15, సెప్టెంబర్ 2010, బుధవారం

పొద్దులో నేను..

ఈమధ్య మా స్నేహితుడొకణ్ణి కలిసినపుడు, పొద్దు చూసావా అని అడిగాను.  వాడు నన్నోసారి వింతగా చూసి, ’నేను చూసేసరికి నడినెత్తిన ఉంటది, ఇంకేం చూస్తాను?’ అన్నాడు. అది కా దది కాదు..  పొద్దు, పొద్దు పత్రిక! చదివావా? అని అడిగాను. నన్నొక పిచ్చివాణ్ణి చూసినట్టు చూసాడు. వాడికి ముందే పత్రికలు, పుస్తకాలు, చదవడం లాంటివంటే ఎలర్జీ.  చిన్నప్పుడెప్పుడో చందమామ చదివితే, ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయంట. సైన్సు పుస్తకం చదవబోతే కళ్ళు వాచిపోయినై. అప్పటినుంచీ, పుస్తకాల జోలికి వెళ్ళకుండా జాగర్తగా నెట్టుకొస్తున్నాడు. అలాంటివాణ్ణి పొద్దు చదివావా అని అడిగితే, వాడు నావంక అయోమయంగా చూడ్డూ మరి!


వాడి సంగతి తెలిసీ అలా ఎందుకడిగానంటే దానికీ కారణముంది మరి.  పొద్దు పత్రికలో చిన్నదో చితకదో పని చేస్తూ ఉన్నాను కాబట్టి, ఆ ముక్క చెప్పుకోవాలన్న దురదొకటి నాకుంది కాబట్టి, అదేదో మనోళ్ళకి చెప్పుకుంటే కుసింత గౌరవంగా ఉంటదని కాబట్టిన్నీ వాడికి చెప్పుకున్నాను. దురద పుట్టినపుడు దేనితో గోక్కుంటన్నామో పట్టించుకోం గాబట్టి, పోయిపోయి మావాడితో గోక్కోబోయాను. వాడు లాబం లేదని తెలిసిపోయాక, ఇహ నా బ్లాగులో రాసేసుకుంటే మీరన్నా చదవకపోతారా అని ఇదిగో, ఇలా..


పొద్దులో వచ్చిన గొప్ప రచనల గురించి కాదీ టపా. వాటి గురించి రాస్తే నాకేమొస్తది, నా రచనల గురించి రాసుకుంటే కుసింత సమ్మగా ఉంటది గాని. :) అంచేత గొప్పవాటి జోలికి పోకుండా నా రచనల గురించి నాలుగు ముక్కలు చెబుతా.

నెలకోటి చొప్పున బ్లాగుల సింహావలోకనాలు రాసేవాణ్ణి. ఈ మధ్య రాయడం లేదులెండి. వాటిల్లో అప్పుడప్పుడూ నా వ్యాఖ్యలు కూడా ఒహటో రెండో పడేసేవాణ్ణి. దాంతో ఓసారి చిన్నపాటి రభసైంది బ్లాగుల్లో. :)

అప్పుడెప్పుడో బ్లాగుల పేరడీ అని ఒకటి రాసాను. దాని రెండో భాగం కూడా రాసానుగానీ, అది చదవనక్కర్లేదు. :) డా. కేశవరెడ్డి గారి అతడు అడవిని జయించాడు పుస్తక సమీక్ష కూడా రాసాను. ఈ ముక్క రాస్తూంటే నాకు ఆ నవల మళ్ళీ చదవాలనిపిస్తోంది. మీరు నా సమీక్ష చదువుతారో లేదోగానీ, ఆ నవల చదివి ఉండకపోతే మాత్రం, తప్పక చదవండి. 

ఒకటో రెండో సంపాదకీయాలు రాసాను. ఇస్రో గురించి ఒకటి, ప్రాథమిక విద్య మీదొకటీ రాసాను. ఈ మధ్య ఒక గళ్ళనుడికట్టు కూడా కూర్చి, మిగతా సంపాదకుల కళ్ళుగప్పి ప్రచురించేసాను కూడా. :)

ఇవేగాక మంచి రచనలు కూడా వచ్చాయి పొద్దులో, వీలైనప్పుడు చదవండి. నే రాసినవాటిని మాత్రం వీల్లేకపోయినా చదవండి.
-------------------------------
పొద్దు పొడిచిన నాలుగేళ్ళ తరవాత, దానికి ఒక కొత్త రూపాన్ని ఇస్తే బాగుంటుందని తలచాం. ప్రస్తుత రూపానికి తెచ్చాం. ముఖ్యమైన విశేషమేంటంటే.. పాత వ్యాసాలు చక్కగా అందుబాటులో కొచ్చాయి. మమ్చిమమ్చి రచనలను చప్పుచప్పున వెతికి పట్టుకుని చదివేసెయ్యొచ్చు. పొద్దును క్రమం తప్పకుండా చదువుతూండే పాఠకులు కూడా కొన్ని పాత వ్యాసాలు చదివి ఉండరు. పాతరూపంలో ఆ వసతి సరిగ్గా ఉండేది కాదు మరి.
  కొత్త పొద్దును ఇంకా చూసి ఉండకపోతే ఓసారి చూసి, ఓ మాట అనండి.

   5 కామెంట్‌లు:

   1. "నే రాసిన వాటిని మాత్రం వీల్లేకపోయినా చదవండి." - :)))))))

    ఇదో... నేనిప్పుడే అన్నీ చదివేస్తాను.. మరి నాకేంటి? అహ.. నాకేంటీ అని? :)

    (క్లూ: అతడు అడవిని జయించాడు రెండో సారి చదివి, రెండో సారి సమీక్షించి, పుస్తకం.నెట్ కి.... )

    రిప్లయితొలగించండి
   2. కొత్త పొద్దు బాగుంది ! మెనూబార్ కొద్దిగా సరిచేయలనుకుంటా మీరు గమనించే ఉండొచ్చు , "సంపాదకీయం" లోని అంశాలు ఫోటో వెనకకి వెళుతున్నాయి .

    రిప్లయితొలగించండి
   3. పూర్ణిమ,
    మళ్ళీ చదివాక, కొత్త ఆలోచనలేమైనా వస్తే వాటిని పుస్తకంలోనే వేద్దాం లెండి. :)

    శ్రావ్యగారూ, మెనూబార్ లో గతంలో సబ్ మెనూతో ఒక లోపం ఉంటే సరిచేసాం. ఇప్పుడు మీరు గమనించిన లోపమేమిటో అర్థం కాలేదు. సంపాదకీయంలోని అంశాలు ఫోటో వెనక్కి వెళ్ళడం గురించి కొన్ని వివరాలు కావాలి. sirishtummala@జీమెయిల్.కామ్ కు ఒక ఉత్తరం రాయగలరా?
    ఒక వంద నమస్కారాలతో
    -శిరీష్.

    రిప్లయితొలగించండి
   4. ఇప్పుడు బాగానే ఉండండి ఏ ప్రాబ్లం లేదు , ఉదయాన్నే నేను చూసినప్పుడు "సంపాదకీయం " - సబ్ మెనూ అంశాలను కింద ఉన్న ఇమేజ్ (సంపుటి ౫ , నంది ఉన్న ఇమేజ్ ) ఓవర్లాప్ చేస్తుంది .
    [ఒక వంద నమస్కారాలతో] ఎంత మాట నాకు అయుక్షీనం కాగలదు :)

    రిప్లయితొలగించండి
   5. బ్లాగ్ పేరడీ పార్ట్-1 సూపరండి చదువరి గారూ,అద్దరకొట్టేహారంతే.

    రిప్లయితొలగించండి

   సంబంధిత టపాలు