28, డిసెంబర్ 2005, బుధవారం

భారతదేశం - SWOT విశ్లేషణ

0 కామెంట్‌లు
భారతదేశపు బలమూ బలహీనతా, మంచీ చెడూ, గొప్పా ముప్పూ, మొదలైనవాటి విశ్లేషణ ఇది. విశ్లేషించేవారి మనస్తత్వాన్ని బట్టి విశ్లేషణలు ఉంటాయి. ఇక్కడ ఇద్దరి విశ్లేషణలు ఉన్నాయి వాటిని పరిశీలిద్దాం.

సాధారణ పౌరుడు (సిగ్గూ లజ్జా వంటి మానవసహజమైనవన్నీ ఉండే వ్యక్తి. మోసం, దగా, నయవంచన వంటి వాటికి బహుదూరం)
బలము: మన సాంస్కృతిక వారసత్వం.
బలహీనత: సరైన చదువు చెప్పకపోవడం
అవకాశం: అపారమైన జనసంపద
ముప్పు: నేటి రాజకీయ నాయకుడు

నేటి రాజకీయ నాయకుడు (వీరి గురించి చెప్పనక్కరలేదు కదా!)
బలము: పీడిత, తాడిత, బలహీన, దళిత, మహిళా, యువజన వర్గాలు
బలహీనత: పత్రికలు, కోర్టులు, మాటుకెమెరాలు చెప్పేవాటిని పట్టించుకునే ప్రజలు
అవకాశం: ఎడాపెడా డబ్బు ఖర్చయ్యే అభివృద్ధి కార్యక్రమాలు
ముప్పు: నా ప్రత్యర్థి రాజకీయ నాయకుడు

పై రెండు విశ్లేషణల్లోనూ ఒక్క్టి మాత్రమే కలిసింది చూసారా? అదే ముప్పు - నేటి రాజకీయ నాయకుడు. మనమూ అదే అనుకుంటున్నాం.., చిత్రంగా వాళ్ళూ అదే అనుకుంటున్నారు.

(ఈ రచయిత విమర్శ నేటి రాజకీయ నాయకుల పైనే, రాజకీయాలపై కాదు. రాజకీయాలు ఇతడికత్యంత ఇష్టమైన విషయం. )

16, డిసెంబర్ 2005, శుక్రవారం

ఎవరికోసమీ శాసనమండలి?

2 కామెంట్‌లు
"శాసనసభలో విద్యావంతులు లేరు, కాబట్టి విద్యావంతులకోసం మండలి కావాలి" అనే వాదనపై రెండు విషయాలు..

1. "శాసనసభలో విద్యావంతులు లేరు, కాబట్టి విద్యావంతులకోసం మండలి కావాలి" అనేది పసలేని వాదన. ప్రస్తుత శాసనసభలో చూడండి..దేశ అక్షరాస్యతా శాతం కంటే చాలా ఎక్కువగానే విద్యావంతులున్నారు. (అయినా నోళ్ళిప్పాలంటే డబ్బు కావాలంట.. ఒళ్ళమ్ముకునేవాళ్ళే నయం.) కాబట్టి విద్యావంతుల కోసం ప్రత్యేకించి మరో సభ అవసరం లేదు. మరో సంగతి.. ఈ చదువుకున్న వాళ్ళ కంటే, పెద్దగా చదువుకోని పల్లె ప్రాంతాల్లోనే ఎన్నికల్లో ఓట్లేసే వారి శాతం ఎక్కువ. అసలుదానికే ఓట్లెయ్యని వాళ్ళకోసం ఈ కొసరు అవసరమా?

2. పైచదువులు చదివినవారు - మంచివారు, తెలివిగలవారు, నీతిపరులని అనుకోవడం సరికాదని మనందరికీ తెలుసు. ఏమీ చదువుకోని టంగుటూరి అంజయ్యా ఆయన ప్రభుత్వం ఇటీవలి ప్రభుత్వాల్లో అత్యంత నీతివంతమైనవి (సాపేక్షికంగా) కాగా ఎం...థో చదివిన బాబు గారి నిర్వాకం మనకు తెలియంది కాదు. పై చదువులు..పై పై చదువులేనండీ!

కాబట్టి మండలి వస్తే లాభపడేది వాళ్ళే.. మనకేం ఒరిగేదిలేదు.
-------------

P.S: మనకు ఒరిగే విషయాలున్నాయి కొన్ని, వాటిని వీళ్ళసలు పట్టించుకోరు... ఉదాహరణకు రాజకీయాల్లో నేరస్తుల విషయమే చూడండి.. దేశం మొత్తం మీద ఒక్కడన్నా మాకు నేరస్తుడే నాయకుడు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటాడా..!?, కోడు. మరి వాళ్ళేంచేసారు..? నేరమయ రాజకీయాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు మార్గదర్శకాలిస్తే.. మొత్తం అన్..హి పార్టీలూ కలిసిపోయి మరీ.. ఎదురు తిరిగాయి. ఏమయింది..? రాజకీయాలూ అలాగే ఉన్నాయి, నేరస్తులూ అలాగే ఉన్నారు. మనమూ అలాగే ఉన్నాం, పిచ్చోళ్ళలాగా.

ఇప్పుడు చెప్పండి.. వీళ్ళేం కోరుకుంటున్నారు? మనకుపయోగప్డేదా.. లేక.. వాళ్ళకు పనికొచ్చేదా?

15, డిసెంబర్ 2005, గురువారం

కెరటాల కరణాలు

3 కామెంట్‌లు
కెరటాల కరణం కథ వినే ఉంటారు. ఆ కరణం నోరు తెరిచి అడిగి మరీ లంచం తీసుకున్నాడు.
మన ఎంపీలు ఆయన తలదన్నిపోయారు.. వీళ్ళు నోళ్ళు తెరవాలంటేనే లంచం అడుగుతున్నారు. మనకు తెలిసినవివి..తెలియనివెన్నో..!

ఇక మండలి కూడానట
శాసనసభకు తోడు మండలి కూడా కావాలని ఆరాటపడి సాధించుకున్నారు. మరో 90 మందికి ''అవకాశాలు...''

దీనిమీద లోక్‌సభలో జరిగిన చర్చను వార్తల్లో చూసాను. అందులో ఒకాయన అంటున్నాడు.. దయచేసి తీర్మానాన్ని వ్యతిరేకించి, ఆంధ్ర ప్రజలను అవమానించకండి.. అని.

అయ్యా, మండలి కావాలని ప్రజలడగలేదు..నాయకులు తామే అడుక్కుని తామే నెరవేర్చుకుంటున్నారు. అదొస్తే మాకు ఒరిగేదీ లేదు, రాకపోతే పోయేదీ లేదు. అదొస్తే 90 మందికే "లాభం" ..రాకపోతే మిగతా తెలుగువారందరికీ లాభం. అంచేత, మీకేం కావాలో మీరు తీసేసుకోండి, పంచేసుకోండి.. మమ్మల్ని అడ్డం పెట్టుకోవాల్సిన పని లేదు.. మేమేం అనుకోం..అనుకున్నా, మేం చేసేదేమీ లేదు కదా..మరో మూడున్నరేళ్ళదాకా మేమేం చెయ్యలేమని మనందరికీ తెలిసిందేకదా. (అప్పుడైనా మేం సాధించేదేమీ లేదులే.. మహా అయితే, దెయ్యాన్ని తరిమేసి, బ్రహ్మరాక్షసిని తెచ్చిపెట్టుకుంటాం!!)

హమ్మయ్య, కాంగ్రెసు ప్రభుత్వం ప్రజలకిచ్చిన మరో వాగ్దానం తీర్చేసింది. అయ్యా రాజశేఖర రెడ్డి గారూ, గబగబా అన్ని వాగ్దానాలూ ఇలా తీర్చేయకండి.. అన్నీ అయిపోతే, కొత్త వాగ్దానాలు చెయ్యడానికి ఎన్నికలు తొందరగా పెట్టాల్సి ఉంటుందేమో..!

9, డిసెంబర్ 2005, శుక్రవారం

వార్తల్లో విప్లవం - ఇందిరమ్మ టీవీ

6 కామెంట్‌లు
"పత్రికలు రంధ్రాన్వేషణే పనిగా పెట్టుకున్నాయి"
"విశాఖలో పత్రికలపై ఆంక్షలు"
"ఆదిలాబాదులో హెచ్చరికలు, నోటీసులు"

ఇవన్నీ ఇప్పటి వార్తలు కావు, విప్లవానికి ముందువి. విప్లవం తరువాత రాష్ట్ర ముఖచిత్రమే మారిపోయింది. ఇది 2006 డిసెంబరు.., ఇప్పుడిలాంటి వార్తలస్సలుండవు.

అసలేం జరిగింది..

19, నవంబర్ 2005, శనివారం

నా గోడు

13 కామెంట్‌లు
తెలుగునాట టీ.వీ.ఛానెళ్ళు స్థూలంగా రెండు రకాలు - టీవీ9, ఈటీవీ2, తేజ న్యూస్ వంటి వార్తా ఛానెళ్ళు, ఈటీవీ, జెమిని, తేజ, మా, జీ వంటి సినిమా ఛానెళ్ళు. మర్చిపోయా, డీడీ8 ఉంది కదా, ఇది ''అదో'' టైపు. ప్రస్తుతానికి దాన్నో పక్కన పెడదాం. ఈ ఛానెళ్ళ తీరుతెన్నులపై ఒక సామాన్యుడి వేదన ఇది.., నా గోడు. (Telugu Blog)

సంబంధిత టపాలు