13, జూన్ 2006, మంగళవారం

అవకాశవాదం - తిట్లకు మహదవకాశం

వ్యవసాయంలో నాట్లు, కోతల రోజుల లాగా తెలుగునాట రాజకీయాల్లో తిట్లూ, కూతల కాలమిది. ఇప్పుడే మొదలైంది. ఓ నెల పాటు ఉచ్ఛస్థాయిలో ఆత్మ స్తుతి, పరనిందలను చూడవచ్చు. ఎన్నికల నాటకంలో అవకాశవాద అంకమిది. నేటి మేటి డైలాగులు కొన్ని.. నీలాలు నా సణుగుడు

సీపీఎం ది వ్యభిచారం - దత్తాత్రేయ ఉవాచ, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నందుకు
వీరు మొన్నటిదాకా కలిసి తిరిగింది ఆ దేశంతోటే, (అప్పుడు తెలంగాణా ఊసే ఎత్తని వాళ్ళు ఇప్పుడు బాసలు చేస్తున్నారు) మరి దాన్నేమనాలో? వీరు చేస్తే సంసారము, వారు చేస్తే వ్యభిచారమూనా?

చంద్రబాబు పుట్టుకతోనే అవకాశవాది, సీపీఎం ఇప్పుడు అవకాశవాది అయింది. -రాజశేఖరరెడ్డి
ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి రెండో ఎస్సార్సీ అవసరమే లేదు అనే తెరాసతో రెండో ఎస్సార్సీ కావాల్సిందే అనే కాంగ్రెసు పొత్తు పెట్టుకుంది. దాన్నేమంటారు? గురివిందకు తన నలుపు తెలీదు! జూన్ 13 పొద్దున తేజ వార్తా ఛానెల్లో పాత్రికేయుడు నెల్లుట్ల వేణుగోపాల్ మాట్లాడుతూ.. "1965 ప్రాంతాల్లో అవకాశవాద రాజకీయాలు మొదలెట్టిందే కాంగ్రెసు" అని చెబుతూ అవకాశవాదం ఆ పార్టీ ప్రవృత్తి అనే ధోరణిలో చెప్పుకొచ్చారు.

మాకసలెప్పుడూ ఎవరితోటీ పొత్తు లేదు. ఇది కేవలం సహకారం. గత శాసనసభ ఎన్నికలలో కూడా కాంగ్రెసుతో మాకు పొత్తు లేదు! -బీవీ రాఘవులు
వామపక్ష సిద్ధాంతమనే కత్తికి రండు వైపులా పదునే! (దానితో భౌతిక విషయాలు దేన్నైనా నిర్వచించవచ్చట.) ఈ సిద్ధాంతం అవకాశవాదాన్నెలా నిర్వచిస్తుందో రాఘవులు గారు మనకు తెలియజేస్తున్నారు.!

కాంగ్రెసు భాజపాలకు వ్యతిరేకంగా వామపక్షాలతో కలిసి ఉద్యమాలు నిర్వహిస్తాం - చంద్రబాబు.
కాంగ్రెసును వ్యతిరేకిస్తున్నారు, సరే, బానేఉంది. మరి భాజపాను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మొన్నటి దాకా మిత్రులేనే! పక్కన పెద్దగీతలు గీసి మిగతా పార్టీలు బాబు గారి అవకాశవాదాన్ని చిన్నది చేసాయి తప్ప వీరేం తక్కువ తినలేదు.

1 కామెంట్‌:

  1. మీరీ రాజకీయుల్ని ఉతకడం బాగా ఉంది. ప్రతి రాజకీయుడూ ఆ తానులోని ముక్కే. మొత్తం రాజకీయాలు గంజాయి మొక్కల వనమై పోయింది. అందులో తులసి మొక్కలు ఎదగలేవు, ఎదగవు. అయినా వాళ్ళనని మాత్రం ఏమి లాభం! సమాజమంతా ఇలాగే అయిపోతోంది. ప్రతి ఒక్కడూ (ఎక్కడొ ఒకటీ అరా మినాహయింపు తప్ప) స్వార్థపరుడు అయిపోతున్నాడు. ఎదుటివాన్ని విమర్శించడం ఫ్యాషను అయిపోయింది.
    కండక్టరు అదక్కపోతే టికెట్టు లేకుండా ప్రయణించే దగ్గరినుంచీ, కాపీలు వ్రాసి పరీక్షలు వ్రాసే దగ్గరి నుండీ, లంచాలు ఇచ్చి పనులు చేయించుకునే దగ్గరి నుండీ, చివరికి దేవుడు దగ్గర కూడ రెకమండేషన్లతో, డబ్బులతో దర్షనాలు, ... ఒక్కటేమిటి .. నిజాయితీ లేమి ఈ సమాజంలో ప్రతిచోటా కనిపిస్తుంది. కాకపొతే అవినీతి వ్యవస్తితమైపోయి మనకది మాములు విషయంగానూ అంతగా పట్టించుకోరాని విషయంగానూ స్థిరమైపొయింది. రాజకీయ నాయకులు ఈ సమాజ సృష్టే గనుకా మనమూ అందుకు బాద్యులమే!
    -- స్పందన

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు