26, నవంబర్ 2010, శుక్రవారం

ఉత్సవ విగ్రహాలు, లార్జర్ దాన్ లైఫ్ సైజు కటౌట్లూ!

ఆంధ్రప్రదేశుకు ముఖ్యమంత్రిని  మార్చారు.  తమలోంచి ఒకణ్ణి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన జనానికి ప్రణబ్బు ముఖర్జీ చెప్పేదాకా తెలీదు, కుర్చీ ఎక్కబోయేది ఎవరో!  ఛానెళ్ళ పుణ్యమా అని, వాళ్లకంటే మనకే కొంత ముందు తెలిసింది.  ’ఏంటి ఎవరు  ముఖ్యమంత్రి కాబోతున్నారు ’అని అడిగితే కాంగీయుడు ప్రతీవాడూ చెప్పిన సమాధానం ఒకటే - అధిష్ఠానం మాటే మామాట ! అమ్మ మాట  బంగారు మూట అనమాట! ఇక్కడి నాయకుణ్ణి విమర్శించమంటే అడ్దమైన బూతులు తిడుతూ ఒంటికాలిమీద లేచేవాళ్ళే వీళ్ళంతా..  కాని మేడమ్మ దగ్గరికి వచ్చేసరికి తోకలు ముడుస్తారు. పిల్లికూనలైపోతారు. ఏంటో ఆ అమ్మ గొప్పదనం!  ఏమిటి ఆమెలో ఉన్న మహత్తు? ఎన్నికల్లో వీళ్ళందరినీ ఒంటిచేత్తో గెలిపించుకు పోగల సమర్ధత, మహిమా ఉన్నాయా? రాష్ట్ర సమస్యలను ఢిల్లీలో కూచ్చుని అవలీలగా తేల్చిపారేస్తదా?


ఆవిడ గారి గొప్పదనమేంటో, ఆమెకున్న మహిమేంటో  సరిగ్గా అదే రోజున బీహార్లో బైటపడింది.  ఇక్కడ ముఖ్యమంత్రి మార్పు నాటకం జరుగుతూండగా అక్కడ నితీష్ కుమారనే ఒకేఒక్కడు కొట్టిన దెబ్బకు బొక్కబోర్లా పడింది.  అతడు రేపిన సుడిగాలిలో లాలూలు, పాశ్వానులు కొట్టుకుపోయారు.  ఈవిడ, ఈవిడగారి కొడుకూ కూడా నామరూపాల్లేకుండా పోయారు. బీహారీలు కాంగ్రెసును నిలువులోతు గొయ్యి తీసి పూడ్చిపెట్టారు.  మూడేళ్ళ కిందట గుజరాతీయుల  చేతుల్లో  కూడా ఇలాంటి సన్మానమే అందుకున్నది మేడమ్మ.  మృత్యు బేహారులు లాంటి మాటలు వాడి కూడా ఎన్నికల కమిషను చేతుల్లోంచి బైటపడింది. కానీ,  గుజరాతీయుల నుంచి తప్పించుకోలేక పోయింది.  నితీష్, మోడీలు అందించిన నాయకత్వపు పటిమ కారణంగా అక్కడ  వీళ్ళ ఆటలు సాగలేదు. 

నాణేనికి రెండో వైపు చూసినా అంతే.. ఆంధ్ర ప్రదేశు, ఢిల్లీల్లో కాంగ్రెసు గెలిచింది.  మళ్ళీ అదే కారణం - స్థానిక నాయకత్వ పటిమ. ఎక్కడెక్కడ ఏయే పార్టీల స్థానిక నాయకత్వం బలంగా ఉంటదో అక్కడక్కడ ఆయా పార్టీలు గెలుస్తున్నాయి.  -సహజం కూడా అది.  స్థానిక నాయకత్వానికి ఇంత ప్రాముఖ్యత ఉండగా ఢిల్లీలో, ఆ మూల ఇంట్లో కూచ్చునే నిదర మొహాలకు ఇంత విలువ ఎందుకు, ఈ కొలుపులెందుకు?   వాళ్ళ గురించి ’అమ్మగారు ఎవరిని ఎంచితే వారే మా ముఖ్యమంత్రి’ అని కెమెరాల ముందు చేరి చెప్పుకునే మన  బంగారాలను చూస్తంటే...      అ క శే రు కా లు!

ఢిల్లీలో కూచ్చుని ఆవిడ ఒకపేరు చెప్పిందంట, దాన్నొక కాగితమ్మీద రాసుకోని, కవర్లో పెట్టి, సీలు చేసి, నలుగురు పరమానందయ్య శిష్యులు ప్రత్యేక ఇమానంలో మోసుకొచ్చి,  ఇక్కడ ఒక డ్రామా ఆడి, దాన్ని తెరిచి, అందులోంచి మన  కొత్త ముఖ్యమంత్రిని బైటికి లాగారు. పుట్టీపుట్టగానే ఈ ముఖ్యమంత్రి ఏంటంటాడూ.. రొండువేలపద్దాలుగులో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చెయ్యడమే తన ఆశయమంట!  పాపము శమించుగాక!

10 కామెంట్‌లు:

  1. కేతిగాళ్ళు ఇక్కడ, బొమ్మల తాళ్ళు ఢిల్లీలో, ఇహ అసెంబ్లీ అంతా తోలుబొమ్మలాట

    రిప్లయితొలగించండి
  2. అమ్మమాట విన్నవారికి వీసెడు పుణ్యం
    అమ్మమాట చదివినవారికి సవ్వాశేరు పుణ్యం
    అమ్మమాట విననివారికి శేరు పాపం
    అమ్మమాట మర్చిపోయినవారికి మణుగు పాపం

    ఆవిడ లీలలు అనంతం
    పావుల తీరు విచిత్రం!

    విగ్రహాల, కటౌట్ల పరువెందుకు తీస్తున్నారు సార్!
    పాపం అవి ఏదో రకంగా అన్నా ఉపయోగపడతాయి!

    రిప్లయితొలగించండి
  3. ఒకమనిషి బదులు తన కత్తితో పెండ్లి చేయించడం, చెప్పులు కుర్చీపై పెట్టి రాజ్యం చేయించడం చదువుకున్నాం. ఇప్పుడూ అదే జరుగుతూ ఉంది. ఈ తొత్తులు ఆయమ్మగారి చెప్పుల్లాంటోళ్ళే.

    ఆ రాహువుకు మొదట పెండ్లి చేయమనండి. ఆ తర్వాత కుర్చీయో, బల్లనో చూడవచ్చు. హమ్మో అది మాత్రం చేయరు. కోడలొస్తే ఏమన్నా ఉందా? ఎంతైనా స్వానుభవం కదా!

    రిప్లయితొలగించండి
  4. ఈ తతంగం అంతా చూసి మన గిరీశం ఏమంటాడో ?మన వాళ్ళు ఉత్త వెధవాయలోయ్ అనేగా.ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా ఉన్న ఆంధ్రా ఇప్పుడు బీహార్ ను ఆదర్శంగా తీసుకోవల్సిన పరిస్థితి కల్పించిన రాజా గారికి జోహార్ చెబుదామా లేక ,మన వోటర్ కు సద్భుద్ది ప్రసాదించమని భగవంతుణ్ణి వేడుకొందామా ?

    రిప్లయితొలగించండి
  5. నిజమే. ఎంతో వెనకబడ్డ బీహార్ కులాలు, మతాలకతీతంగా నితీష్ ని గెలిపిస్తే ఇక్కడ మనం కులాల ఆధారంగా ముఖ్యమంత్రి ఎంపిక జరిగినా చూస్తూ ఊరుకుంటున్నాం.

    రిప్లయితొలగించండి
  6. నేననుకోవడం - కి.కు.రె. కూడా తాత్కాలికుడే. 2012 లో తెలుగుగడ్డ మీద ఇంకో ముఖ్యమంత్రినో, ప్రధానమంత్రినో చూస్తాం మనం. ఎలాంటి రాష్ట్రమిది, ఎలాంటి పదవి అది, ఎలా చేసిపారేశారు కాంగీలు ?

    రిప్లయితొలగించండి
  7. పాత కథ పునరావృతం అవుతోంది.. అంతే..

    రిప్లయితొలగించండి
  8. అందుకే జగన్ మధ్య వేలు మాత్రం వుంచుకుని మిగిలిన చెయ్యిని వదిలేసేడు

    రిప్లయితొలగించండి
  9. This is the beginning of the end of the Congress Party at the centre and in Andhra Pradesh.

    రిప్లయితొలగించండి
  10. రాష్ట్రం లొ పరిస్తితి రోజుకొ విధం గా మారుతుంటే మీరు కీ బొర్డ్ కదపకుండా కూచోవడం ఏం బాగాలేదు

    కాముధ

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు