తెలుగు బ్లాగరుల్లో పద్యాలు రాసేవారు కొందరున్నారు. వారివలన పద్య చాపల్యం అంటుకున్న వారిలో నేనూ ఒకణ్ణి. అదే చెబుతున్నానిక్కడ.
తు, చ ల లాగా పద్యాల్లోనూ గణ పూరకాలు ఉంటాయి. పత్రికల్లో ఖాళీ పూరకాల లాగా. రెండో పద్యంలోని "రయమున" అలాంటిదే!
తెలుగు బ్లాగరుల్లో పద్యాలు రాసేవాళ్ళు ఎక్కువైపోతున్నారనడానికిదో ఉదాహరణ.
బ్లాగున పద్యములను బహు
బాగుగ రాయుట గని, జన బాహుళ్యమునన్
మోగెను పద్దెపు ఖ్యాతియు
బ్లాగురుడును వారి శిష్యబ్లాగరులు గనన్!
సమస్యలిచ్చెద రొక్కరు
సమముగ పూరింతు రొకరు సతతము, శాస్త్రీ
యముగన్ రాసెద రొక్కరు
క్రమముగ చదువరులు కూడ రయమున రాయన్!
తు, చ ల లాగా పద్యాల్లోనూ గణ పూరకాలు ఉంటాయి. పత్రికల్లో ఖాళీ పూరకాల లాగా. రెండో పద్యంలోని "రయమున" అలాంటిదే!
తెలుగు బ్లాగరుల్లో పద్యాలు రాసేవాళ్ళు ఎక్కువైపోతున్నారనడానికిదో ఉదాహరణ.
----------------
ఛందస్సు గురించి వికీపీడియాలో చదవొచ్చు.
చదువరి గారు,
రిప్లయితొలగించండివినటానికి బాగుంది. చంధస్సు ఎలావుంది అని చెప్పే ప్రావీణ్యం లేదనుకోండి. మీ ఈ టపాతో ఈ చాపల్యం నాకంటాలనే కోరుకుంటున్నా!
కందం నడక బానే పట్టుకున్నారు. రయమున అక్కడ సందర్భోచితంగానే ఇమిడింది, పూరకం కాదు.
రిప్లయితొలగించండిరెండో పద్యం మొదటి గణం/పదం (సమస్య) - జగణం బేసి స్థానంలో తగదు. కావలిస్తే నాలుగింట వేసుకోవచ్చు. శ్రీశ్రీ చెప్పాడు
కం. జగణంతో జగడం కో
రగా తగదు గాని దాని ఠస్సాగొయ్యా
??? ??? ???
చిగిర్చితే నాలుగింట సిరిసిరిమువ్వా :-)
తప్పు తెలియజేసినందుకు థాంక్సండీ, కొత్తపాళీ గారూ. కానీ, ఇప్పుడు దాన్ని మార్చాలంటే సరైన పదం దొరకడం లేదు. సమనులు అనే ఇంగ్లీషు మాట (సరిగ్గా అతకలేదనుకోండి) తప్పించి నా బుర్రకు మరోటందలేదు. పద్యాన్ని పూర్తిగా మార్చగలనేమో ప్రయత్నిస్తా.
రిప్లయితొలగించండి@వికటకవి గారూ, ఛందస్సు తన్నింది.:) మీ చాపల్య ప్రదర్శనకోఅం చూస్తాను.
భలే! భలే! మీరు చాలా బాగా పట్టుకున్నారు ఈ విద్య. మీరు మరితమంది చేత రాయించగలరనే నా ఆశ.
రిప్లయితొలగించండిపద్యాలు మంచి నడకతో వచ్చాయి. పదప్రయోగం కూడా మంచి తమాషాగా ఉంది.
గురువుగారు చెప్పినదే కాకుండా, ఇంకో చోట కూడా గణభంగం ఐంది. శిష్యబ్లాగరులు లో ష్య కూడా గురువే.
