16, సెప్టెంబర్ 2007, ఆదివారం

ఇంటర్నెట్లో తెలుగు లోతెంత?

ఓ మూడేళ్ళ కిందటి దాకా నెట్లో తెలుగు అనేది ఉందనే నాకు తెలియదు. ఏ పని చేసినా ఇంగ్లీషులోనే చెయ్యడం. కంప్యూటరుకు తెలుగు నేర్పొచ్చని, తెలుగులో సుబ్బరంగా రాయొచ్చని ఎప్పుడైతే తెలిసిందో.. ఇక నేను ఆ వచ్చీరాని ఇంగ్లీషు రాయడం మానేసాను. తెలుగులోనే అన్నీ!

ఇవ్వాళ తెలుగులోనే ఉండే సైట్లు బోలెడన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని నా జీవితంలో భాగమైపోయాయి. భుక్తి కోసం నేను చేసే పనులు ఇవ్వని ఆత్మ తృప్తి ఆయా సైట్లలో నేను చేసే పనులు నాకిచ్చాయి.

నాకు అన్నిటి కంటే ముందు పరిచయమైన తెలుగు సైటు వికీపీడియా! తెలుగు విజ్ఞానసర్వస్వం - ఎన్‌సైక్లోపీడియా. తెలుగులో ఉన్న ఆ సైటు చూసి నాకు మూర్ఛపోయినంత పనైంది. ఎంతో స్వేచ్ఛ ఉంది అక్కడ! అక్కడ ఎవరైనా రాయొచ్చు కూడా. వెంటనే రాయడం మొదలుపెట్టాను. అప్పటికే ఉన్న సభ్యులు - ముఖ్యంగా రవి వైజాసత్య, నాకు ఎంతో సాయపడ్డారు. ఆయన నాకు వికీ గురువు! ఇప్పుడంటే వికీలో చేరేవారికి సాయం చేసేందుకు అక్కడ ఎంతో మంది ఉన్నారు గానీ, ఆ రోజుల్లో రవి ఒక్కడే వికీకంతటికీ! అసలు ఇప్పటి వికీ స్వరూపం చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతింతై, వటుడింతయై అన్నట్టు పెరిగిపోతోంది. రవితో పాటు, ప్రదీప్, కాజ సుధాకరబాబు, నవీన్ వంటి ఎందరో సభ్యులు వికీని పరుగులు పెట్టిస్తున్నారు. అక్కడ నేనూ రాస్తాను. నెట్లో నేను చేసే పనులన్నిటిలోకీ నాకు బాగా ఇష్టమైనది ఇదే, నా బ్లాగు కంటే కూడా! ప్రతి తెలుగువాడూ చూసి తీరాల్సిన, రాసి తీరాల్సిన సైటు ఇది.


బ్లాగులు చూడండి.. చక్కటి తెలుగులో ఉండడమే కాదు వాటి గొప్పదనం.., చక్కటి భావాలతో, మంచి భాషతో, వైవిధ్యమైన విషయాలతో మనలను అలరిస్తూ ఉంటాయి. ఈనాడు, జ్యోతి వగైరా పేపర్లు చదువుతాం. ఎన్ని చదివినా అవే వార్తలు, అవే కబుర్లు. విశ్లేషణలు మాత్రం కొద్దిగా భిన్నంగా ఉంటాయి. కానీ..

కంద పద్యం గురించి, కర్ణాటక సంగీత మాధుర్యం గురించి, రాయలసీమ వ్యావహారికంలో చిన్ననాటి కథలు, విశేషాలు, విదేశాల కబుర్లు, నిజమైన, నిష్పాక్షికమైన సినిమా సమీక్షలు, కడుపుబ్బ నవ్వించే గల్పికలు, నిర్మొహమాటంగా ఉండే రాజకీయ విశ్లేషణలు, వంటలు, సామాజిక సమస్యలు మొదలైన వాటిపై వ్యాసాలు.. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? సమకాలీనమైన ఈ విశేషాలు మనబోటి సామాన్యుడి మాటల్లో ఎక్కడ చూడగలం? బ్లాగుల్లో చూడగలం! అసలు మన పత్రికలపైనా, టీవీల పైనా, సినిమాల పైనా నిష్పాక్షికమైన విమర్శ కావాలంటే బ్లాగులు చూడాల్సిందే! మరోచోట దొరకవు. ఎవరైనా, ఏ విషయం గురించైనా రాయగలగడమే ఈ బ్లాగుల విశిష్టత! ఈ పేజీకి ఎడమ పక్కన ఉన్న బ్లాగుల లింకులకెళ్ళి చూస్తే, బ్లాగుల గురించి నేను చెప్పింది బహు తక్కువని తెలిసిపోతుంది. కూడలికి వెళ్తే బ్లాగుల పూర్తి జాబితా చూడవచ్చు.

వికీకి, బ్లాగులకు, ఆమాటకొస్తే తెలుగును ఇంటర్నెట్ వ్యాప్తం చెయ్యడానికి దోహదం చేసినవి కొన్నున్నాయి. తెలుగు నెజ్జనులకు అవి ప్రాతఃస్మరణీయాలు. ఓసారి బ్లాగుముఖంగా వాటిని స్మరించుకుంటాను.
  • తెలుగుబ్లాగు గూగుల్ గుంపు (http://groups.google.com/group/telugublog) నెట్లో తెలుగు అభివృద్ధికి దోహదపడిన అత్యుత్తమ స్థలం ఏదన్నా ఉందీ అంటే.. అది ఇదే
  • లేఖిని (http://lekhini.org) తెలుగులో రాయడానికి ఇంతకంటే సులభమైన సైటు ఇంకా రాలేదు.
  • పద్మ (http://geocities.com/vnagarjuna/padma.html) నేను తెలుగులో రాయడం సాధన చేసిందిక్కడే. లేఖిని వచ్చాక, వెనకబడింది.
  • కూడలి (http://koodali.org) మొత్తం బ్లాగుల కబుర్లన్నీ ఇక్కడ చూడొచ్చు.
మొదటిదాని కర్త చావా కిరణ్ కూ, లేఖిని కూడలి ల కర్త వీవెన్ కు, పద్మను సృష్టించిన నాగార్జునకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాలి. వీటిని పెంచి పోషించిన తెలుగువారికందరికీ అభినందనలూ తెలపాలి.

తరువాతి కాలంలో వెలసిన కిందిసైట్లు కూడా ఇతోధికంగా సేవ చేస్తున్నాయి.
  • తెలుగుబ్లాగర్స్ (http://www.telugubloggers.com)
  • తేనెగూడు (http://www.thenegoodu.com)
  • జల్లెడ (http://jalleda.com)
ఈనాడులోను, ఇతర పత్రికల్లోను వచ్చిన వ్యాసాలు ప్రజలను పై సైటుల వైపుకు పంపిస్తే తెలుగువారు తెలుగులో చదివేందుకు, రాసేందుకు పై సైటులు ఎంతో దోహదం చేసాయి.

కొత్తవారి కోసం
నెట్లో తెలుగుకు మీరు కొత్తవారైతే, అసలెక్కడ మొదలుపెట్టాలబ్బా అని అయోమయంగా ఉంటే తెలుగుబ్లాగు గూగుల్ గుంపుకు వెళ్ళండి. అక్కడి సభ్యులు మీకు దారి చూపిస్తారు. నేను పైన రాసిన విశేషాలు చాలా తక్కువ -సింధువులో బిందువంత! ఓసారి గుంపులో చేరాక, ఇంకా బోలెడు సంగతులు తెలుస్తాయి. అంతర్జాలానికే ప్రత్యేకించిన పత్రికల దగ్గరనుండి, తెలుగు భాష అభివృద్ధి కోసం మనవాళ్ళు పాటుపడుతున్నారన్న విషయం దాకా ఎన్నో విషయాలను మీరు చూడాల్సి ఉంది. ఆయా పనుల్లో మీరూ పాల్గొనాల్సి ఉంది. రండి!

10 కామెంట్‌లు:

  1. By the power vested up on e by the state of telugu blogs, I now pronounce this టపా, "Official Telugu marketing/representative టపా"...

    చాలా బాగా వ్రాసారు, ఇంకా పొడుగున్నా.. ఇంకా బాగానే ఉండేది.

    రిప్లయితొలగించండి
  2. ఈనాడులో వ్యాసానికి ఇక్కడ పూర్ణత్వం లభించింది. థేంకులు!

    ~Sriram
    sreekaaram.wordpress.com

    రిప్లయితొలగించండి
  3. ఫీలింగు, ఇన్ఫర్మేషను సమపాళ్ళలో రంగరించారు. "సింధువులో బిందువు" బాగుంది.

    రిప్లయితొలగించండి
  4. చాలా బాగుంది. "చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా.." అని పాడుకొంటూ మరింత ముందుకు సాగిపోదాం..!!

    రిప్లయితొలగించండి
  5. చాలా బాగా వ్రాసారు. కొత్త పాళీ అన్నట్టు భావన, భాష, సమాచారం అన్ని తగు పాళ్ళలొ కలిపారు. very nice

    రిప్లయితొలగించండి
  6. సోత్కర్ష తగదని తమకృషి గురించి చెప్పుకున్నట్టులేరు. తెలుగు వికీలోనే కాదు, తెలుగు బ్లాగు బృందములో కూడా చర్చలు ఆంగ్లంలోనే జరుతున్న తరుణంలో చర్చలూ తెలుగులోనే జరపాలి.. అలా చేయటం మీరనుకున్నంత కష్టం కాదు, అని మానసిక అవరోధాన్ని దాటించిన వారధి చదువరి!!

    రిప్లయితొలగించండి
  7. ఎక్కువ సమాచారంతో, ఉపయుక్తకరంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  8. చాలా బాగా వ్రాసారు. ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  9. బాగుందొయ్ చదువరి. వికీ అంటే చాలా ఇష్టం అని చాలా చోట్ల వ్రాయడం చూశాను. మంచిది కృషీ బాగా చూపించు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు