16, ఆగస్టు 2009, ఆదివారం

ఎంత ఘోరం! ఎంత అవమానం!!

జాతి సిగ్గుతో తలదించేసుకోవాల్సిన సంగతి మరొకటి దొరికేసింది మనకు. అద్భుతమైన సినిమాలెన్నింటిలోనో నటించి, అమెరికాతో సహా అనేక దేశాల ప్రజలను ఆనంద డోలికల్లో ఓలలాడించిన షారుఖ్ ఖాన్‌ను పేరొందిన నటుడని కూడా చూడక అమెరికా ఇమ్మిగ్రేషనువాళ్ళు రెండు గంటల సేపు ప్రశ్నించారంట. తన పేరును బట్టే తనకీ అవమానం జర్గిందని చెబుతున్నాడతడు. [మై నేమ్ ఈస్ ఖాన్ అనేది ఖాన్ కొత్త సినిమా పేరంట :) ] ఎంత అవమానం! రండి, సిగ్గుతో తలొంచేసుకుందాం.


అంబికాసోనీ అని మనకో మంత్రి ఉందంట. షారుఖ్ ఖానుకు జరిగిన 'అవమానా'న్ని యావజ్జాతికీ జరిగిన అవమానంగా భావించి, రండి దెబ్బకు దెబ్బ తీద్దామని ఈబిడ సందేశమిచ్చింది. అంటే, ఇన్నాళ్ళూ మనం మంచివాళ్ళం కాబట్టి అమెరికావాళ్ళని ఇమ్మిగ్రేషను చెక్ సరిగ్గా చెయ్యడం లేదు, ఇక నుండి సరిగ్గా చెక్ చేస్తామన్నమాట! ఆహా, మనకెంత గొప్ప మంత్రిణుందో కదా! రండి ఇలాంటి 'మహా' మంత్రి ఉన్నందుకు మనందరం సగర్వంగా తలెత్తుకు తిరుగుదాం.

''అమెరికాకు ఎందుకొచ్చావు.. నీ ఫోన్‌ నంబరు ఏమిటి.. ఎక్కడ ఉండబోతున్నావు.. హోటల్‌ నంబరేమిటి..'' అంటూ చిల్లర ప్రశ్నలతో వాళ్ళు షారుక్కును విసిగించారంట. మన అధికారులు ఈ చిల్లర ప్రశ్నలడగరు. బహుశా ఇలాంటి చిల్లర ప్రశ్నలు అడగరాదని అంబికా సోనీ వంటి నేతాగ్రగణ్యులు, నేతా శిరోమణులు మన అధికారులకు చెబుతారు కాబోలు. లేకపోతే మనవాళ్ళూ ఇలాంటి చిల్లర నేరాలు చేసుండేవారు. గర్వపడాల్సిన సంగతే!

షారుక్కుకు కోపం వస్తే నీ హడావుడేంటి అంటారా.. నా సొంతగోడొకటుందిక్కడ. షారుక్కుకు జరిగిందే నాకూ జరిగింది, నాలుగైదేళ్ళ కిందట. డిట్రాయిట్లో దిగ్గానే ఆ ఇమ్మిగ్రేషను కౌంటరులో ఉన్నవాడు 'పద ఆ పక్క గదిలో కూచ్చో' అని అన్నాడు. 'అక్కర్లేదులే, తీరిగ్గా కూచ్చుని కాఫీ బోఫీలు తాగేంత సమయం నాకిప్పుడు లేదు, ఈసారొచ్చినప్పుడు వస్తాలే' అని చెబుదామనుకున్నా. ఇంగ్లీషొచ్చినవాళ్ళకి నా ఇంగ్లీషు అర్థం కాదని గుర్తొచ్చి, 'తప్పదు కాస్త ఆలస్యమైనా కాస్సేపు కూచ్చొని ఆ కాఫీయో మరోటో తాగేసి పోదామ'నుకుని పొయ్యి ఆ గదిలో కూచ్చున్నా. గంటా గంటన్నరైనా, కాఫీ కాదుగదా.. కనీసం పలకరించినవాడైనా లేకపోయె.

నాలాంటోళ్ళు ఇంకో ఇద్దరు ముగ్గురున్నారక్కడ. వాళ్ళలో ఒకడికి వాడి మాతృభాష తప్ప మరోటి రాదు. సిరియాలోనో జోర్డానులోనో మాట్లాడే అరబిక్కు లాంటి భాష వాడిది. వాడితో సతమతమైపోతున్నారు వాళ్ళు. అతగాడు గతంలో ఓసారి అమెరికా వచ్చి, వీసా తీరాక కూడా ఉండిపోతే బలవంతాన పంపించేసారంట. ఇప్పుడు కెనడా పోయి, అక్కడి నుండి మళ్ళీ వచ్చాడు. 'అప్పుడలా ఎందుకు చేసావు? ఇప్పుడెందుకు వస్తున్నావు?' లాంటి ప్రశ్నలు ఇంగ్లీషులోను, అరబిక్కులో చేతులు తిప్పుతూను అడుగుతున్నారు. వాడుకూడా !@$!@$%, %$ &@$%!; %$@ !@$!%! అంటూ అరబిక్కులోను, ఇంగ్లీషులో చేతులు తిప్పుతూను సమాధానం చెబుతున్నాడు. ఆ చేతులభాష ఒకళ్ళదొకళ్ళకి అర్థమౌతున్నట్టు లేదు. ఓ గంటపైగా కష్టపడ్డారు. ఇహ ఆ అమెరికావాళ్ళకి విరక్తి కలిగి, వాడి భాష మాట్టాడగలిగేవాణ్ణి కనుక్కోవడానికి దేశమ్మీదకి కొందర్ని, గూగులు మీదకి కొందర్నీ పంపించి, వాణ్ణి పక్కన కూచోమని, నన్ను రమ్మన్నారు.

నాకిక కాఫీ ఇవ్వరనీ, నన్నూ ఇట్టాగే ఏదిచ్చుకు తింటారనీ అప్పటికే నాకు అర్థమైపోయింది.  కాకపోతే ఆ సిరియా/జోర్డాను వాణ్ణి చూసాక, నాకు ధైర్యమొచ్చేసింది. నాకూ చేతులున్నాయి కాబట్టి ప్రయత్నం చేద్దామనుకున్నాను. ఆపైన నాకూ ఆ అమెరికా నల్లావిడకీ సంభాషణ ఇలా జరిగింది. అవిడడిగిన ప్రతీ ప్రశ్నకీ నాదో విజ్జ్ఞప్తి ఉండేది, పదేపదే రాయడమెందుకని అది నేనిక్కడ రాయడం లేదు. అదేంటంటే 'సారీ నాకర్థం కాలా, ఏదీ మళ్ళీ అడుగు ' అని.

"ఎందుకొస్తున్నావ్, అమెరికాకి?"
"ఫలానా పని మీద"

"ఎన్నాళ్ళుంటావ్"
"ఫలానా ఇన్నాళ్ళు"

"ఈ పనికి అన్ని రోజులెందుకు"
"అక్కర్లేదు, ఇదిగో ఇన్ని రోజులిస్తే చాలు" (నే తెచ్చిన పచ్చళ్ళూ అప్పచ్చులూ మావాళ్ళకిచ్చేందుకు ఈ మాత్రం సమయముంటే చాలు నాకు)

"నిన్నిక్కడికి ఎవరు పిలిచారు? వాడి నంబరివ్వు"
"ఇదిగో"

(ఫోనులో మాట్టాడాక..) "అతగాడు చెప్పిన పనీ నువ్వు చెప్పిన పనీ తేడాగా ఉన్నాయే! నాకు నిన్ను నమ్మబుద్ధి కావడం లేదు"
(నేను పచ్చళ్ళూ అప్పచ్చులూ మావాళ్ళకిచ్చేందుకొస్తున్నానని నిజం చెప్పేసినట్టున్నాడు!! ఇక లాభం లేదు, మరింత బాగా నటించాలి) "అదేంటి, అలా ఎందుకు చెప్పాడు చెప్మా?"

"పోనీ ఇంకెవరైనా కాంటాక్టు పర్సనున్నారా?"
"ఆ, ఉన్నారు, ఇదిగో ఈ నంబరు. (దేవుడా, దేవుడా కనీసం ఈ సారన్నా నిజం చెప్పనీకుండా చూడు)"

(ఫోనులో మాట్టాడాక) "ఏంటో.. ఈసారి ఈయన చెప్పిందీ నువ్వు చెబుతున్నదీ సరిపోయింది. కాస్సేపలా కూచ్చో, నీ సంచులు చెక్ చెయ్యాలి."
(హమ్మయ్య) "అలాగే!"

సంచులంటే మామూలు సంచులనుకునేరు, అమెరికా సూట్‌కేసులవి. ఒక్కోదానిలో రెండు సంసారాలను పెట్టెయ్యొచ్చు. అర్భకుడొకడొచ్చి సూట్‌కేసులను తెరవమన్నాడు. నన్ను తెరవమంటాడేంటి, వాడే తెరుచుకోవచ్చుగా. ఒక తెలుగువాడికి, హిందువుకీ ఎం..థ అవమానం!! కానీ పరిస్థితి గుర్తొచ్చి, తలెత్తి 'జై ఆంజనేయం ప్రసన్నాంజనేయం' అనుకుంటూ ఒకదాన్ని తెరిచాను. అందులో సగభాగం ప్యాంట్లూ, చొక్కాలు, లుంగీలు వగైరాలున్నాయి. మిగతా సగం అప్పచ్చులు!

"ఇదేంట"న్నాడు 
(నాకు మావాళ్ళు ముందే చిలక్కి చెప్పినట్టు చెప్పారు. 'ఇదేంట'ని ఎవడైనా అడిగితే కుక్‌డ్ ఫుడ్ అనమని. చిత్రం, వాడు సరిగ్గా అదే ప్రశ్న అడిగాడు, ఇహజూడండి.. నేనా ఊరుకునేది..?) "కుక్‌డ్ ఫుడ్"

"ఇదేంటీ?"
"కుక్‌డ్ ఫుడ్"

"మరిది?"
"కుక్‌డ్ ఫుడ్"

"ఇదేంటి మరి?"
"కుక్‌డ్ ఫుడ్ "

"ఇదో?"
"కుక్‌డ్ ఫుడ్ "

"ఇదీ?".. "నాకు తెలుసు నువ్వు చెప్పొద్దు, ఇది కూడా కుక్‌డ్ ఫుడ్డే, కదూ?"
"ఔను!"

ఇహ తట్టుకోలేక, రెండో సంచి తెరవమన్నాడు. తీసాను. అందులో కొన్ని ఎర్రటివి, కొన్ని ఎర్ర్..ర్హటివి, కొన్ని పసుపువి, కొన్ని ఆకుపచ్చవి, కొన్ని తెల్లనివి, కొన్ని గులాబీవి - ద్రవాలు కొన్ని, ఘనాలు కొన్ని, పొడులు కొన్ని, జెల్లీలు కొన్నీ ఉన్నాయి. సంస్కృతంలో చెబుతారు చూసారూ.. భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోష్యాలు.. అవన్నీ ఉన్నాయందులో! పాలిథీన్ సంచుల్లో మెరుస్తూ, ఊరిస్తూ ఉన్నాయి.

మళ్ళీ ఆ అర్భకుడు-
"ఏంటివన్నీ !!!!?"
"కుక్‌డ్ ఫుడ్"

వాడికిక ఓపిక నశించి, ఆ నల్లావిడని పిలుచుకొచ్చాడు. ఆవిడొచ్చి, చూసి.. తేరుకున్నాక, అడిగింది.

"నువ్వొచ్చిన పని ఇన్ని రోజులకే నన్నావ్, అన్ని రోజులకు ఇం..థ తిండా?"
(ఒక నవ్వు నవ్వి) "నాకొక్కడికే కాదు, ఇక్కడ మా టీములో జనం ఇంకా ఉన్నారు, పాపం వాళ్ళు తిండిలేక అలమటించిపోతున్నారు. అందుకనీ.."

టీమంటే ఆఫీసుల్లో ఊంటాయే.. ఆ టీమనుకున్నట్టుంది ఆవిడ పాపం. వాడితో ఇంగ్లీషులో ఏదో చెప్పింది. తెలుగులో చేతులూపలేదు కాబట్టి నాకర్థం కాలా. ఎవడో ఇండియా స్పెషలిస్టును పిలిపిస్తున్నారని లీలగా తెలిసింది.

కాస్సేపటికి మరొకడొచ్చాడు. చురుకైనవాడని చూడగానే తెలిసిపోయింది. "ఇండియానుంచొచ్చావా?" అంటూ బయటపెట్టిన సరుకు మొత్తాన్నీ ఒకేసారి చూసాడు. నల్లావిడ కూడా పక్కనే ఉంది.

"ఇవన్నీ కుక్‌డ్ ఫుడ్సేగా" అన్నాడు. ఒకే ఒక్ఖ చూపులో విషయాన్ని పసిగట్టేసరికి అతడి మీద ఎంతో గౌరవం కలిగింది. అతణ్ణి ఆరాధనగా చూస్తూ అవునన్నాను. 'ఎర్ర్..ర్హటిదొకదాన్ని పుచ్చుకుంటారేంటి' అందామనుకున్నాను. ఆనక నాక్కూడా ఒకటివ్వమని ఆ నల్లావిడ కూడా అడుగుద్దేమోనని సందేహించి అనలేదు. 'సర్సరే, ఇక సూట్‌కేసులు సర్దేసుకో' అనేసి, ఆవిడతో 'నో ప్రాబ్లెమ్' అని చెప్పేసాడు. అప్పటిదాకా ఇలాంటి సూట్‌కేసులు ఎన్ని చూసాడో అతగాడు -ఛక్‌మని తేల్చేసి వెళ్ళిపోయాడు. ఆవిడ కూడా ఏదో అంటూ అతడెనకాలే పోయింది.

ఇంతకీ ఈ ఉదంతాన్ని ఏదో ప్రహసనం లాగా చెప్పాను గదాని తేలిగ్గా తీసుకునేరు, నాకు జరిగిన అవమానాన్ని నేనేమీ తేలిగ్గా తీసుకోలేదు సుమండీ! ఒక తెలుగువాడిగా, ఓ హిందువుగా నాకు జరిగిన హ్యుమిలియేషనుకూ (దీన్నలా అనాలని షారుక్కే చెప్పాడిప్పుడు) మనసులో కుమిలిపోతూనే ఉన్నానిన్నాళ్ళూ. ఇప్పుడు షారుక్కును చూసాక, 'ఓహో ఇలాటి అవమానాలు జరిగినపుడు ఊరుకోకూడదు, గొంతెత్తి అరవాలన్నమాట' అని తెలిసొచ్చింది.

నాకూ, షారుక్కుకూ జరిగిన ఈ అనుభవాల దృష్ట్యా అంబికా సోనీకి ఒక సలహా పారేద్దామనుకుంటున్నాను. డిట్రాయిట్ విమానాశ్రయంలో మూడున్నర గంటలు గడిపిన భారతీయుడికి, తెలుగువాడికి, హిందువుకూ సలహా ఇచ్చే హక్కుంది కూడాను. పైగా షారుక్కు లాగా నేను కూడా 'ఫెల్ట్ యాంగ్రీ అండ్ హ్యుమిలియేటెడ్'! -కాకపోతే తెలుగులో!

అంచేత అంబికా సోనీకి నా సలహా ఏంటంటే.. అమెరికావాడితో గొడవ పెట్టుకోకుండా సామరస్యంగా పరిష్కరించండి. కింది పనులపై దృష్టి పెట్టండి:

1. అమెరికాలోని ఇమ్మిగ్రేషను జనాలందర్నీ ఇక్కడికి పంపించి, మన దేశంలో ఓ ఏడాది పాటు శిక్షణ ఇవ్వాలని అమెరికాను కోరండి. సుబ్బరంగా షారుక్కు, ఆమీరు, సల్మాను, అభిషేకు, ఫరూక్‌షేకు, ఐశ్వర్య, మా తెలుగు సినిమా 'బాబు'లు, ప్రభుత్వం లోని బాబులు, వాళ్ళ బాబులూ వగైరాలందర్నీ వాళ్లకి పరిచయం చేద్దాం. 'ఇదిగో ఈసారి వీళ్ళెవరైనా అమెరికా వచ్చినపుడు నమష్కారో, ఆదాబో పెట్టేసి పమ్మించెయ్యాలి తెల్సిందా ' అని చెప్పెహేసి, ట్రైనింగిచ్చేసి పంపిచ్చేద్దాం.

లేదా..

2. అమెరికా నేతలను పిల్చి ట్రైనింగివ్వండి. 'ఒహోరి పిచ్చి సన్నాసుల్లారా, అధికారిని వాడి పని వాణ్ణి చెయ్యనివ్వడమేంట్రా? మీరంతా ఉండి ఏం చేస్తున్నట్టు? ఫలానావాణ్ణి చెక్‌చేసేందుకు వీల్లేదు అని మీరు చెబితే వాళ్ళు చెయ్యగూడదు, లేకపోతే చేసుకోవాలి, అంతే -అలా ఉండాలిగానీ, ఇదేంటిది? ఎవడు బడితే వాడు రూల్సును పాటిస్తూపోతే ఇక మీరున్నదెందుకు?' అంటూ ప్రైవేటు చెప్పేసి, మన పద్ధతులను నేర్పించెయ్యండి. ఈ ట్రైనింగిచ్చేందుకు ప్రపంచంలో మనాళ్ళని మించిన స్పేషలిస్టుల్లేరు.

లేదా..

3. ఆ ఇమ్మిగ్రేషన్ను మనకు ఔట్‌సోర్సు చేసెయ్యమనండి. మనాళ్ళకైతే ఎవణ్ణి చెక్ చెయ్యాలో ఎవణ్ణి చెయ్యకూడదో మీరు ఇప్పటికే బాగా ట్రైనింగిచ్చి ఉన్నారు గదా! ఆ అధికారులకి. కూడా తిక్క కుదురుద్ది. లేకపోతే షారుక్కును, నన్నూ అల్లరి పెడతారా? చిల్లర ప్రశ్నలడుగుతారా?

లేదా..

4. అమెరి'కాకి' మన దేశమ్మీదా మన కాకి అక్కడా వాలకుండా తగువు పెట్టేసుకోండి.. ఈ పంది జరాలూ, కోళ్ళ గున్యాలు, గుర్రాల వాతాలూ రాకుండానైనా ఉంటాయి.

38 కామెంట్‌లు:

 1. ఎంత సినిమా హీరో అయితే మాత్రం రూల్స్ ఫాలో అవ్వాల్సిన పని లేదా? గతంలో ఒక సినిమా నటి లండన్ లోని ఒక నగల షాప్ లో నగ దొంగతనం చేసింది. సినిమా నటి కదా అని వదిలెయ్యడానికి అది ఇండియా కాదు కాబట్టి పోలీసులు ఆమెని లాకప్ లో తొయ్యడడం, ఆమె బెయిల్ కోసం ప్రయత్నించడం కూడా జరిగాయి.

  రిప్లయితొలగించండి
 2. చాలా సీరియస్ విషయాన్ని చాలా సరదాగా చెప్పారు. మిమ్మల్ని బాగానే సతాయించారన్నమాట. వాళ్ళ బాధలు వాళ్ళవి.

  రిప్లయితొలగించండి
 3. చిన్నప్పుడు చదువుకున్నా, సరోజినీనాయుడు పండిత్ జి (నే అనుకుంటా) ని ఏదో సమావేశానికి ఏదో కారణం వల్ల లోపలికి అనుమతించలేదంట. మనం ఆ విషయాన్ని చరిత్రగా చెప్పుకుంటాం. అదే పని అమెరికా వాళ్ళు చేస్తే జాత్యాహంకారం అంటాం. మనం ఇంతే.

  రిప్లయితొలగించండి
 4. 4. అమెరి'కాకి' మన దేశమ్మీదా మన కాకి అక్కడా వాలకుండా తగువు పెట్టేసుకోండి.. ఈ పంది జరాలూ, కోళ్ళ గున్యాలు, గుర్రాల వాతాలూ రాకుండానైనా ఉంటాయి.

  fida ayipoya ee soochana ki. Wonderfully hilarious.

  రిప్లయితొలగించండి
 5. ఇంత సీరియస్ విషయాన్ని హెంత సరదాగా చెప్పారండీ.. మీ పెట్టెలు చూసిన నల్లావిడలో నాకు బుల్లి కృష్ణుడి నోరు చూసిన యశోద గుర్తొచ్చింది :-) :-)

  రిప్లయితొలగించండి
 6. మీరు చెప్పిన సూచనలు బాగున్నాయి. నిజంగా అమెరికావాళ్ళకు ప్రైవేటు చెప్పాల్సిందే. లేకపోతే అందరికీ ఒకే రకమైన రూల్స్ ఫాలో అవుతారా? ఈ వార్తను ప్రచురించిన BBC సైట్లో షారుఖ్ ఫోటోనూ, మన వార్తాసంస్థలిచ్చిన వార్తల్లో వచ్చిన ఫోటోలను కాస్త గమనించండి. షారుఖ్ ఇమేజిని కాపాడే అదనపు బాధ్యత వార్తాసంస్థలు తీసుకుంటే, జరిగినదాన్ని జాతీయ విపత్తుగా ప్రభుత్వం గుర్తించిందన్నమాట. బాగుంది.

  రిప్లయితొలగించండి
 7. చదువరి గడుసరి. బాగా నవ్వించారు. మధ్యలో బోరు కొట్టినా. :-)

  రిప్లయితొలగించండి
 8. ఈ రెండు రోజుల్లోనూ, అమెరికా లో జరిగిన సో కాల్డ్ హ్యుమిలిఏషన్ ని సరైన కోణంలో చెప్పారు. పేపర్లలో చదివి, టి.వీ.ల్లో చూసి చూసి ఎదో విపరీతం జరిగిపోయిందనుకున్నాము.మిరు అన్నట్లుగా అమెరికన్ సెక్యూరిటీ వాళ్ళని మనవాళ్ళ దగ్గరకు ట్రైనింగ్ కి పంపాలి.

  రిప్లయితొలగించండి
 9. బాగా చెప్పారు! మరీ ఎంత రూల్స్ ఐతే మటుకు మన వెండితెర వేల్పుల్ని కూడా ప్రశ్నలడిగేయడమే! ఆ ఇమిగ్రేషన్ వాళ్ళను నెలరోజులపాటు లాలూ కిందో మాయావతి కిందో ట్రైనింగులో పెట్టెయ్యాలి. తిక్క కుదిరిపోతుంది.

  రిప్లయితొలగించండి
 10. పనిలో పనిగా ఇమ్మిగ్రేషను ఆఫీసర్లకి మన జూ ఎంటియార్, చరణ్ తేజ ఇత్యాదుల ఫొతోలన్నీ కూడ ఇచ్చి, రోజూ పొద్దున లేవంఘానే వాటికి దణ్ణం పెట్టుకోవడం ట్రెయినింగివ్వాలి.

  రిప్లయితొలగించండి
 11. Good post. సెక్యూరిటీ వాళ్ళు చేసినదానిలో ఏమీ తప్పు లేదు. అంతగా అవమానం పొందితే షారూఖ్ ఖాన్ వెంటనే ఇండియాకు వచ్చేయచ్చుగా, డ్యాన్స్ షోల్లో డ్యాన్సులేయకుండా? What a pathetic fellow.

  రిప్లయితొలగించండి
 12. బాగా చెప్పారు.ఈనాడులో వార్త చదవగానే నాకూ అనిపించింది "షారుఖ్ సినిమా హీరో అయినంత మాత్రాన చెక్ చేయకూడదా అని".ఇమ్మిగ్రషన్ లో అనుమానం వచ్చినా, రాండం గా కూడా చెక్ లు ఉంటాయి.

  మీకు మా డెట్రాయిట్ లో జరిగిన అవమానానికి నేను దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాను. --)

  రిప్లయితొలగించండి
 13. Woh ! చాల రోజుల తరవాత చాల మంచి పోస్టు వ్రాసారు !

  రిప్లయితొలగించండి
 14. మన ఇండియాలో లాగా అక్కడ చట్టం డబ్బున్న వాళ్ళకు ,అధికార పరపతి ఉన్నవాళ్ళకు చుట్టం కాదు.ఏదో పేపర్ లో నేను చదివాను,అక్కడ బుష్ అధ్యక్షుడు గా ఉన్నప్పుడు ఆయన పిల్లలు ఏదో తప్పు చేస్తే వాళ్ళను కూడా శిక్షించి చట్టం తన పని తాను చేసింది .భారతదేశంలో అది సాధ్యమా? అది మనకు అలవాటు లేదు కాబట్టి చాలా బాధ పడి పోతున్నాం.మనం ఎంతమందిమి చట్టాలను పాటిస్తున్నాము.ట్రాఫిక్ సిగ్నల్సు పాటించడమనే కనీస మర్యాద ఎంతమందిమి పాటిస్తున్నాము?సల్మాన్ ఖాన్ క్రిష్ణజింకల వేట కేసు ఏ మైంది?బీహార్ దాణా కేసు యేమైంది? యూరియా కేసు యేమైంది?చివరికి తిరుమల దైవ దర్శనానికి కూడా పైరవీలు తీసుకొని పోతున్నాము.ఊరి సర్పంచు గా ఎన్నికైన వాడు కూడా చట్టానికి అతీతుడనుకుంటున్నాడు.ముందు మన మైండ్ సెట్ మార్చుకోవాలి.అమెరికా వాళ్ళకు కొంత అహంకారం ఉండ వచ్హు.కానీ ఈ ఊరి జమీందారు పక్క ఊరి జీతగాడు అనే సామెత గుర్తు పెట్టు కోవాలి.

  రిప్లయితొలగించండి
 15. కొత్తపాళి చెప్పినట్లు సినిమా వాళ్ళ ఫోటోలకు దండం పెట్టు కోవడం నేర్పించాలంట,ఆ వాఖ్యను చూస్తే తెలుస్తుంది,మనము ఇంకా ఎంత బానిస మనస్తత్వంలో ఉన్నామో.అలాంటి స్థితిలో ఉన్న మనకు అది అన్యాయం లాగే అనిపించడం ఏం వింత కాదు.

  రిప్లయితొలగించండి
 16. షారుఖ్ సంగతేమో కానీయండి, మన నాయకమ్మన్యులకు పసందైన విందు. ఈ చర్చను పార్లమెంట్ లో చర్చించి, కావలసినంత కాలక్షేపాన్ని పంచవచ్చు.

  మీ మూగబాధలు విన్నాక అమెరికా కు అడుగుపెట్టకూడదనిపిస్తోంది.

  రిప్లయితొలగించండి
 17. ఒక ఊరి రెడ్డి ఇంకో ఊరి పసులపోలిగాడన్నట్లు ఎవరండీ మాకు ఈ ఖాన్ పెర్నాండెజ్,అద్వానీ,కలాంలాంటివారినే వదల్లేదు మేము ఈయనేమన్నా పెద్ద పుడింగా

  రిప్లయితొలగించండి
 18. సినిమా హీరోలకి మాత్రం రూల్స్ అవసరం లేదా? మనం సినిమా హీరోలని అమాయకంగా అభిమానిస్తే అందరూ అలా అభిమానించాలని రూల్ లేదు.

  రిప్లయితొలగించండి
 19. చదువరి గారూ,
  ఐ లవ్డ్ ఇట్. సరైన కోణంలో విష్యాన్ని చూసి, సరదాగా రాసి, మిగతా బ్లాగుల్లోనూ, మీడియాలోనూ పిచ్చి రాతలు రాస్తున్న వారికి ఇప్పటికైనా అర్ధమవుతుందో లేదో. ఆంధ్రజ్యోతి లో ఎడ్డింగ్ "దిగ్భ్రాంతికరం..పిచ్చితనం" అట. ఎవరికో నాకర్ధం కాలా.
  సల్మాన్ ఖాన్ ఒక్కడు మాత్రం భలే నచ్చాడు నాకు ఈ విషయంలో.

  రిప్లయితొలగించండి
 20. మరచా..కొత్తపాళీ గారి వ్యాఖ్య అదిరింది.

  రిప్లయితొలగించండి
 21. హమ్మయ్య... డీటో నా ఆలోచనల్ని వ్రాసారు.
  మనకి "బాద్షా" గానీ వారికో శతకోటి లింగాలలో మరో బోడిలింగం.

  ఏదో వేధించేసినట్లు,ముస్లిమ్ కాబట్టే ఇలా జరిగినట్టు వక్రీకరించి దాన్నో పేద్ద అంతర్జాతీయ సమస్యగా మార్చేస్తున్నారు.

  ఓ రెండు మూడేళ్ళ క్రితం నాకూ ఇలాంటి అనుభవం ఎదురయింది. మీ అంత శల్య పరీక్ష కాకపోయినా :-)
  మరి నా గురించి ఎందుకంత రాధ్ధాంతం చెయ్యలేదో ఈ ప్రభుత్వం.

  రిప్లయితొలగించండి
 22. Good post. సెక్యూరిటీ వాళ్ళు చేసినదానిలో తప్పు లేదు.

  రిప్లయితొలగించండి
 23. రోహింటన్ మిస్త్రీ అని మంచి రచయిత. పార్సీ మనిషి, ముంబాయిలో పుట్టిపెరిగినా కెనడా పౌరసత్వం తీసుకున్నాడు. మనిషి చుడ్డానికి నల్లటి బవిరి గడ్డం గట్రాతో ఉంటాడు. ఆంగ్ల కథా నవలా రచయితగా ప్రపంచమంతటా బాగానే పేరు సంపాదించాడు. 9/11 జరిగిన మరుసటి యేడు ఆయన కొత్త నవల విడుదలైన సందర్భంగా ప్రచురణ సంస్థ వాళ్ళు అనేక అమెరికను నగరాలకి ఆయన పర్యటన ఏర్పాటు చేశారు, నవలకి ప్రచారంలో భాగంగా. అప్పట్లో కొత్తగా సవరించిన అమెరికను రక్షణ ప్రయత్నాల్లో person and baggage check of randomly selected passengers at the gate కూడా ఒకటి. రోహింటన్ నాలుగు ప్రయాణాలు చేసేప్పటికి, నాలుగు ప్రయాణాల్లోనూ తాను ఈ రేండం ఎంపికకి గురికావడంతో, ఐదో సారి కూడా అలా జరిగినప్పుడు, ఆ విమానం ఎక్కకుండా, బయటికి వచ్చేసి - తన ఏజెంటుకి కాల్చేసి, ఇది తన ఆత్మగౌరవానికి భంగకరమనీ, మిగతా మూదు నెలల ఇరవై నగరాల టూరు కేన్సిల్ చెయ్యమని చెప్పి - అప్పటికప్పుడు కారు అద్దెకి తీసుకుని రోడ్డుద్వారా కెనడా తిరిగి వెళ్ళిపోయారు.

  రిప్లయితొలగించండి
 24. అమెరికాలో సెక్యూరిటీ అలా అమలు చెయ్యబట్టే 9/11 తరువాత టెర్రరిస్టు దాడులు జరగలేదు. ఎవ్వడైనా సరే సెక్యూరిటీ అంటే సెక్యూరిటీయే. ప్రతిదానికే ఊరికే ఇలా ఇదయిపోవటం మళ్ళీ ఏమన్న జరిగితే సెక్యూరిటే లోపాలు అని ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవటం మీడియాకు అలవాటయ్యిపోయింది. సెక్యురిటీకి అందరూ తలవచి సహకరించాలిగాని దాన్నో పెద్ద ఇస్యూ చేసి సెక్యూరిటే సంస్థల మనోధైర్యాన్ని కుంగతీస్తే టెర్రరిస్టులు అటువంటి అవకాశాన్ని చక్కగా వాడుకోగలరు.

  రిప్లయితొలగించండి
 25. దావూద్ ఇబ్రహీం ముఠా సంజయ్ దత్ ఇంటిలో AK47, హ్యాండ్ గ్రెనేడ్ లు ఎందుకు దాచింది? సినిమా హీరోని ఎవడూ ఏమీ చెయలేడు అనుకునే కదా. షారూఖ్ ఖాన్ ని కూడా ఎవడూ ఏమీ చెయ్యలేని పరిస్థితి ఉంటే షారూఖ్ ఖాన్ సహాయంతో కూడా ఆయుధాలు, డ్రగ్స్ లాంటివి రవాణా చెయ్యొచ్చు.

  రిప్లయితొలగించండి
 26. కుక్డ్ ఫుడ్ అనగానే అంత ఈజీగా ఎలా వదిలేసారండి..నేనే అతని ప్లేస్ లో ఉంటే ఒక్కో బాటిల్ ఓపెన్ చేయించి మీ చేత తినిపించి పరీశీలించి పరిశోదించి గాని వదిలేదాన్ని కాదు :P
  మొన్న దుబాయ్ వెళ్ళినపుడు మావారిని ఇలాగే ఒక్క సారి కాదు రెండుసార్లు పక్కకు పిలిచి మరీ ప్రశ్నలతో వేదించి వదిలారంట ..
  మరి మేము హిందువులం కదా ఇప్పుడు సిగ్గుతో మా ఆయన తలదించుకోవాలా వద్దా ..కాస్త క్లారిఫయ్ ఇవ్వగలరు ఎవరన్నా :)

  రిప్లయితొలగించండి
 27. అమెరికన్ ర్యాండమ్ చెకింగ్ లో "ర్యాండమ్" ఎంతో తెలిసీ ఇలా మాట్లాడితే చెయ్యగలిగేదేమీ లేదు.

  రిప్లయితొలగించండి
 28. గూడ్.. ప్రవీణ్ ఒక మంచి పయింట్ చెప్పాడు. మన హీరొ లు కి అక్రమం గా ఎ కె 47 లు వుంచుకొవడం , దొంగతనం గా జింకలను వెటాడటం, ఇంట్లొ నిర్మాతలను కాల్చి పారెయడం లాంటి చరిత్ర వుంది .

  అయినా అమెరికా వాళ్ళొ బ్రిటన్ వాళ్ళొ ఎంతసేపు వుంచారనెది (ప్రశ్నించారనేది) మన సమాదానం మీద కూడా అదారపడి వుంది. వళ్ళు దగ్గరపెట్టి , వాళ్ళు అడిగినదానికి సూటిగా సమాదానం చెబితె వెంటనె అయిపొతుంది. ఆ హార్వర్డ్ ప్రొఫెస్సర్ లా "ఈ విల్ టాల్క్ యుర్ మామా" అంటె ఎవరికయినా కాల్తుంది మరి. మనకి ఇక్కడ షారుక్ ఎమి మాట్లాడెదొ ఎవరికి తెలీదు. 90 మినిట్స్ వుంచారనెదె తెలుసు.

  అంతగా షారుక్ కొ ఇంకొ మమ్ముట్టి కొ ఇలాంటి చెకింగ్ లు నచ్చక పొతె మళ్ళి అమెరికా వెళ్ళడం మానెయమనండి.. అమెరికా ప్రొడక్ట్స్ వాడటం మానెయమండి. అప్పుడు చూద్దం మన షారూక్ ఎంత హర్ట్ అయ్యాడో ..

  రిప్లయితొలగించండి
 29. Good One.

  Sai Brahmanandam Gorti's comment in the below post.

  http://kovela.blogspot.com/2009/08/blog-post_16.html?showComment=1250521964629#c4079992380855110603

  రిప్లయితొలగించండి
 30. వాళ్ళకి పబ్లిసిటీ కావాలి. అది నెగటివ్ గా వచ్చినా సరే.. ఇలా గోల గోల పెట్టి సానుభూతి సంపాదించేస్తే అది రేపు రిలీజ్ అయ్యే సినిమాకి బాగా పనికొస్తుంది. వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయండీ.. అడుగు తీసి అడుగేస్తే "మాకేంటీ" అని లెక్కెట్టుకునేవాళ్ళు.. ఇంతటి పబ్లిసిటీ ని వూరికే వదులుకుంటారా...

  రిప్లయితొలగించండి
 31. డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యి వాటి కోసం మాఫియా ముఠాతో సంబంధం పెట్టుకుని ఆ ముఠాకి చెందిన AK47, హ్యాండ్ గ్రెనేడ్ లు ఇంటిలో దాచిన సంజయ్ దత్ గురించి తెలిసి కూడా సినిమా హీరోలని చెక్ చెయ్యకూడదనడం అమాయకత్వం కాదా?

  రిప్లయితొలగించండి
 32. చదువరి గారూ,
  మీ కథా, దానికొచ్చిన వ్యాఖ్యలు చదవి నాకూ ఒక పిట్ట కథ చెప్పాలనిపించింది. చిత్తగించండి.
  ఒకావిడ చుట్టాలింటికొచ్చిందిట. ఆ గృహస్తు ఆవిణ్ణి ఒక లెంపకాయ కొట్టాట్ట. ఆవిడ మీ లాంటి పెద్ద మనిషి దగ్గరకి వచ్చి మొరపెట్టుకుందిట. ఆయనన్నట్టా, ‘ఒక చిన్న దెబ్బకే యింత రాద్ధంత చేస్తే ఎలాగమ్మా, అతను ఇంటికొచ్చిన వాళ్ళనీ, వాళ్ళవిణ్ణి రోజు చితగ్గొడుతూనే వుంటాడు’ అని. అంబికా సోని అత్యుత్సాహం వదిలేయండి, ఈ విషయంలో అవమానం జరిగిందని భావించినవాడే మనకి అబద్ధం చెప్పినవాడిన వాడిల కనిపించడం విచారకరం.

  రిప్లయితొలగించండి
 33. రమణ గారు...
  మీ కథ ఈ సందర్బానికి సూట్ అవ్వలేదని నా అభిప్రాయం.
  ఇంకొ విషయం .. ఇందులొ 'అవమానం' ఎమీ లేదు. 'ఓవర్ ఎక్షన్ ' తప్ప. నాకున్నది ఒకటె ప్రశ్న ..

  నిజం గా అవమానం అనుకుంటె వెంటనే ఎందుకు వచ్చేయలెదు. వెళ్ళింది ఎమి దేశకార్యం మీద కాదు, పీకల మీదకి వచ్చి కాదు.
  మళ్ళీ అమెరికా వెళ్ళకుండా వుంటాడా ?

  Fundamental question is - why is Sharuk exceptional ? Why should they leave him without performing their duty ?

  రిప్లయితొలగించండి
 34. రమణ గారూ,
  మీ పిట్టకథ ఇదిగో ఇలా చెబితే ఇంకా నవ్వొచ్చేది..
  ఆయనన్నాట్టా.. "ఇది మరీ బావుంది, ఒక చిన్న దెబ్బకే యింత రాద్ధాంతం చేస్తే ఎలాగమ్మా, మా ఆవిడ నన్ను రోజూ చితక బాదేస్తూనే ఉంటది, నేనెవరికన్నా చెప్పానా? నోరు మూసుకుని పడుంటల్లా!?"
  ఎటొచ్చీ మీరు చెప్పినది, నేను చెప్పినది రెండూ కూడా సందర్భానికి ఆమడ దూరంలో ఉన్నాయి.వదిలెయ్యండి.

  అవమానం జరిగిందని అతడు భావించాడంటున్నారు..
  1. భావించడం వేరు, జరగడం వేరు. అతగాడు భావిస్తే యావద్దేశమూ భావించాలా?
  2. ఎంతోమందికి జరిగే సాధారణ చెకింగు వ్యవహారమది. అతడికొక్కడికే అవమానమెందుకనిపించింది?
  3. నేను ముస్లిమును కాబట్టి నాకీ అవమానం జరిగిందంటున్నాడు. నువ్వు ముస్లిమువు కాబట్టి చెక్ చేస్తున్నామని ఎవరు చెప్పారు? దేశంలోకి వచ్చే ప్రతీ ఒక్ఖ ముస్లిము కేసునూ ఎస్కలేటు చెస్తున్నారా?
  4. మరి నేను ముస్లిమును కాదే! నాకెందుకు జరిగింది?
  5. ఇప్పటికెన్నోసార్లు వెళ్ళాడంట. ఎప్పుడూ ఇలాగే చెకింగులవుతున్నాయా? అవుతోంటే.. ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు గోల చేస్తున్నాడు?
  6. అవ్వకపోతే, ఇప్పుడు మాత్రమే జరిగి ఉంటే.. మరి అంతకుముందు అతగాడి పేరు ఖాను కాదా? అప్పుడతడు ముస్లిము కాదా? ఇన్నాళ్ళుగా జరగనిది, ఇప్పుడు మాత్రమే జరిగితే దానర్థం ఇది ర్యాండమ్‌గా జరిగే చెకింగేకానీ మరోటి కాదనే కదా! ఇప్పుడు ఇతగాడు మావిడ నన్ను కొట్టిందని ఊరంతా తిరిగి గోలచెయ్యడం సానుభూతి కోసం కాదా?

  ఆలోచించగలరు!
  ---------------------
  ఈ కిందిది రమణ గారి వ్యాఖ్యకు స్పందన కాదు..

  నేనసలు ఈ మొత్తం వ్యవహారంలో "నేను ముస్లిముము కాబట్టి.." అనే సంగతికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అసలా షారుక్కు అన్నదానికంటే మంత్రి అన్నదీ, పత్రికల్లో చదివినదే నా స్పందనకు ఎక్కువ ప్రేరణ.

  నేననుకోవడం.. ఏదో ఒకటి వాగి అప్పనంగా ప్రచారం పొందటం అతగాడి ప్రయత్నం. మొన్నొకడెవడో నేను ముస్లిమును కాబట్టే నాకు ఇల్లు అమ్మడం లేదు అంటూ రచ్చకెక్కాడు బొంబాయిలో. ఇట్టాంటి ఏడ్చే పిలగాళ్ళను సముదాయించడమే మనపని ఎలాగూ అయిపోయింది. అది మన ఖర్మ. ఇప్పుడు ఇతర దేశాల వాళ్ళకూ పట్టింది ఈ ఖర్మ.

  రిప్లయితొలగించండి
 35. వ్యాఖ్యానించినవారందరికీ నెనరులు

  Sreevathsava: మంచి సంగతిని గుర్తు చేసారు

  మురళి: "బుల్లి కృష్ణుడి నోరు చూసిన యశోద" : సూపరు సార్!

  చంద్ర మోహన్: :)

  కొత్త పాళీ:
  ఫోటోలు: -హహ్హహ్హా
  ఆల్బర్ట్ పింటో కో గుస్సా క్యో ఆతా హై లాగా, వై అండ్ వెన్ డు ఇండియన్స్ ఫీల్ యాంగ్రీ అండ్ హ్యుమిలియేటెడ్ అని ఒక పుస్తకం డీటేలుగా రాసిపడేసి, అమెరికా బడుల్లో నాండిటేలుగా పెట్టించెయ్యాలి. రోహింటన్ మిస్త్రీ సంగతి చెప్పినందుకు నెనరులు.

  శ్రీ: దిగ్భ్రాంతి: :) శ్రీగారూ, నా మనోభావాలను సానుభూతితో అర్థం చేసుకున్నందుకు నెనరులండి.

  రమణారెడ్డి: మీరు చెప్పింది నిజమే! కానీ ఇక్కడి స్పందనల్లోని భావాన్ని అర్థం చేసుకోవడంలో మీరు కాస్త పొరబడ్డారేమోనని అనిపిస్తోంది. లేక మీ భావాన్ని అర్థం చేసుకోవడంలో నేనూ పొరబడ్డానా !?

  రవి: :)

  చిలమకూరు విజయమోహన్: :) :)

  ప్రవీణ్ గార్లపాటి: ఓహో మీకూ నాలాగే మనోభావాలు దెబ్బతిన్నాయన్నమాట!

  SIVA: మీరన్నది నిజం

  నేస్తం: ఏట్‌నేనేదో అల్లాటప్పా నటుణ్ణనుకున్నారేటి? :)

  కత్తి మహేష్ కుమార్: ఔను, కొన్ని సమయాల్లో చెయ్యగలిగేదేమీ ఉండదు. మీ మాటలో అంత ఉషారు లేదెంచేతో! ;)

  శ్రీలలిత, మంచు పల్లకీ: బాగా చెప్పారు

  రిప్లయితొలగించండి
 36. Naaku kooda nachindi mee blog loni vishayam. Monna mana maagi raashtrapathi abdul kalam gariki jariginappudu kooda intha gola cheyyaleedu. Aayana kooda ento hundaga teesukunnaru aa vishayaanni. Aina, avamaanam jarigindi ani feel avutoo kooda malli, angelina joli india vaste nenu check chesthanu ani anatam enduku?
  assalu nizam gaa feel ayyada, leka meeda evvaro annattu publicity stunt eena?

  రిప్లయితొలగించండి
 37. చాలా బాగు౦ది.మన వాళ్ళు ఎప్పుడు నేర్చుకు౦టారో ,కలా౦ గార్కి జరినప్పుడు సదరు ఈ మ౦త్రి గారు ఎ౦ చేశారో???మీ కుడ్ ఫుడ్
  బాగు౦ది.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు