29, జనవరి 2007, సోమవారం

తెలుగు సినిమా - 75 ఏళ్ళ పండుగ

మొదటి తెలుగు సినిమా నిర్మించి 75 ఏళ్ళయిన సందర్భంగా పడుగ చేసారు. బాగానే చేసారు. మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిగిన పండుగలో మూడోనాడు వాళ్ళలో వాళ్ళకి ఉన్న విభేదాలు వికటాట్టహాసం చేసాయి.

పండుగలో కొన్ని విశేషాలు:

కాలనాళిక:
మరో పాతికేళ్ళ తరువాత, తెలుగు సినిమా ఎలా ఉండబోతోందన్నది ఎవరి ఊహకు తగినట్లుగా వాళ్ళు ఓ కాగితంపై రాసి ఓ పెట్టెలో వేస్తారు. అలా అందరూ రాసాక, ఆ పెట్టెకు సీలేసి, పాతికేళ్ళ తరువాత, అంటే తెలుగు సినిమా వందేళ్ళ పండుగ రోజున తీస్తారు. ఆనాటి పరిస్థితిని ఇప్పటి వాళ్ళు ఎంతవరకు ఊహించగలిగారు అనేదాన్ని అంచనా వేస్తారన్నమాట. చక్కటి ఆలోచన! ఈ కాలనాళికను ఓ పదిహేను రోజుల పాటు చాంబరులో ఉంచి సినిమా వాళ్ళందరి ఊహలను సేకరించి ఆపై పదిలపరుస్తారు.

సన్మానాలు: పాత తరం నటులను సన్మానించే కార్యక్రమం. నిర్మలమ్మ, అంజలీదేవి, కాంతారావు వంటి వారిని గౌరవించడం సముచితంగా ఉంది. ఆ జాబితాలో ఉండాల్సిన వారు కొందరు కనిపించలేదు, ఎంచేతో? రావి కొండలరావును మిస్సయ్యారు. (లేక నేను మిస్సయ్యానా?)

వేదిక నిర్వాహకులు: మూడోరోజు కార్యక్రమాన్ని రాజేంద్రప్రసాదు సరిగ్గా నిర్వహించలేదు. సన్మానం జరిగేదొకరికైతే ఈయన చెప్పేదింకొకరి పేరు. మధ్యలో అక్కడక్కడా వెకిలి చేష్టలు కూడా జోడించి వీలయినంతగా చెడగొట్టాడు. చప్పట్లు కొట్టమంటూ బతిమిలాట్టం ఈయనకో అలవాటులా ఉంది.

ఆటాపాటా: వెకిలి పాటలని కాస్త తగ్గించి మంచి పాటలను మరిన్ని కూర్చాల్సింది.

హుందాతనం: - అనగా జయసుధ! తనకు సన్మానం జరిగాక మాట్లాడమంటే ఆమె మాట్లాడింది మూడే మాటలు. నన్ను పరిచయం చేసిన కృష్ణ, విజయనిర్మలలకు, దర్శకులు దాసరి, రాఘవేంద్రరావులకు, తోటి నటీనటులు, దర్శకులు, సాంకేతికులు అందరికీ నా ధన్యవాదాలు.- ఇంతే! కొందరు మాట్లాడిన సోది విన్న తరువాత ఇది చాలా హాయిగా అనిపించింది.

మెరుపులు:
  • పద్మనాభం పాడిన పాట. పాట విడిగా విని తరువాత వ్యక్తిని చూస్తే "పాడిన వ్యక్తి ఇంత ముసలివారా" అని అనుకోక మానరు. చాలా చక్కగా పాడారు.
  • నిర్మలమ్మ చక్కగా మాట్లాడింది.
  • సునీల్ చేసిన మైము. చక్కగా చేసాడు.
  • తలకు మాసిన సన్మానం స్కిట్: ఇందులో గుండు హనుమంతరావు హావభావాలు బాగున్నాయి.
  • సుమ కబుర్లు: ప్రేక్షకుల్లో కూర్చున్న సినిమా వాళ్ళతో మాట్లాడుతూ సుమ కొన్ని మంచి కబుర్లు చెప్పించింది.
ఆశాభంగం: హీరోల పాట. పాటా బాలేదు, చిత్రీకరణా బాలేదు. తెలుగు సినిమా చరిత్రను పాటలో పొదుగుతారనుకున్నాను. బహుశా ఎక్కువ ఊహించడం వలన అలా అనిపించేదేమో! తరువాత మీరు చూడబోయే హీరోలందరి పాట ఎంతో అద్భుతంగా వచ్చింది అని కె.ఎస్.రామారావు అన్నపుడే నేను అనుమానించాను. అదే అయింది. సినిమా వాళ్ళకే ప్రత్యేకించిన ఈ డైలాగుతో జాగ్రత్తగా ఉండాలి.

(యాంటీ) క్లైమాక్సు: తెలుగు సినిమా ప్రముఖులను, లెజెండ్లను సన్మానించే కార్యక్రమాన్ని గొప్ప ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక, పరిశీలనాత్మక కార్యక్రమంగా మార్చేసారు మన తెర వేల్పులు. అసలు లెజండు, సెలెబ్రిటీ అనగానేమి అంటూ అర్థాలు అడగడం మొదలు పెట్టి ప్రేక్షకులకు ఎంతో విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేసారు. ఎంతో ఉద్వేగాన్ని అభినయించారు. కళ్ళనీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఆపై కాలనాళికలో శాలువాలు, జ్ఞాపికలనూ వేసి మొత్తం నాటకాన్నంతటినీ రక్తి కట్టించారు. మొత్తమ్మీద సరదాగా సంతోషకరంగా జరగాల్సిన కార్యక్రమంలో మెలోడ్రామాను చొప్పించి, కార్యక్రమాన్ని తమ సినిమాల స్థాయికి దిగజార్చారు.

పంపిణీదారు: మాటీవీ బాగానే డబ్బులు చేసుకుని ఉండాలి. దురదృష్టవశాత్తూ ప్రకటనల మధ్య అప్పుడప్పుడు కార్యక్రమాన్ని చూపించాల్సి వచ్చింది గానీ లేకపోతే డబ్బుతో దిబ్బేసుకు పోయేవారే!

పండుగ డైలాగు: "ఇంత పెద్ద ఏర్పాట్లలో కొన్ని లోపాలు దొర్లడం సహజం" (చట్టం తనపని తాను చేసుకు పోతుంది అనే డైలాగు పదే పదే గుర్తొచ్చింది.)

5 కామెంట్‌లు:

  1. ఎదేమయినా మంచి రసవత్తర ఘట్టాలకు తెర లేపారు.

    రిప్లయితొలగించండి
  2. చదువరి గారు, తెలుగు సినేమ 75 సంవత్సరాల పండుగ విశేషాల గురించి చాల చక్కగ చెప్పారండి. మీరు యాంటి క్లైమాక్స్ విభాగంలో అన్నట్టు సినేమ వాళ్ళందరు వీలైనంత over action చేశారు. మీరు యే హీరో వైపు మాట్లాడకుండా నాకు మీ మీదున్న గౌరవాన్ని మరింత పెంచారు.

    రిప్లయితొలగించండి
  3. అయ్య..! బాబోయ్ నా మతి చెడింది. సినిమా సినిమా అన్న వాళ్ళకి మంచి సినిమా అది. అసలు నన్నడిగితే ఇది గనక విడుదల చేస్తే వంద సంవత్సరాల ఉత్సవాల వేడుక వరకు నడుస్తది. సినిమా ఇండుస్త్రీకి చాలా లాభాలు వస్తాయంటాను.. ఇన్ని రోజులు మనం స్క్ర్రీన్ పై వాళ్ళ వేషాలు చూసి ఎంతో మంచి వాళ్ళని నమ్మి మోసపోయాము.వీళ్ళేదో మర్యాద తెలిసిన వ్యక్తులనుకున్నాను.ఆదర్శమూర్తులనుకున్నాను.(నాకు ఆవేశం ఎక్కువ క్షమించాలి).ఏది ఏమైనా అందరి సినిమాలు వెండి తెర మీద చూపించే వాళ్ళు. వాళ్ళ సినిమా బుల్లి తెర మీద చూపించారు..నమ్మలేకున్నాను.. అసలు నాకో విషయం అర్థం కాదు. ఒక్కటి అడుగుతున్నాను టీవి వాళ్ళ ఇంటర్వ్యూస్ లో ఎప్పుడూ కొత్త సినిమాలు బాగలేవు పాత సినిమాలు బాగుండేవి అంటూ మన సినిమా పెద్దలు చెప్పుకుంటూ వస్తున్నారు.. నైతిక విలువలు తగ్గాయని ఇంక ఏంటో చాలా విషయాలు చెప్తు తెగ బాదపడ్తున్నారు. అసలు వీల్లు పాత సినిమాలు తీసే కాలం లో ఏమైనా విలువలు పాటించారా? వాళ్ళ కాలంలో వాళ్ళు ఏదో కొత్తతనం చూపించాలని వాళ్ళు ప్రయత్నిచారు. ఇప్పుడు వీళ్ళ తరంలో వీళ్ళు కొత్త తనం కొరకు ప్రయత్నిస్తున్నారు.. ఇప్పటి వాళ్ళదేమి తప్పు లేదు.కాని ఒక విషయం మట్టికి బల్ల గుద్ది మరీ చెప్పగలను.ఎప్పుడూ కూడ తరువాతి తరాల వాళ్ళే తెలివిగలవారు.. సరే.. మన సినిమా హీరోల గురించి మాట్లాడితే వీళ్ళు నిజంగా నాలాంటి వాళ్ళందరకి ఆదర్శమూర్తులే. నిజంగా సినిమా అంటే మంచి రిలీఫ్ అనిపిస్తుంది.. నాకు మూడ్ బాగలేకుంటే వెంటనే మంచి హీరోయిన్ ఉన్న సినిమాకి వెళ్తాను. ఇక బయట నిజ జీవితంలో అలాంటి హీరోయిన్ కొరకు వెదుకుతాను.. ఇంకా నా వయసు 22 సంవత్సరాలు మాత్రమే కాబట్టి. ఇదంతా ఎందుకంటే సినిమా ప్రభావం మనుషుల పై ఎంతవరకు పడుతుంది అని తెలియ జేయటానికి.కాని సినిమా ఇండుస్త్రీ చాలా విధాలుగా నిరుద్యోగాన్ని భర్తీ చేస్తుంది. రాజకీయానికి సినిమాకి చాలా దగ్గరి సంబంధం ఉంది
    .చెప్పేది చేయరు, అర్థికంగా ఎదుగుతారు.
    మల్లీ అదేంటో గాని సినిమా వాళ్ళంటే విపరీతమైన పబ్లిసిటీ. వాల్లెన్ని తప్పులు చేయని ప్రేక్షకుల మదిలో మట్టికి గొప్పవాల్లు. సల్మాన్ ఖాన్ మరియు మొనికా బేడి వీల్లు సినిమా వాల్లే. కాని సల్మాన్ ఖాన్ కి హైదరాబాద్ లో విశేష నీరాజనాలు.అశేష అభిమానులు.ఇదంతా చూస్తే సినిమా అంటే ఎంత వెర్రో అర్థమౌతుంది.
    ఇంకా చెప్పాలంటే కాలనాళిక. బాగానే ఉంది కాని ఇంక 25 సంవత్సరాలకు ఎన్ని మర్పులు వస్తాయి ఎవరు ఊహించగలరండి.నా అనుమానం సినిమా ఇండుస్త్రీ ఉంటుందా? అని. ఉన్నా ఆంధ్రా సినిమా తెలంగాణా సినిమా అన్న చీలికలు రాకుండ ఉంటాయా? అప్పుడు ఆ కాలనాళిక ఏ ప్రాంతానిది.. ఇప్పుడు ప్రతీ జిల్లాల్లో సినిమాలు స్వంత ప్రొడక్షన్ లో తీస్తున్నారు..
    ఉదా:సింగరేణి తరంగాలు రామగుండలో
    బహుశా అలా జరకుండా జాగ్రత్తపడతారేమో. నిజంగా సినిమా వాల్లు చిరంజీవులు..ఎప్పుడూ తెరపై బ్రతికే ఉంటారు నిజ జీవితంలో చనిపోతూ ఉంటారు..నిత్య నూతన యవ్వనమంటే అదేనేమో.
    ((ఇదే నామొదటి కామెంట్(ప్రయత్నం), ఎమైనా తప్పు చేస్తే తెలియజేయగలరు.))

    రిప్లయితొలగించండి
  4. పండూ! చాలా మందిమి రాసిన మొదటి వ్యాఖ్య కంటే మీర్రాసినది బాగుంది. బ్లాగొకటి మొదలుపెట్టి రాస్తూ పొండి. మీ కలం పదును దేలుతుంది. మీరు సింగరేణి వారా? మణుగూరు సింగరేణి తరంగాలతో నాక్కొంత పరిచయం ఉంది. -చదువరి

    రిప్లయితొలగించండి
  5. చదువరి గారు.. మీరిచ్చిన ఉత్సాహానికి నా జోహార్లు.. నేను ఇంకా MCA final year చదువుతున్నాను.. మా నాన్నగారు సింగరేణి ఉద్యోగి అందుకే చెప్పాను. ప్రతి రోజు నేను మీ బ్లాగ్ చదువుతున్నాను. చాలా బాగుంది. నా లాంటి వాళ్ళకి ఉత్సాహాన్ని ఇలాగే ఇస్తూ ఉండండి.. ఉంటాను...

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు