19, ఆగస్టు 2011, శుక్రవారం

పాపం అన్నా హజారే!

ఎవరిమీదైనా లోక్ పాల్ కు మనం ఫిర్యాదించామనుకుందాం. ఆ తరవాత అది రుజువు కాలేదనుకోండి.. మన ఖర్మ కాలినట్టే! ఫిర్యాదు చేసినందుకు మన్ని తీసుకుపోయి జైల్లో పెడతారు. అంటే ఏంటనమాటా.. ఫిర్యాదించేముందు మనమే కేసును పూర్తిగా దర్యాప్తు చేసుకుని, మనకు మనం నిరూపించుకున్నాక, అప్పుడు చెయ్యాలి ఫిర్యాదు. మన ఎంపీలు పార్లమెంటులో వోటేసేందుకు డబ్బుల్తీసుకున్నారనుకోండి, పార్లమెంటులో ప్రశ్న అడగడానికి కూడా డబ్బులు తీసుకున్నారనుకోండి, మనం కళ్ళు మూసుక్కూచోవాలి. మాట్టాడకూడదు.
ప్రభుత్వం ప్రతిపాదించిన లోకపాల్ బిల్లు ఇది. అంచేతే దీన్ని జోక్ పాల్ అని అన్నా బృందం అన్నది.

ఇట్టాంటి జోక్ పాల్ మాకొద్దు, జనలోక్‍పాల్ కావాలి అని అడగడమా అన్నా బృందం తప్పు?  పార్లమెంటులో ఫలానా విధంగా బిల్లు పెట్టండి, ఇలా వద్దు, దీనివలన ప్రజలకు ప్రయోజనం లేదు అని చెప్పడమా వాళ్ల తప్పు?  ’పార్లమెంటు ఏ నిర్ణయం తిసుకున్నా శిరసావహిస్తాం’ అని కూడా అన్నారు కదా. కానీ పార్లమెంటులో ప్రవేశపెట్టబోయిన బిల్లు డ్రాఫ్టే ఇలా ఏడిస్తే ఎదిరించడం తప్పా?  అవినీతిని ఏమాత్రం అరికట్టలేని బిల్లును ప్రభుత్వం తయారుచేసుకుంటే తిరగబడాల్సింది పోయి, తిరగబడుతున్న అన్నా హజారేను విమర్శించడం ఏంటి పెద్దలారా?

ఒకచోటెక్కడో రాసారు, ’మనలో పాపం చెయ్యనివాడే ఆ రాయి విసరాలి’ అంటూ. ’ముందు మనం మారాలి ఆ తరవాత అన్నీ మారతాయి’ అనే టైపు వాదన అది. మనం డబ్బులు తీసుకుని వోటేస్తున్నాం కాబట్టి, ఎన్నికైనవాడికి సంపాదించుకోవాల్సిన అవసరం కల్పిస్తున్నాం. అంచేత వాళ్ళు లంచాలు తింటున్నారు. మనం నిజాయితీగా ఉంటే అంతా బాగుపడుతుంది. అని రాసారు. నిజమే, ఆదర్శవంతంగా ఉంది. కానీ..
 • అన్నా హజారేకు మనుషుల మనస్తత్వాలను మార్చే శక్తి లేనట్టుంది. అంచేతే వాళ్లను భయపెట్టి ఉంచే చట్టాన్ని తెమ్మంటున్నాడు. 
 • అన్నా హజారేకు వంద కోట్ల మందిని భయపెట్టే శక్తి కూడా లేనట్టుంది. అంచేతే కీలకమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, ఓ వెయ్యో రెండు వేల మందినో అదుపులో పెట్టి ఉంచే చట్టం మాత్రమే తేవాలంటున్నాడు.
వెయ్యీ రెండు వేల మందిని అదుపులో పెట్టే చట్టాన్ని తేవడానికే భూమ్యాకాశాలను ఏకం చెయ్యాల్సి వస్తోంది. అలాంటిది, ’మొత్తం వందకోట్ల మందీ కూడా మారిపోయి, నీతిమంతులైతే సుబ్బరంగా బావుంటది గదా’ అని అంటే, పాపం అన్నా హజారే ఏం చెబుతాడు? అందరూ నీతిమంతులే అయితే అసలీ లోక్ పాలెందుకూ? లోకాయుక్త ఎందుకూ? సీబీఐ ఎందుకు? -ఏమీ అక్ఖర్లా!

పోనీ, మనం డబ్బులు తీసుకుని ఓట్లెయ్యడం మూలానే ఆళ్ళు లంచాలు తీసుకుంటున్నారనుకుందాం. తప్పు మన్దే అనుకుందాం. ఈ లోక్ పాల్ ద్వారా ఎంపీలని డబ్బుల్తిననీకుండా కట్టడి చేస్తే.. ఇక వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వకుండా ఉంటారు కదా. వచ్చే మార్గం లేకపోతే వాళ్ళు మాత్రం ఎందుకిస్తారు?

ఇంకో చోట చదివాను.., ఇన్ని అధికారాలతో లోక్ పాల్ ను తెచ్చాక, వాడు కూడా అవనీతిపరుడైతే ఏం చేద్దాం? ఇంకో పాల్ కోసం ఉద్యమం చేద్దామా? అని ప్రశ్నించారు అక్కడ. (నవ్వకండి, నిజంగానే అడిగారు.). ఇట్టాగే ఆలోచిస్తే నాకో ప్రశ్న వచ్చింది.. ప్రభుత్వం తెచ్చిన లోక్ పాల్ ఏర్పడిందనే అనుకుందాం. అది లాభంలేదు, దానికి బుసకొట్టడం కూడా రాదు అని తెలిసాక, అప్పుడు మళ్ళీ ఇంకో పాల్ కావాలని ఉద్యమిద్దామా?

13 కామెంట్‌లు:

 1. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 2. ఆశ గారు రాసిన వ్యాఖ్య పొరపాటున తొలగించాను; మళ్ళీ ప్రచురిస్తున్నాను.
  -------------------
  http://www.nytimes.com/2011/08/18/world/asia/18iht-letter18.html
  పై వ్యాసం చూడండి. మనూ జోసఫ్‌గారు జాతీయ, అంతర్జాతీయ ప్రసార మాధ్యమాల్లో కూడా ఈ పిచ్చి వాదనలకు కొంచెం వాక్పటిమ జోడించి మరీ సెలవిస్తున్నారు.

  రిప్లయితొలగించండి
 3. ఒకచోటెక్కడో రాసారు, ’మనలో పాపం చెయ్యనివాడే ఆ రాయి విసరాలి’ అంటూ. ’ముందు మనం మారాలి ఆ తరవాత అన్నీ మారతాయి’ అనే టైపు వాదన అది. మనం డబ్బులు తీసుకుని వోటేస్తున్నాం కాబట్టి, ఎన్నికైనవాడికి సంపాదించుకోవాల్సిన అవసరం కల్పిస్తున్నాం. అంచేత వాళ్ళు లంచాలు తింటున్నారు. మనం నిజాయితీగా ఉంటే అంతా బాగుపడుతుంది. అని రాసారు.

  హె హే.. మా జూ.మహానయకున్ని భుజాలనెత్తుకుని మోసే ఒకానొక టాబ్లాయిడ్ లాంటీ తెలుగు వెబ్ సైటులో ఇలాంటి వాదననే చూశాను. వారి అభిప్రాయం ప్రకారం జూ.మహానయకుడి మీద కేసులు పెట్టి అతనికి పాపులారిటీ, మరియు ఓటు బ్యాంకు రెండూ పెంచుతున్నారట. పాపం అదే నిజమైతే.. మా జూ.మహానాయకులంగారు పొలోమని సుప్రీము కోర్టుకు పరుగులెందుకు పెట్టారో ఆ వార్త రాసిన వారికే తెలియాలి. :P, భజనలు చేయొచ్చుకానీ, మరీ ఇంత ఇదిగా చేయడం చూస్తే చిరాకేస్తుంది.

  రిప్లయితొలగించండి
 4. మీరు చెప్పిన యాంటీ వాదనలు నేను కూడా ఒకప్పుడు చేశాను. కానీ ఏదో ఒక పదునైన చట్టం లేకుండా ఈ వేల లక్షల కోట్ల అవినీతిని అఱికట్టలేం అనే అభిప్రాయం నాకు తరువాత కలిగింది. కనుక నేను జనలోక్‌పాల్ ప్రతిపాదనని ప్రస్తుతం సమర్థిస్తున్నాను. మనం మారితే అంతా మారుతుందనేది నిజమే కానీ మనుషులు మారడానిక్కూడా ఒక అనుకూల వాతావరణం కావాలి గదా ! ఇలాంటి చట్టాలు ఆ వాతావరణాన్ని ఏర్పఱుస్తాయని ఆశిస్తున్నాను.

  ఒకవేళ భావి-లోక్‌పాల్ స్వయంగా అవినీతిపరుడే అయినా సాక్ష్యాధారాలు బలంగా ఉన్నప్పుడు అవినీతిపరులకి వ్యతిరేకంగా తీర్పివ్వడం తప్ప అతనికి గత్యంతరం ఉండదు. అయితే ఈ లో‌క్‌పాల్ వ్యవస్థలో కేవలం ఒక్క కేంద్రన్యాయస్థానమే కాకుండా 28 మంది రాష్ట్రస్థాయి లోక్‌పాళ్ళు కూడా ఉండాలి. అలా ఉంటే ఒకఱు కాకపోతే మఱొకఱు ప్రజలకి న్యాయం చేసే అవకాశం ఉంటుంది. కేంద్ర లోక్‌పాళ్లు కూడా ఒక్కఱు కాకుండా ఏకకాలంలో ముగ్గుఱు, నలుగుఱు ఉండడం శ్రేయస్కరం, ఎన్నికల కమీషనర్లలాగే !

  రిప్లయితొలగించండి
 5. చదువరి గారు, జనలోక్పాల్ ఆవశ్యకత ను బాగా చెప్పారు.

  రిప్లయితొలగించండి
 6. మన నాయకులు మనకి చెప్పేదేమిటంటే, నిర్ణయాలు, శాసనాలు అన్నీ వాళ్ళే చేస్తారు. ఎవరూ నోరు విప్పి ఎందుకూ అని అడగకూడదు.

  VOTE & FORGET అనేది వీళ్ళు మనకిచ్చే నినాదం.

  రిప్లయితొలగించండి
 7. good one.

  all those who criticize or think there are other problems other than corruption can come out with those problems and solutions and fight for them taking inspiration from anna rather than trying to dilute or side track the movement.

  రిప్లయితొలగించండి
 8. These are the ten differences between Janlokpal and govt. bill. As you can see most of them are essentially procedural. I sincerely doubt that an average citizen however educated he might be can really undertsand the nuances.

  http://www.samachar.com/10-differences-between-Jan-Lokpal-Bill-and-Govt-Bill-litwLebedih.html

  రిప్లయితొలగించండి
 9. http://aroonism.blogspot.com/2011/05/anna-hazare-biggest-indian-fool.html

  రిప్లయితొలగించండి
 10. జనలోక్ పాల్ ఆవశ్యకత మీద ఏమాత్రం సందేహం లేదు.కాని అవినీతి మీద మధ్యతరగతి ఎందుకింత రొమ్ములు బాదుకొంటున్నది?ఎక్కువమంది ఇచ్చేవైపు వుండటం మూలానేనా?తీసుకునే వైపు ఉన్నవాళ్ళు ఎంతమంది అవినీతికి వ్యతిరేకంగా వున్నారో చెప్పండి!

  రిప్లయితొలగించండి
 11. చదువరి, చాలా బాగా చెప్పారు.

  ప్రభుత్వం వైపునుంచి వస్తున్న వాదనలు అడ్డగోలుగా వుంటున్నాయి. ఉదాహరణకు:
  1. చట్టాలవల్ల అవినీతిని అరికట్టలేము - మరి ప్రభుత్వ లోక్‌పాల్ ఎందుకు ప్రవేశపెట్టినట్టు? తమాషా చూద్దామనా?!
  2. పార్లమెంటే చట్టాలు చేయాలి, వ్యక్తులు మైదానాల్లో కాదు - ఎవరు కాదన్నారు? ఇన్నేళ్ళూ ఎందుకు చేయలేదు?
  3. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు - ఎందుకవుతారు? బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని పోలీస్ కేసు పెట్టండి, పెట్టారుగా తిహార్లో! మళ్ళీ కాళ్ళట్టుకుని ఎందుకు బయటికి సాగనంపారు?!
  4. BJP, RSSలు వాళ్ళ వెనక వున్నారు - వాళ్ళే కాదు, వామపక్షాలు, జగన్, తెదెపా కూడా వున్నారు, వుంటారు. అయితే ఏమంట? వుండకూడదా? అది నేరమైతే వాళ్ళను నిషేధించండి, వాళ్ళు పార్లమెంటులోకూడా వున్నారు.
  5. అమెరికా హస్తం వుంది - అమెరికా హస్తమో, పాకిస్థాన్/చైనా కాళ్ళో... ఏదీ ఆయా దేశాల్లోనుంచి రాయబారులను నిరశనగా రికాల్ చేయండి, చూద్దాం.
  6. PMని చేరిస్తే కొంపలంటుకుపోతాయి - ఏమీ? పిఎం ఆకాశం నుంచి వూడిపడ్డాడా? 10జన్‌పథ్లో రోజూ తోమాల సేవ చేయడానికి, రాహుల్‌తో క్లాసు పీకించుకోవడానికి ఐతే PM గారి ప్రిస్టీజికి అడ్డురావట్లేదా?
  ====
  /అవినీతి మీద మధ్యతరగతి ఎందుకింత రొమ్ములు బాదుకొంటున్నది?/
  ఏదో .. పై/కింది/మధ్య ఏదో తరగతి వుంటారు, ఐతేనేం? ఎవరో ఒకరు వుండి చావాలి గదా! :)
  /ఎక్కువమంది ఇచ్చేవైపు వుండటం మూలానేనా?తీసుకునే వైపు ఉన్నవాళ్ళు ఎంతమంది అవినీతికి వ్యతిరేకంగా వున్నారో చెప్పండి!/

  అవును, తీసుకునే వాళ్ళే వుండాలా?! లక్షలమంది వున్నారు, ఎవరిది ఏ కేసో సర్వే అంత అవసరమైతే పార్లమెంటులో బిల్లు పెట్టి సర్వే చేయ్ద్దాములేండి, తీఎరిగ్గా. మొదట గట్టి లోక్‌జన్‌పాల్ రానివ్వండి, 'ఏ బారాత్ నై చలేగీ' అని అరవడానికి చాలా మంది వున్నారు. అరుణా రాయి, అరుంధతి రాయి లాంటి దిక్కుమాలిన రాళ్ళని ప్రభుత్వం వేస్తూనే వుంది. హమ్మమ్మమ్మా...

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు