27, సెప్టెంబర్ 2011, మంగళవారం

సకల నాయకుల దొమ్మీ

తెలంగాణ - ఒక అసంభవ చిత్రం / Telangana - an impossible picture

తెలంగాణ నాటకంలో యుద్ధాంకం జరుగుతోంది. నాయకులు బ్యాచ్చీలు బ్యాచ్చీలుగా విడిపోయి ఘోరంగా యుద్ధం చేసేసుకుంటన్నారు. తెలంగాణ పేరిట ఒక దొమ్మీ జరుగుతోంది. దొమ్మీలో ఎవడితో పోరాడుతున్నామో పట్టించుకోడెవడూ.. కలబడి కొఠేసుకోడమే!  తెలంగాణ నాయకుల దొమ్మీలోనూ అదే జరుగుతోంది.

ఖచ్చితంగా చెప్పాలంటే.. వీళ్ళు చేస్తున్నది కొట్టుకోడం కూడా కాదు, కొట్టుకుంటున్నట్టు నటించడమే! తాము తెలంగాణ కోసం కొట్టేసుకుంటున్నట్టు తెలంగాణ ప్రజలు అనుకోవాలి. వాడికంటే నేనే బాగా పోరాడుతున్నాను అంటూ జనాన్ని నమ్మించాలి. వాడి కంటే పెద్ద తెవాదిని నేనని వాళ్ళను కమ్మెయ్యాలి -దాదాపుగా అందరిదీ అదే లక్ష్యం. ఒకడినొకడు తిట్టుకుంటారు. కొందరు కలిసి మిగతా కొందర్ని తిడతారు. అందరూ కలిసి ’ఆంద్రోళ్ళ’ను తిడతారు. విడివిడిగా ముఖ్యమంత్రిని తిడతారు. కలిసి కేంద్రాన్ని తిడతారు...

తెదేపాతోటి కాంగ్రెసుతోటీ తెరాస పోరాడుతోంది. ’మీరంతా చవట సన్నాసుల’ని తిడుతోంది. ’తెలంగాణ కోసం మేం మాత్రమే పోరాడుతున్నాం, మీరు చేతులు ముడుచుకుని కూచ్చున్నారు, లేదా పోరాడుతున్నట్టు నటిస్తున్నారు’ అని ఎండగడుతోంది. వచ్చే ఎన్నికల్దాకా తెలంగాణ రాకూడదు, యుద్ధం మాత్రం జరుగుతూనే ఉండాలి, ఈ రెండు పార్టీలను చెండాడుతూనే ఉండాలి. ఎన్నికల్లో అన్ని స్థానాలనూ కొత్తిమీర కట్టలాగా కోసుకుని బొడ్లో పెట్టుకుపోవాలి (పంచతంత్రంలో రమ్యకృష్ణ లాగా) - ఇదీ వాళ్ళ తంత్రం! వాళ్ళ యుద్ధం తెలంగాణ కోసం కాదు, తెలంగాణ సీట్ల కోసం.

కాంగ్రెసు, తెదేపాల యుద్ధం కూడా అందుకే. కాకపోతే తెరాస లాగా సీట్లన్నిటినీ కోసుకుపోదామనే ఆశ లేదు వాళ్లకు, తమ దగ్గరున్న కొత్తిమీర కట్టలోంచి కూసిని రెమ్మలనైనా దక్కించుకోవాలనే తాపత్రయం మాత్రమే ఉంది. బతుకు పోరాటం వాళ్ళది! అందుకే తెలంగాణ కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటూ, జనాన్ని నమ్మించడానికి ఆపసోపాలు పడిపోతున్నారు.

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు, తెదేపా పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీల బతుకంత దుర్భరమైన బతుకు మరోటి లేదు. వీళ్ళకు యుద్ధం చేసేంతటి సీనులేదు. కేసీయారు కొట్టే దెబ్బలను కాసుకోవడంతోనే వీళ్ళకు తెల్లారిపోతోంది. సర్కసులో జంతువుల బతుకులాంటిది వీళ్ల బతుకు. రింగుమాస్టరు కేసీయారు. ఇతడో జగత్కంత్రీ. ప్రజలంతా నావెంటే ఉన్నారు, మీరు నే జెప్పినట్టు చేసారా సరే. లేదో.. వాళ్ళ చేత బడితెపూజ చేయిస్తా అని కొరడా ఝళిపించి ఈ ఎమ్మెల్యేలు ఎంపీల చేత నానా డ్యాన్సులూ ఆడిస్తున్నాడు. డిప్యూటీ రింగుమాస్టరు కోదండరామ్ కూడా కేసీయారుకు తగినవాడే.. అదుగో చూసారా తెలంగాణ ప్రజలంతా మీ అంతు చూడ్డానికి తయారుగా ఉన్నారు అంటూ ఇంకా ఇంకా భయపెట్టేస్తూ ఉంటాడు. ఈ భయాలతో వీళ్ల బతుకు నరకమై పోయింది. పీకల్దాకా ఉన్న కోపం ఎవరిమీద వెళ్లగక్కాలో తెలీక వీళ్ళు చంద్రబాబును, సోనియాను, రాజగోపాలును, కావూరిని, ’ఆంద్ర పెట్టుబడిదార్ల’నూ బూతులు తిడుతూ తమ వంతు యుద్ధం చేస్తూంటారు.ఎవడో ఒకణ్ణి తిట్టకపోతే తెలంగాణ గురించి తాము పట్టించుకోవట్లేదని అనుకుంటారేమోనని తెలంగాణ నాయకుల భయం.

కాంగ్రెసు ఎమ్మెల్యేలు, ఎంపీలు తిట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డి అప్పనంగా దొరికాడు. ఏ ప్రతిపక్ష నాయకుడూ తిట్టనట్టుగా అతణ్ణి తిట్టేస్తున్నారు వీళ్ళు. గాజు గదిలో ఉన్నాడు కదా, ఏం మాట్టాడలేడులే అని ధైర్యం వీళ్లకి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళ అంచనాలకు అందని మొండివాడు. గాజుగదిలో ఉన్నా ఎనకాడకుండా ఎడాపెడా రాళ్ళు విసురుతున్నాడు.

ఇలాంటి సంకుల సమరాల్లో  ఏమరుపాటున ఉంటే ఏ మాత్రం ఊహించని విధంగా దెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. (రాక్షసి తంగడి యుద్ధంలో అళియ రామరాయలు కూడా ఇలాగే దెబ్బతిన్నాడంట. ఓ ఏనుగు బెదరి, పరుగెత్తడంతో తొక్కిసలాట జరిగి అతడు పల్లకీ నుంచి తూలి కింద పడ్డాడు. శత్రువు అతణ్ణి పట్టి, తల తుంచేసాడు). దాడి ఎటువైపు నుంచి వస్తుందని ఊహిస్తారో, ఆ దిశగా వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు. కానీ అనుకోని వైపు నుంచి వచ్చేదాడి కారణంగా దెబ్బతింటారు. ఉదాహరణకు కేసీయారు, కోదండరామ్, కాంగీయులూ వేస్తున్న అస్త్రాలను జాగ్రత్తగా కాచుకుంటూ, పనిలోపనిగా తానూ కొన్ని బాణాలు వేస్తూ కిరణ్ కుమార్ రెడ్డి యుద్ధం చేస్తున్నాడు. అయితే అతడేసిన బాణాల్లో ఒకటి అనుకోకుండా జైపాల్ రెడ్డికి తగిలింది. జైపాల్ రెడ్డి వెంటనే తన దగ్గరున్న ’వాయవ్యా’స్త్రాన్ని వదిలాడు. కిరణ్ గాయపడ్డాడు.

కిరణ్ పై అనుకోని దిశ నుండి మంత్రి శంకర్రావు రూపంలో కూడా దాడి జరుగుతోంది. ఇది కామెడీ దాడి.
శంకర్రావు యుద్ధం సర్దాగా ఉంటది. సినిమాల్లో క్లైమాక్సు సీన్లో సంకుల సమరాలు జరుగుతూంటాయి. ఈ సీన్లో మొత్తం సినిమాలోని పాత్రలన్నీ చేరి ఎవడి మానాన వాడు ఫైట్లు చేసేస్తూంటారు, కమెడియన్లతో సహా. హీరో ఓపక్క సీరియస్ యుద్ధం చేస్తూంటే, ఈ కమెడియన్లు కామెడీ యుద్ధం చేసి జనాన్ని నవ్విస్తూంటారు. ఈ రెండో రకం యుద్ధమే శంకర్రావుది. దొమ్మీలో శంకర్రావు పాల్గొంటున్నందుకు కారణం తెలంగాణ కాదు. అందరూ తెలంగాణ పేరు మీద యుద్ధం చేసుకుంటూంటే, శంకర్రావు మాత్రం... నా భద్రతకు ప్రమాదముంది కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, రేపు నాకేమైనా అయితే ముఖ్యమంత్రిదే బాధ్యత/ముఖ్యమంత్రి నాతో పలకటం లేదు/నేను పుట్టిన్రోజు గ్రీటింగ్స్ చెబుదామని ఫోను చేసినా తీయలేదు,.. ఈ బాపతు రాళ్ళు విసురుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.

సందట్లో సడేమియాలు కొందరుంటారు. దొమ్మీల్లో దూరి తమ పాత కక్షలను తీర్చేసుకుంటూంటారు. ఈ దొమ్మీలో కూడా సొంత కారణాలతో దూరి కొఠేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. దీనికి ఉత్తమ ఉదాహరణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెసును వదిలి ఎట్టాగూ బైటికి పోయేవాడే ఇతడు. తన సొంత కారణాల కోసం కాకుండా తెలంగాణ కోసం బైటికి పోతే జనంలో హీరో అయిపోతాను గదా అని అతడి ఎత్తు లాగుంది. అందుకే ఈ దొమ్మీలో దూరిపోయాడు. ఎడాపెడా కొట్టేస్తున్నాడు.

అందరికంటే తెలివైన యోధుడు చంద్రబాబే! అసలు దొమ్మీకే వెళ్ళలేదు. కానీ ప్రతివాడి నోటా అతడి మాటే. కేసీయారు దగ్గర్నుండి నాగం దాకా అందరూ అతణ్ణే తిడుతూంటారు. ఎన్ని తిట్ల కంత పరపతి!  చంద్రబాబు కొద్దిగా కృష్ణుడి టైపు.. నా సైన్యాన్ని రెండు భాగాలు చేసాను.. ఒకభాగాన్ని తెలంగాణకు, రెండో దాన్ని కోస్తా సీమలకు ఇచ్చేస్తున్నాను. నేను మాత్రం ఏ  వైపునకున్ చేర, నాయుధమున్ ధరింప, అని నిక్కముగా ’రెండు ’పట్ల ఊరకే చూచువాడ  అంటూ అటో కన్ను ఇటో కన్నూ పడేసి నెట్టుకొచ్చేస్తున్నాడు.

ఈ దొమ్మీ రేపుతున్న దుమ్ములో  తెలంగాణ సామాన్యుడు ఎవరికీ కనబడ్డం లేదు. అతడికీ ఏమీ కనబడుతున్నట్టు లేదు.

8 కామెంట్‌లు:

  1. తెలంగాణా "ముష్టి" యుద్దాలను బాగా వర్ణించారు చదువరి గారూ.

    రిప్లయితొలగించండి
  2. ఇది ఒక ప్రజా ఉద్యమం పేరిట జరిగే రాజకీయ ఉద్యమం గా అనుకుంటున్నాను , ఇక్కడ జనాల ఇబ్బందులు కాని ఇలాంటివి ఏమిపట్టవు ! ఎమన్నా అంటె తెలంగాణా అంటారు , ఏందుకు కావాలంటే వితండవాదం చేస్తారు .వీళ్ల దగ్గర సరైన సమాదానం ఉండదు , ఏందుకంటే వాళ్లకే తెలియదు కాబట్టి .కొంతమంది ప్రజలు కూడా గుడ్డి గా వీళ్ళనే అనుసరిస్తున్నారు అలొచించకుండా :(

    రిప్లయితొలగించండి
  3. ఆరిపోబోతున్న దీపమీ ఉద్యమం. కాస్త జ్వాల ఎక్కువే ఉంటుంది. ఉండనివ్వండి !

    హైదరాబాదు లేకుండా తెలంగాణకి సరేనంటే ఆర్నెలల్లో వస్తుంది ప్రత్యేక రాష్ట్రం. కానీ వీళ్ళ దగ్గఱ పట్టూ విడుపూ లేదు. వట్టి మూర్ఖులు. తమదే ఉద్యమమంటారు. తామే మనుషులమంటారు. తాము చెప్పిందే నిజమంటారు. తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళంటారు. ఇతరుల్ని గౌరవించడం, ఇచ్చిపుచ్చుకోవడం, సౌమ్యంగా చర్చించడం లాంటి ధోరణులేమీ లేవు. అంతా అసభ్యత, అశ్లీలత, అనాగరికత, అప్రజాస్వామికత. వీళ్ళ దగ్గఱ రౌడీమూకలు తప్ప ఇంకేమీ ఉన్నట్లు కనిపించడం లేదు. కనుక ఈ ఉద్యమం మఱో విఫల తెలంగాణ పోరాటంగా చరిత్రకెక్కడమే తప్ప ప్రయోజనం లేదు.

    కిరణ కుమారుడు నివుఱుగప్పిన నిప్పు. ఆ సంగతి తెలీక అతన్తో చెలగాటమాడుతున్నారు వెఱ్ఱి తె.వాదులు. "అందాకా" రాకూడదని మితవాదులు కోరతారు. కానీ అవతలివాళ్ళు అతివాదులైనప్పుడు మఱి "అందాకా" వస్తుంది. వాళ్ళు తెస్తారు, ఱేపో, మాపో, ఎల్లుండో ! ఏరియా ఏదైనా అంతా మన తెలుగురక్తమే కదా ! చూసి విచారించడం తప్ప ఏం చేయగలం ? కడుపులో అడ్డం తిరిగితే స్వంతబిడ్డనైనా నఱికి తల్లిని కాపాడక తప్పదు.

    రిప్లయితొలగించండి
  4. vaasthavaalani chaala prasaanthanga varninchaaru.good.

    @ఏరియా ఏదైనా అంతా మన తెలుగురక్తమే కదా ! చూసి విచారించడం తప్ప ఏం చేయగలం ? కడుపులో అడ్డం తిరిగితే స్వంతబిడ్డనైనా నఱికి తల్లిని కాపాడక తప్పదు - well said!

    రిప్లయితొలగించండి
  5. మీ బ్లాగులో నాకు అత్యంత నచ్చే అంశం, పర భాషా పదాలు వుండకపోవటం (వుండటం తప్పని కాదు). స్వచ్చమైన తెలుగు చదివే అవకాశాన్నీ, అదృష్టాన్నీ కలిగించారు.

    రిప్లయితొలగించండి
  6. John: :)
    jabilli: ఔనండి.
    LBS తాడేపల్లి: "తమదే ఉద్యమమంటారు. తామే మనుషులమంటారు. తాము చెప్పిందే నిజమంటారు. తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళంటారు. ఇతరుల్ని గౌరవించడం, ఇచ్చిపుచ్చుకోవడం, సౌమ్యంగా చర్చించడం లాంటి ధోరణులేమీ లేవు. అంతా అసభ్యత, అశ్లీలత, అనాగరికత, అప్రజాస్వామికత. వీళ్ళ దగ్గఱ రౌడీమూకలు తప్ప ఇంకేమీ ఉన్నట్లు కనిపించడం లేదు." - ప్రత్యక్షర సత్యం!
    vasantham, Balu, BP: నెనరులు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు