30, ఏప్రిల్ 2008, బుధవారం

మేటి దివిటీలు - 1

తెలుగు వారి చరిత్ర రెండువేల యేళ్ళ నాటిది. ఐతరేయ బ్రాహ్మణంలో మొట్టమొదటి సారిగా మన ప్రసక్తి వచ్చిందట. ఎన్ని వేల యేళ్ళవాళ్ళమో ఖచ్చితంగా తెలీకపోయినా మొత్తానికి కొన్ని వేల యేళ్ళ వాళ్ళమే!

కొన్ని వేల యేళ్ళలో కొన్ని కోట్ల మంది పుట్టి, బ్రతికి, పోయారు. కొన్ని లక్షల మంది పుట్టి, బ్రతికి, బ్రతికించి, పోయారు. కొన్ని వందల మంది మాత్రం.. పుట్టి, బ్రతుకుతూ ఉన్నారు. ప్రజల మనసుల్లో వీరు చిరంజీవులు. తెలుగు జాతి ఉన్నంత కాలం వాళ్ళు ఉంటారు. అలాంటి వారిలో నుండి నాకు నచ్చిన పది దివిటీల పేర్లు ఇక్కడ రాయదలచాను. వాళ్ళు మనకు ప్రాతస్మరణీయులు. పదే రాయదలచాను కాబట్టి పదే ఉన్నాయి. పదిలో ఉండాల్సినవయ్యుండీ ఇక్కడ పేర్లు లేకపోతే.. అది నా తెలివితక్కువతనమే తప్ప చిరస్మరణీయులను తక్కువ చెయ్యడం కానే కాదు. ఆ సంగతి మీకు తెలియనిదేం కాదు!

అ వెలుగు దివిటీల గురించి రాయగలిగేంత విషయం ఉన్నవాడినేం కాదు నేను. నాకు తోచినంతలో ఒకటో రెండో పద్యాలు రాసి పూజ చేస్తున్నాను. పనిలో పనిగా నా పద్య కండూతి కూడా తీరుతోంది.

ఇక నేనెంచుకున్న వరస.. ఇది వారి జీవిత కాలాలను బట్టి తీసుకున్న వరస కాదు. వారి గొప్పతనాన్ని బట్టి నేనిచ్చిన ర్యాంకింగూ కాదు. దీనికో వరస లేదు. ఎవరిపై పద్యం సిద్ధమైతే వారి పేరు పెట్టేస్తానన్నమాట!
---------------------------------------------

వేమన:
తెలుగు వాడికి వేమన తొలిగురువు. మనకో వేదాన్ని ఇచ్చి, మన గుండెల్లో నిలిచిపోయాడు. ఉప్పు కప్పురాల తేడాయైనా, అల్పుడెలా పలుకుతాడన్నా.. వేమన వేదంలో మనకు దొరుకుతుంది! తెలుగుజాతికి ప్రాతస్మరణీయుడైన వేమన చరిత్ర అస్పష్టంగా ఉండటం మన దురదృష్టం. రెండేళ్ళ కిందనుకుంటా.. రాతప్రతుల సేకరణ అనే యజ్ఞం చేస్తే కొన్ని లక్షల పత్రాలు పోగుపడ్డాయట కేంద్ర ప్రభుత్వం దగ్గర. అలాంటి బృహత్ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వమూ చేస్తే వేమన గురించిన మరిన్ని వివరాలు తెలియవచ్చేమో!


వేమనకో నూలుపోగు:
అరటిపండునొలిచి అరచేతిలోనుంచి
ఆరగింపుమంటి వాదరమున
ఆంధ్ర జాతికీవె ఆదిగురుడవయ్య
అఖిలజనులవినుత అమర వేమ

వేమ నీతి యదియె వేమగీత యదియె
వేదసమముగాని వేరు గాదు
వేయిగళములెత్తి వేమారు పాడరా
వేద స్ఫూర్తి తోడ వేమ సూక్తి

18 కామెంట్‌లు:

  1. మీ సంకల్పమూ, ఈ తొలి ప్రయత్నమూ బహు ప్రశంసనీయంగా ఉన్నాయి. వరుసలో తరువాయి భాగాల్ కోసం ఎదురు చూస్తుంటాము

    రిప్లయితొలగించండి
  2. మీ దివిటీలు ధగధగ్గాయమానంగా ప్రకాశించాలని ఆశిస్తూ...తెలుగు సాహిత్య చరిత్రలో నా వరకూ అగ్రతాంబూలం 'వేమన'కే! అతి సామాన్యుడికీ , మీరనట్టు అరటిపండు వలిచి ఇచ్చినట్టు, అత్యంత సులభంగా అర్థమయ్యే విధంగా జీవిత సత్యాలను విప్పి చెప్పిన 'వేమన్న' కవియే కాక ఓ దార్శనికుడు,వేదాంతి'. శ్రీశ్రీ అన్నట్టు మన తెలుగు కవిత్రయం - "తిక్కన, వేమన, గురజాత"!

    రిప్లయితొలగించండి
  3. బావుంది, కొనసాగించండి - మిగతా టపాల కోసం ఎదురు చూస్తున్నాను..

    రిప్లయితొలగించండి
  4. మీ పద్యాలు చాలా బాగున్నాయి. దివిటీలు దీపాలై వెలుగులు పంచాలని ఆశిస్తున్నాను.

    @తాడేపల్లి గారు,

    గురజాడ మీకు ఎందుకు నచ్చడో తెలుసుకోవాలని ఉందిమీకు అభ్యంతరం లేకపోతే!

    రిప్లయితొలగించండి
  5. >> ఆరగింపుమంటి వాదరమున

    మధ్యలో స్పేస్ ఉంటుందంటారా?

    సూపర్ స్టార్ట్, మిగిలినవెప్పుడు?

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. మీ రెండు పద్యాలూ నిజంగా దివిటీలు.
    వాటిపక్కన ఒక చిన్న కొవ్వొత్తిని వెలిగిస్తున్నా...

    ఆట వెలది తోడ ఆట లాడిన వాడు
    నేటి తెలుగు జనుల మేటి యోగి
    కామి గాక మోక్ష గామి గాడను మాట
    కాల గతికి నిలచు కాలిబాట

    రిప్లయితొలగించండి
  8. మెచ్చదగిన సంకల్పము,ప్రయత్నమూను.

    పండిత పామర జనరంజన చేసిన వారిలో ప్రథముడయిన వేమనకే నిజంగా అగ్ర తాంబూలం. మీరు ర్యాంకింగ్ లేదన్నా మా ర్యాన్కింగ్లో వేమనయ్యదే ఆ గౌరవం.

    మిగితా వాటికి ఎదురు చూస్తూ..............

    రిప్లయితొలగించండి
  9. మీ బ్లాగు బాగుంది.
    చక్కటి విశ్లెషణ తో కూడిన అంశాలున్నాయి.
    బొల్లోజు బాబా
    http://sahitheeyanam.blogspot.com/

    రిప్లయితొలగించండి
  10. ఆటవెలది.
    నామటుక్కి నాకు ఆటవెలది యంటె
    నిద్ర నుండి లేపి తెలుపమంటె
    స్మృతికి మొదట వచ్చు వేమన్న శతకమే
    అతిశయోక్తి కాదు ఆంధ్రులందు.

    రిప్లయితొలగించండి
  11. "తెలుగు వాడికి వేమన తొలిగురువు". చాలా బాగా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  12. వ్యాఖ్యాతలందరికీ నమస్సులు.

    "దివిటీలు" అనడంలో నా ఉద్దేశ్యం - ఆ ప్రాతఃస్మరణీయులే మేటి దివిటీలని. నా పద్యాలు కేవలం మిణుగురులే! ఈ పద్యాలే దివిటీ లనే అర్థం ఈ జాబులో స్ఫురింపజెస్తే ఆ తప్పు నాదే!

    ఒరెమూనా:"ఆరగింపుమంటి వాదరమున" - మధ్య ఖాళీ ఉండాలనుకున్నానే!?

    రిప్లయితొలగించండి
  13. ఈ పద్యాలే దివిటీ లనే అర్థం ఈ జాబులో స్ఫురింపలేదు. :)

    రిప్లయితొలగించండి
  14. చదువరి గారు,
    పద్యాలు రెండూ బాగా వచ్చినాయి, ముందు ముందు ఈ దివిటీల వరస టపాలకి ఈ పద్యాలు కొలబద్దగా పెట్టుకోండి
    భవదీయుడు
    ఊదం

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు