22, ఫిబ్రవరి 2006, బుధవారం

మమ్మేలిన మా శాసనసభ్యులకు..

తెలుగుకు ప్రాచీన హోదా కోసం శాసనసభ తీర్మానం చేసింది. చాలా సంతోషం. అలాగే మరికొన్ని పనులు చేయాల్సి ఉంది. అది మీచేతుల్లోనే ఉంది.

1. పదో తరగతి వరకూ తెలుగు మాధ్యమం లోనే విద్యాబోధన జరగాలి. అందరూ ఇంగ్లీషులో చదివి, తమ పిల్లలు తెలుగులో చదివితే ఈ పోటీ యుగంలో వెనకబడిపోతారేమో ననే భయం తప్ప ఏ తల్లిదండ్రులకూ తన భాషపై ప్రేమ ఉండకుండా ఉండదు. కాబట్టి ప్రజలే తెలుగొద్దనుకుంటున్నారు అని అనొద్దు.

2. ఆంధ్ర ప్రదేశ్ లో చదివే ఎవరైనా డిగ్రీ స్థాయి వరకూ తెలుగు ఒక విషయంగా చదివితీరాలి.

3. భాష విషయమై ప్రత్యేక పరిశోధన ఒక ఉద్యమ స్థాయిలో జరగాలి. వేమన గురించి ఎప్పుడో బ్రౌను చెప్పినది తప్ప ఆయన చరిత్ర మనకింకేమీ తెలీదు. ఈ విషయమై సమగ్ర పరిశోధన జరగాలి. వేమనకు జాతీయ కవిగా గుర్తింపు రావాలి. మన వేమన అందరి వేమన కావాలి. వీటికొరకు ప్రభుత్వం పూనుకోవాలి.

4. తెలుగు ప్రాచీనత కొరకు పట్టుబట్టడం ఎంత ముఖ్యమో భాషను ఆధునికీకరించడము అంతే ముఖ్యం. వివిధ రంగాలకు సంబంధించి పారిభాషిక పదకోశాలను నిర్మించాలి.., పాత్రికేయులకు ఉన్నట్లుగా.

5. అయ్యేఎస్సుల నుండి గుమాస్తా దాకా తెలుగొస్తేనే ఉద్యోగమివ్వాలి.

6. ప్రభుత్వ కార్యకలాపాలు సమస్తం తెలుగులోనే జరపాలి. ఇంగ్లీషులో రాసి తెలుగులోకి అనువాదం చెయ్యడం కాదు. తెలుగులో రాయాలి. అవసరమైతే - ఖచ్చితంగా అవసరమైతేనే - ఇంగ్లీషులోకి అనువదించాలి.

7. ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు, రహదారి పేర్లు, సూచికలు తెలుగులో రాయాలి.

8. కంపెనీలు, వ్యాపార సంస్థల్లో తెలుగు వాడకాన్ని ప్రోత్సహించాలి. తెలుగు వాడేవారికి అమ్మకం పన్నులో 1 శాతం తగ్గింపునిస్తే చాలు.., తెలుగు వాడకంలో వాళ్ళు ప్రభుత్వానికే మార్గ దర్శకులౌతారు. (తమ రాష్ట్రంలోని వ్యాపార సంస్థల బోర్డులు తప్పనిసరిగా కన్నడంలో ఉండాలని కర్ణాటకలో నిబంధన ఉందట)

మిమ్మల్నెన్నుకున్నందుకు మేం గర్వపడేలా చెయ్యండి.

చివరగా ఓ వినతి.. తెలుగు టీవీ లంగర్లు తమ వెకిలిచేష్టలు తెలుగులోనే చెయ్యాలని నిబంధన పెట్టండి. ఎన్ని ఇంగ్లీషు పదాలు మాట్లాడితే అన్ని గుంజీళ్ళు తియ్యాలి..అదీ కార్యక్రమం అవగానే, కెమెరా ఎదుటే.

భవదీయుడు

4 కామెంట్‌లు:

 1. Good one.

  but at the same time language must enjoy its freedom, it must flow like river..

  రిప్లయితొలగించండి
 2. మీ వ్యాసం చాలా బాగుంది. అయితే దానిని ఆచరణలొ పెట్టడం కొంచము కష్టము ఎందుకంటే ఈ రోజుల్లో తెలుగు సరిగా చదవడం రాని వాళ్లు కూడా ఇంగ్లీషు లో చదవాలని ఆశిస్తున్నారు.
  ఉదాహరణ కి నేను కొంతమంది పిల్లలకి ట్యూషన్ చెబుతాను, చిన్న తరగతుల వాళ్లే, వాళ్లో ఒక అబ్బాయి కి తెలుగే సరిగా తప్పులి లేకుండా చదవటం రాదు(5వ తరగతి)వాళ్ల నాన్న ఆటో నడుపుతాడు. అతనికి ఆ అబ్బాయి ని ఇంగ్లీషు మీడియం లో చదివించాలని కోరిక.ఆలాంటి పరిస్థుతులలో ఇట్లాంటివి కొంచెం కష్టం అనుకుంటాను.

  రిప్లయితొలగించండి
 3. Anonymous గారూ,
  మీరు చెప్పింది నిజమేనండీ. పోటీ యుగంలో తెలుగులో చదివిన పిల్లలు వెనకబడి పోతారేమోనని తల్లిదండ్రులు భయపడటం సహజం. అందుకే తెలుగులో చదువు తప్పనిసరి చెయ్యాలని నా కోరిక. మీ అభిప్రాయం రాసినందుకు కృతజ్ఞుణ్ణి.
  -చదువరి.

  రిప్లయితొలగించండి
 4. సోదరులారా,
  ఒక విన్నపం
  తెలుగు వాళ్లకు ఉన్న జబ్బులలో ముఖ్యమైనవి
  1. ఆరంభశూరత్వం.(మథ్యపాన నిషేథ ఉద్యమం)
  2. ప్రారంభ నైరాశ్యం (starting trouble)
  కూర్చుని కబుర్లు చెప్పేవాశ్శే కానీ కదలేవాళ్ళు ఉండరు.
  ఉచితంగా వస్తే తప్ప.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు