25, ఏప్రిల్ 2008, శుక్రవారం

ఆయనకు తెలుగు చేసింది, ఆమెకు తెగులు సోకింది

ఇవ్వాళ ఈనాడులో రెండు వార్తలు.. పక్కపక్కనే. రెండు వార్తలూ తెలుగు గురించే కావడంతో, ఒకే పేజీలో పెట్టి వాటిలోని వైరుధ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపింది.

మొదటిది:
తెలుగుకు ప్రాచీన హోదా విషయమై లోక్‌సభలో చర్చకు వచ్చినపుడు, ఆ ప్రశ్న లేవనెత్తిన బొత్స ఝాన్సీ సభలోనే లేదు -ఫోనొచ్చిందట! అది కావాలని చేసిన ఏర్పాటని ఈనాడంటోంది; అదేదో రాజకీయమట. తమ పార్టీవాళ్ళే ఆమెను ఆ సమయానికి సభలో ఉండొద్దని చెప్పి బయటికి పంపారంట. ఏదన్నా గానీండి.. తెలుగు నాయకులకు తెలుగు భాష పట్ల ఉన్న శ్రద్ధకు ఇదో ప్రతీక. దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి వార్త ఇది.

ఇదంతా మనకు మామూలే. ఈ రకం రాజకీయ నాయకులు మన చుట్టూ ఉన్నారు. నడుస్తూ నడుస్తూ ఉంటే మన కాళ్ళకూ చేతులకూ తగులుతూ, అడ్డం పడేంత మంది ఉన్నారు. కానీ.., మనకు మామూలు కాని వార్తొకటుంది, చూడండి:

తమిళనాడు శాసనసభలో తెలుగు గురించి మాట్టాడుతూ గోపీనాథ్ అనే సభ్యుడు కన్నీళ్ళ పర్యంతమై పోయాడు. ఆ రాష్ట్రంలో తమిళ మాధ్యమంలోనే
చదువు చెప్పాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందట. దాని కారణంగా తన నియోజకవర్గంలో లక్ష మందికిపైగా తెలుగు మాట్లాడే పిల్లలు ఇబ్బంది పడతారని ఆయన తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఆయన మాట్టాడుతూండగా మధ్యలో ఆపి, స్పీకరు ఇక చాలు కూచ్చోమన్నాడట. దానికి ఆయన కన్నీళ్ళ పర్యంతమైపోయాడు. స్పీకరు మళ్ళీ మాట్టాడే అవకాశం ఇచ్చాడట గానీ, దుఃఖంతో సరిగ్గా మాట్టాడలేకపోయాడట. మనకంతగా పరిచయంలేని నాయకత్వమిది. ఊహించని వ్యక్తిత్వం.

గోపీనాథ్‌తో బొత్స ఝాన్సీని పోల్చి చూడాలి మనం. మామూలుగా ఝాన్సీ అడిగిన ప్రశ్నపై సభలో చర్చ జరిగే అవకాశం లేదట. ఇతర ప్రశ్నలను అడిగినవారు ధర్నాలతో బిజీగా ఉండటంతో ఆమెకు మాట్టాడే అవకాశం వచ్చిందట; దాన్నామె కాలదన్నుకుంది. "ఏదీ ఈమె ఇప్పటిదాకా ఇక్కడే ఉందే.." అని స్పీకరు కూడా వెతుక్కున్నాడట. ఇదీ ఆమె నిర్వాకం. మరి గోపీనాథ్ ఏంచేసాడు..? స్పీకరు ఆపమన్నా మాట్టాడబోయాడు. తన వాదన అంత సమంజసం కాకున్నా..
(ఏమాటకామాటే చెప్పుకోవాలి: తమిళనాడు ప్రభుత్వం చేసిన పని ఒప్పే. అక్కడుంటే తమిళంలో చదివి తీరాల్సిందే అని అనడంలో తప్పేఁవుంది.) తన భాష మాట్టాడేవారి కోసం తన పదవినీ తద్వారా తనకొచ్చిన అవకాశాన్నీ గోపీనాథ్ సద్వినియోగం చేసాడు.

శభాష్ గోపీనాథ్!

9 కామెంట్‌లు:

 1. మీరు చెప్పింది సబబే. తెలుగు భాషకి ప్రాచీన హోదా కావాలంటే మనకి కావల్సింది గోపీనాధ్ లాంటి వాళ్ళే గానీ ఝాన్సీ లాంటి వాళ్ళు కాదు. ఆ పేరు పెట్టుకుని ఝాన్సీలక్ష్మీబాయ్ పరువు తీసింది.
  చిన్న సవరణ: తమిళనాడు ప్రభుత్వం తమిళ భాషలో "బోధన" జరగాలని ఆదేశించింది. కొన్నేళ్ళ క్రితమే తమిళ సబ్జెక్ట్ చదవడం తప్పనిసరి చేసారు, అందులో తప్పు లేదు. కానీ తమిళ భాష లోనే బోధన కూడా జరగాలంటే అప్పటి వరకూ ఉపాధ్యాయుడు తెలుగు లో చెపితే వినడానికి అలవాటుపడ్డ పిల్లలు తమిళంలో చెపితే అర్థంచేసుకోగలరా?

  రిప్లయితొలగించండి
 2. హొసూర్ ప్రాంతంలోని తెలుగు వారి భాషాభిమనంలో ఒక వంతు శాతం మన నాయకులలో ఉన్నా ఈ పాటికి మనం మన భాషకి పట్టిన దుస్థితినుంచి తప్పించుకునేవారం.

  ఈ రోజుకి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోపల నున్న వారికే తెలుగు పాఠ్య పుస్తకాలు అందజేయలేకపోతున్న ఈ
  వ్యవస్థని ఆ అధికారులని చెప్పు తీసుకుని నడి బజారులో నిలబెట్టి కొట్టినా తప్పులేదు.

  హొసురులోని విద్యార్ధులు తెలుగు పాఠ్య పుస్తకాలకోసం ఎంత కష్టపడుతున్నారో ఈ వెధవలకు తెలుసా?

  తమిళ రాష్ట్రంలో తమిళం నేర్చుకోవాలని ఆ ప్రభుత్వం ఆదేశించడం‌లో తప్పులేదు. కాని తెలుగు భాషకి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇవ్వకపోవడం తప్పే!

  రిప్లయితొలగించండి
 3. నెటిజన్ గారు.... వ్యవస్తని చెప్పుతోకొడదాం అంటారు ఏంటండి..వ్యవస్త అంటే మనమే కదా....మరీ అన్యాయం....(హహహ్ హహహ్)
  మన రాష్ట్ర ప్రభుత్వంవాళ్ళే భాష గురించి చర్చించుకోవాటానికి సమయంలేదు పొనులో బిజీ ఆయే... మరి తమిళులు... అన్నదొరైపుణ్యమా అంటూ ...హిందీనే... (రాష్ట్ర్ర్రబాషకదా అని నా గౌరవం) పక్కనబెట్టారు...తెలుగుని నెగ్లెక్ట్ చెయ్యరా ఏంటండి...

  రిప్లయితొలగించండి
 4. chaks: మీరు చెప్పింది ఇబ్బందేగానీ, దానికోసం మిగతా రాష్ట్రం మొత్తం తమ భాషలో చదువుకునే అవకాశాన్ని ఎందుకు కాదనాలి?
  netizen: హోసూరు ప్రాంత ప్రజల తెలుగు భాషాభిమానుల్లో స.వెం.రమేశ్ ఒకరనుకుంటా! ఆయన చురుకైన కార్యకర్త కూడానట.
  chandramauli: ఝాన్సీయే కాదండీ.. మనవాళ్ళంతా అంతే! మన భాషను, మనవాళ్ళను మనం చూసినంత చులకనగా మరొకళ్ళు చూడరు.

  రిప్లయితొలగించండి
 5. గోపీనాధ్ గారికి నా అభినందన పూర్వక నమస్సులు. ఇక తెలుగు రాజకీయవాదులు తెలుగు భాషకు చెశే ఇంకో సేవ కూడా ఉండి, మొన్నటి సారి తప్పిపోయినా, అధిష్టానం కోటా కింద రాజ్యసభ లో తెలుగు ప్రజలకి ప్రాతినిధ్యం వహించటనికి రాష్ట్రేతరులని తెచ్చిపెట్టుకుంటారు. ఓ నాలుగేళ్లక్రితం ఒకాయన నామినేషన్ వేస్తూ ఇది మా మామగారి ఊరు, ఇక్కడినుంచి ఎన్నికవ్వటనికి నాకు సర్వ హక్కులు ఉన్నాయ్ అన్నాడు ( రాజివ్ హై. లో విమానాలు నడపటం నేర్చుకున్నారు కాబట్టి, అంతర్జాతియ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టటం సబబే అనంట్టు.) సరే అయనా ఆ నామినేషన్ వేస్తూ చూస్తూ ఉండండి రెండేళ్లలో తెలుగు నేర్చు కుంటాను అన్నాదు. మొన్నీమధ్య గుంటూరు మిర్చి యార్ద్ కొచ్చి ఏ భాషలో మాట్లాడాదో మీకు చెప్పనవసరం లేదనుకుంటా.

  రిప్లయితొలగించండి
 6. ఏ ఉద్దేశ్యంతో అన్నాడోగానీ, 'మనవాళ్లుత్త వెధవాయలోయ్' అని గిరీశం మహాశయుడన్నది మనవాళ్ల భాషాభిమానం విషయంలో మాత్రం పచ్చి నిజం. అరవ వాళ్లని చూసి మా భాషకి కూడా ప్రాచీన హోదా ఇవ్వమని కేంద్రాన్ని దేబిరించే బదులు రాష్ట్రం లోని అన్ని బళ్లలోనూ (అంటే .. ప్రభుత్వ, ప్రైవేటు, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ .. అన్ని రకాల బడులు) పదో తరగతి దాకా తెలుగు బోధన తప్పని సరి చెయ్యటానికి రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డేంటి? అసలు, ఎవరో ప్రాచీన హోదా ఇస్తే మన భాషకొరిగేదేంటి? అయితే గియితే, ఆ పేరుతో కొన్ని కోట్ల రూపాయల నిధులు వస్తాయి - అవీ ఏ రాజకీయుడి బంధుగణానికో సంతర్పణమే. కేంద్రాన్ని అడుక్కునే పని లేకుండా తెలుగుని నిజంగా ఉద్ధరించే మార్గాలు సవాలక్ష ఉండగా అవన్నీ పక్కనబెట్టి ప్రాచీన హోదా గురించి ఈ రచ్చ ఎందుకు?

  ప్రభుత్వం సంగతి పక్కనబెడితే, ప్రైవేటు మీడియాలో తెలుగు ఎంత శుద్ధంగా అమలవుతుంది? ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఒకట్రెండు తప్ప మిగతా దినపత్రికల్లోగానీ, వార పత్రికల్లోగానీ రాసే తెలుగులో తెలుగెంత? టి.వి. ఛానళ్లు మరీ ఘోరం. యాంకరమ్మలు వంకర మాటలతో ఇటు తెలుగుని, అటు ఇంగ్లీషుని రెంటినీ ఖూనీ చేస్తున్నా ఆయా కార్యక్రమాల దర్శక నిర్మాతలు కిమ్మనరెందుకో! సినిమాల విషయం ఇక చెప్పక్కరలేదు. మొన్నటి దాకా హిందీ నాసికా గాయకాగ్రేసరుల ధాటికి ముక్కలు చెక్కలయిన పాటలనే విని తరించే వాళ్లం. ఇప్పుడు కొత్తగా డబ్బింగ్ రంగంలోకి కూడా పంజాబీ భామలు ప్రవేశించి చంపేస్తున్నారు! మరో వంక తమిళ దర్శకుల సమూహం 'పెద్ద పుడింగువా', 'పోడా మచ్చీ' లాంటి పదాలను విరివిగా తెలుగులోకి చొప్పించేసి మన భాషని మరింత సుసంపన్నం చేసేస్తుంది.

  ఇవన్నీ చూస్తే ఈ మధ్య నాకనిపిస్తుంది; భాషా పరిణామక్రమంలో ఇదో భాగం, మనమింత గింజుకోవటం అనవసరమేమో.

  రిప్లయితొలగించండి
 7. అబ్రకదబ్ర గారు,తెలుగు భాష విషయంలో ఏ పనీ కాంగ్రెస్ వాళ్ళవల్ల తెమిలేది కాదనీ మీకూ,నాకూ,అందరికీ తెలుసు.తెలుగు జాతి ఔన్నత్యం మీద,ఆత్మగౌరవం మీద వెలసిన తెలుగు దేశం వారే ఇందుకు సమర్ధులు.తెలుగుకు ప్రాచీన భాషా హోదా విషయములో జరుగుతున్న జాప్యానికీ,జాతరకూ యన్టీయార్ బ్రతికి ఉంటే ఎలాంటి స్పందన వచ్చేదో మనం ఊహించగలం.కానీ ఇప్పటికైనా మించి పోయింది ఏమీ లేదు,తెలుగు కు ప్రాచీన భాషా హోదా కల్పించనందుకు నిరసనగా కనీసం ఉత్తుత్తిగా రాజీనామాలు స్పీకరు మొఖాన కొట్టి రమ్మనండి,తెల్లారే పాటికి ఆ ఉత్తర్వులు చచ్చినట్లు వస్తాయి.పార్టీ పేరులోనే తెలుగు ఉన్నందుకు వారి కనీస కర్తవ్యం అది,మనందరి మద్దతు ఎటూ ఉంటుందికదా.అలాగే ఈ విషయములో ఇ-మెయిల్ క్యాంపెయిన్ ఎవరన్నా ప్రారంభించవచ్చు కదా?!

  రిప్లయితొలగించండి
 8. రాజేంద్రకుమార్ గారూ, మీరు నే రాసినదాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నట్లున్నారు. సమస్యని ఏ పార్టీ తీరుస్తుందనేది నేనడగటం లేదు. 'తెలుగుకు ప్రాచీన హోదా గురించి అంత గింజుకోవటం ఎందుకు' అన్నది నా ప్రశ్న. రాష్ట్రంలో తెలుగు మిణుకు మిణుకుమంటుంటే దాన్ని సరిదిద్దకుండా, పరాయి వాళ్లు మన వెలుగులని గుర్తించటంలేదని ఏడవటమేంటని నా ఉద్దేశ్యం.

  రిప్లయితొలగించండి
 9. అబ్రకదబ్ర: ప్రాచీన హోదా విషయంలో నాదీ మీ అభిప్రాయమే! వీళ్ళు ఇంట్లో చెయ్యాల్సిన పనులు చెయ్యకుండా, ప్రాచీన హోదా కోసం ఢిల్లీలో పోరాటం ఎలగబెడతారంట! అంతా మాయ జెయ్యడమే!

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు