19, డిసెంబర్ 2009, శనివారం

రాయలవారికి బహిరంగలేఖ!

మొత్తమ్మీద డాక్టరు గారు మళ్ళీ మనలోకంలో పడ్డారు. ఎటొచ్చీ.. 'నేజెప్పేది వినండి, మీరేదైనా చెప్పాలనుకుంటే పోయి మీమీ బ్లాగుల్లో ఏడవండి, ఇక్కడ మీ రాతలకు స్థానం లేదు అని అంటున్నారు.' సరే అలాక్కానివ్వండి సార్!  కానీ, డాక్టరు గారూ, ఓటి గమనించారా..? మీకు రాయలంటే అభిమానం.  మీ బ్లాగుకు ఆయన పేరే పెట్టుకున్నారు. ఆయనో సమైక్యవాది. -పోనీ విస్తరణవాది అనుకుందాం. మీరు మాత్రం విభజనవాది! రాయలు ధర్మం తెలిసినవాడు, గుర్రాలమ్ముకుందామని వచ్చి గొడవలు పెట్టుకున్నవాళ్లను  కూడా సభకు రానిచ్చి, వాళ్ళు చెప్పింది విన్నాడంట. మీరేంటి సార్,
మీరు చెప్పేది వినటానికే తప్ప, మాకు మాట్టాడే అవకాశం లేకుండా చేసిపారేసారు!!?  :) సరే, మీరు ఆజ్ఞాపించిన విధంగా ఆ జీవోతో మొదలుపెట్టి, కుసింత నా సోది కూడా వినిపిస్తాను. ఈ టపాలో సింహభాగం మీ ఆజ్ఞ లేకపోయినా ఇవ్వాళ వచ్చేది. మీ టపా తరవాత ఈ ఉపోద్ఘాతం వచ్చి చేరింది. (టపా స్వరమూ కొంత మారిందిలెండి :) ) .


---------------------------
జీవో విషయమై..
అన్యాయాలు జరిగాయి, జరగలేదనడం లేదు. వాళ్లకూ జరిగాయి, మనకూ జరిగాయి. జీవోలదేముంది, చాలా చూపించొచ్చు. వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు చూపిస్తే మనకు అన్యాయం చేసిన జీవోలను మనమూ చూపిస్తాం.  అదికాదు చెయ్యాల్సింది, అన్యాయానికి పరిష్కారం ఏంటని ఆలోచించాలి. పరిష్కారం రాష్ట్ర విభజనేనని భజన చెయ్యడం కాదు. 

ఇంతకీ, ఆ జీవో విడుదల చేసుకున్న మంత్రి తన జిల్లాకు బోల్డంత ఇచ్చేసుకున్నాడని వాపోయారు. మరి నీటిపారుదల శాఖ మంత్రి గత ఐదేళ్ళుగా తెలంగాణ వ్యక్తే.  జలయజ్ఞంలో ఆయన చేతివాటమెంతో చూసారా? ఆ లెక్కలు ఉన్నాయా మీదగ్గర? ఒకవేళ అతడూ అలాగే తన జిల్లా సంగతో ప్రాంతం సంగతో చూసుకుని ఉంటే గనక, మాకు నిధులు రాలేదు అని వీళ్ళనరాదు. ఒకవేళ అతడు అలా చేసి ఉండని పక్షంలో.. ఎవరిని నిలదీయాలో వీళ్ళకు తెలిసినట్టే !

అన్యాయాల చిట్టా విప్పితే చాలా చూడాల్సి వస్తది. తెలంగాణకు బాగా అన్యాయం జరిగిందని చెబుతూ ఉండే నీళ్ళ విషయమే చూద్దాం. నీళ్ళ పంపకంలో నిజంగానే తెలంగాణకు అన్యాయం జరిగింది. కానీ ఆ అన్యాయపు లోతెంత? కారకులెవరు? దానికి పరిష్కారం రాష్ట్ర చీలికేనా? ఇంకొంచం వివరంగా చూద్దాం.

1956లో రాష్ట్రం ఏర్పడ్డాక, ఇప్పటి దాకా నీళ్ళ ప్రాజెక్టుల కోసం ఏ ప్రాంతంలో ఎక్కువ ఖర్చు పెట్టారో చూసారా?  
1.  గోదావరి, కృష్ణా డెల్టాలు ఎప్పుడో 19 వ శతాబ్దంలో ఏర్పడ్డాయి. ఎప్పుడో 1878 నాటికే 5 లక్షల ఎకరాలకు పైగా సాగు నీరందించిందంట కృష్ణా నదిపై కట్టిన బ్యారేజి.  క్రమేణా అది పెరిగి దాదాపు 11 లక్షల పైచిలుకు ఎకరాలకు నీరందిస్తోంది. కృష్ణా బ్యారేజీ కట్టిన వందేళ్ళ తరవాత కొట్టుకుపోతే, మళ్ళీ కట్టింది (ఇప్పటి ప్రకాశం బ్యారేజీ) కూడా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడక ముందే!
2. సుంకేశుల బ్యారేజీ, కడప కర్నూలు కాలవ: ఇవి కూడా 19 వశతాబ్దంలోనే కట్టారు.
3. గోదావరి కింద తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏర్పడ్డ డెల్టా వ్యవస్థ కూడా 19, 20 వ శతాబ్దాల్లో ఏర్పడినదే!
4. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సర్వే, ప్లానింగు పూర్తయింది, మొదలుపెట్టిందీ సంయుక్త రాష్ట్రం ఏర్పడక ముందే. ఆనాటి నందికొండ ప్రాజెక్టు రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు.  శంకుస్థాపన రోజున రెండు రాష్ట్రాల నాయకులూ హాజరయ్యారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు నీళ్ళండించే ప్రాజెక్టది.  తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాల్సినన్ని నీళ్ళివ్వడం లేదనేది వాస్తవం. కానీ ప్రాజెక్టు కట్టింది మాత్రం రెండు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకునే!
5. శ్రీశైలం ప్రాజెక్టు:  ఇది సంయుక్త రాష్ట్రంలో కట్టినదే. కేవలం విద్యుత్తు కోసం కట్టిన ఈ ప్రాజెక్టును నేటికి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మార్చడంలో అందరితో పాటు తెలంగాణకూ భాగం ఉంది.  శ్రీశైలం విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందనేది ఒప్పుకోవాల్సిందే!
6. రాజోలిబండ డైవర్షను పథకం కూడా 1956 కంటే ముందే కట్టిన ది.
7 . తెలంగాణలోని శ్రీరామ పాద సాగర్ సంయుక్త రాష్ట్రంలో  కట్టిందే
8. తెలంగాణలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు 1956 తరవాత కట్టిందే
ఇక జలయజ్ఞంలో  నాయకులు తినగా మిగిలిన కాస్తో కూస్తో డబ్బులో ఎంతెంత వివిధ ప్రాంతాలకు పోతోందో లెక్కేసి, మూడు ప్రాంతాలకు పెట్టిన ఖర్చుల గురించి మాట్టాడితే అప్పుడు తెలుస్తుంది ఎవరెవరికి ఎంతెంత ఖర్చు పెట్టారో! 

ఇంకో గణాంకాల  వివరం చూడండి:
తెలంగాణలో సాగు నీటి వసతి కలిగిన విస్తీర్ణం: 24,14,000 హెక్టార్లు. రాష్ట్రం మొత్తం సాగు నీటి వసతి విస్తీర్ణంలో శాతం: 40%
కోస్తా+సీమల్లో సాగు నీటి వసతి కలిగిన విస్తీర్ణం: 36,55,000 హెక్టార్లు. రాష్ట్రం మొత్తం సాగు నీటి వసతి విస్తీర్ణంలో శాతం: 60%
తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం: 42% కోస్తా విస్తీర్ణం: 58%
రెండు ప్రాంతాల్లో 2006-07 నాటికి సాగునీటి వసతి కలిగిన భూ విస్తీర్ణం వివరాలు ఇవి. దాదాపుగా భౌగోళిక విస్తీర్ణాల నిష్పత్తికి సమానంగా ఉంది ఈ నిష్పత్తి.  ఒక్కటి గుర్తు పెట్టుకుని ఆలోచించండి.. తెలంగాణలో అటవీ ప్రాంతం మిగతా ప్రాంతాలతో పోలిస్తే బాగా ఎక్కువ. ఆ ప్రాంతాన్ని తీసేస్తే ఈ నిష్పత్తి తెలంగాణకే అనుకూలంగా ఉండొచ్చు బహుశా! ఈ సాగునీటి వసతుల్లో కాలువలు, బావులు, బోర్లు, చెరువులు వంటి అన్ని రకాల వసతులూ కలిసి ఉన్నాయి.  కాలువల వసతి కోస్తాలో ఎక్కువ ఉంది, తెలంగాణలో తక్కువ ఉంది. తెలంగాణలో చెరువులు, బోర్ల వ్యవసాయం ఎక్కువ. ఆ విధంగా తెలంగాణకు అననుకూలత ఉంది.  ప్రాంత భౌగోళిక పరిస్థితిని బట్టి, తగిన సాగునీటి వసతిని ఏర్పరచుకుంటారు. తెలంగాణలో చెరువుల వ్యవసాయం ఎక్కువగా ఉండేది. కాలాంతరంలో చెరువులను బాగు చేసుకోవడంలో నిర్లక్ష్యం చేసారన్నది నిజం.  కానీ ఉన్న చెరువులను బాగు చేసుకోని తప్పులో నాయకుల బాధ్యతెంత? కోస్తా సీమ వాసుల బాధ్యతెంత? మీకోటి తెలుసా.. తెలంగాణ లోని అతిపెద్ద చెరువులు - లక్నవరం (ఓ సముద్రమంత ఉంటదీ చెరువు!), పాకాల, రామప్ప - ఈ మూటినీ కాకతీయులు నిర్మించారు.   నిజాము కాలంలో వీటికి మరమ్మతులూ చేయించారు. ఆ తరవాత, ఇప్పటికీ వీటిని పట్టించుకునే నాథుడే లేడు. ఎవరిదండీ తప్పు? ఈ ప్రాంత నాయకులదా లేక.. 'ఆంద్రోళ్ళ'దా? వీటి గురించి జనం వీళ్ళని నిలదీయకుండా వీళ్ళంతా మనల్ని దుమ్మెత్తి పోస్తూ, తిడుతూ ఉంటారు.

మరో సెట్టు గణాంకాలు చూడండి:
2005-06 లో రాష్ట్రంలో పంటలు వేసిన మొత్తం విస్తీర్ణంలో - కోస్తా సీమల భాగం: 61%  తెలంగాణ వాటా: 39%
కోస్తా భౌగోళిక విస్తీర్ణం: 58% తెలంగాణ విస్తీర్ణం: 42%
పంటల విస్తీర్ణంలో తెలంగాణ వాటా దాదాపుగా భౌగోళిక విస్తీర్ణాల నిష్పత్తికి సమానంగా ఉంది. తెలంగాణవాదులు, నాయకులు వీటి సంగతి మాట్టాడరు. కానీ తెలంగాణ పల్లెల్లో చితికిపోతున్న జీవితాలను గురించి మాట్టాడుతారు. దానికి కారణం 'ఆంద్రోళ్ళే'నని గాండ్రిస్తారు కూడాను. 
 
కరీంనగరం, నిజామాబాదు, ఖమ్మం, వరంగల్లు జిల్లాల అభివృద్ధిని, ప్రజల జీవన పమాణాలను నల్లగొండ, మహబూబ్‌నగరు జిల్లా వాటితో పోల్చి చూసారా? చూడండి, మీకు తెలుస్తుంది అంతరాలేమిటో!  అంతరాలుండవని కాదు, ఉంటాయి, జిల్లా జిల్లాకు అంతరాలుంటాయి. అంతమాత్రాన  ఆ అంతరాలకు పక్కనోడు కారణమని నిందించడమేనా? అంతమాత్రాన రాష్ట్రాన్ని చీలుస్తారా అనేది ప్రశ్న.  ఈ రెండు జిల్లాల ప్రజల దుర్భర పరిస్థితికి, పై నాలుగైదు జిల్లాల నాయకుల స్వార్థమేకారణమని, వారి దమననీతే కారణమనీ అనడం పద్ధతేనా? నల్లగొండ ఫ్లోరైడు సమస్య కోసం రాష్ట్రాన్ని చీల్చేందుకు కంకణం కట్టుకున్న కేసీయారు ఎన్నిసార్లు నల్లగొండ జిల్లాలో పర్యటించాడు? నల్లగొండకు మంచినీళ్ళు ఎందుకు రావో చూస్తానంటూ ఆర్భాటం చేసాడొకసారి. ఆ సందర్భంలోనే సాగరుకు అడ్డంగా గోడ కడతాం అని గర్జించాడు. ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పాడు. వెంటనే చప్పబడిపోయాడు. (ఒక్కరోజులోనే  ఆ 'ముట్టడి' ఆగిపోయినట్టు గుర్తు!) ఎవరికుందండీ నిబద్ధత? రాష్ట్రాన్ని చీల్చేందుకు షాయషక్తులా ఆవేష పడుతున్న జానారెడ్డి హోమ్‌మంత్రిగా ఉండి ఈ ఐదేళ్ళలో ఏం చేసాడండీ,నల్లగొండ మంచినీళ్ళ విషయంలో?  అక్కడి ఫ్లోరైడు సమస్యను తీర్చడం పట్ల ఆయన కంటే ఎక్కువ బాధ్యత కలిగినవాళ్ళెవరైనా ఉన్నారా? మంత్రులూ, మహా మంత్రులూ అయి కూడా ఏమీ చేయని ఈ పుచ్చు నాయకులు రేపు రాష్ట్రాన్ని చీల్చాక చేస్తారా? కల్ల! చీల్చబూనుతున్నది, తమ ప్రయోజనాల కోసమే తప్ప జనాల కోసం కాదు.  'ఇప్పుడు చేస్తున్న గోలలో పదో వంతు చేసినా మాకు నీళ్ళొచ్చేవి, ఈ ఫ్లోరైడు బాధ తప్పేది గదా' అని నల్లగొండవాసులు అడిగితే సమాధానం చెప్పుకోడానికేం లేదీ చీలికవాదులకు. వాళ్ళామాట అడిగే సందివ్వకుండా, మన కష్టాలకన్నిటికీ ఇదిగో వీళ్ళే కారణమని కోస్తా సీమ నాయకులపై దుమ్మెత్తి పోస్తున్నారు. 

రాష్ట్రాన్ని చీల్చడంలో తలమునకలుగా ఉన్న తెలంగాణవాదులు, తెలంగాణ నాయకులు  తెలంగాణలోని ప్రతీ చిన్న సమస్యనూ రాష్ట్రవిభజన యజ్ఞంలో సమిధగా వ్రేల్చుతూ వస్తున్నారు. నీళ్ళ విషయంలో జరిగిన అన్యాయాలను ఎదుర్కోవడంలోనూ అంతే! పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరు తూముల్ని, మూతుల్ని అమాంతంగా పెంచేస్తున్నపుడు మా ఎడమ కాలువ సంగతి కూడా చూడండి అని ఎవరూ గొంతెత్తలేదే? పీ జనార్దనరెడ్డి ఒక్కడే, ఒకేఒక్కడై గోల చేసాడు. పాలక పార్టీలో ఉండి కూడా నిజాయితీగా మాట్టాడాడు. ఈ చీలికవాదులు మాత్రం అప్పుడేం మాట్టాడలేదు.., ఇప్పుడు కన్నీళ్ళు పెట్టేసుకుంటున్నారు.  రాజోలిబండ డైవర్షను వద్ద రాయలసీమ నాయకులు చేసే హడావుడిలో కొంతైనా చేస్తే, మహబూబ్‌నగరు జిల్లాకూ కాసిని నీళ్ళు తెప్పించగలరు, తెలంగాణ నాయకులు. అక్కడేమీ చెయ్యని చవట నాయకులు  ఇవతలికొచ్చి 'ఆంద్రోళ్ళ'ను తిడతారు.  రాష్ట్రాన్ని చీల్చాలంటారు. అంతే.., అయిపోద్ది, వాళ్ళ బాధ్యత తీరిపోద్ది!

ఇన్నాళ్ళూ మన బాధల గురించి మనమేమీ చెప్పుకోలేదు. వాళ్ళకున్నట్టే, మన కోస్తా సీమలకూ అనేక బాధలున్నాయి. అయినా మనమేం బజార్న పడలా, ఉద్యమాలు చెయ్యలా! ఎందుకంటే కష్టాలు జీవితంలో భాగమనుకున్నాం. అందరికీ ఉన్నట్టే మనకూ కష్టాలున్నాయి లెమ్మనుకున్నాం.  ఏడ్చి మొత్తుకున్నంత మాత్రాన సమస్యలు చక్కబడవు, మనమే ఏదో ఒక పరిష్కారాన్ని ఎతుక్కుందామనుకున్నాం.. వీలైనంతలో ఎతుక్కున్నాం.

కాకతీయుల్లాగే, విజయనగర రాజులు నిర్మించిన చెరువులు సీమలో ఎన్నో ఉన్నాయి. వాటికి మరమ్మతులు చెయ్యడం లేదని సీమవాసులు ప్రత్యేక రాష్ట్రం అడిగారా? అనంతపురం జిల్లాలో పాపాఘ్ని నది గురించి అనుకుంటా.. సంజీవరెడ్డి అన్నాడంట.. పాపాఘ్ని నదిలో నీళ్ళు కాదు, ఇసుక పారుతోంది అని. అంత ఆవేదన ఉన్నాగానీ ప్రత్యేక రాష్త్రం అడిగామా? ప్రత్యేక రాష్త్రం రాకపోతే యేం, పరిస్థితులు చక్కబెట్టుకోలేమా అని ఆలోచించి ఉంటారు, బహుశా మన నాయకులు!

150, రెండొందల యేళ్ళ కిందట తెల్లోడు ఏర్పాటు చేసిన డెల్టా వ్యవస్థ, నేటికీ మనకు, మనతో పాటు మరి కొందరికీ అన్నం పెడుతోంది.  ఆ డెల్టాల ఆధునికీకరణ అనేది సంయుక్త రాష్ట్రంలో, యాభై యేళ్ళ తరవాత, ఇప్పటికీ జరగలా.  అయినా మనం  ప్రత్యేక రాష్ట్రం అడగలా!

తొంభైల్లో ఐటీకి సంబంధించినంతవరకూ హైదరాబాదెంతో విశాఖ, విజయవాడ, కర్నూలు, తిరపతి కూడా అంతే.  ఏఁ, 'హైటెక్కులన్నీ హై.కే యెందుకు, మా పట్టణాల్లోనూ పెట్టండి'  అని మనమేమైనా అడిగామా? ఐఐటీ హై.లోనే ఎందుకు, మా జిల్లాలో పెట్టండి అని గోల చేసామా? పెట్టుబళ్ళన్నీ హై.లోనే పెడుతున్నారు.. మా నగరాలు కనబడ్డం లేదా అని ఏడ్చిపోయామా? అభివృద్ధి చెందేది మన రాజధానే గదా అని అనుకున్నాం. ఇవ్వాళ వదిలేసి పొమ్మంటే ఎలా ఉంటది. పైగా అన్నల్దమ్ముల్లాగా విడిపోదామంట. మంటెత్తుతుంది ఆ మాట వింటే!  డాక్టరు గారూ, మీలాగా తెలంగాణ వాళ్ళ బాధలతో సహానుభూతి వ్యక్తపరచడం మంచిదే సార్, బాగుంటది కూడా! కానీ మనమేదో బాగుపడిపోతున్నామని ఏడ్చిపోయే సమయాన, వాళ్ళ బాధలకు మనమే కారణమని దుమ్మెత్తిపోసే కాలాన, మన బాధలు,  కష్టాలేవో మనకూ ఉన్నవేళ, వాటినెవడూ పట్టించుకోని, మనల్నెవడూ అర్థం చేసుకోని సందర్భంలో నేను సహానుభూతి ఎలా వ్యక్తపరచగలను? నా కష్టాల గురించి పట్టించుకోవడమే నాకు ముఖ్యం.  నా బాగోగులు నేనే చూసుకోవాలి అని నాకు అర్థమైనప్పుడు దాన్నెలా సాధించుకోవాలో ఆలోచిస్తాను. దానికవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తాను. నువ్వు చేసేది తప్పని అనే అధికారం వీళ్ళకెక్కడిది సార్? నా సమస్యల పట్ల అసలేమీ పట్టింపులేని వాళ్లకు, 'ఇదిగో ఈ జీవోలో ఇలా అన్యాయం జరిగింది, ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెబుతావో చెప్పు' అని గద్దించే అధికారం ఎక్కడిది సార్? 

సమస్యలున్నాయి సరే..,  సమైక్యాంధ్ర అడిగితే అవెలా పరిష్కారమౌతాయి అని వాళ్ళడగొచ్చు. కానీండి, చూద్దాం ఏం జరుగుతుందో! అయినా.., సినిమాల్లో విలనుకు, జోకరుకూ మా యాస వాడారు అంచేత రాష్ట్రాన్ని చీల్చాలి  అని అడిగేవాళ్ళకు మనల్ని ఈ ప్రశ్న అడిగే అర్హత లేదులెండి!

---------------------------
నీళ్ళకోసం, నిధుల కోసం, నియామకాల కోసం మొదలెట్టిన ఈ తెలంగాణ ఉద్యమం, ఆ లక్ష్యాలనెప్పుడో మర్చి పోయింది. ఇప్పుడది జనాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి, ఏదో రకంగా రాష్ట్రాన్ని చీల్చి తమ పబ్బం గడుపుకోవాలనుకునే, ఏదో రకంగా తమ కసినితీర్చుకోవాలనుకునే కొందరు స్వార్థపరుల చేతిలో ఆయుధమైపోయింది.   స్వపరిపాలన కోసం తెలంగాణ కావాలంట. ఏమిటి స్వపరిపాలన? కేసీయారు తెలంగాణకు రాజైతేనే స్వపరిపాలన ఉన్నట్టా? అప్పుడు నాగం జనార్దనరెడ్డి స్వపరిపాలన అడగడా? కోమటిరెడ్డి వెంకటరెడ్డో, జానారెడ్డో స్వపరిపాలన అడిగితే ఏం చేస్తారు? ఇలాంటి తలతిక్క వాదనలా తెలంగాణ ఏర్పాటుకు ప్రాతిపదిక?

అయితే, తెలంగాణకు సమస్యల్లేవని కాదు.. తెలంగాణవాదులు చెప్పుకుంటున్న స్థాయిలో కాకపోయినా.., అసలంటూ ఉన్నాయి. కానీ వాటికి పరిష్కారం ప్రత్యేక రాష్ట్రం కాదు.  యాభై యేళ్ళనుంచీ ఉన్నదంటున్న సమస్యకు యాభై యేళ్ళ కిందటి పరిష్కారాన్ని సూచిస్తున్నారు, రాష్జ్ట్రాన్ని చీల్చడం తప్ప మరో మార్గం లేదని వాదిస్తున్నారు.

కానీ అసలు చీలిక అంటే ఏమిటి? తెలంగాణ ఏర్పాటా? కాదు, ఇది తెలంగాణా ఏర్పాటు కాదు, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు.  తెలంగాణకు అవసరమైన రాజధాని ఇప్పటికే ఉంది, దానికవసరమైన మౌలిక సదుపాయాలు - అవసరమైనదానికంటే ఎక్కువే ఉన్నాయి.  లేనిదల్లా కోస్తా సీమలకే!  అవసరమైన దానికంటే ఎక్కువే అని ఎందుకన్నానంటే ఆ సదుపాయాలు సమైక్యాంధ్ర కోసం ఏర్పరచినవి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల నోళ్ళు కొట్టి, మన నోళ్ళ మట్టిగొట్టి, సంపదనంతా ఇక్కడికి దోచిపెట్టి, ఈ నగరాన్ని అభివృద్ధి చేసారు.   హై.లో పెట్టుబళ్ళు పెట్టడం కాదు, మన నగరాలు, పట్టణాలు, పల్లెల్లో పెట్టండి అంటూ మన ప్రాంతంలో ఎవరూ గోల చెయ్యలేదు. హైదరాబాదు మనదే కదా అని అనుకున్నాం.  ఇప్పుడేం జరుగుతోంది.. 'ఇదంతా మాదే, మీరు పోయి మీ రాజధాన్ని ఏర్పాటు చేసుకోండి పోండి' అంటున్నారు. అదేంటని అడిగినవాణ్ణి, నా రాష్ట్రం నేనడుగుతుంటే నీకెందుకు బాధ అని గద్దిస్తున్నారు. పొమ్మన్నా పోకుండా చూరు పట్టుకు వేలాడుతున్నారని ఈసడిస్తున్నారు. బాగా అభివృద్ధి చెందిన హై.ను లాగేసుకుని మమ్మల్ని పొమ్మని గెంటెయ్యడం న్యాయమా? 


-------------------------------
ఇంకో ప్రహసనం చూస్తున్నారా టీవీల్లో?  ప్రతీ విశ్లేషకుడూ (అక్కడ ఘంటా చక్రపాణి కూడా విశ్లేషకుడేనంట..  హవ్వ!! తెలంగాణ పక్షపాతం ఉంటే చాలు  టీవీ విశ్లేషకుడైపోవచ్చనమాట!. ఇతగాడు మొన్నెప్పుడో ఓ కోస్తా నాయకుడికి ఎటకారంగా చెబుతున్నాడు.. ఫ్యాక్టరీలు, కంపెనీలూ పెట్టి, హై. ను అభివృద్ధి చేసామని మీరనే పనైతే.. అవి మాకేమీ అక్కర్లేదు, మీవి మీరు తీసుకెళ్ళండి అని చెప్పాడు - టీవీలో ! ఇలా మాట్టాడేవాళ్ళు నిష్పాక్షిక విశ్లేషకులంట!) 'మీకు అభయం ఇస్తున్నాం, మీకు భరోసా ఇస్తున్నాం.. తెలంగాణ రాష్ట్రంలో మీకేం భయం లేదు, హాయిగా ఉండొచ్చు' అంటూ వరదహస్తం చూపిస్తూంటారు.  అతి చేస్తూంటారు. అక్కర్లేని అభయాలు, అవసరం లేని భరోసాలు ఇచ్చేస్తూంటారు.  ఒకవేళ తెలంగాణయే గనక ఏర్పడితే, ఆనాడు హై.లో ఉండటమే కష్టమైన పరిస్థితే గనక వస్తే.. ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.., దుండగుల తాట తీస్తది.  ఒకవేళ ప్రభుత్వ నేతలే దానికి పూనుకుంటే కేంద్రం ఊరుకోదు - ఈపు సాపు చేస్తది. అంచేత, ఓయ్.. విశ్లేషకులూ, మీరు అభయాలు, భరోసాలూ ఇవ్వనక్కరలేదు., ఇకనాపండి, మీ పోసుకోలు కబుర్లు!

23 కామెంట్‌లు:

 1. జీవన్ రెడ్డి మాటలు చూశారా? "పెట్టుబడులు పెట్టాం పెట్టుబడులు పెట్టాం అంటారు..ఏం పెట్టారు మీరు? చార్మినార్ మీ పెట్టుబడా? గాంధీ హాస్పటల్ మీ పెట్టుబడా? సాలార్జంగ్ మ్యూజియం మీ పెట్టుబడా? ఉస్మానియా యూనివర్సిటీ మీ పెట్టుబడా? గోల్కొండ ఖిల్లా మీ పెట్టుబడా? ఉస్మానియా ఆస్పత్రి మీ పెట్టుబడా? మీ పెట్టుబడులేమిటో మీరు తీస్కపోండి" ....ఇలాంటి మనుషులతో ఎలా వాదిస్తాం? అవి పెట్టుబడులని ఎవరైనా ఎలా అంటారు? కొంచెమైనా కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడతారో?

  రిప్లయితొలగించండి
 2. హైదరాబాద్ లో పెట్టుబడులు ఎక్కువ పెట్టి చిన్న పట్టణాలని నిర్లక్ష్యం చెయ్యడం పాలకుల తప్పు కానీ తెలంగాణా ప్రజల తప్పా? చిన్న పట్టణాలలో పెట్టుబడులు పెట్టాలని తెలంగాణా ప్రజలు కోరారు. చంద్రబాబు లిబరలైజేషన్ పేరుతో చిన్న పరిశ్రమలని మూసివేసినప్పుడు తెలంగాణా ప్రజలు తీవ్రంగా విమర్శించారు. చిన్న పట్టణాలలో పెట్టుబడులు పెట్టాలని తెలంగాణా ప్రజలు కోరలేదు అనడం ఏమిటి? రాష్ట్రంలో ఏ సమైక్యవాదికీ తాను హైదరాబాద్ మీద మోజుతోనే తెలంగాణాని వ్యతిరేకిస్తున్నాను అని నిజం చెప్పుకునే ధైర్యం లేదు. ఈ విషయం నేను రాజకీయాగ్నిహోత్రం కథలో వ్రాసాను http://blogzine.sahityaavalokanam.gen.in/2009/12/blog-post_19.html హైదరాబాద్ మీద మోజుతో సమైక్యవాదం జపం ఎందుకు? మాకు చిన్న పట్టణాల అభివృద్ధి మీద ఇంటరెస్ట్ లేదు, అందుకే హైదరాబాద్ మీద మోజు పెట్టుకున్నాం అనే నిజం చెప్పొచ్చు కదా.

  రిప్లయితొలగించండి
 3. బావుందండీ మీ టపా!
  అసలు ఐటి రంగం ఇటుకేసి చూడకుండా వుండి వుంటే ఈ హై. లో ఎంత మంది వుండే వాళ్ళు?
  ఐటి కి కావలసింది ఏ రాష్ట్రమూ అని కాదు.
  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ రంగాన్ని కేవలం ఒక నెలలో వేరొక చోటుకు తరలించుకు పోగలదు. ఇదేమీ పెద్ద పరికరాలతో బరువైన యంత్రాలను ఇక్కడ వుంచి నడపే పరిశ్రమ అంతకన్నా కాదు.
  వాతావరణం సానుకూలం కాకపోతే టక్కున వేరే ప్రదేశానికి కదిలి పోతుంది.
  అప్పుడు మేమూ ఐటి కి పెద్ద పీట వేస్తాం అని ఇక్కడనుండి గావు కేకలు పెట్టినా వినే నాధుడుండడు.
  ఇంచక్కా భజన పరులతో ఈ రాజకీయ కేతిగాళ్ళంతా చేరి ఖాళీగా వున్న మాల్సును, ఏలుకుంటారల్లే వుంది.

  రిప్లయితొలగించండి
 4. నిజానికి కోస్తా ప్రాంతం కూడా వెనుకబడిన ప్రాంతమే. ఇక్కడ చాలా ప్రభుత్వ కార్యాలయలు , స్కూల్స్ , కాలేజీలు బ్రీటీష్ కాలం నాటివి. ఇక చాలా కాలేజీలు,ప్రభుత్వ ఆసుపత్రులు ధనవంతుల జ్జాపకార్దం వారి విరాళాలతో కట్తినవే ఎక్కువ. పకృతి అనుగ్రహంవల్ల నీరు ఉండటం వల్ల పంటలు కస్టపడి పండించి ప్రజలు అభివృద్దిలోకి వచ్చారు తప్పితే ప్రభుత్వం ఇక్కడ చేపట్టిన అభివృద్ది ఏమీలేదు. అభివృద్ది అంతా ఇక్కడి ప్రజల కస్టార్జితం. ప్రభుత్వ పరంగా అభివృద్ది ఏదైనా ఉంటే అది బ్రిటీష్ కాలంలో జరిగినదే.
  ఇక హైదరాబాద్ అభివృద్ది వల్ల,ప్రతీ విషయానికి హైదరాబాద్ పై ఆదారపడటం వల్ల తెలంగాణాలో మరో నగరం అభివృద్ది చెందలేకపోయింది.

  రిప్లయితొలగించండి
 5. తెలంగాణా వాదులారా,
  ఒక్కసారి ఆలోచించండి.మీరు విడిపోయినంత మాత్రాన తెలంగాణా అభివృద్ధి చెందుతుందా..అప్పుడు కూడ మిమ్మలని పాలించేది ఈ నాయకులే, ఈ మంత్రులే.
  రాష్ట్రంలో, కేంద్రంలొ, ముఖ్యమంత్రులు మరియు ప్రధాన మంత్రులుగా తెలంగాణా వారు పరిపాలించారు కదా అప్పుడు అన్ని అవకాశాలు ఇంకా మొత్తం అధికారాలు వాళ్ళ చేతిలొ ఉన్నాయి కదా.అసలు ఎందుకు ఇప్పుడు తెలంగాణా తెలంగాణా అని అరిచి గగ్గోలు పెడుతున్న ఒక స్వార్ధ రాజకీయ నాయకుడు ఇంకా మిగిలిన అన్ని పార్టీల నాయకులు పదవులలో కొనసాగిన మరియు కొనసాగుతున్న వారే కదా.ఇన్ని రోజులు వీరు చేయలేని మరియు జరగని అభివృద్ధి ప్రత్యేక తెలంగాణా రాగానే జరిగిపోతుందా? ఇన్నిరోజులు ఇంత పెద్ద రాష్ట్రం కాబట్టి మన బడ్జెట్ కూడ పెద్దగానె ఉండేది.అంత బడ్జెట్ తొ ఇంక మీచే ఎన్నుకోబడిన మీ ప్రాంత నాయకులు తొ మీకు జర గాల్సిన అభివృద్ధి ఎందుకు జరగలేదు? ఎప్పుడైనా ఏ నాయకులైనా చిత్తశుద్ధి ఉండాలి కాని అనుకున్నది ఎదైనా సాధించవచ్చు అని మీకు తెలీదా? మన నాయకులు మంచి వారు కానప్పుడు తప్పు ఎవరిది వారిదా లేక వారిని ఎన్నుకున్న మనదా?..నాయకులు మంచి వారు కానప్పుడు విడిపొయున్నా కలిసున్నా అభివృద్ధి అనేది నేతి బీరకాయ లొ నెయ్యి లాంటిదే.నేతలకు ఎలాగూ వాల్ల స్వార్ధాలు తప్ప అభివృద్ధి అవసరం లేదు.ఇప్పుడు ఇటువంటి చిల్లర గొడవల వల్ల మనం యావత్ భారతదేశం లోనే అందరికి మన రాస్ట్రం చిన్నచూపుకి గురి కావాల్సి వస్తుంది. కనీసం మనం అయిన సమైఖ్యం గా ఉండి రానున్న భావితరంలొనైనా మంచి యువనేతలను ఎన్నుకుని దేశంలోనె మన రాస్ట్రాన్ని అగ్రగామి గా నిలపవలసిన భాధ్యత ప్రతి ఒక్క తెలుగువానిది. సమైఖ్యం గా ఉన్నప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది.అందుకే పెద్దలు అన్నారు "కలసి ఉంటె కలదు సుఖం".

  రిప్లయితొలగించండి
 6. ఈ రోజు తెలంగాణా లో ఉద్యమం చేస్తున్నవారు ఆంధ్ర నాయకులకు కాదు కోస్తాంద్ర , రాయలసీమ ప్రాంత ప్రజలకు వ్యతిరేకం గా చేస్తున్నారు . వాళ్ళ మాటలలో గాని , వారి నాయకుల మాటలలో గాని ఇదే కనపడుతుంది . కాబట్టి ఈ ఉద్యమానికి మద్దతు గా మాట్లాడేవారు కూడా ఈ ప్రాంత ప్రజలు అన్యాయం చేస్తున్నారని ఒప్పుకుని ఈ మాటలు మాట్లాడుతున్నారా అనేది చెప్పాలి . అలాగే తెలంగాణా ప్రజలకు మనసుల తగిలిన గాయాలే కాని ఆంధ్ర , రాయలసీమ ప్రాంత ప్రజల మనసులు ఉంటాయో ఉండవో కూడా చెప్పాలి.వీల్లెవరికి కెసిఆర్ , ఈ వేర్పాటు వాడు మాట్లాడే నరుకుతాం , తరుముతాము, తలకాయలకు వెల గట్టటం లాంటివి కనపడతలేవా ? లేకపోతె చాకచక్యం గా చూడనట్లు నటిసిస్తున్నారా ?

  రిప్లయితొలగించండి
 7. రైల్వేలో మన రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది కాబట్టి,ఆంధ్రపదేశ్‌ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి లాంటి వితండవాదనలు ఏదో రకంగా మొండిగా సమైక్యవాదాన్ని సమర్దించటం కోసమే గానీ వాదనలో పస లేదు.జై ఆంధ్ర అంటాను జైతెలంగాణా అంటాను.విడిపోతే తప్పేంటి అనే వెంకయ్యనాయుడులాగా సమైక్యవాదులు ఎందుకు కలిసుండాలో కారణాలతో సహా స్పష్టంగా చెప్పాలి.మన పక్కనే ఉన్న యానాం ను రాష్ట్రంలో కలపాలని అడగకుండా సమైక్యవాదులు ఎందుకు విడిచిపెడుతున్నారో అర్ధం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.

  రిప్లయితొలగించండి
 8. యానాం గురించి ఎవడు అడిగాడు బాబు? ఒరిస్సాలోని ఖుర్దా పట్టణం, లోకో కోలనీ, నాలుగవ సందులో తెలుగువాళ్ళు ఎక్కువ. ఆ సందుని కూడా ఆంధ్రాలో కలిపెయ్యమని డిమాండ్ చెయ్యు. ఈ టాపిక్ యానాం గురించి కాదు. పెట్టుబడుల విషయంలో ఆంధ్రాకీ, తెలంగాణాకీ మధ్య ఉన్న సమస్యల గురించి. పెట్టుబడులని హైదరాబాద్ లోనే ఎక్కువగా కేంద్రీకృతం చేసి, హైదరాబాద్ ని తెలంగాణాకి ఇవ్వొద్దు అనడం ఏమిటి అనేది ఆలోచించాల్సిన ప్రశ్న. యానాం క్వెషన్ వల్ల తెలంగాణా సమస్యకి పరిష్కారం దొరకదు.

  రిప్లయితొలగించండి
 9. అంతే కాదు, 1956 కు ముందే 60 నుండి 70 అడుగులతో నిండుగా పారి, జలరవాణా కు కూడా ఉపయోగపడిన, బెజవాడ నుండి చెన్నపట్టణానికి నీళ్లు తీసుకెళ్లిన బకింగ్ హాం కెనాల్ పూర్తిగా కనుమర్గు అయ్యింది, దానివలన ఒక్క వ్యవసాయం కు నీళ్లు రాకపోగా, అది వెళ్లె ప్రాంతాలలో ఉన్న చుట్టుప్రక్కల ఊళ్లకు వేసవి వచ్చిందంటే మమంచి నీళ్లకు కూడా ఇబ్బంది ఏర్పడింది, అలాంటి ఉదహరణ చూపి బెజవాడ నుండి చెన్నై వరకు ఉన తీర ప్రాంతమంతా విడిపోదామని గొడవ పెట్టమంటారా ? ఈ ఒక్క ఉదాహరణో, ఇలాంటివో చూపి, కొస్తా విడిపోవాల్సిందే అని ఇల్లెక్కి కూయమంటారా?
  ఇక చెరువుల కింద వ్యవసాయం ఒక్క తెలంగాణా లోనే కాదు, కొస్తా అంతా, అంతకంటే సీమలో నిర్లష్యం చేయబడలేదా? సీమ వాసిని అని చెప్పుకొనే రాయలోరికి అది తెలియదా? ఒక్కసారి దిక్కు దివాణాలేకుండా పడివున్న కంభం చెరువు (అతి పెద్ద చెరువులలో అదీ ఒకటే) చూసి మాట్లాడండి?

  అంతెందుకు ఫ్లోరిన్ విషయం పాలకులు మిగతా ప్రాంతాలలో పట్టించుకొని , నల్లగొండ నిరక్ష్యం చేసారు అని చెప్పగలరా? అన్ని ప్రజా సమస్యలల్లాగానే దీనిని ప్రాంతాలతో సంబంధంలేకుండా నిర్లక్ష్యం చేసారన్న సంగతి తెలియదా? దానికి విడిపోవటమా పరిష్కారం?

  రిప్లయితొలగించండి
 10. మంచి చర్చ . మనన్సు పెట్టి ఆలోచిస్తే మనమధ్య అంతరాలను పెంచే కుయుక్తులగూర్చి అర్ధమవుతుంది .

  రిప్లయితొలగించండి
 11. తెలంగాణా లో కృష్ణా నది అరవై శాతం, గోదావరి ఎనభై శాతం ప్రవహిస్తుంది. కాని ఇప్పటికే ఎనభై శాతం నీరు ఆంధ్రా లోనే వాడకం జరుగుతుంది. ఒక వైపు తెలంగాణా ఎండి పోతుంటే పోలవరం, పులిచింతల ఎందుకు?

  ఏమన్నా అంటే 'మీ నాయకులు...' అంటారు. మా నాయకులు గొప్ప వారని అనటం లేదు. అలాగని మీ నాయకులు సుద్ద పూసలూ కారు. మీకు మంద బలం ఉంది. ఏదైనా అసెంబ్లీలో, పార్లమెంట్ లో గెలిపించుకో గలరు. ఆంధ్రా వారంతా ఒక్కటైతే తెలంగాణా వారు ఏదీ ప్రజా స్వామ్య పద్దతులలో సాధించుకోలేరు అని ప్రస్తుత పరిస్తితులే అద్దం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్నయాల్నే తల క్రిందులు చేసేలా పావులు కలుపుతున్నారంటే ఎంత బలమైన లాబీయింగ్ మీదో ఇట్టే అర్థమవు తుంది.

  హైదరాబాదులో మొత్తం పెట్టుబడులు లెక్కేస్తే ఆంధ్రా వాళ్ళ పెట్టు బడులు బహు స్వల్పం. ఆ మాటకొస్తే ఆంధ్రా వాళ్ళ పెట్టుబడులు హైదరాబాదు కన్నా ఎక్కువగా మద్రాసు, బెంగుళూర్ లలో ఉన్నాయి. లగడపాటి రాజగోపాల్ తన పెట్టుబడులు 15 రాష్ట్రాలలో ఉన్నాయని ఆయనే చెప్పాడు. జగన్ పెట్టుబడులు హైదరాబాదులో కన్నా బెంగుళూరులో ఎక్కువ. ఇలా పెట్టుబడుల పేరు చెప్పి మద్రాసు కావాలని మంకు పట్టు పట్టి 1953 లో పొట్టి శ్రీరాములును పోగొట్టు కున్నారు. ఇప్పుడేం చేస్తారో చూడాలి.

  ఒక వేళ హైదరాబాదును కేంద్ర పాలితం చేశారనుకుందాం. మీరు విభజనకు ఒప్పుకుంటారా? చస్తే ఒప్పుకోరు. మీ అసలు బాధంతా అప్పనంగా దండుకుంటున్న ఎనభై శాతం నదీ జలాలు ఇకపై దండుకోవటం కుదరదని.

  రిప్లయితొలగించండి
 12. చదువరిగారూ

  నేను చెప్పాలనుకున్నవి, చాలా మటుకు మీరు చెప్పేసారు కాబట్టి నా కలానికి శోష కలిగించదల్చుకోలా. ఉద్వేగం ఉండొచ్చు కానీ దానికే ఊడిగం చెయ్యటం మంచిపని కాదని ఈ సమిధలు ఎప్పుడు తెలుసుకుంటాయో. ఏదేమైనా తెలంగాణా విషయం, అది వచ్చినా రాకపోయినా - బ్లాగ్లోకంలో నిశ్శబ్ద పీఠాల్ని, గుడ్డెద్దు పడిన చేలల్ని కదిలించింది. సంతోషం..

  వంశీ

  రిప్లయితొలగించండి
 13. చదువరిగారికి, పోస్ట్ చాలా బాగుంది,సమర్దవంతంగా తిప్పికొడుతున్నారు,అభినందనలు .కాని ఈ పరిస్తితికి ఒకవిధంగా సమైక్యవాదులూ కారణమే, ఆంద్రా వారిని ఇక్కడి రాజకీయ నిరుద్యోగులు దొంగలని తిడుతున్నప్పుడు కూడా ఒక్కరూ నోరు మెదపలేదు,అప్పటి మౌనమే ఇప్పుడు తప్పు అయిపోయింది,ఇప్పుడు ఇక్కడి కుక్కపిల్లని కదిలించినా ,ఆంద్రా వారిని దొంగలని తిడుతుంది,తిట్టకపోతే దానికి అదేదో తప్పులా అనిపిస్తుంది,కనీసం సరిహద్దులు కూడా తెలియకుండా కొన్ని పడికట్టు పదాలు .....మాకు అన్యాయం జరిగింది,మా నీళ్ళన్నీ వాడుకుంటున్నారు,దొంగలు...దోచుకుంటున్నారు,సెటిలర్సు ఇవే రిపీట్. అయినా అక్కడినుంచి ఎవ్వరూ ఇక్కడికి తెలంగాణా అని రాలేదు,రాజదాని అని వచ్చారు,వస్తారు,వస్తున్నారు.ఈ రోజు సన్నాయి నొక్కులు లన్నీ నాడు రాజశేఖరుడి చుట్టూ భయంగా తిరిగినవే,ఆ రోజు లోపలికి పోయిన నాలుకలన్నీ ఈ రోజు ఈ బలహీనప్రభుత్వం లో బయటకు వచ్చాయి అంతే, పొరపాటున ప్రభుత్వం ఏర్పడితే ప్రతి ఎం యల్ ఏ కి మంత్రిపదవి ఖాయం,అందుకే ఇన్ని తిప్పలు, వేర్పాటువాదపు అరుపులు.రేపు జాతియ గీతము లో తెలంగాణా అన్నపదములేదు మార్చమన్నా మార్చమంటారు.జై సమైఖ్యాంద్ర.

  రిప్లయితొలగించండి
 14. సమైక్యాంధ్రపై మీ టపాలు, చాలా వివేకవంతంగా, అర్థవంతంగా ఉంటున్నాయి. ప్రత్యేక తెలంగాణా వాదంతో చవకబారు రాజకీయాలు, అసలు ఏ సమస్య మీదా ఏ అవగాహనా లేని ఒక విదేశీ వనిత, తన పుట్టిన రోజు బహుమతి అని ఓ ప్రకటనా - ఇవన్నీ అసహ్యం పుట్టేలా ఉన్నాయి. అసలీ ప్రజాస్వామ్యం పట్లే రోత కలుగుతున్నది.

  తెలంగాణా అంటే, గోదావరి నీళ్ళ గురించి మాట వస్తున్నది. గోదావరి మీద ఆనకట్టలు కట్టడానికి నిజంగా తెలంగాణాలో అవకాశం ఉందా? ఉంటే ఇన్ని యేళ్ళయినా ఆ ప్రయత్నాలు ఎందుకు జరగడం లేదు? ఒకవేళ ఆ అవకాశం లేకపోతే, ఆంద్రోళ్ళు, సీమ వాళ్ళు బాధ్యులెలా అవుతారు?అన్నవి నాకు అర్థం కాని ప్రశ్నలు.

  రిప్లయితొలగించండి
 15. కామెడీ ఏంటంటే, షికాగో శ్రీధర్రాజుగారూ, అలాగే డాక్టర్ రాయలవారూ, ఎక్కడో పశ్చిమార్థగోళంలో కూర్చుని, తెలంగాణా సమస్యలగురించి "వర్రీ" అయిపోవడం :)

  దేవుడా రక్షించు నా దేశాన్ని,
  ఈ ఎన్నారై పెద్దమనుషులనుండి.

  రిప్లయితొలగించండి
 16. 1845 జి.ఓ కి ఒక రోజు ముందు 1843 జి.ఓ వచ్చింది. ఇక్కద లభిస్తుంది అది http://goir.ap.gov.in/Reports.aspx. దాని ప్రకారం వరంగల్ కు 14.11 కోట్లు, మహబూబ్ నగర్ కు 13.85 కోట్లు(1845 లో మరో 1.05 కోట్లు) నాబార్డ్ నిధులు కేటాయించబడ్డాయి. ఇంకా మరికొన్ని జిల్లాలకు కేటాయింపులు కూడా వున్నాయి.

  దీన్ని బట్టి అర్ధం అవుతున్నది. ఇలాంటి వాదనలు ఎంత అసంబద్ధమో. దీనికి ముందు వెనుక ఇలాంటి జి.ఓ లు మరిన్ని వచ్చి వుండవచ్చు. ఇలాంటి విషయాలు ఒక జి.ఓ తో తేలేవి కావు. అన్యాయం జరిగిందా లేదా అన్నది సమగ్రంగా చూడాలి గానీ ఏదో ఒక జి.ఓ తో కాదు.

  రిప్లయితొలగించండి
 17. అమ్మయ్య! ఓ పరీక్ష ముగిసింది. ఏదో నా సొంత గొడవ లెండి.

  మొదటగా నా బ్లాగులో వ్యాఖ్యలు తీసేయటానికి కారణం- తెలుగు బ్లాగర్లు పెరిగిపోయి వ్యాఖ్యోపాఖ్యానం ఇలా చేంతాండంత అవుతుందనే:-)వ్యాఖ్యల సంగతి అటుంచండి , అసలు 'టపా'లు కట్టేసింది వ్యక్తిగత కారణాల వల్ల. వద్దు,వద్దు అనుకొంటూనే మళ్లీ మొదలయ్యింది ఈ వ్యసనం.

  ఇక అసలు సంగతి కొద్ధాం. మీ విశ్లేషణ అమోఘం- ఇందులో ఏ మాత్రం 'శ్లేష' లేదు.కానీ తెలంగాణాకు అన్యాయం జరిగింది- అని అంగీకరించిన నాడే సమస్యకు పరిష్కారం సాధ్యమవుతుంది.రాష్ట్ర విభజన జరిగినా, జరగకున్నా కొంపలేవీ మునగవని 'మీ' జె.పి. గారే అన్నారు. ఇక 'మా' చిరంజీవి గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది.రాష్ట్ర విభజన కన్నా 'హైదరాబాదు' ఎక్కడ చేజారిపోతుందో అన్నదే అందరి బాధ.

  తెలుగు రాజకీయ రంగస్థలంపై గజ్జెకట్టిన ప్రతిపార్టీ నాయకుడూ పదిరోజుల కిందటిదాకా తెలంగాణా వేర్పాటుకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో చందా కట్టినవాడే!-భూమి 'సాక్షి'. మరి అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు సార్ ఈ సీమాంధ్ర నాయకులు. అసలు మన రాష్ట్రానికి ఆంధ్ర'ప్రదేశ్' అని పేరు పెట్టినవాడిని నిలువునా పాతరేయాలి. 'ప్రదేశ్' అట, ఇదేమి ఉత్తర హిందూస్థానం లోని రాష్ట్రం కాదే. తెలుగు 'అజంత' భాష కాదా?

  చావా గారు చెప్పినట్లు 'తెలుగునాడు' అని నామకరణం చేసి, ఈసారి నిజంగా అమలయ్యే 'ఒప్పందాలు' చేసుకొని అందరికీ సమన్యాయం చేస్తామంటే ఈ మంటలు చల్లారే అవకాశముంటుంది.ఇదీ మరీ తమిళ'నాడు'లా ఉందనుకొంటే, మొత్తం రాష్ట్రానికే తెలంగాణా అని పేరు పెట్టేస్తే పోయె! తెలంగాణా అంటే'తెలుగు వారి నేల'అని కదా అర్థం. 'తెలంగాణా' వచ్చినట్టూ ఉంటుంది, తెలుగు ప్రజలందరూ 'సమైక్యం'గానూ ఉంటారు, మనకు ఈ 'ప్రదేశ్' పీడా విరగడవుతుంది.ఇలా చేస్తే ఉభయతారకం! మీరేమంటారు?నేను విభజనవాదిని కాదు, సమైక్యవాదినీ కాదు- 'న్యాయ'వాదిని:-)

  రిప్లయితొలగించండి
 18. కృష్ణ గారికి-

  http://krishnadevarayalu.blogspot.com/2007/02/blog-post_19.html
  http://hridayam.wordpress.com/2007/02/19/cheruvu/

  మిస్టర్ గిరీశం గారికి-

  'వర్రీ' కావడం పై మీ 'కొర్రీ'లు అలా అందరికీ పంచండి సార్. మా ఇద్దరితో సరిపెడితే ఎలా? తెలంగాణా, సీమ ఎన్నారైలకే ప్రశ్న ఎక్కుపెట్టి, కోస్తాంధ్ర ఎన్నారైలకు అన్యాయం చేసినవారౌతారు. అందుకే సమన్యాయం ఉండాలన్నారు:-)

  రిప్లయితొలగించండి
 19. బాగా చెప్పారు ఇస్మాయిల్ గారు.. రాష్ట్రానికి తెలంగాణా అని పేరు పెట్టి మన కె.సి.ఆర్ గారిని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేస్తే ఆయన గారి గుల ఏమైనా తీరుతుందేమో.

  రిప్లయితొలగించండి
 20. >>తెలంగాణా లో కృష్ణా నది అరవై శాతం, గోదావరి ఎనభై శాతం ప్రవహిస్తుంది. కాని ఇప్పటికే ఎనభై శాతం నీరు ఆంధ్రా లోనే వాడకం జరుగుతుంది

  దీనికి కరెక్టు సమాధానం మన ఉండవల్లి చెప్పాడు. భౌగోళికంగా కోస్తాలో నీటి వాడకం/పంచడం తేలికట. వద్దాన్నా నీరు వచ్చి మన మీద పడుతుందట. అదే తెలంగాణాలో ఐతే బోల్డంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమంట.
  జేబుకు చిల్లు పడితే చొక్కా చింపేస్తామా? కొందరు బుఱ్ఱ తక్కువ ప్రత్యేకవాదుల విశ్లేషణలు ఇలాగే ఉంటాయి. దిన పత్రికల్లో వచ్చిన కొన్ని వ్యాసాలు చదివి ఏదంటే అది వాదిస్తూంటారు. ఐకమత్యమే మహాబలం అని ఎప్పుడు తెలిసొస్తుందో వీళ్ళకు.

  రిప్లయితొలగించండి
 21. ఓపని చెయ్యండి. తెలంగాణాలో డాములు కట్టండి. ఓ ఇప్పుడున్న సాధారణ డాములకి రెట్టింపు సైజులో. నీళ్ళన్నీ అక్కడే నిల్వ బెట్టండి. ఎగువలో డాములు బద్దలయ్యే నీటి ఉధౄతి రాకా మానదూ, వదలకా తప్పదు. కానీ ఆంధ్రా దోపిడీ గాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఆ నీళ్ళని వదలకుండా అక్కడే ఆపుకోండి. డాములు పగిలినా సరే. ఆ డాములు పగలటానికి కూడా ఆంధ్రోళ్ళే కారణమని ఆడిపోసుకోండి.
  *** *** ***

  Just the same story again. If the state is partitioned, it'l be just like the situation of India and pak. Nothing bbetter. No one will gain except those political leaders

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు