23, జనవరి 2010, శనివారం

శాస్త్రీయ పుకారు

నేను మొదటి ఉద్యోగంలో చేరినపుడు ఇండక్షన్ కార్యక్రమం ఒకటి వారంపాటు జరిగింది. మొత్తం ఒక యాభై మందిమి. ఓరోజున ఓ గదిలో కూలేసి కమ్యూనికేషన్స్ నిపుణుడొకాయన క్లాసు పీకుతున్నాడు. కాసేపయ్యాక, ఒక సరదా ఆట ఆడదామని చెప్పాడు. మొదటి వరసలో కూచ్చున్న మొదటి వాడి దగ్గరికెళ్ళి, 'ఇదుగో ఇతని చెవిలో రహస్యంగా ఒక కబురు చెబుతాను. అతడు తన పక్కవాడి చెవిలో ఆ సంగతిని ఊదుతాడు. ఆతడు తన పక్కవాడి చెవిలో చెబుతాడు. అలా చెప్పుకుంటూ వెళ్ళగా, చిట్టచివరి వాడు తనకు చేరిన సమాచారమేంటో బోర్డు మిద రాస్తాడు.' అని చెప్పి, మొదటివాడి చెవిలో ఏదో కబురు చెప్పాడు. దాన్నీ, చిట్టచివరివాడు బోర్డు మీద రాసేదాన్నీ పోల్చి చూస్తాడన్నమాట, ఇదీ ఆట!


వాడు పక్కనవాడికి, వాడు తన పక్కనవాడికీ,.. అలా చెప్పుకుంటూ పోయాం. చివరివాడు తనకు చేరిన సంగతిని బోర్డు మీద రాసాడు. పంతులు గారు మొదటివాడికి చెవిలో చెప్పిన సంగతికీ, బోర్డుమీద రాసిన దానికీ అసలు సంబంధమే లేదు; ఎంత 'అ'సంబంధంగా, ఎంత అసంబద్ధంగా ఉన్నాయంటే.. 'తెలుగు సినిమాల్లో విలనుకు, ఆసిగాళ్ళకూ తెలంగాణ యాస వాడతారు ' అనేది మొదటివాడికి చెవిలో చెప్పిన సంగతైతే, చివరివాడికి చేరింది మాత్రం 'తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాల్సిందే ' అన్నట్టుగా నన్నమాట! మరీ ఇంత అసంబద్ధంగా లేకపోయినా, సుమారుగా ఇంత అసంబద్ధంగానే ఉన్నట్టు గుర్తు.


దీన్నిక్కడ వదిలేసి, ఈ టపాలోని రెండో భాగానికి పోతే..


----------------------

ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) అనే ఐక్యరాజ్యసమితి వారి సంస్థ ఒకటుంది. గ్లోబల్ వార్మింగుపై నివేదికలు తయారుచేస్తూ ఉంటుంది. ఆర్కే పచౌరీ అనే భారతీయుడు దీనికి అధ్యక్షుడు. ఐపీసీసీ 2007 లో ఒక నివేదిక ఇచ్చింది. 2035 కల్లా హిమాలయాల్లోని హిమానీ నదాలు కనుమరుగౌతాయనేది ఈ పెద్ద నివేదికలోని ఒక చిన్న భాగం. అయితే, ఆ నివేదికలో హిమానీనదాల గురించి తాము చెప్పినది తప్పని 2010 జనవరి 20న ఆర్కే పచౌరీ చెప్పాడు.  

ఈ తప్పు వెనక కథాకమామీషు ఇది:

అప్పుడెప్పుడో పదేళ్ళ కిందట సయ్యద్ హస్నైన్ అనే సైంటిస్టొకాయన గ్లోబలు వార్మింగు గురించి మాట్టాడుతూ, హిమాలయాల్లోని హిమానీ నదాలు వేగంగా తరిగిపోతున్నాయనీ, ఈ లెక్కన ఇంకో 40 యేళ్ళలో మధ్య, తూర్పు హిమాలయాల్లోని హిమానీ నదాలు అన్నీ కరిగి, కనుమరుగైపోతాయని చెప్పాడు. ఎవరితో..? న్యూ సైంటిస్ట్ అనే పత్రికతో.

ఆ ఇంటర్వ్యూను చదివిన వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ అనే సంస్థ 2005 లో హిమాలయాల్లో హిమానీనదాలపై ఒక రిపోర్టు తయారు చేసి, ఈ న్యూ సైంటిస్టు పత్రికలో వచ్చిన ఇంటర్వ్యూను ఉటంకిస్తూ 2035 కల్లా హిమాలయాల్లో హిమానీ నదాలు కనుమరుగౌతాయని రాసింది. దానికి తోడు, హస్నైన్ చెప్పినది మధ్య, తూర్పు హిమాలయాల గురించైతే, వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ మొత్తం హిమాలయాలన్నిటికీ వర్తించేలా రాసింది.

