27, ఫిబ్రవరి 2006, సోమవారం

తనికెళ్ళ భరణి ఇంటర్వ్యూ

శివరాత్రి నాడు (26-02-06) జీ-తెలుగు టీవీలో తనికెళ్ళ భరణిని శైలేష్ రెడ్డి చేసిన ఇంటర్వ్యూ ప్రసారమైంది. భాషోద్యమంపై కొన్ని ప్రశ్నలకు ఆయన తన అభిప్రాయాలు చెప్పారు.

భాషా విషయమై ప్రస్తుతం వచ్చిన కదలికను విస్తరించాలని, ఉధృతం చెయ్యాలనీ ఆయన భావిస్తున్నారు. రాజకీయ పార్టీలన్నీ ఈ ఉద్యమానికి మద్దతు తెల్పడం మంచి పరిణామంగా ఆయన భావించారు. తెలుగుపై ప్రవాసాంధ్రుల ప్రేమ, దూరంగా ఉండడంచేత కలిగిన అనురాగంగా ఆయన భావించారు (అయితే నెగటివ్ గా మాత్రం ధ్వనించలేదు).

అయితే, ప్రత్యేకించి నిరాశ వ్యక్తం చెయ్యనప్పటికీ ఆయన మాటలు ఆశావహంగా ధ్వనించలేదు. సాధారణంగా భరణి గారి హావభావాలు, భాష, ఆంగిక భాష చాలా ఉత్తేజితంగాను, ఉత్సాహం కలిగిస్తూను ఉంటాయి. ఈ ఇంటర్వ్యూలో అలా అనిపించలేదు. మరి శైలేష్ రెడ్డి గారి ప్రశ్నలు ఆయనలో ఆ చొరవను రగిలించలేదో, లేక నేనే ఎక్కువ ఆశించానో తెలీదు.

మరిన్ని ప్రశ్నలు వేసి తగు సమాధానాలను రాబట్టితే బాగుండేది. ఉదాహరణకు భాషావిషయమై నెట్లో జరుగుతున్న చర్చల గురించి వారి సంభాషణలో రాలేదు. వారి సంభాషణ మొదట్లో నేను కొంత చూడలేదు. ఒకవేళ అప్పుడు వచ్చిందేమో తెలియలేదు. అయితే, భరణి గారు ప్రవాసాంధ్రులతో సంబంధాలు కలిగి ఉన్నారని మాత్రం అనిపించింది. జంపాల చౌదరిగారు తమ పిల్లలకు పెట్టుకున్న పేర్ల గురించి ప్రస్తావించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సంబంధిత టపాలు