26, ఫిబ్రవరి 2008, మంగళవారం

పాలాభిషేకం!

14 కామెంట్‌లు
మీరు గమనించే ఉంటారు.. ఇది పాలాభిషేకాల సీజను. మనమెవరినన్నా విమర్శించామనుకోండి.. వెంటనే ఆ బాధితుడికి పాలాభిషేకం చేస్తారన్నమాట!

తెలుగువాళ్ళం మనం - సాధారణంగా అవతలి వాణ్ణి అనుకరిస్తూ ఉంటాం. స్వతహాగా మనదైన దాన్ని ఛీత్కారంగా చూట్టం మనకలవాటు. అదే అవతల వాడు చేసే చెత్త పని కూడా మనం నెత్తినెట్టుకుని పూజిస్తాం, అణకువతో పాటిస్తాం. మరి, ఈ పాలాభిషేకాన్ని ఎక్కడ నుండి పట్టుకొచ్చాం? కొంపదీసి మనమే కనిపెట్టామా ఏంటి? ఒకవేళ మనమే కనిపెట్టి ఉంటే ఇది త్వరలోనే చస్తుంది లెండి. అది కలకాలం మనాలంటే దానికి పేరు మార్చి ఏదో ఒక ఇంగ్లీషు పేరు - "మిల్క్ పోరింగ్ సెరిమనీ" లాంటిదన్నమాట- పెట్టేస్తే కలకాలం అలా పడుంటుంది.

సరే.. విషయానికొస్తా. దివంగతులైన నాయకులు కాబట్టి, విగ్రహాలకు పాలు పోస్తున్నారు. బతికున్న వాళ్ళను విమర్శిస్తే ఏం చేస్తారో? అప్పుడు కూడా పాలాభిషేకాలు చేస్తారా? అలా చెయ్యాలని నేను పిలుపునిస్తున్నాను. అప్పుడే కదా మనకు వాళ్ళ మీద ఉన్న మహాభిమానం యావదాంధ్ర దేశానికీ తెలిసేది? ఉదాహరణకు, రాజశేఖరరెడ్డిని, చంద్రబాబునూ ఎవరన్నావిమర్శించారనుకోండి.. వెంటనే మనం పాల బూతుకెళ్ళి ఓ వందో వెయ్యో లీటర్ల పాలు కొనేసి వాళ్ళింటి కెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు..

చంద్రబాబు: బావుంది, కానివ్వండి. ఎవ్వరు ఎవ్వరిని విమర్శించినా ఇలాగే పాలాభిషేకాలు చేసుకుంటూ ముందుకుపోండి. అన్ని పార్టీలవారూ ఈ పద్ధతి పాటించాలని, హెరిటేజ్ పాలు ఇందుకు శ్రేష్టమనీ మనవి చేసుకుంటా ఉన్నాను.

రాజశేఖరరెడ్డి: ఎవడబ్బ సొమ్మని పాలాభిషేకం చేస్తారు? లాగులేసుకున్నప్పటి నుండి నన్ను తిడుతూనే ఉన్నారు.. ఎప్పుడన్నా పాలు పోసారా నాకు? ఇప్పుడు కొత్తగా ఏంటిది? ఇదంతా చంద్రబాబు కుట్ర! తన పాల కంపెనీ బాగు పట్టం కోసం వేసిన ఎత్తిది. నేను మేళ్ళు చేసేది ప్రజలకు.., అంతే! ఈ పాలాభిషేకాలు జరగనిచ్చే ప్రశ్నే లేదు.

ఎమ్మెస్: ఆయన తన ఇంట్లో తలుపులన్నీ వేసేసుకుని, కుర్చీలో వెనక్కు వాలి, కాళ్ళు చాపుకుని, కుర్చీలోనే దాదాపుగా పడుకున్నట్టుగా కూచ్చుని ఉన్నాడు. టీవీ విలేకరొకడు ఎలాగో ఇంట్లోకి జొరబడి ఆయన్ని విసిగిస్తున్నాడు..

"ఏంటి సార్.., ఇలా ఇంట్లో కూచ్చుని తలుపులేసుకున్నారేంటి?"
"ఏం జెప్పమంటావయా? ఆ కేసీయారేమో మమ్మల్ని సన్నాసులు, చవటలు, దద్దమ్మలు అని తిట్టిండు కదా.. మా పార్టీ కార్యకర్తలకు బాధేసిందట. పాలాభిషేకం చేస్తామని వెంటపడుతుర్రు. ఒద్దురా, పాలు పోసుకుంటే ఆ జిడ్డు పోదురా, అట్టలు కట్టేసి, చీమలు పట్టేస్తాయిరా అని మొత్తుకున్నా వినటం లేదు. ఏం చెయ్యనూ? అందుకని ఇలా! అక్కడికీ.. 'కేసీయారు మనోడేలే, అతడో మాటన్నా మనం పట్టించుకోకూడదు' అని చెప్పా! వాళ్ళు వింటేగా.. పాల క్యాన్లు తీసుకుని వెంటపడ్డరు!"


మరి సినిమా అభిమానులు పార్టీల కార్యకర్తలకేమైనా తీసిపోయారనుకున్నారా?

'మహాస్టారు' జిడ్డు బాబు నటించిన "ముష్టి వెధవ" సినిమా విడుదలై రెండ్రోజులైంది. రాష్ట్రం మీద కొదిలిన 350 పెట్టెల్లోనూ 250 దాకా తిరుగు ప్రయాణపు ఏర్పాట్లలో ఉన్నాయి. ఇలా లాభం లేదని పెద్దయెత్తున సక్సెస్ మీట్ ఒకటి ఏర్పాటు చేసి హడావుడి చేసారు. మాజీ గవర్న రొకరినీ, రిటైరైపోయిన నిర్మాతొకణ్ణీ, మరో పది మంది భట్రాజుల్నీ పోగేసి, గొప్ప సభ ఏర్పాటు చేసి, తమ సినిమా విజయగాథను వినిపించారు. మరసటి రోజు పేపర్లలో ప్రముఖంగా వచ్చిందా వార్త. అయితే కొత్త కెరటం అనే ఒక పత్రికలో మాత్రం దాంతోపాటు ఆ సినిమాపై సమీక్ష కూడా వచ్చింది. ఈ కొత్త కెరటానికో తిక్క ఉంది.. నిజాలు రాసేస్తూ ఉంటుంది (వింతగా ఉంది కదా! తిక్క మరి, ఏం చేస్తాం!!). దాంతో పాపం సమీక్షను నిజాయితీగా రాసేసారు. ఇహ చూస్కోండి.. కలతచెందిన మహాభిమానులు ఊరూ వాడా ఏకం చేసి, పాల క్యాన్లు పట్టుకుని హైదరాబాదుకు వెళ్ళారు. 'అన్నయ్యా, నిన్ను విమర్శించిన కొత్త కెరటానికి తగిన శాస్తి చెయ్యాలి.. రా నీకు పాలాభిషేకం చేస్తాం' అని గోల చెయ్యసాగారు. బాబు బేజారెత్తిపోయి, సెక్రటరీతో '..ఇదేం గొడవయ్యా? పిచ్చి..లు తయారయ్యారు. ఏదో ఒకటి సర్ది చెప్పి పంపెయ్యి' అని బతిమిలాడాడు. ఆ సెక్రెటరీ అసాధ్యుడు.. తుఫాన్ను కూడా తన ఇంటి మీదకు రాకుండా పక్కింటోడి మీదకు మళ్ళించగల ఘనుడు; ఇలా అన్నాడు వాళ్లతో.. "కొత్త కెరటం తిట్టింది సినిమాను కదా.. అంచేత ఆ దర్శకుడికి అభిషేకం చెయ్యండి." అని ఎగేసాడు. ఇదీ నిజమేననుకుని అందరూ పొలోమని దర్శకుడి దగ్గరికి పోయారు.

అతడికప్పటికే సంగత్తెలిసి, రాష్ట్రమొదిలిపెట్టి పోడానికి బట్టలూ అవీ సర్దేసుకుని సిద్ధంగా ఉన్నాడు. పాపం కాస్త ఆలస్యమై వీళ్ళకి చిక్కిపోయాడు. వెంటనే రూటు మార్చి, "ఇదిగో ఇప్పుడే నిర్మాత దగ్గరికి పోతున్నాను. మన సినిమా గురించి నిజాలు రాసేసారు కదా, నాకెంతో బాధేసింది. అందుకని నేను ఆయనకు పాలాభిషేకం చెయ్యటానికి పోతున్నాను, మీరూ రండి" అని వాళ్ళను వెంటేసుకుని నిర్మాత దగ్గరికి పోయాడు. (ఈ మాత్రం సృజనాత్మకతను ఆ సినిమా క్కూడా వాడుంటే, అది మరో నాల్రోలు ఆడి ఉండేది)

ఆ నిర్మాత కూడా తక్కువోడేం కాదు. అసలే సినిమా పెట్టెలు తిరుగు ప్రయాణంలో ఉన్నాయని తెలిసి తిక్కలో ఉన్నాడు, ఆ పెట్టెలిక ఎలాగూ పనికిరావు. పైగా, వాటిని దాచి పెట్టడానికి స్థలం దండగ. ఇదంతా ఆలోచించి ఒక ప్లాను వేసాడు.. 'అభిషేకం నాకెందుకయా.. తిట్టింది సినిమాను కదా.. పొయ్యి ఆ సినిమా రీళ్ళకు చెయ్యండి, ఆ కొత్త కెరటం తిక్క కుదురుద్ది' అని చెప్పాడు. మహాబాబు గారి యువసేన అది విని బుర్రూపుకుంటూ పాల క్యాన్లు తీసుకుని సినిమా క్యాన్ల కోసం పరుగో పరుగు!

నీతేవిటంటే - మిమ్మల్నెవడూ తిట్టకుండా చూసుకోండి.. లేకపోతే మీ వీరాభిమానులు మీకు పాలాభిషేకాలు చేసీగల్రు!

2, ఫిబ్రవరి 2008, శనివారం

జోగయ్యా, ఇదేం గోలయ్యా?

9 కామెంట్‌లు
అసలు చిరంజీవి పార్టీ పెడతాడో లేదో, పెట్టినా జోగయ్యనందులో చేర్చుకుంటాడో లేదో గానీ ఈయన మాత్రం ఇంకా పెట్టని ఆ పార్టీలోకి జొరబడి పోయాడు.

కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలికి ఉత్తరం రాసి, ఆమెను నిదర లేపుదామనుకోవడంలో తప్పులేదు. కానీ ఆ ఉత్తరాన్ని కాపీ టు సీయెమ్, కాపీ టు పీయెమ్ లాగా ప్రతీ వాడికీ ఇవ్వటంతో , ఆయన అసలు ఉద్దేశం చిరంజీవికి దగ్గరవడం తప్ప పార్టీ శ్రేయస్సేమీ కాదని తేలిపోయింది.

ఈ అత్యుత్సాహంలో చిరంజీవి కూతురి పెళ్ళి సంగతి కూడా తెచ్చి, పుండును మళ్ళీ రేగగొడుతున్నాడు. ఆమె "నన్నీ గొడవల్లోకి లాగొద్ద"ని అంటోంది. అటూ ఇటూ చేసి, చిరంజీవిక్కూడా కోపం తెప్పించి, రెంటికీ చెడేట్టున్నాడు జోగయ్య.

సంబంధిత టపాలు