మీ పద్యం దెబ్బతోటి ఎప్పుడో బళ్ళొ చదువుకున్న చంధస్సు పాఠాలు గుర్తు కొస్తున్నాయి
రిప్లయితొలగించండిచదువరి గారు తెలుగు బ్లాగు పద్యకర్తల పేర్లు బాగానే ఒకచోటా చేర్చి పద్యం కూర్చారే చాలా బాగుంది.
రిప్లయితొలగించండిదిన్ దిన్ ప్రవర్థమాన్!! :-) ఈసారి తప్పుల్లేకుండా సమకాలీన రాజకీయం మీద ఏదో ఒక సమస్యపై మీ శైలి వ్యంగ్యంతో వదలండి రెండు 'కంద'గడ్డలు. కత్తిపీటలకు కూడా దురద పుట్టించాలి.
రిప్లయితొలగించండిఛందస్సు సంగతెలా ఉన్నా మీరు రాసిన పద్యం రాగయుక్తంగా, చదవడానికి బ్రహ్మాండంగా ఉంది.
రిప్లయితొలగించండికాదనుకుంటా శ్రీరామా. శిష్య బ్లాగరులు వేర్వేరు పదాలుగానే లెక్క. సంస్కృతంలో లాగ సమాసం కలిసినంత మాత్రాన తెలుగులో ఒకే పదం కాదు, వేర్వేరు పదాలుగా గుర్తించవచ్చు. సంధిగా కలిస్తే సంగతి వేరే.
రిప్లయితొలగించండిఇది తెలుగులో బహుశా మొట్టమొదటి హైపర్లింకుల కందం అయి ఉండాలి! కందాచులేషన్లు! :- )
రిప్లయితొలగించండిసంధి చేయకపోతే సంయుక్తాక్షరం ముందు అక్షరం గురువు కాదనే మా తెలుగు అయ్యవారూ చెప్పారు.
నాకు తెలుసు నేనెక్కడుంటే - అక్కడే సమస్య అనీ - అందుకే పరిగెత్తు కొచ్చా....
రిప్లయితొలగించండిచదువరిగారు,
మొదటి పద్యం లో శిష్యులవీపు మీరు సాపు చేయండి :). సమస్యను నేను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాను.
సమముగ పూరింతురొకరు
సమస్యలిడగా నొకండు;.....
నిజానికి, రాఘవగారి సమస్యని శ్రీరాం గారు పూరిస్తుంటే మధ్యలొ నే వచ్చాను..
కాబట్టి..
సమముగ పూరింతురొకరు
సమస్యలిడువా రిరువురు;...
అని కూడా అనవచ్చు
ఇక ముక్తాయింపు ( అర్ధం చూడద్దు, గణయతిప్రాసలు చూడండంతే)
చదువరి వడివడి వ్రాయగ
పదుగురి పద్దెముల పైని పసిడిపలుకులన్
కదిలిరి జనులుకవులగుత
తదుపరి వికటకవియనగ తమరిక గురువే!
తు. చ అంటే గుర్తొచ్చింది, తు. చ లు తప్పితే లోకులు వాటికే ఒత్తులిస్తార్ట. ( నా మొదటి బలహీనత-పేరడీలు, రెండోది-పన్నులు,మన్నించండి)
మొదటి పద్యంలో రెండు గన్నులుంటం కూడా ప్రమాదమేనండోయ్. తెరెసా గారు మొదటిసారని మిమ్మల్ని వదిలేసినట్టున్నారు లేకపోతే పునరుక్తి అనేవారు.
(ఇదంతా తెలిసి చెప్పింది కాదు, తెలుసుకొనే ప్రయత్నం లో చెప్పింది మాత్రమే)
రెండో పద్యం లో "శాస్త్రీయముగన్" "చదువరులు" చక్కగా అమరాయి. ( పైకెళ్లి ఒకసారి పద్యం చదవండి) పైగా రెంటికీ లంకెలుండటంవల్ల క్రీగీటు తోను, లావుగాను మెరుస్తున్నాయేమో - చూడటానికి చదవుకోటానికి కూడా అందంగా ఉన్నాయి.
రిప్లయితొలగించండిమన్నించండి, రెండు గన్నులు సరిపోయాయి, ఒకటి చదువరులకి, ఒకటి గురుశిష్యులకని ఇప్పుడే తెలిసింది.
రిప్లయితొలగించండిమీరు గన్ను తీయద్దు. ( మీ బ్లాగ్‍కొచ్చి ఏమి మాట్లాడిన , నాకేంటో రాజకీయపు బాగ్రౌండ్ కనిపిస్తుంది)
వహ్వా...వహ్వా! సుభానల్లాహ్!
రిప్లయితొలగించండిఊకదంపుడు గారు దంచేశారండి. చాలా బాగుమ్ది మీపద్యం. ఇక్కడ పెద్ద సాహితి సభ జరుగుతున్నట్లది
రిప్లయితొలగించండిమా తెలుగు అయ్యవారు ఏమి చెప్పారో నాకు గుర్తులేదు. మా కాలంలో చదువులు అలాంటివిలెండి :) ఈ విషయం తెలీక అప్పుడప్పుడు కష్టపడుతుంటా గణాలు కిట్టించడానికి. తెలియచేసినందుకు గురువుగారికీ,పద్మగారికీ కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండి@శ్రీరాం గారు
రిప్లయితొలగించండివచనము లేలనొ తమరికి
రచియింపకపద్యమొకటి రయమున రామా
రుచిగల సాహిత్యసభస
హచరులడిగిరి,చదువరియె ఆరంభింపన్
@చదువరి గారు,
మీ రయము నాపద్యాన్ని కూడా ఆదుకుంది.
ఊ.దం. గారూ,
రిప్లయితొలగించండిపెద్దలు గురువులు ఇందరు
ముద్దుగ సుద్దులు గరపెడి మురిపెపు సభలో పద్దెములల్లుచుపాడుచు
విద్దెను చూపగ వదరుట విజ్ఞత యగునే! (నాకున్)
sorry for the prblm wth formatting in the prev comment...
రిప్లయితొలగించండిపెద్దలు గురువులు ఇందరు
ముద్దుగ సుద్దులు గరపెడి మురిపెపు సభలో
పద్దెములల్లుచుపాడుచు
విద్దెను చూపగ వదరుట విజ్ఞత యగునే! (నాకున్)
పద్యాల వాన కురుస్తోందిక్కడ! శ్రీరామ్ గారూ,
రిప్లయితొలగించండిపద్యం చాలా బాగుంది.
వ్యాఖ్యానించిన అందరికీ నా కృతజ్ఞతలు.
ఊకదంపుడు గారూ! పద్య రాజకీయమేమీ చెయ్యడం లేదండీ.
సుజనరంజని వారి దయతో రాజకీయ పద్యం ఒకటి రావచ్చు ఒకటో తేదీన, రానారె గారూ!
కొత్తపాళీ గారూ, ఊకదంపుడు గారూ, రెండో పద్యాన్ని సవరించడానికి ప్రయత్నించాను. ఎలా ఉందో చూడండి..
సమయోచిత ప్రశ్నలడుగ
సముచిత పూరణ లిడునిట, సతతము శాస్త్రీ
యముగన్ రాసెద రిచ్చట
శ్రమపడి చదువరులు కూడ రయమున రాయన్!
ఇకపోతే ఊకదంపుడు గారి బహు లఘువుల కందం చూసాక.. గతంలో నేను రాసుకుని దాచేసిన ఒక బహు లఘువుల కందం ఇక్కడ రాసేందుకు తెగిస్తున్నాను..
కరవని శునకము కలదని
త్వరపడి చొరబడి చెరబడి వగచిన చోరా!
కరచుట మరచిన మరచును
అరచుట ఎరుగని శునకము యవనిని కలదే?
సర్వలఘు కందం కూడా రాయొచ్చట గదా.. ఎక్కడో చదివాను. పెద్దలు చెప్పాలి.
ఆ.వె. దంచు దంచు మని కందములు దంచె ఊక
రిప్లయితొలగించండిదంపుడు చదువరుల సాహితి సభ
న తెలుగు బ్లాగరులు గద్యమున్ విడిచి పద్య
మంబు బట్టె జాబు లిచ్చులటకు
నేను ఇప్పుడు ఆటవెలది నేరుస్తున్నా తప్పులు చెప్పగలరు
సవరించాక ఫిట్టయింది, కానీ చదువరి గారూ, సమస్యలు సమయోచితంగా ఉంటాయా? :-))
రిప్లయితొలగించండిమీ శునకందం ఆల్మోస్టు సర్వలఘు కందమే. రెండూ నాలుగూ పాదాల్లో చివరి అక్షరం గురువై ఉండాలి అనే నియమాన్ని బట్టి ఆ రెండు అక్షరాలు తప్ప మిగతావన్నీ లఘువులుగా ఉండేదాన్ని సర్వలఘు కందమంటారు.
ఉదా: పోతన గజేంద్రమోక్షం నుండి
కం: అడిగెదనని కడువడి జను
నడిగిన తన మగడు నుడువడని నడయుడుగున్
వెడవెడ సిడిముడి తడబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్
హడావుడిగా వెళ్తున్న భర్తని ఆపి ఏవిటో సంగతి కనుక్కుందామని లక్ష్మీదేవి తనూ గబగబా ముందుకు వెళ్తుంది. అడిగినా ఆయన చెప్పడేమో అనే సందేహంతో ఆగిపోతుంది. ఇలా ఆయన వెనక పెరిగెత్తాలో లేదో తేల్చుకోలేక తబ్బిబ్బులైపోతోంది.
ఒక కొంటె పేరడీ. రవి అనే ఒక మిత్రుడు కాఫీకప్పు కడగటానికెళ్ళి వొళ్ళు తడుపుకున్న దృశ్యం చూసి ..
కం. కడిగెదనని నుడివిన రవి
కడుగకనొక కాఫి కప్పు కడుగుచునుంటే
బడబడ పడియెను సలిలము
కడివెడుగా తడిసెనతడు కడిగెడు వేళన్ :-))
శ్రీరామా, పెద్దలు గురువులు పద్యం ముద్దుగా బాగుంది :)
రిప్లయితొలగించండిచదువరి గారూ, పద్యం నచ్చినందుకు ఆనందం. మీ శునకందం భలే ఉంది!
రిప్లయితొలగించండితెరెసా గారూ, ధన్యోస్మి!
ఏం జరుగుతుందిక్కడ? పద్యానికింత క్రేజా? :)
రిప్లయితొలగించండి@ఒరెమూనా - నర్తనశాలలో ఉత్తరకుమారుడు యుద్ధానికి బయల్దేరితే బృహన్నల రధం మెల్లగా నడుపుతుంటే ఇంత నెమ్మదిగా నడూపుతున్నావేమని ఉత్తరుడు హేళన చేస్తాడు. దానికి బృహన్నల, "మొదటిసారి మా రాజకుమారులు కొత్త కొత్తగా యుద్ధానికి బయలు దేరుతున్నారని" అని జవాబిస్తాడు. క్రేజు కేవలం పద్యం కోసం కాదు. ఇన్నాళ్ళూ తన బ్లాగులో రాజకీయుల నిజస్వరూపాల్ని బయటపెడుతూ చీల్చి చెండాడుతూ ఉండే భీకర చదువరులు కొత్తకొత్తగా కందపద్యాన్ని ఎత్తుకున్నారని - అందుకూ క్రేజు! :-)
రిప్లయితొలగించండిశునకందం - శునకానందం :)
రిప్లయితొలగించండి@రానారె గారూ!
రిప్లయితొలగించండిశ్రీరామునిజతగా రా
నారే! జెప్పుడి తమరును నాలుగుకవితల్
ధారాళముగా, కలనిజ
మౌరా! నవభువనవిజయ మౌనిట; ముదమున్
@శ్రీరాం గారు
మీరు వయసులో పిన్న ఏమో కాని, పద్యవిద్యలో మాకు పెద్దలే, ఇంకా
పెద్దలున్నచోట పిన్న తప్పులుజేయ
దిద్దగలరు ముందు తిట్టి రేని
మేలు కవిత జెప్ప మెరుగులనద్దరే
కలరు కొత్తపాళి గారు మనకు !
చదువరి గారు,
ఈ టేకదిరింది. 'తమరిక గురువే' అంటానికి ఏమాత్రం సందేహం లేదు.
ఆ సమస్య చూసి, మీరు రాజకీయం గా పూరిస్తారనే అనుకున్నా. దాన్ని నేను అసాంఘికం చేశాను.
కొత్తపాళీ గారు,
ఈ పేరడీల బలహీనత, మీకు .. ఎప్ప..
మాటలబాబు గారు,
నన్ను లాగితే ఛందం చెడుతుందని చదువరి గారు నిరూపించారు, 'కందములు' దగ్గర గణ భంగమైంది, చూడండి, అలాగే యతి ప్రాసలు కూడా.
దంచు దంచు మనుచు దంచగా ఊకదం- అంటే మొదటి పాదం 'ఫిట్ట' వుతుంది.
@ ఊ.దం. గారు తప్పులు తెలిపినందుకు ధన్యవాదాలు. అత్యుత్సాహం ప్రదర్శించి నిద్రలేమిలొ వ్రాశాను ఈ ఆట వెలది. మెదటిపాదం ఇటు తిప్పి అటు తిప్పి చాలా సార్లు ప్రయత్నించి సరి పోయిందనుకొన్నాను.అది తప్పింది.యతి స్థానము చూసుకొని వ్రాశాను అని అనుకొన్నాను.కాని ఆదీ తప్పింది. అన్ని ఇక్కడ ఆక్కడ చూసి వ్రాయాలి. గణాలు,యతిస్థానాలు, పద్య లక్షణాలు ఇంకా కంఠస్థం రావు.
రిప్లయితొలగించండిఇక్కడ చాలా జరిగిందే,
రిప్లయితొలగించండినాకూ ఎప్పటి నుండో
"మోగును పద్దెపు ఖ్యాతియు" లో ఖ్యా ముందు పు గురువా లఘువా అని సందేహం వుండేది. రాఘవగారు ఎక్కడో అది లఘువన్నట్లు గుర్తు.
సంధి జరగక పోతే లఘువనమట. ఈ నియమాన్ని కూడా ఎవరైనా తెవికీలో చేర్చితే బాగుంటుంది.
http://te.wikipedia.org/wiki/ఛందస్సు
ఇక ఊకదంపుడు గారు,
ఊకని దంచినట్లు దంచేస్తున్నారుగా పద్యాలనుగూడా..
చదువరి గారు,
మీరు నిజంగానే ఎక్కడికో ఎదిగిపోయారు. చాలా బాగున్నాయి, మీ కందాలు.
ఇక పందిని చంపడమొకటే తరువాయి. :)
శ్రీరామ్,
"పెద్దలు గురువులు ఇందరు"
యిందరు అని వ్రాయాలేమో ??
కోపాగారు,
మీ పారడీ 'బానే'వుంది, కానీ సూపర్ మాన్ గాలిలో ఎగిరితే అందులో గొప్పేముంది? :)
@శ్రీరామ్ గారు,
రిప్లయితొలగించండిఇక్కడ "ఇందరు" అంటే పెద్దలు,గురువులు కాక మిగిలిన వాళ్లు అని అర్ధమా? సంధి చేయలేదు.
@రాకేశ్వర గారు,
మీ మానసమవగతము కాకున్నది. కొత్తపాళీవర్యుల నొక ప్రౌఢమైన మత్తేభమో శార్దూలమో కోరుచుంటిరా?
@మాటలబాబు గారు,
అవునండీ, గణాలని ఎదో ఒకటి చేసి కుదిరిచ్చాం,హమ్మయ్య పద్యం సిద్ధం అనుకుంటే యతి ప్రాసలు తంతాయి. మళ్లామొదలు.
ఆపక ప్రత్నించండి .. త్వరలోనే మంచి పద్యాలు రాయగలరు.
పద్యానికి ఇక్కడ తన బలిమే కాక గురువుగారు చెప్పినట్టు స్థానబలిమి కూడా తోడయ్యింది. ఈ టపాని తెలుగుబ్లాగుల్లో అత్యధిక వ్యాఖ్యలొచ్చిన దానిగా చేసే బాధ్యత ఊ.దం. గారి మీద పెడుతున్నా!
రిప్లయితొలగించండిరాక్, యిందరు అని రాయాలా? నాకు తెలీదు మరి.
ఊ.దం. గారూ, పెద్దతనం పిన్నతనం జ్ఞానంలోనే! మిగతా విద్యలు గారడీలే కదా. మీరిలా ఆటవెలదులని పంపుతారని భయపడే ఒక పద్యం రాసేసాను. ఇంక వదిలెయ్యండి :)
ఔనండీ అక్కడ సంధి చేస్తే అర్ధం మారిపోతుందని అలా చేసాను.
@ ఊకదంపుడుగారు
రిప్లయితొలగించండికోపాగారు పద్యాలలో సూపర్ మాన్ అని, కబట్టి expectations చాలా ఎక్కువ ఉంటాయని అంతే.
@ శ్రీరాం
నాకూ సరిగ్గా తెలియదండి,
మీరు నాకు ఇక్కడ చెప్పినదానిని నేను సరిగా అర్థం చేసుకోలేదేమో..
http://andam.blogspot.com/2007/06/blog-post_06.html
పద్యాల మధ్యలో అచ్చులు రాకుండటం గురించి ఎవో నియమాలున్నాయిగా.
"ర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు" వంటి చోట చెల్లుతాయనుకుంట ???
"అత్యధిక వ్యాఖ్యలొచ్చిన దానిగా చేసే బాధ్యత ఊ.దం. గారి మీద పెడుతున్నా"
రిప్లయితొలగించండిఅప్పుడు గాని చదువరి గారు నాకిక్కడ "No Entry" board పెట్టరు. ఆయన ఇప్పటికే -
తేట పరచి నేను దెలుపగ సోనియా
కష్టములరుణ దళ, కరుణ క్రియల
నిమషమైన మనసు నిలువగనీయక
ఊదరెట్టి వీడు ఊక దంచు
అని అనుకుంటున్నారనుకుంటా..
రానారె గారు, రాకేశ్వరగారు , ఈ టపా చూస్తే రాఘవగారు పద్యాలు చెబితే కొత్తపాళీ గారు తమశిష్యుల పద్యోన్నతి గని 'finishing touch' లా ఓ పద్యం చెబుతారని ఆశ అంతే..
చదువరి గారు, అడగటం మరిచాను.. అంత మంచి కుక్కా-దొంగా పద్యం ఇన్నాళ్లు ఎలా దాచారండి. కుక్కలదినోత్సవానికో , దొంగలదినోత్సవానికో ప్రకటిద్దామనుకున్నారా?
కొత్తపాళీ గారూ, సమయోచితం.. మీకు తెలీనిదేముంది!? పిల్లకు అందం, ఛందం ఉంటే చాలు అర్థం సంగతి తరవాత చూద్దాం అనే స్థితిలో ఉన్నాను. (కొత్త పెళ్ళికొడుకును కదా:))
రిప్లయితొలగించండిమరో సమర్ధన.. ఊకదంపుడు మహాశయుడు, కీలెరిగి వాత లాగా వీలెరిగి సమస్య ఇస్తారనీ..
అబ్బే, ఊకదంపుడు గారూ, నేనలాగేం అనుకోడం లేదులెండి. దేని గోల దానిదే. కాకపోతే.. ఈ కరుణానిధి, కరుణా పయోనిధి మీద చేస్తున్న దండయాత్ర మనసును నిలువనీయకున్నది. జయవిజయుల్లో ఒకడికి ఇంకా శాపవిమోచనమైనట్టు లేదు.
రాకేశ్వరా! ఈ పందిని జంపుట యేమి? చంపకనే మాల వేయుట కాదుగదా!? అదియే యైన, దానికి మరి కొంత సమయము పట్టును.
పందిని చంపటం గురించి ఇక్కడ చూడండి.http://kottapali.blogspot.com/2007/03/blog-post_16.html
రిప్లయితొలగించండిపద్యాల్రాయడం ఎలా పట్టుబడుతుంది అనే ప్రశ్నకి అదే టపాలో చివరి వ్యాఖ్య కూడా చూడండి.
వహ్వా...బహు బాగుంది పద్యాల జల్లు!
రిప్లయితొలగించండిచదువరి గారు - మీ మధురమైన పద్యాలకు, మిక్కిలి సుమధురమైన చర్చకు వేదిక కల్పించినందుకు కృతజ్ఞతలు.
@కొత్తపాళీ గారు - గజేంద్రమోక్షం పద్యంలో లక్ష్మీ దేవి తడబాటు మాటల పొందికలో క(వి)నిపిస్తోంది! పోతన గారు శిల్పౌచిత్య సాధనలో, కావాలనే సర్వ లఘు కందం వ్రాసి ఉంటారంటారా?! మంచి పద్యాన్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.
@చదువరి గారు
రిప్లయితొలగించండి"జయవిజయుల్లో ఒకడికి ఇంకా శాపవిమోచనమైనట్టు లేదు" - బేషుగ్గా చెప్పారు.
మీరు చెప్పినట్టు నేను సమస్యలు వీలెరిగే ఇస్తున్నాను. కావలంటే ఇక్కడ (http://sreekaaram.wordpress.com/2007/08/14/%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%af%e0%b0%b2%e0%b1%81/)చూడండి లేదా ఇక్కడ (http://sreekaaram.wordpress.com/2007/09/02/%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b0%82%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%82-%e0%b0%95%e0%b0%be%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b3%e0%b1%81-%e0%b0%ae%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b3%e0%b1%80/).
శ్రీరాం గారేమో కీ(Solution/పూరణ) లెరిగి, కీలెరిగి వాతలు పెడుతున్నారు. :(
@సిరి గారు
ఆ పద్యానికి డకార పునరావృతం కూడా అందమేనండీ.
@కొత్తపాళి గారు,
మీరు చెప్పిన సామెత కి కందపద్యం ఉన్నట్టుంది మాస్టారూ.
ఊ.దం. గారూ, పన్నులు పీకుతున్నారసలు!
రిప్లయితొలగించండిచదువరిగారూ, మీ బ్లాగులోని వ్యాఖ్యలకు లంకెలిద్దామంటే కుదరకుండా చేశారే! :-(
రిప్లయితొలగించండిఇన్నాళ్లూ నేనెక్కడ
రిప్లయితొలగించండినున్నానని తోచుచుండె నుత్సాహముతో
నిన్నిన్ని పద్యములఁ గనఁ
హన్నన్నా చెప్పలేదె? అసలొకరైనా!
9.5 out of 10
రిప్లయితొలగించండి