దీన్ని చదివేసిన ఐపీసీసీ, గ్లోబల్ వార్మింగుపై తాను ఇచ్చిన ఒక నివేదికలో ఈ సంగతిని చేర్చింది. 2035 కల్లా హిమానీ నదాలు అంతరించిపోతాయని జోస్యం చెప్పింది. దానికి మూలంగా వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ ఇచ్చిన నివేదికను చూపెట్టింది. చివరికది తప్పని తేలింది. హిమానీనదాలు పూర్తిగా కనుమరుగవ్వాలంటే వీళ్ళు చెప్పే వ్యవధికి పదిరెట్లు సమయం పడుతుందని ఒక అంచనా!

ఐపీసీసీ నివేదికలోని హిమానీనదాల విభాగాన్ని తయారు చేసిన మురారీ లాల్ అనే గ్లేసియాలజిస్టు, 'మేం రాయడంలో తప్పేం లేదు. తప్పేదన్నా ఉంటే ఆ ముక్క చెప్పిన హస్నైన్‌దే' అని తేల్చేసాడు. ఇక ఆ హస్నైన్ ఏమంటాడంటే 'నేనేదో నోటిమాటగా ఓ పాత్రికేయుడితో అన్నమాటను పట్టుకుని రిపోర్టులో రాసెయ్యడమేంటి? నేను రాసిన ఏ పరిశోధనా వ్యాసాల్లో కూడా ఈ 2035 అనే సంవత్సరాన్ని ప్రస్తావించలేదు. ఇలాంటి స్పెక్యులేషన్ కబుర్లు రాసేటప్పుడు నిజానిజాలు సరిచూసుకోవాలి' అని చెప్పాడు.

ఇక్కడ ఇంకో పుకారుంది.. రష్యా సైంటిస్టొకాయన ఇదే విషయంపై ఇచ్చిన నివేదికలో '2350 కల్లా హిమాలయాల్లోని హిమానీ నదాలు అంతరించి పోతాయ'ని చెప్పాడంట. అయితే, డబ్ల్యూ డబ్ల్యూఎఫ్, ఐపీసీసీలు దాన్ని 2035 గా రాసాయంట.

ఈ మొత్తం ప్రహసనంలో హైలైటేంటంటే.. ఐపీసీసీ ఈ నివేదికను 2007లోఇచ్చాక, 2009 నవంబరులో భారతప్రభుత్వం పనుపున ఒక గ్లేసియాలజిస్టు తయారుచేసిన నివేదికలో ఈ 2035 జ్యోతిష్యాన్ని కొట్టిపారేసాడు. ఐపీసీసీ నివేదికను అనవసర భయాలను కలిగించేదిగా ఉందని మన పర్యావరణమంత్రి జైరామ్ రమేష్ చెప్పాడు. దానికి జవాబు చెబుతూ ఆర్కే పచౌరీ భారత ప్రభుత్వ నివేదికను 'వూడూ సైన్సు' అని అన్నాడంట. అంటే చేతబడి అని అనుకోవచ్చు. ఈ లెక్కన ఐపీసీసీ చెప్పినదాన్ని బాణామతి అని అనుకోవాలి మనం!

ఇంతకీ ఐపీసీసీకి నోబెల్ పురస్కారం వచ్చింది. "మనిషి చేతల కారణంగా వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల గురించి ఉత్కృష్టమైన విజ్ఞానాన్ని పోగు చేసి, దాన్ని వ్యాపింపజేస్తున్నందుకుగాను, ఆ మార్పులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలకు పునాది వేస్తున్నందుకుగాను ", ఐపీసీసీకి అల్ గోర్‌కు కలిపి 2007లో నోబెల్ శాంతిబహుమతి వచ్చింది.

అయితే ఒక మెచ్చుకోదగ్గ సంగతేంటంటే -న్యూ సైంటిస్టు వ్యాసంలోని అంశాల నిగ్గు తేల్చకుండా (పీర్ రివ్యూ - సాటివారి సమీక్ష) తమ నివేదికల్లో వాడుకున్నందుకుగాను విచారాన్ని ప్రకటిస్తూ డబ్ల్యూడబ్ల్యూఎఫ్, ఐపీసీసీ రెండు కూడా తమ నివేదికల్లో ఈ సంగతిని ప్రముఖంగా రాసాయి.

8 కామెంట్‌లు:

 1. బావుంది. మన టీవీ 9 వాళ్ళతో వీళ్ళు పోటినా లేక వీళ్ళతో టీవీ 9 వాళ్ళు పోటీనా? రెండోదే నిజం అయ్యివుంటుంది, ఎందుకంటే పోటీలో వీళ్ళను టీవీ 9 వాళ్ళు డామినేట్ చేసేసేరు కదా.. హమ్మ్... ఏ చరిత్ర చూసినా అని పాడుకోవాలేమో. ఈ మధ్య న హిస్టరీ, డిస్కవరీ ఏ&ఈ ఇలాంటి ఏ చానల్ పెట్టీన మాన వ చరిత్ర అంతమయ్యాక అంటూ తెగ దడిపించేస్తున్నాడు. ఏమిటో వీళ్ళ గిమ్మిక్కు లు.

  రిప్లయితొలగించండి
 2. హ్హ హ్హ హ్హ..ఈ గ్లోబల్ వార్మింగూ, మాన్ మేడ్ అన్న వాదమూ, దాంట్లో ఉన్న నిజాల శాతం, లొసుగులూ, అవక తవకల శాతం గురించి చాలా డీప్ గా, చాలా సంవత్సరాలనుంచీ ఇక్కడ అమెరికా లో బానే చర్చ జరుగుతుంది, although the debate is dominated by one side for the most part. కానీ నేను ఎప్పుడు ఇండియన్ న్యూస్ పేపర్స్, ముఖ్యంగా తెలుగువీ తిరగేసినా, అలాగే బ్లాగుల్లో కూడా, ఒకే వైపు వాదం అదేదో భూమి గోళాకారం లో ఉన్నది అని అంత రూఢీగా జనాలు రాస్తూంటే కొంచెం ఆవేదన వేసేది.

  ఆ వాదం లో ఉన్న ప్రాపగాండా శాతం గురించి కొంచెం ఎవరన్నా రాస్తే బాగుండు అనుకుంట ఉన్నా.

  థాంక్యూ.

  రిప్లయితొలగించండి
 3. ఇంతకీ అల్ గోర్ ది కూడా చెత్త నోబెల్ ఏనా అయితే ఒబామా లాగ. మున్ముందు సోనియా గాంధీకి (రాష్ట్రం లో శాంతిని పెమ్పొందిన్చినందుకు) , కే సి ఆర్ కి (శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నందుకు) కూడా ఇచ్చేడట్టు ఉన్నారు.

  రిప్లయితొలగించండి
 4. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన చారిత్రిక తప్పిదం అన్నమాట.. ఐతే 'గ్లోబల్ వార్మింగ్' మాత్రం సీరియస్ ఇస్యూనేనండీ..

  రిప్లయితొలగించండి
 5. మీరి మైఖేల్ క్రైటన్ వ్రాసిన "స్టేట్ ఆఫ్ ఫియర్" అన్న పుస్తకం చదివారా? తప్పక చదవాల్సిన పుస్తకం అది. పర్యావరణ రక్షణ పేరిట డబ్బులు దండుకోవడాని ప్రముఖ పర్యావరణ సంస్థలు ఎలా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారో తమ వాదనలకు బలం చేకూర్చడానికి ఎలాంటి పనులు చేయడానికి తెగిస్తారో వాటిలో నిజమెంతో చర్చించిన పుస్తకం. కాల్పనిక కథే ఐనా ఎంతో కలకలం సృష్టించింది.

  రిప్లయితొలగించండి
 6. మీరు చంద్రమోహన్ గారు స్టేట్ ఆఫ్ ఫియర్ తప్పక చదవాల్సిందే. అదేదో శాస్త్రీయ ఉద్గ్రంథం అని అనుకోకూడదు కానీ, ప్రస్తుతం జరుగుతున్న దాన్ని బాగా ఎత్తి చూపుతుంది

  రిప్లయితొలగించండి
 7. ఇలా ఉంటుంది గ్లోబల్ వార్మింగు మతస్థుల సైన్సు
  http://bit.ly/cBk6Va

  రిప్లయితొలగించండి
 8. మొన్నీ మధ్యన అమెరికా రాజధాని ప్రాంతమంతా రెండు మూడడుగుల మంచుకుప్పల్లో కూరుకు పోయింది. మొదణ్ణించీ గ్లోబల్ వార్మింగు సిద్ధాంతాల్ని వ్యతిరేకిస్తున్న పెద్దమనిషొకాయన ఇదే అదనుగా రేడియోకీ టీవీకీ యెగబడి, చూడండి, ఇంత చలీ ఇంత మంచూ ఉంటే గ్లోబల్ వార్మింగేవిటి, అంతా హంబగ్ అని మరోసారి నొక్కి వక్కాణించాడుట.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు