28, ఆగస్టు 2009, శుక్రవారం

కాటమరాజు కథ - ఆరుద్ర నాటకం

కాటమరాజు కథ
-స్టేజీ నాటకం
 • రచన: ఆరుద్ర
 • వస్తువు: ఆంధ్ర చారిత్రిక గాథ
 • రాసిన సంవత్సరం: 1961
 • ముద్రణ: 1999
 • ప్రచురణకర్త: స్త్రీశక్తి ప్రచురణలు, చెన్నై
 • ఆసక్తులు: చరిత్ర, ఛందోబద్ధ పద్యాలు
 • 130 పేజీలు, 55 రూపాయలు.
 • దొరుకుచోటు: విశాలాంధ్ర, కె.రామలక్ష్మి
కాటమరాజు కథ - 13 వ శతాబ్దం చివరిలో నెల్లూరుసీమలో జరిగిన ఒక వాస్తవ వీరగాథ. పలనాటి వీరచరిత్ర లాగా కాటమరాజు కథ కూడా మన రాష్ట్రంలో సుప్రసిద్ధం.

కాటమరాజు గొల్లప్రభువు. వేలాది పశువులు అతడి ఆస్తి. శ్రీశైలం ప్రాంతంలో తమ ఆవులను మేపుతూంటారు. ఓ సంవత్సరం ఆ ప్రాంతంలో కరవు కారణంగా గ్రాసం లేక వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దక్షిణంగా ప్రయాణించి పాకనాడుకు చేరి అక్కడి పాలకుడు నల్లసిద్ధిరాజుతో ఒక ఒడంబడికకు వచ్చి ఆ రాజ్యంలో పశువులను మేపుకుంటూంటారు.
ఒక సంవత్సరం పాటు పశువులను మేపుకోనిస్తే ఆ ఏడాదిపాటూ పుట్టే కోడెదూడలన్నిటినీ నల్లసిద్ధికి అప్పగించాలి. ప్రతిగా నల్లసిద్ధి వారికి తమ రాజ్యంలో రక్షణ కల్పిస్తాడు. ఇదీ కౌలు ఒడంబడిక. అయితే, నల్లసిద్ధి ఉంపుడుకత్తె కారణంగా నల్లసిద్ధికీ కాటమకూ తగవు వస్తుంది. అది యుద్ధానికి దారితీస్తుంది.

స్థూలంగా ఇదీ కథ. ఈ కథను ఆరుద్ర నాటకంగా రాసారు. లభించిన చారిత్రిక ఆధారాల నేపథ్యంలోనే నాటకాన్ని రాసారు. యుద్ధఫలితం ఏమైందనే విషయమై చరిత్రలో సరైన వివరం లేనందువల్లనో ఏమో.. నాటకం యుద్ధఫలితాన్ని సూచించకుండా ముగుస్తుంది. యుద్ధంలో కాటమరాజు మరణించి ఉండవచ్చని పుస్తకానికి పీఠిక రాసిన పరిశోధకుడు రాసారు. ఈ యుద్ధంలోనే, ఖడ్గతిక్కన పాల్గొని మరణించింది. కవి తిక్కన (తిక్కన సోమయాజి) ఖడ్గ తిక్కనకు పినతండ్రి కొడుకు.

ఆరుద్ర ఈ నాటకాన్ని 1961 లో రచించారు. ఏ సందర్భంలో ఎవరి ప్రోద్బలంతో రాసారో 'రచన గురించి 'లో  కె.రామలక్ష్మి చెప్పారు. ఈ నాటకాన్ని మొదట ఎక్కడాడారో, ఎవరెవరు నటించారో కూడా తొలి పేజీల్లో ఇచ్చారు. ఆ నాటకం చదివాక నాకు కలిగిన అనుభూతి ఇది.

నాటకం చదవడానికి హాయిగా ఉంది. నేను ఏకబిగిని చదివేసాను. నాటకం ముక్కుసూటిగా సాగిపోతుంది. కథ వేగంగా నడుస్తుంది. అనవసరమైన సాగతీత లేదు. అనవసరమైన సన్నివేశాలు లేవు, సంభాషణలూ లేవు.  ఒక సన్నివేశం.. నల్లసిద్ధి కాటమరాజుకు రాయించిన కౌలుపత్రం నల్లసిద్ధికి అతడి దూత వినిపిస్తూండగా ముగుస్తుంది. వెంటనే వచ్చే సన్నివేశంలో కౌలుపత్రంలోని మిగతా భాగాన్ని అదే వ్యక్తి కాటమరాజుకు వినిపిస్తూండగా మొదలౌతుంది. సినిమాలో సీను మారినట్టుగా అనిపిస్తుంది. -సినిమావేత్త రాసిన నాటకం మరి!

చారిత్రిక కథల్లో సహజంగా ఉండే అతిశయోక్తులు ఈ నాటకంలో చాలా తక్కువగా ఉన్నాయి. నాకు అగుపడ్డ ఒక అతిశయోక్తి కాటమరాజు వద్ద ఉన్న పశువుల సంఖ్య. అది పదిలక్షలని కాటమరాజు దూత ఖడ్గతిక్కనకు చెబుతాడు. పది లక్షలంటే చాలా ఎక్కువగా అనిపించడం లేదూ!!

సంభాషణల్లో ఓ చమక్కు - సిరిగిరి అనే పాత్ర తన భర్తతో సరస సంభాషణలు చేస్తూండగా మాటల్లో భర్త, 'నేను శ్రీశైలం వెళ్ళిపోతాను' అని అంటాడు. సిరిగిరి అయ్యో నన్నొదిలి వెళ్ళిపోతావా అని కలత చెందుతుంది. ఓసి పిచ్చిదానా 'శ్రీ శైలం' అన్నా, 'సిరి గిరి' అన్నా ఒకటే గదా.. నేను నిన్ను చేరుకుంటాననే గదా చెబుతున్నది అని చమత్కరిస్తాడు.

రచయిత కాటమరాజు పట్ల, అతని పక్షం పట్లా ఒకింత పక్షపాతం చూపించాడని అనిపిస్తుంది. కాటమరాజును శ్రీరామచంద్ర సముడిగా చూపిస్తాడు. రాముడితో పాటు, భరతుడు, కైక పాత్రలు కూడా కనిపిస్తాయి. ఆవులను తోలుకొని దక్షిణాదికి పొమ్మని కాటమరాజుకు సిరిదేవి (కైక) చెప్పడం, అందుకు కోపించి అమె కన్నకొడుకు అయితంరాజే (భరతుడు) ఆమెపై కత్తియెత్తడం, ఖండఖండాలుగా నరికేస్తాననడం.. అంతా మరీ నాటకీయంగా ఉంది. అలాగే, యుద్ధానికి దారితీసిన కారణాల్లో నల్లసిద్ధితో పాటు కాటమరాజుది కూడా తప్పు ఉండి ఉండవచ్చు అని నాకు అనిపించింది. చరిత్రలో కూడా ఒక పక్షం వైపు పూర్తిగా మంచే ఉండి, ఎదరి పక్షం పూర్తిగా విలనీని ప్రదర్శించిందా అనేది సందేహాస్పదమే! అయితే ఇది శాస్త్రీయంగా రాసిన చరిత్ర పుస్తకం కాదు, కేవలం చరిత్ర ఆధారంగా రాసిన నాటకం. కాబట్టి, కొంత నాటకీయత సహజం, అవసరం కూడానేమో!

కాటమరాజు పాత్ర అచ్చు బొబ్బిలియుద్ధం సినిమాలో రంగారాయుడి పాత్ర (రామారావు వేసాడు) లాగానే అనిపించింది. ఆ సినిమాలో లాగానే ఈ నాటకంలో కూడా అనుచరులు చీటికీ మాటికీ కత్తులు దూస్తూ ఉంటారు. కాటమరాజు శాంతి వచనాలు చెబుతూ వాళ్ళను చల్లబరుస్తూ ఉంటాడు. ఇక, మనకు బాగా పరిచయమైన ఖడ్గతిక్కన పాత్ర మీద రచయిత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు అనిపించింది. యుద్ధభూమి నుండి వెనుదిరిగి వచ్చినపుడు భార్యా తల్లీ అతడికి చేసిన 'సన్మానం' ఇందులోనూ ఉంది. కానీ అతడెందుకు వెనుదిరిగి రావాల్సి వచ్చిందో కారణం చూపించాడు ఆరుద్ర. నాకు నచ్చిందది. ఖడ్గ తిక్కనకు సంబంధించి ఉద్వేగభరితమైన మరో సన్నివేశాన్ని సృష్టించి సెంటిమెంటును కూడా పండించాడు రచయిత.

కాటమరాజుతో పోరాడిన రాజు మనుమసిద్ధి అని మనం చదూకున్నాం.  ఈ నాటకంలో మాత్రం నల్లసిద్ధిరాజు అనే పేరు ఉంది.  నల్లసిద్ధి, మనుమసిద్ధి ఒక్కరేనా? ఈ సందేహాన్ని తీరుస్తూ, పీఠిక రాసిన తంగిరాల వేంకట సుబ్బారావు గారు ఈ ఇద్దరూ వేరువేరని తేల్చిచెప్పారు.  కాబట్టి ఆ రాజు నల్లసిద్ధి అని స్థిరపరచుకుందాం.  కానీ, నాటకమంతా నల్లసిద్ధి అనే వాడారు గానీ..,  పుస్తకంలో మొదట్లో ఇచ్చిన 'నటీనటులు' అనే పేజీలో రాజు పేరును మనుమసిద్ధి అని రాసారు.  నాటకంలో కూడా ఒక పద్యంలో 'మనుమసిద్ధి' అనే పేరు వస్తుంది. చదువరులకు ఇది అయోమయం కలిగిస్తుంది.

నాటకానికి ముందే పాత్రల పరిచయపట్టిక ఉంటే బాగుండేది. పాత్రలు చదువరికి ముందే పరిచయమైపోవాలి. లేకపోతే కొంత అయోమయంగా అనిపిస్తుంది. మొదటి రంగంలో ఓ రెండు పేజీలు కాగానే ఒక్కసారిగా నాలుగైదు పాత్రలు ప్రవేశిస్తాయి. వాటిలో ఒకపాత్ర పేరు 'అగుమంచి ' -ఎప్పుడూ వినని పేరు!  అంతకుముందు 'ఆడంగులొస్తున్నారు' అనే సూచన ఉంది కాబట్టి ఆ పాత్ర ఆడమనిషి అని అనుకుంటాం, లేకపోతే ఆ పాత్ర ఆడో మగో కూడా తెలీదు. ఆ తరవాత తెలుస్తుందనుకోండి.  పీఠిక రాసిన తంగిరాల వారు కథను, అందులోని పాత్రలను పరిచయం చేసారు. అయితే పరిచయంలో కాటమరాజు వంశవృక్షం మొత్తాన్నీ చెప్పడంతో అది కొంచెం పెద్దదైపోయింది. నాటకం చదవబోయేముందు వివిధ పాత్రల గురించి తెలుసుకోవడం కోసం పీఠిక చదవడం తప్పనిసరి.

నాటకం కాబట్టి ప్రతి సంభాషణకూ ముందు పాత్ర పేరు రాస్తారు కదా..  'అయితంరాజు' అనే పాత్ర చెప్పే మొట్టమొదటి సంభాషణకు ముందు "అయి" అని రాసారు. ముందే పాత్రల పరిచయంలేదు..., కనీసం పాత్రను పరిచయం చేసే సన్నివేశంలోనైనా పూర్తిపేరు వెయ్యొద్దా? 'అయి' అంటే ఏం అర్థమౌతుంది? అంతకు ముందు వేరే పాత్రలు ఈ పాత్ర గురించి మాట్టాడుకుంటాయి కాబట్టి కొంత అర్థమౌతుంది.

నాటకం చూస్తే కలిగే అనుభూతి బహుశా నాటకాన్ని చదివితే కలగదు. పాత్రల ఆహార్యాన్నీ, హావభావాల్నీ ఊహించుకుంటేగానీ మనం నాటకాన్ని ఆస్వాదించలేం. ఈ నాటకాన్నే ఒక నవలగా చదివితే బహుశా నాకు మరింత తృప్తిగా ఉండేదేమో! నవలలోనైతే సంభాషణలే కాక, పాత్రల మానసిక పరిస్థితి, మనోభావాల వర్ణన కూడా ఉంటాయి కాబట్టి, రచన మరింత సమగ్రంగా ఉంటుంది. సన్నివేశానికి ముందు ఆ సన్నివేశం గురించిన వర్ణన, వివరణ మరింత విపులంగా ఉండాలేమో ననిపించింది.
పద్యాలు ఇష్టపడేవాళ్ళకి, ఈ నాటకం మరింతగా నచ్చుతుంది. చక్కటి పద్యాలను ఇందులో సందర్భోచితంగా ఇమిడ్చారు. ఇప్పటికే వ్యాప్తిలో ఉన్న చాటువులను సేకరించారు. కొన్ని రచయిత తానే రాసారట. పద్యాలు పెద్ద పెద్ద సమాసాలతో కాకుండా తేలిక పదాలతో సులభంగా అర్థమౌతూ ఉంటాయి. చక్కగా పాడుకోను వీలుగా ఉంటాయి. మచ్చుకో పద్యం చూడండి.

సీస||
మురదండ మేఘముల్ ముసిరి వచ్చుటలేదు
                  ముంతపోతగా వాన ముంచలేదు
దడదడ చప్పుళ్ళ దబ్బాటు వానలా?
                  గొర్తి పదునుదాక కురియలేదు
వర్షించు వేళలో వాగళ్ళు కనిపించి
                  సింగిణి రంగులుప్పొంగలేదు
ఎల్లంకి గాలులు ఏనాటి ముచ్చటో
                  పీచరగాలైన వీచలేదు

తే.గీ||
కన్నెపిల్లలు కావిడికట్టె త్రిప్ప
కప్పతల్లియు నోరెండి కన్నుమూసె
వరుణదేవుని గుండెలు కరుగలేదు
చేటు కాలము ప్రాప్తించె కాటభూప

తేటగీతిలోని చివరి పాదాన్ని చూడకపోతే, ఈ పద్యాలు నేటి ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితిని వర్ణిస్తూ రాసినవేమోననుకుంటాం.

నాటకంలో 'ఠాణా' అనే పదాన్ని వాడారు. హిందీ మాటను వాడారేంటబ్బా అనుకున్నాను -బహుశా సంస్కృతపదమయ్యుండొచ్చు.   'లంచం ' ఆ రోజుల్లోనే ఉండేదని కూడా అర్థమైంది.

పుస్తకం రాసినవారి ప్రజ్ఞ గురించి నేను చెప్పగలిగినదేమీ లేదు. కానీ, వేసినవారి గురించి మాత్రం రెండు ముక్కలు చెప్పాలి.  బాపుబొమ్మ అట్టతో, పెద్ద అక్షరాలతో పుస్తకాన్ని ముద్రించారు. నాటకం మొత్తానికి ఒక ఖతి (ఫాంటు), పద్యాల కోసం ప్రత్యేకంగా వేరే ఖతినీ వాడారు. ఆ పద్ధతి బాగుంది. అయితే ఒక్క పద్యానికి మాత్రం మామూలు ఖతే పడింది, ఎందుకో తెలవదు. కొన్ని పద్యాల పాద విభజన సరిగ్గా లేదు. కంపోజింగు అయ్యాక, సరిచూడవలసినవాళ్ళు సరిగ్గా చూడలేదన్నది స్పష్టం. 'ఛందస్సు సరిపోవడంలేదేమిటా'ని కూడా చూసుకోలేదు. పద్యాల్లో అచ్చుతప్పులూ దొర్లాయి. ఇతరచోట్ల కూడా అచ్చుతప్పులున్నాయి.పద్యాల కోసం వాడిన ఫాంటులో 'ళ' అక్షరం సరిగ్గా లేదు, అది అచ్చం 'శ'లాగా కనిపించింది. (బొమ్మలో చూడండి) నాకు చాలా అసంతృప్తి కలిగించిన అంశమది. ఖతిలో ఆ దోషం ఉన్నపుడు వేరే ఖతి వాడి ఉండాల్సింది. ఏదో ఒకటి అచ్చేసి ప్రజల్లోకి తోసేద్దామనుకుంటే జరిగేది అచ్చుతప్పులూ అచ్చ తప్పులేకాదు, రచయితకు అపచారం కూడా.

కథకు సంబంధించి ఆకరాలను (రిఫరెన్సులు), మూలాలను కూడా ఇచ్చి ఉంటే పుస్తకానికి మరింత విలువ రావడమే కాదు, ఈ కథ గురించి మరింత తెలుసుకునేందుకు చదువరులకు అవకాశం ఉండేది. కథ జరిగిన ప్రదేశాలను సూచిస్తూ ఒక మ్యాపును పుస్తకంలో ఇచ్చి ఉంటే కూడా బాగుండేది.

చాలా తెలుగు పుస్తకాలకు ఉండే ప్రత్యేకతలు దీనికీ ఉన్నాయి. అవి:
 • మూడో పేజీలోనో నాలుగో పేజీలోనో పుస్తకం గురించి వేస్తారు చూడండి.. పుస్తకం పేరు, ముద్రించినది ఎక్కడ, ప్రచురించినది ఎవరు, ఏ సంవత్సరంలో వేసారు, ఎన్నో ఎడిషను, ప్రతులు ఎక్కడ దొరుకుతాయి వగైరా సమాచారం మొత్తం, అన్ని పుస్తకాల్లోలాగే ఇంగ్లీషులోనే ఉంది. దీన్ని ఇంగ్లీషులో వెయ్యాల్సిన అవసరం ఏంటో? మన సినిమాల్లో పేర్లన్నిటినీ తెలుగులో వేసేసి, నిర్మాత దర్శకుల పేర్లు మాత్రం ఇంగ్లీషులో కూడా వేసుకున్నట్టు, మన పాటల కాసెట్ల మీద పాటకు సంబంధించిన క్రెడిట్లన్నీ ఇంగ్లీషులో ఉన్నట్టు!
 • ISBN లేదు.

7 కామెంట్‌లు:

 1. చాలా రోజులుగా చదవాలనుకుంటున్న పుస్తకం.. షాపులో డిస్ప్లే లో ఉండకపోడంతో వెళ్ళినప్పుడు మర్చిపోతున్నాను.. ఈసారి గుర్తు పెట్టుకుని తీసుకోవాలి. చాలా బాగా పరిచయం చేశారు.. వెంటనే చదవాలనిపించేలా...

  రిప్లయితొలగించండి
 2. చాలా బాగా పరిచయం చేసారండి. తప్పకుండా చదవాలన్న ఆసక్తి కలిగింది.

  రిప్లయితొలగించండి
 3. Thanks for the review. I saw the book in Kolkata this March but only browsed through it. I spent more time on Arudra's two books on Vemana and his essays. It seems from the review that I should have read it more carefully.

  రిప్లయితొలగించండి
 4. I vaguely remembered a story about Arudra that his work on film scripts led to his research on telugu literature and Samagra Andhra Sahityam. A goole search shows that there may be some substance to this story. From
  http://www.thulika.net/2008June/arudra.html
  "Arudra mentioned in one of his essays an incident that led to working on his major work, Samagra Andhra Sahityam. It was triggered by a brief conversation the author had with B. N. Reddy, a prominent movie producer. Arudra casually suggested to Reddy to make a movie on the famous poet Tikkana. Reddy asked Arudra to see if there was enough material to make a movie.

  Arudra, as his wont, started researching the subject, and was fascinated by the enormous amount of material he had come across in the process. The movie did not happen but his research, which extended over a period of sixteen years, resulted in the said volumes. “The information useful for the race [of the Telugu people] must not be put away,” he told himself, and set out to publish it in a series of volumes. The set of twelve volumes
  speaks of not only Arudra’s thirst for knowledge and tenacity but also his commitment to the Telugu race.
  Arudra’s commitment is evident from his comment that he quit smoking in order to continue his reading in the library uninterrupted."

  రిప్లయితొలగించండి
 5. వ్యాఖ్యాతలందరికీ నెనరులు.
  స్వరూప్‌గారూ, ఈ పుస్తకం పీఠికలో తంగిరాల వారు కూడా ఆరుద్ర కొందరి రచనలను అధారంగా చేసుకొని, కొంత తాను స్వయంగా పరిశోధించి ఈ నాటకం రాసారని చెప్పారు.

  రిప్లయితొలగించండి
 6. చదువరి గారు,
  కాటమరాజు మందలో ఆవులసంఖ్య చాలా ఎక్కువ. పదిలక్షలకంటే ఎక్కువ ఉండడం సమంజసం కావచ్చు కూడా.
  యాదవుల ఆవులమంద కుదిరితే ఆరామడ చెదిరితే పన్నెండామడ అని ఒక సామెత ఉంది. కుదురుగా ఉంటే ఆ ఆవులమంద ఆరామడల దూరం ఉంటుందట. దాన్ని బట్టి లెక్కకట్టవచ్చు. అలాగే గోపాలకులే కోటిమంది ఉండేవారని చెపుతారు. శ్రీశైల ప్రాంతంనుండి కాటమరాజుని నెల్లూరికి పంపడానికి త్రిమూర్తులు వేషం వేసి వస్తే, యెద్దుల యెర్రయ్య అనే ఆయన, ఆవులని బుజ్జగించి అతిథులకోసమని ఒక్కొక్క ఆవు నుండి అరచేతిలోకి పట్టగలిగినన్ని పాలను సేకరిస్తే అవి ఆరు కాగులైనాయట. ఒక్కొక్క ఆవు అరచెయ్యిలో పట్టినన్ని పాలిస్తే, ఆరుకాగుల పాలు కావాలంటే ఎన్ని ఆవులుండాలి? ఎన్ని ఎద్దులుండాలి, ఎన్ని కోడెలు ఉండి ఉంటాయి?

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు