14, ఏప్రిల్ 2007, శనివారం

అప్పన్న, అప్పన్న, అప్పన్న

2 కామెంట్‌లు
అనిల్ చీమలమర్రి గారి నటురె పుటురె చదివాక..
చాన్నాళ్ల తరువాత తిరిగొచ్చిన అనిల్ బాగా నవ్వు తెప్పించారు. అది చదివాక, చిన్నప్పుడు (బహుశా ఆంధ్రప్రభలో అనుకుంటా) నేను చదివిన ఓ జోకు జ్ఞాపకమొచ్చింది.

ఇద్దరు ఆడపిల్లలు. కవల పిల్లలు. మూడేళ్ళిలా వచ్చాయో లేదో బడికి పంపించారు. పాలేరు వెంట హుషారుగా బడికి వెళ్ళారు పిల్లలిద్దరూ.

బళ్ళో మేష్టారు వాళ్ళను ముద్దు చేసి,
"నీ పేరేంటమ్మా" అని అడిగారు
"అప్పన్న"
"ఏదీ మళ్ళీ చెప్పు"
"అప్పన్న"
పేరు నోరు తిరగడం లేనట్లుంది అని అనుకుని రెండో పాపను అడిగారు
"నీ పేరేంటమ్మా?"
"అప్పన్న"
"!"..., "అక్క పేరు కాదమ్మా, నీ పేరు చెప్పు"
"అప్పన్న"
మేష్టారు తెలివిగా "సరే, మీ అక్క పేరు చెప్పు"
"అప్పన్న"
"!!"
ఇలా లాభం లేదని పాలేరును పిలిచి అడిగారు
"ఈ పాప పేరేమిటోయ్?"
"అప్పన్నండి"
"!!!"..., "మరి ఈ పాప పేరు?"
"అప్పన్నండి"
"!!!!"
......
......

"ఏమిటయ్యా ఇద్దరికీ ఒకటే పేరు చెబుతున్నావు, అందునా మగపేరు చెబుతున్నావు, ఇంతకీ నీ పేరేమిటీ?"
"అప్పన్నండి"
!!??!!??!!!

తరువాత తెలిసింది..,
ఆ పాపల పేర్లు - అపర్ణ, అర్పణ, పాలేరు పేరు అప్పన్న అని.
పిల్లలకు నోరు తిరగలేదు. పాలేరుకూ నోరు తిరగలేదు మరి!

8, ఏప్రిల్ 2007, ఆదివారం

అడ్డుగోడలు, అడ్డగోలు మాటలు

9 కామెంట్‌లు
నాగార్జునసాగరుకు అడ్డంగా గోడ కడతారట. అబద్ధాల గోడలు కట్టారు, ప్రజలను చీలుస్తూ గోడలు కట్టారు, ఇక సాగరును చీలుస్తారట. కోస్తా రాయలసీమ వాసుల పట్ల వీళ్ళ దౌష్ట్యం ఇదే మొదటిది కాదు, గతంలో కొన్ని వందల సార్లు అనేకమంది నాయకులు అన్నమాటలే ఇవి. ఏడుపుగొట్టు పిల్లకాయలు మారాం చేసినట్లు ఉంది వీళ్ళ గోల.

  • పులిచింతల కడితే తెలంగాణకు నష్టం లేదు, అయినా సరే దాన్ని వ్యతిరేకిస్తున్నారు.
  • ఆంధ్రా అధికారులు దొంగలన్నారు.
  • ఆంధ్రా వాళ్ళు హైదరాబాదు కాలుష్యానికి కారణం అన్నారు.
  • ఆలమట్టి కడితేనే మంచిది అంటూ అడ్డగోలుగా మాట్లాడారు.
  • మా ప్రాంతానికి వచ్చి మమ్మల్ని, మా ఆస్తులను, భూములను దోచుకున్నారన్నారు.
  • మమ్మల్ని గేలి చేసారు, మా యాసను ఎగతాళి చేసారన్నారు.
  • హైదరాబాదు మా చెమటతో కట్టుకున్నది, దాన్ని వీళ్ళు దురాక్రమణ చేసారు. ఇక్కడ భూములు కొనీ, వ్యాపారాలు పెట్టీ అభివృద్ధి చెందారు. మేం వెనకబడిపోయాం అని అన్నారు
  • తెలంగాణ వాళ్ళకు అవకాశమే లేకుండా బళ్ళూ, కాలేజీలు కూడా వాళ్ళే పెట్టేస్తున్నారు.
  • ఇక్కడ మా హోటళ్ళు లేవు అన్నీ ఆంధ్రా హోటళ్ళే! అని అన్నారు
  • సినిమా పరిశ్రమ యావత్తూ ఆంధ్ర మయమే, తెలంగాణ వాళ్ళు లేరు అని అన్నారు
  • సినిమాల్లో వాడే భాష ఆంధ్ర మాండలికమే, విలన్లకు, ఆసిగాళ్ళకు మాత్రం తెలంగాణ మాండలికం వాడుతారు.
  • తెలుగుతల్లి అనే భావనను తూలనాడారు
  • తెలుగు అనే మాటను దొంగతనం చేసారన్నారు
  • ఇలా ఎన్నో.. ఇదుగో, ఇప్పుడు సాగరుకు అడ్డంగా గోడ కడతారట.
నల్లగొండ ఫ్లోరైడు సమస్య విషయంలో జరుగుతున్నది అమానుషమనేది నిర్వివాదాంశం. సాగునీటి కంటే తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాలనేది సహజ న్యాయం. ఫ్లోరైడు సమస్యను పరిష్కరించకపోవడం పట్ల నిరసన తెలియజేస్తూ ఒకప్పుడు ఎన్నికలలో నాలుగైదు వందల మంది నామినేషను వేసి దేశవ్యాప్తంగా ఈ సమస్యను వెలుగులోకి తెచ్చారు నల్లగొండ వాసులు. అయినా జరిగిందేమీ లేదు. హైదరాబాదుకు తాగునీరు తెచ్చే గొట్టాలు తమ ఇళ్ళ ముందు నుండే వెళ్తూ ఉన్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి వారిది. ఒకరు కాదు, అన్ని ప్రభుత్వాలు, పార్టీలూ దోషులే ఈ విషయంలో! గోడలు కట్టే వీరులూ అందుకు మినహాయింపేమీ కాదు.

వెనకబాటుతనం అనేది అన్నిచోట్లా ఉన్నదే అని ఆలోచించరు. ఊరికే అరిస్తే ఉపయోగమేమిటి? కేవలం భావోద్వేగం పని సాధిస్తుందా? అందరి మీదా ఇలా అరిచీ, కరిచీ తెలంగాణ వ్యతిరేకతను పెంచడం తప్ప ఉపయోగమేమిటి? ప్రతీదానికీ ఆంధ్రులే కారణమని ఇలా అన్ని రకాల తిట్లూ తిట్టి, ఆ మీదట అదే జనం అన్నదమ్ముల్లా విడిపోదామని సన్నాయి నొక్కులు నొక్కుతారు! సోదర భావం అంటే ఇలా తిట్టుకోవడమా? ఇది కేవలం తెరాస నాయకులకే పరిమితం కాదు పత్రికల్లో వచ్చిన వ్యాసాల్లో చూసాం, కొండొకచో బ్లాగుల్లోనూ చూసాం. ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారంటే, వ్యతిరేకించరూ మరి!?


3, ఏప్రిల్ 2007, మంగళవారం

జీమెయిలు ఉత్తరాలు ఇక ప్రింటు తీసి మన ముంగిట్లో

5 కామెంట్‌లు
జీమెయిలు వాడు కొత్త సర్వీసు - Gmail Paper - మొదలుపెట్టాడు. మీ మెయిలును ప్రింటు తీసి మీ ఇంటికి పోస్టులో పంపిస్తాడు. మీరెన్ని మెయిళ్ళడిగితే అన్నీ పంపిస్తాడు.. ఒకటైనా, వెయ్యైనా, లక్షైనా! అటాచిమెంట్లు కూడా ప్రింటు తీసి పంపిస్తాడు. ఫోటోలను చక్కటి ఫోటో పేపరు మీద అచ్చేసి మరీ పంపుతాడు.

మరి డబ్బేమాత్రం తీసుకుంటాడు? పైసా కూడా తీసుకోడు. ఔను, డబ్బడగడు. జాబులను ప్రింటు చేసిన కాగితాలకు వెనక వైపున యాడ్లు వేసుకుంటాడు. దానితో ఖర్చులొచ్చేస్తాయి.

రాత్రి జీమెయిలు ఇంటర్‌ఫేసు అనువాదంలో భాగంగా దీన్నీ అనువదించాను. కుతూహలం కలిగి, వాడి సైట్లో చూసా. ఈ లింకు దొరికింది. ప్రస్తుతం అమెరికాలో పెట్టినా త్వరలోనే ఇక్కడకూ వస్తుందేమోలే అని అనుకుంటూ కింది "టర్మ్‌స్ ఆఫ్ యూజ్స్" నొక్కి ఆ పేజీ చూస్తే, అక్కడ కనబడింది - ఏప్రిల్ ఫూల్ అని!

2, ఏప్రిల్ 2007, సోమవారం

చాప కింద నీరు

8 కామెంట్‌లు
గత ఆదివారం ఆంధ్ర జ్యోతిలో మత మార్పిడి వార్త వచ్చింది. మతప్రచారంలో భాగంగా ఈ క్రైస్తవ మిషనరీలు ఎలా పని చేస్తున్నాయో చదివి ఆశ్చర్యపోయాను. గిరిజనుల పేదరికాన్ని, అమాయకత్వాన్ని, చదువులేనితనాన్ని ఆసరాగా చేసుకుని నాగరికులమని చెప్పుకున్నవారు వారి శ్రమను దోచుకోవడం చిరకాలంగా జరుగుతున్నదే. కానీ సేవలో మత విశ్వాసాలను చొప్పించి, గిరిజన సమాజాన్ని ఛిన్నాభిన్నం చెయ్యబూనడం క్రైస్తవ మిషనరీలకే చెల్లింది.

సంబంధిత టపాలు