9, డిసెంబర్ 2005, శుక్రవారం

వార్తల్లో విప్లవం - ఇందిరమ్మ టీవీ

"పత్రికలు రంధ్రాన్వేషణే పనిగా పెట్టుకున్నాయి"
"విశాఖలో పత్రికలపై ఆంక్షలు"
"ఆదిలాబాదులో హెచ్చరికలు, నోటీసులు"

ఇవన్నీ ఇప్పటి వార్తలు కావు, విప్లవానికి ముందువి. విప్లవం తరువాత రాష్ట్ర ముఖచిత్రమే మారిపోయింది. ఇది 2006 డిసెంబరు.., ఇప్పుడిలాంటి వార్తలస్సలుండవు.

అసలేం జరిగింది..


2004 లో రాజశేఖరరెడ్డి గారు అధికారంలోకి వచ్చాక, ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే ఈ పనికిమాలిన తెలుగుదేశం నాయకులు ఒక్కడొక్కడే చచ్చిపోవడం మొదలుపెట్టారు. వాళ్ళని కాంగ్రెసు వారే చంపించినట్టు పత్రికలవాళ్ళు ఓ..గోలపెట్టేసారు. ప్రాజెక్టులు, డ్యాములు, కాలువలు, జలాశయాలు ఇలా బోలెడన్ని కట్టించి పారేస్తూ ఉంటే, ఈ పత్రికలు కుళ్ళుకుని, భరించలేక నిందలు వెయ్యడం మొదలుపెట్టాయి. కాంట్రాక్టులన్నీ కాంగ్రెసువాళ్ళే దక్కించుకుని ప్రజలసొమ్మును భోంచేస్తున్నారని గోల. దీనికితోడు, ప్రాజెక్టుల అంచనాలను పెంచేసారని విమర్శలు.

ప్రభుత్వంలో అవినీతి, భూముల కుంభకోణం, కరెంటు కోసారని, ఉచిత కరెంటు ఆపేసారని, పోలీసుల చేతకానివాళ్ళని, సీబీఐ తెలివితక్కువదని, ఇలా రోజూ గోలే.. పత్రికల్లోనూ గోలే, టీవీల్లోనూ గోలే. ఈ తలకాయ లేని పాత్రికేయులకు ఇవితప్ప మరోటి కనిపించదా అని ముఖ్యమంత్రిగారు తెగ ఆశ్చర్యపడిపోయారు. వీళ్ళని సంస్కరించాలని భావించారు. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా వాళ్ళు దారికిరాలేదు. లాభంలేదనుకుని స్వయంగా తనే రంగంలోకి దూకి ఓ టీవీ చానెలు, ఓ పత్రిక పెట్టిపారేసారు. అదీ నేజెప్పిన విప్లవం.

ఇప్పటి సంగతి

ఇహ, ప్రస్తుతానికి వస్తే.. ఇందిరమ్మ టీవీ లో వార్తలు చూద్దాం..అబ్బో ఇప్పటికే ముఖ్యాంశాలైపోయాయి. వివరాలు చెప్తోంది.

ముఖ్యమంత్రి గారీవేళ ఓ కొత్త పథకాన్ని ప్రారంభించారు..అది: రాజీవ్‌ గాంధీ క్షమాభిక్ష పథకం. ఈ పథకం కింద 247 మంది జీవిత ఖైదీలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖలో ఓ ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి కోర్టులు శిక్ష విధించిన నేరస్తులను ఎలా విడుదల చెయ్యాలనే విషయమై పరిశోధన సాగిస్తారు. ఈ విభాగం లాలూ ప్రసాద్ యాదవ్, షహబుద్దీన్‌ వంటి ఉద్దండులను కన్సల్టెంట్లుగా నియమించుకునే ఏర్పాట్లు చేస్తుంది. ఈ పథకంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి. ప్రముఖ సంఘసేవకుడు, మద్దెలదరువు సూరి ఆనందబాష్పాలతో ఇలా వ్యాఖ్యానించారు: ఇది భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే రోజు. ఈ పథకాన్ని వెంటనే అమలుచేసి సాయంత్రానికల్లా దీని ఫలాలను ప్రజలకు అందించాలని ఉత్సాహంగా ప్రకటించారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని స్వాగతిస్తూ ఇలా అన్నాడు: "ఈ పథకం అభివృద్ధి పథంలో మరో ముందడుగు. నేను ప్రభుత్వాన్ని మనసారా అభినందిస్తున్నాను." అయితే బాబు మాట్లాడిన వీడియో క్లిప్పింగు పాడయిపోయింది కనుక చూపించలేకపోతున్నాం.


గత మూడేళ్ళలో పోలీసుల పనితీరు విపరీతంగా మెరుగుపడటంతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రాష్ట్రంలో ఈ కాలంలో మూడు హత్యలు, ఆరు దొంగతనాలు మాత్రమే జరగడంతో పోలీసులకు పని లేకుండా పోయింది. అంచేత వాళ్ళు గోళ్ళు గిల్లుకుంటూ కనిపించడం పరిపాటైపోయింది. ఆ ఫొటోలను ప్రచురించి కొన్ని పత్రికలు పోలీసులపై దుష్ప్రచారం చేస్తున్నాయనీ, వాటిని నమ్మరాదని, మంత్రి జానారెడ్డి గారు ప్రబోధించారు. "నేరాల సంఖ్యను సున్నాకు తీసుకురావడం కొరకు, వీలైతే దానికన్నా తగ్గించడం కొరకు షాయషక్తులా కృషి చేస్తున్నామ"ని కూడా మంత్రి తెలియజేసారు.


రైతులకు ఈ రోజు మరో వరాన్ని ప్రసాదించారు. ఆత్మహత్యలు చేసుకున్న వారికి ఇచ్చే పైకాన్ని మరో రూపాయిన్నర పెంచారు. అయితే "నా చావుకు అప్పులు కారణం కాదు, విసుగు పుట్టి చచ్చిపోతున్నాను" అని రాసిపెట్టి చనిపోయిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆత్మహత్యలు చేసుకోబోయే వారు ఉత్తరం ఎలా రాయాలనే విషయమై ప్రభుత్వ కాల్‌సెంటరును సంప్రదించవల్సిందిగా మంత్రి రఘువీరారెడ్డి గారు తెలియజేస్తున్నారు. మంత్రి ఇంకా ఇలా అన్నారు: "ఇన్ని మంచి పనులు చేస్తున్న మమ్మల్ని విమర్శిస్తున్న వారు, కళ్ళుండీ చూడలేని కబోదులు, వచ్చే జన్మలో నిజంగానే గుడ్లగూబలై పుడతారు"


వశిష్ట వాహన్‌, తమకు చెందిన కంపెనీయే నని వోక్స్‌వాగన్‌ అంగీకరించింది. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన 11 కోట్లూ తమకు చేరాయని, మంత్రి బొత్స సత్యనారాయణ అవినీతికి పాల్పడలేదని, తమ కారణంగా అంతటి గొప్ప నిజాయితీపరుడు నీలాపనిందలకు లోనవడం తమను తీవ్రంగా బాధించిందని కంపెనీ చైర్మన్‌, డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు భోరున విలపిస్తూ చెప్పారు. ఈ వీడియో కూడా పాడైపోవడంతో చూపించలేకపోతున్నాం. అయితే అమాయకులైన మంత్రిగారి వీడియో మాత్రం బాగా వచ్చింది, ఇదిగో చూడండి.

మా నిఘావిభాగం వెలికితీసిన గొప్ప వార్త: పరమ కిరాతకుడు, దుష్టుడు, నరహంతకుడు, ప్రజాకంటకుడు, ప్రజల పాలిట నరకాసురుడు, అపరకంసుడూ ఐన కెరటాల భానును హత్య చేసింది, అతడి పార్టీ మనుషులే గానీ, బండ శీను గారు కాదని మా పరిశోధనలో తేలిపోయింది. అత్యంత నిజాయితీపరుడని పేరుతెచ్చుకుని, రాష్ట్రప్రభుత్వమిచ్చే "ఎంతో నిజాయితీపరుడు" పతకాన్ని పొందిన పోలీసు అధికారి కే.డీ పూనా గారు కూడా దీనిని ధృవీకరించారు. ప్రముఖ గాంధేయవాదియైన బండ శీను గారు, హత్య జరిగిన సమయంలో దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా తో గోల్ఫ్ ఆడుతున్నారు. దీనికి ప్రత్యక్ష సాక్షీ, ప్రముఖ సంఘసేవకుడూ అయిన, మద్దెలదరువు సూరిగారి ఇంటర్వ్యూ ఈ వార్తల తరువాత చూడండి.

రాష్ట్రం మొత్తం మీద ప్రజారోగ్యం అత్యద్భుతంగా మెరుగుపడింది కనుక, ప్రభుత్వాసుపత్రుల అవసరం ఇకలేదని భావించి, వాటిని మూసివేస్తున్నామని ఆరోగ్యశాఖామంత్రి రోశయ్య తెలియజేస్తున్నారు. ప్రభుత్వ డాక్టర్లంతా, అదే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సొంత ప్రాక్టీసు పెట్టుకోవాలని సూచించారు. దీని కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 130 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని ఆర్థికమంత్రి రోశయ్య ప్రకటించారు.

రాష్ట్ర రాజధాని పేరును ఇందిరాబాదు అని మార్చాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై మీ అభిప్రాయాలు తెలియజేసే సువర్ణావకాశం ఇందిరమ్మ టీవీ మీకు కల్పిస్తోంది. కింది మూడు సమాధానాల్లోంచి (మాత్రమే), ఒకదానిని ఎంచుకుని మాకు ఎస్సెమ్మెస్ చెయ్యండి.
1) అద్భుతమైన ఆలోచన
2) ఆహా, ఎంత మంచి ఆలోచన!!!
3) అంతే కాదు, రాష్ట్రం పేరును రాజీవ్ ప్రదేశ్ అని కూడా మార్చాలి.

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి తొలి నిజమైన, నిష్పాక్షికమైన వార్తా చానెల్‌ - ఇందిరమ్మ టీవీ..

6 కామెంట్‌లు:

 1. వాహ్! అద్భుతం! ఇందిరమ్మ టివి వార్తలు చాలా బాగున్నాయి.

  రిప్లయితొలగించండి
 2. ఇప్పుడే అందిన వార్త:
  ఇంటింటికి ఒక టీవి పధకం కింద ఇందిరమ్మ టీవి చానల్ మాత్రమే వచ్చే ప్రత్యేకమైన టివి ని రాష్ట్రమంతా పంపిణి చేయనున్నట్లు నీడ ముఖ్యమంత్రి సూరీడు గారు మా విలేకరికి తెలిపారు. టీవిల పంపిణీ కంట్రాక్టు సరసాదేవి & కో కి ఇచ్చినట్లు తెలియచేసారు.


  చదువరి గారికి వినతి:

  ఇందిరమ్మ టీవి వార్తా విశేషాలు ఎప్పటికప్పుడు విదేశాలలో వున్న తెలుగు వారికి ఇలాగే అందివ్వగలరని ఆశిస్తున్నాము.

  -నేనుసైతం

  రిప్లయితొలగించండి
 3. వార్తలు సూపర్!

  --ప్రసాద్
  http://blog.charasala.com

  రిప్లయితొలగించండి
 4. "షాయషక్తులా" చదవగానే నవ్వాగలేదు. పత్రికలన్నీ సూరిని నిందిస్తాయి. పరిటాలపై ప్రతీకారయత్నం తప్ప ప్రజలకు అతడేంద్రోహంచేశాడని?

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు