1, జనవరి 2010, శుక్రవారం

కొత్త సంవత్సరానికి పాత టపాలు!

నచ్చిన బ్లాగుల గురించి, టపాల గురించీ ఈ మధ్య టపాలొస్తున్నాయి. ఆ స్ఫూర్తితోనే ఈ టపా!

సాధారణంగా నాకు హాస్యం చిప్పిల్లే టపాలు నచ్చుతాయి. అసలు హాస్యం నచ్చందెవరికిలెండి!! హాస్యం తరవాత, జ్ఞాపకాల టపాలు కూడా నాకెంతో నచ్చుతాయి. ఎవరి జ్ఞాపకాలు వాళ్ళకు ముద్దేననుకోండి. నాకు మాత్రం ఎవరి జ్ఞాపకాలైనా ముద్దే! చదవడానికి ఆహ్లాదకరంగా, చదివాక హాయిగా ఉండే ఏ టపాలైనా బావుంటాయి. ఎప్పటికప్పుడు గుర్తుకొస్తూ ఉండే టపాలు కొన్నిటి గురించి ఇక్కడ కొంత...


ఇటీవలి కాలంలో బ్లాగులోకంలోకి వచ్చినవారికి ఆపాతమధురాలైన ఆ పాత మధురాలను పరిచయం చేద్దామనే వంకతో మరోసారి ఆ బ్లాగరులకు నేను చేస్తున్న నమస్కారం ఇది! ఏంటి.. నాలుగేళ్ళ బ్లాగు ప్రయాణంలో నచ్చిన టపాలు ఇవేనా అని అడగొచ్చు.. నిజమే, నచ్చినవాటిలో కొన్నిటి గురించే ఇక్కడ రాసాను. ఇలాంటివి, ఇంతకంటే మంచివీ ఇంకా మరెన్నో ఉన్నాయి, ఇదొక అసంపూర్ణ జాబితా! ఇందులో కొన్ని అన్‌సంగ్ టపాలు, కొన్ని వెల్‌సంగ్, కొన్ని ఆల్వేస్ సంగ్!

 1. జ్ఞాపకాల టపాలు తలచుకోగానే మనకు గుర్తొచ్చేవాళ్ళలో రానారె ప్రథముడు. తన చిన్ననాటి కబుర్లు చెప్పేందుకే ఒక బ్లాగును ప్రత్యేకించారాయన. సీమ మాండలికంలో (అది కడప మాండలికం అని సరిదిద్దుతారాయన) రాసిన ప్రతీ టపా గుర్తుంచుకోదగ్గదే. వాటిలో నేనెంచినది ఇది. ఒక పుస్తకంలాగా వెయ్యదగిన బ్లాగు - బ్లాగు, టపా కాదు సుమండీ! - "యర్రపురెడ్డి రామనాధరెడ్డి". రామనారెడ్డి, రామనారెడ్డి కాదు! చదువరుల దురదృష్టం కొద్దీ ఈ బ్లాగు ఇప్పుడు ఆహ్వానితులకు మాత్రమే!
 2. పప్పు నాగరాజు గారనే ఒక బ్లాగరి ఉన్నారు. సాలభంజికలు అనే బ్లాగు ఉండేది. అందులో వాక్యం రసాత్మకం కావ్యం అనే టపాల శృంఖల వచ్చింది. ఆ టపాలను చదివి అప్పటి బ్లాగరులు ఆనందించారు. కొందరు కొత్త సంగతులను నేర్చుకున్నారు. ఆ టపాలను చదవని, ఈ వ్యాసం చదివే చదువరులను ఊరించడం తప్ప మరేమీ చెయ్యలేకపోతున్నాను. నాగరాజు గారు తన బ్లాగును ప్రస్తుతం దాచి ఉంచారు.
 3. మనసు దోచుకున్న తెలుగు కీచకుడు అంటూ గుజరాతీయుల మనసును దోచుకున్న మన కూచిపూడి కళాకారుల ప్రదర్శన గురించి రాసి నువ్వుశెట్టి సోదరులు నా మనసును దోచుకున్నారు. నాకు బాగా నచ్చేసిన టపాల్లో ఇదొకటి. టపాలో చివరన గిరిచంద్ గారు రాసిన కొన్ని వాక్యాలు నాకు ఆనందబాష్పాలు తెప్పించాయి. నేను నెలకో రెణ్ణెల్లకో ఓసారి పోయి చదువుకుంటూండే టపాల్లో ఇదొకటి.
 4. వేణూ శ్రీకాంత్ తన జ్ఞాపకాల గురించి రాసిన ఈ టపా నాకు ఎప్పుడూ గుర్తొచ్చే టపాల్లో ఒకటి. ఆ టపాకోసం ఆయన అతికినట్టుగా సరిపోయే బొమ్మ ఒకటి పెట్టారు. ఆ టపా చదవండి, ఆ బొమ్మ చూడండి.
 5. తేటగీతి! వ్యంగ్యం (సెటైరు) రాయడంలో ఆ బ్లాగును మించినది తెలుగు బ్లాగుల్లో మరోటి లేదు. రిచంజీవి, రె.కాఘవేంద్రరావు లాంటి పేర్లు పెట్టడంలో ఆయనకాయనే సాటి. ఆయన ధోరణిలో చెప్పాలంటే ఈ బ్లాగును 'తీటగేతి' అనాలి. సీనియర్ అని ఒక సీరియల్ రాసారాయన. తప్పక చదవాల్సిన సీరియలది.
 6. బ్లాగాడిస్తా అనే బ్లాగొకటుంది. అందులో మలయాళంకారం అనే పోస్టొకటుంది. ఇది చదివితే ఈయన నిజంగానే బ్లాగాడిస్తున్నారే అని అనుకుంటాం.
 7. క్షవర కల్యాణం పేరుమీద తనకు జరిగిన ఘోరావమానాన్ని దిగమింగుకోలేక, బ్లాగులో చెప్పుకున్నారు తోటరాముడు -మనల్ని మురిపించడానికి! అసలు తోటరాముణ్ణి తలుచుకోకుండా ఇలాంటి జాబితా రాయగలమా!!
 8. ఇదే క్షుర ఖర్మ వ్యవహారంపై అబ్రకదబ్ర అనే తెలుగోడి గోడు కూడా చదివితీరాల్సిందే! ఈయన రాజకీయాలంటారు, సినిమాలంటారు, కథలంటారు, హాస్యమంటారు, వ్యంగ్యమంటారు, సామాజిక విషయాలంటారు,.. ఇంకా చాలా అంటారు. అయితే ఇది మాత్రం ఈ బ్లాగులో తలమానికమంటాను!
 9. చక్కటి అర్థవంతమైన మాటలను పదేపదే వాడి వాటికి అగౌరవాన్ని ఆపాదించిన వాస్తవాలను చూస్తూంటాం. ఉదాహరణకు "డిఫరెంట్" అనే ఇంగ్లీషు ముక్కను రేప్ చేసి ఆ మాటంటేనే విరక్తి కలిగేలా చేసిన మన సినిమావాళ్ళ సంగతి మీకందరికీ తెలిసిందే! సరిగ్గా దానికి వ్యతిరేకంగా చేసిన వ్యక్తి ఒకాయన బ్లాగుల్లో ఉన్నారు. ఊకదంపుడు అనే ఫక్తు ఊకదంపుడు మాటకు ఒక గౌరవాన్ని ఆపాదించిన వ్యక్తి గురించే నేను చెబుతూంట! ఇంగ్లీషు యూ లివ్ లాంగా అంటూ ఈయన రాసిన ఇంగ్లీషు పాఠాలను మీరింకా చదివి ఉండకపోతే మించిపోయిందేమీ లేదు.. ఇప్పుడు చదవండి. ఒకవేళ ఈసరికే చదివేసి ఉన్నా మళ్ళీ చదవండి, ఇంకోసారి నవ్వుకుంటే పోయేదేమీలేదు. ఇదొక్కటే కాదు, ఆ శృంఖలలో అన్నీ చదవండి. నా సార్వకాలిక అత్యుత్తమ (దీన్ని ఇంగ్లీషులో ఏమనాలో ఊదం గారు చెప్పకపోవడం చేత నాకు తెలీలేదు) టపాల్లో ఒకటి. ఇంగ్లీషు పాఠాల్ని అర్థంతరంగా ఆపేయడం ఏం న్యాయమో ఊదంగారే చెప్పాలి. అన్నట్టు ఊదంగారు బహు పన్‌డితులు కూడాను. పైన చెప్పిన రెండు క్షుర ఖర్మలకు తోడుగా ఈయన కూడా తన ఖర్మను తలుచుకున్నారో టపాలో. ఆయన బ్లాగులో ఎక్కడుందో వెతుక్కోని చదూకోండి.
 10. ఒక దళారీ పశ్చాత్తాపం చదివారా? ఆ పుస్తక కర్త తెలుగు బ్లాగరే -కొణతం దిలీప్! సామాజిక రాజకీయ విషయాలను ఒక ఉపాధ్యాయుడిలా వివరించే ఈ బ్లాగులో మాతాతలు పండించుకుని తిన్నారంటూ తన వ్యక్తిగత జ్ఞాపకాల గురించి ఒక టపా రాసారు, దిలీప్. చదివితీరాల్సిన టపా అది!
 11. ఊసుపోక – నసాంకేతికాలు అంటూ నిడదవోలు మాలతి గారు రాసిన ఈ టపా నాకు చాలా ఇష్టం. చెయ్యితిరిగిన రచయిత్రి రాసిన 'ఊసుపోక ' రాతలు కూడా మనల్ని అలరిస్తాయి. ఆ సంగతి తన వ్యాఖ్యలో రానారె చెప్పారు కూడాను. ఊసుపోక టపాల్లోని ఉత్తమమైన వాటిలో ఇదొకటి.
 12. సుజాత గారు ఏదైనా పుస్తకాన్ని చదవలేదని చెబితే, ఆ పుస్తకాన్నే గనక నేను చదివి ఉంటే ఆ సంగతిని నా బ్లాగులో ఓ టపా రాసి పడేద్దామని చూస్తూ ఉన్నాను. ఆ అవకాశం ఎప్పుడొస్తుందో మరి! ఆమె ఎంత వొరేషియస్ రీడరో మనసులోమాట అంత మోస్ట్ ప్రాలిఫిక్ 'రన్' గెట్టరు. ప్రజలు మెచ్చిన ఈ బ్లాగులో పిల్లల చదువుల గురించి రాసిన ఈ టపాకు ఓ ప్రత్యేకత ఉంది.
 13. గడ్డిపూలు బ్లాగులో వచ్చిన వీరగాధ మొదటి భాగం ఇది. Sujatha గారి స్ఫూర్తిదాయకమైన పోరాట గాధ ఇది. చదివి తీరాల్సిందే ఈ శృంఖల!
 14. సునిశితమైన హాస్యానికి చిరునామా సత్యశోధన బ్లాగు. కొవ్వలి వారి గుర్తింపుకార్డు ప్రహసనం చదవాల్సిన టపా. మరింత చురుగ్గా రాయాల్సిన 'బ్లాగుసామాజిక బాధ్యత' ఉందని ఆచార్యుల వారికి నా ఈ టపా ద్వారా తెలియజేస్తూ..
 15. చరసాల ప్రసాదు గారి ధీరత్వం గురించి చదవండి. ఒకప్పుడు విరివిగా రాసిన ప్రసాదు గారు ఇప్పుడు అరుదుగా రాస్తున్నారు. ఈయన రాసే పోలికలు వైవిధ్యంగా ఉండి, ఆకట్టుకుంటూంటాయి.
 16. ఈయన గురించి ఒక బ్లాగరి ఎక్కడో చెప్పారు - "ఈయన్ని అభిమానించొచ్చు, ఏవగించుకోవచ్చు, ఈయన అభిప్రాయాలను తీవ్రంగా వ్యతిరేకించవచ్చు, గాఢంగా అభిమానించనూవచ్చు.. కానీ పట్టించుకోకుండా మాత్రం ఉండలేం.-" అని. సరైన మాట! కత్తి మహేష్ తనగురించి తాను కాస్త ఎమోషనల్‌గా చెప్పుకున్న విశేషాలు చదవండి.
 17. "పప్పు" మాటెత్తగానే పరిగెట్టుకుపోయి చేతులు కడుక్కోని విస్తరేసుకుని కూచ్చునే బ్లాగరు లెంతమంది ఉన్నారో చూడాలనుకుంటే మాకినేని ప్రదీప్ గారి ఈ టపా చూడాల్సిందే! కేవలం పప్పు అయిపోయింది కాబట్టి భోజనం ముగించాల్సి వచ్చిన పప్పు ప్రేమికుడి విశేషం చదివి ఆనందించండి. నా సార్వకాలిక అత్యుత్తమాల్లో ఒకటి! మీరూ పప్పు అభిమానులైతే అక్కడ పప్పుకు మీ ఓటు వెయ్యండి.
 18. చిల్లర శ్రీమహాలక్ష్మి గురించి కొత్తపాళీ గారు రాసిన టపా నా సార్వకాలిక అత్యుత్తమాల్లో ఇంకోటి. ఇలాంటి మరికొన్ని మధురమైన జ్ఞాపకాలను కూడా ఈ బ్లాగులో చదవొచ్చు. మరెన్నో రాయాల్సిన అవసరం ఉందని ఈ బ్లాగరి గుర్తించినట్టుగా తోచదు.
 19. అప్పుడేం జరిగిందంటే అంటూ ఎన్నో విశేషాలు చెప్పి అలరించిన క్రాంతి గారు తన రహస్య ఎజెండా గురించి చెప్పి జనాన్ని భయపెట్టాలని చూసారుగానీ, చదువరులు అది చదివేసి, హాయిగా నవ్వేసి, కానీండి ప్రొసీడైపోండని ప్రోత్సహించారు. బ్లాగుసామాజిక బాధ్యతగురించి క్రాంతిగారికి కూడా ఎవరైనా చెబితే బాగుండు.
 20. కరకరలాడే చేగోడీలు, వేయించిన వేరుశనక్కాయలు, కారపప్పచ్చులు - వీటి ప్రాశస్త్యం గురించి నాకో అభిప్రాయం ఉంది.. మొట్టమొదటి చేగోడీయో, వేరుశనక్కాయో, కారపప్పచ్చో తినడం వరకే మానవ ప్రయత్నం అవసరమౌతుంది. ఆ తరవాత అవే మనచేత తినిపిస్తాయి. తింటూనే ఉంటాం. ఆపడం అనేది మనవల్ల కాదు -అవి అయిపోతే తప్ప! ఈ చేగోడీలు అనే బ్లాగు కూడా అలాంటిదే! ఇదిగో, ఒక చేగోడీ తిని చూడండి, నామాట అబద్ధమైతే చెప్పండి. 'అందరూ రాస్తున్నారు గదా, మనమూ రాద్దాం' అని రాయడం మొదలుపెట్టారు రిషి. కానీ, అందరూ రాస్తూనే ఉన్నా, తాను మాత్రం రాయడం తగ్గించేసారు, ఎంచేతో! మాట మీద నిలబడకపోతే ఎలా మాస్టారూ!!
 21. కలగూరగంప! బ్లాగరి ఆసక్తుల్లాగే ఈ బ్లాగులోని టపాల దత్తాంశాలు కూడా బహుళం! నిరుద్యోగం పురుషలక్షణం అనే శీర్షికన రాసిన వ్యాస శృంఖల ఆయన పరిణిత ఆలోచనాధోరణిని తెలుపుతాయి. చక్కటి తెలుగులో తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు రాసే టపాలకు పరిశోధనాస్థాయి ఉందని చదువరులు భావిస్తూంటారు.

చదువరులకు కనబడనీయకుండా చేసిన తమ బ్లాగులను, తిరిగి ప్రజలకందివ్వమని బ్లాగ్వరులను అభ్యర్ధిస్తూ..
------------------------

పై బ్లాగుల్లో కొన్నిటిలో పాత టపాలను తేలిగ్గా పట్టుకునే సౌకర్యాలు లేవు. పాత టపాలను తేలిగ్గా పట్టుకోవాలంటే కింది మూడు అంశాలు ప్రతీ బ్లాగుకూ తప్పనిసరి..
 1. ఒక వెతుకుపెట్టె.
 2. నెలవారీగా పేర్చిన పాత టపాల భోషాణం. నెలల్ని తీసుకెళ్ళి ఏ డ్రాప్‌డౌను పెట్టెలోనో పడెయ్యకూడదు. చక్కగా సంవత్సరం పేరు, దాని కింద నెలల పేర్లు, ఒక్కో నెల కింద ఆ నెలలో వచ్చిన టపాల శీర్షికలు ఉండాలి. సంవత్సరాన్ని నొక్కగానే దానికింద నెలలు జారుతూ తెరుచుకోవాలి. నెలను నొక్కగానే ఆ నెలలో వచ్చిన టపాలు జారుతూ కనబడాలి. నాలుగేళ్ళ కిందటి టపాను కూడా ఠక్కున పట్టుకోవచ్చు.
 3. ట్యాగులు / వర్గాల జాబితా ఉండాలి.

16 కామెంట్‌లు:

 1. చదువరి గారూ !
  మీ బ్లాగులోక విహారం, సింహావలోకనం బాగున్నాయి.
  May your New Year ( 2010 ) be full of Happiness and Sunshine

  SRRao
  sirakadambam

  రిప్లయితొలగించండి
 2. బాగుందండీ అసంపూర్ణ జాబితా, నాకు చోటు దక్కించినందుకు ధన్యవాదాలు. నా బ్లాగుల్లో వెతుకుపెట్టెను వీలైనంత త్వరలో చేరుస్తాను.

  మీకూ మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 3. Wish you all a very Happy, Prosperous and a Fun-filled new year - 2010 :)
  sripranavart.blogspot.com

  రిప్లయితొలగించండి
 4. ఈ మధ్య కాలంలో నాకు నచ్చిన సరదా టపా: సామాజిక న్యాయం - హిందీ పేటెంటు. ఈ కన్నగాడు అరుదుగా రాసినా, బాగా రాస్తాడు.

  రిప్లయితొలగించండి
 5. బాగుంది, కనబడినంత మేర చరిత్రని విహంగవీక్షణమొనరించారు. అదసరే గానీ, శృంఖల అనే బదులు టపాల వరుస అనుకోవచ్చుగదా. గొలుసు అన్నా ఇబ్బంది లేదు. అదేదో సావెజ్జెప్పినట్టు ఆ వెతుకు పెట్టె పెట్టుకునే సదుపాయం ఉపాయం ఏదో కూడా కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి.

  రిప్లయితొలగించండి
 6. మీ టపాని బుక్ మార్క్ చేసుకుని తీరిగ్గా ఒక్కొక్కటి చదువుకుంటాను...థాంక్యు...

  రిప్లయితొలగించండి
 7. భలే. చాలా మంది ఇలా నచ్చిన టపాలు ఎంచారా ?
  నే చూడనే లేదు.

  ఈ సంవత్సరం మంచి టపాలన్నీ చదవాల్సిందే.

  రిప్లయితొలగించండి
 8. హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 9. బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు, ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ,
  మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం
  భద్రాచల నరసింహ క్యాలండర్ - 2010 ఈ కింది లింకులో
  http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
  ధన్యవాదములు
  - భద్రసింహ

  రిప్లయితొలగించండి
 10. కొన్ని చదివినవి, మరి కొన్ని చదవాల్సినవి ఉన్నాయండి.. శేఖర్ పెద్దగోపు గారి మాటే నాదీను.. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..

  రిప్లయితొలగించండి
 11. నచ్చిన టపాల గురించిన ఆలోచన భేషుగ్గా ఉంది. నాకూ వీలవుతుందా? నేనూ రాయాలి.

  రానారె గారు బ్లాగు మూసేశారని ఇప్పుడే తెలిసింది. ఇది నిజంగా చాలా చాలా అన్యాయం.

  రిప్లయితొలగించండి
 12. చదువరి గారికి ధన్యవాదాలు, వెదుకు పట్టీ పెట్టాము.

  రిప్లయితొలగించండి
 13. I dont have any personal blog. but I read ur all post very nice particularly abt Telangana. I request you please post a topic on 'people who blongs to Telangana but want 2 be united Andhra Pradesh'. Why dont these 'Seemaandhra'leaders ask them to comeout and ask for united andhra. I guess u understood my point. Really 80% Telangana people really wnat Separete Telangana.

  రిప్లయితొలగించండి
 14. చదువరి గారూ,
  మీ అభిమానానికీ ప్రోత్సాహానికీ వేవే నెనరులు.
  భవదీయుడు
  ఊకదంపుడు

  రిప్లయితొలగించండి
 15. తీటగేతా? ఇంసల్ట్! నేనూ, సీ గాన పెసూనాంబా, వాకౌట్ చేస్తున్నాం.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు