27, సెప్టెంబర్ 2010, సోమవారం

తెలుగు సినిమా పరిశ్రమలో "ఆ నలుగురు" ఎవరు?

తెలుగు సినిమా దశ దిశ గురించి శనివారం నాడు హెచ్చెమ్ టీవీ ఒక చర్చా కార్యక్రమం చేసింది. అనేకమంది నిర్మాతలు, దర్శకులు ఇతర సాంకేతికులూ ఈ అమావేశంలో పాల్గొని తమ గోడు వెళ్ళబోసుకున్నారు.  పరిశ్రమ గురించి చర్చ పెడితే, పెద్ద నటులెవరూ రాలేదు. పెద్ద నిర్మాతలు, దర్శకులూ కూడా ఎవరూ రాలేదు.  -వాళ్ళను పిలవలేదో, పిలిచినా రాలేదో, వాళ్ళకు లాభం కలిగే సంగతులు ఇక్కడ లేవో, మరింకేంటో!  రామచంద్రమూర్తి  మన ఉద్దేశం ఫాల్ట్ ఫైండింగు కాదు ఫ్యాక్ట్ ఫైండింగ్! అని చెప్పాడు.  పాల్గొన్నవాళ్లలో కొందరు:  ప్రసన్న కుమార్,  సాగర్, విజయచందర్, విజేందర్ రెడ్డి, ఏవీయెస్.


అనేక విషయాలు చర్చకు వచ్చాయి.  ముఖ్యమైనవివి:
  1. ఆ నలుగురు:  థియేటర్ల గుత్తాధిపత్యం గురించి మాట్టాడడంతో చర్చ మొదలైంది. ప్రసంగాలు ఆటోమాటిగ్గా ఆ నలుగురి చుట్టూరా తిరిగాయి. ఎవరు ఏ విషయం గురించి మాట్టాడినా, విషయం ఆ నలుగురి మీదుగా పోకుండా ప్రసంగం ముగియలేదు.   కొందరు మృదువుగా చెప్పారు. కొందరు కుసింత ఘాటుగా చెప్పారు. కొందరు జాగర్తగా, వాళ్ళకి కోపం రాకుండా  ఉండేట్టుగా మాట్టాడారు. కానీ చాలామంది ఈ విషయాన్ని మాత్రం కదిలించారు. 
  2. డబ్బింగు సినిమాల నిషేధం: ఇది కూడా అందరి అభిమాన  టాపిక్కే! 
  3. చిన్న సినిమాలకు తొలి మూడు నాలుగు వారాలకు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలి: ఇది కొందరు అడిగారు. 
  4. నటీనటుల రెమ్యునరేషన్స్ తగ్గించుకోవాలి.
  5. నిర్మాణ ఖర్చు తగ్గించాలి
  6. సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించాలి/పెంచాలి
  7. టెక్నాలజీని పెంపొందించాలి
  8. అవార్డులొచ్చిన సినిమాలకు సబ్సిడీ ఇవ్వాలి
  9. తెలుగు నటులకు ప్రాముఖ్యత ఇవ్వాలి

ఎక్జిబిటర్ల నాయకుడు విజేందర్ రెడ్డి ’నిర్మాతలు ఖర్చులు తగ్గించుకోవాలి, వాళ్ళు ఈ పని చెయ్యాలి, ఆ పని చెయ్యాలి’ అంటూ సలహాలు ఇచ్చాడు.  సినిమా హాళ్ళ వాళ్ళు మాత్రం టిక్కెట్ల రేట్లు  పెంచాలని కోరబోతున్నట్టు చెప్పాడు.  బెంగాలు, కర్ణాటక, తమిళనాడు,..  వగైరా చోట్ల రేట్లు మనకంటే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. ఇక, ఆ తరవాత మాట్టాడినవాళ్ళు ఆయన్ను విమర్శించారు. ఈమధ్యే రేట్లు పెంచారు మళ్ళీ ఎందుకు పెంచాలి అని ప్రశ్నించాడొకాయన. అసలు రేట్లు పెంచాల్సిన అవసరం మీకేముంది అన్నాడొకాయన. సినిమా విడుదలైన మొదటి రెండు వారాల్లో టిక్కెట్లను పెంచే జీవోను ఎక్జిబిటర్లే తెచ్చారని ఎవరో అన్నారు. విజేందర్ రెడ్డి  అబ్బే, అది అడిగింది నిర్మాతలేగానీ, మేం కాదని చెప్పాడు. ఛాంబర్లో నిర్మాతలే కాదు మీరూ ఉన్నారు అంటూ ఎదురు వాదన వచ్చింది. ఇలా కాసేపు వాళ్ళ వాదన సాగింది.

తెలుగు నటులకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదని చెప్పారు కొందరు.  ఇతర భాషా నటుల్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ప్రకాష్ రాజ్ ను బహిష్కరించాలని అనుకున్న తరవాత కూడా ఎందుకు అతడికి పాత్రలు ఇస్తున్నారు? అని అడిగాడు. "ఈ మాటే ప్రకాష్ రాజ్ ను ఎవరో అడిగితే, తెలుగు నిర్మాతలకు నన్ను బహిష్కరించేంత దమ్ము లేదు అని చెప్పాడంట" అని అతడే అన్నాడు.

ఒక అవార్డు సినిమా తీసిన దర్శకుడొకాయన, తన సినిమాకు ప్రభుత్వ సబ్సిడీ ఇవ్వలేదు, మంత్రి, అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం కానీ పనికాలేదు.  సబ్సిడీలను వెంటనే విడుదల చెయ్యాలని కోరాడాయన.  తెలంగాణ సినిమా జెయేసీ ప్రస్తావన తెచ్చాడొకాయన. తెలంగాణ ఉద్యమాన్ని ఇందులోకి దూర్చడానికి ఇది సమయం కాదు అని రెండు మూడు సార్లు వారించాక, ఊరుకున్నాడు.

టెక్నాలజీని మనవాళ్ళు సరిగ్గా వాడుకోవడం లేదు, అసలు టెక్నాలజీ గురించిన అవగాహన కూడా సరిగ్గా లేదు అని మరొకాయన  అన్నాడు. డిజిటల్ ప్రింట్లు రావాలి అని గుడివాడకు చెందిన డిస్ట్రిబ్యూటరు ఒకతడు అన్నాడు.

వెంకటేశ్వరరావనే ఒక ప్రేక్షకుడు చక్కగా మాట్టాడారు. అసలు తెలుగు సినిమాకు ఎందుకెళ్ళాలని అడిగారు.. చక్కటి తెలుగు భాష వాడుతున్నారని వెళ్ళాలా? తెలుగు సంస్కృతిని చక్కగా చూపిస్తున్నారని వెళ్ళాలా? అంటూ ప్రశ్నించాడు. 

ఒకాయన, చిన్న నిర్మాత అనుకుంటాను, "ఆ నలుగురు" మారితే తప్ప, చిన్న నిర్మాతలకు మనుగడ లేదు అని చెప్పాడు. వాళ్ళు మారాలి, లేదా "మనలోంచి నక్సలైట్లు ఎవరో పుట్టుకొచ్చి .." అని మాట్టాడుతూ, తమాయించుకుని, మామూలుగా చెప్పుకుపోయాడు. 

విజయచందర్ ఘాటుగా మాట్టాడాడు..  ఆ నలుగురినీ గట్టిగా విమర్శించాడు. పేర్లు చెప్పొద్దని రామచంద్రమూర్తి గారు ముందే చెప్పారని ఆగాను గానీ, వాళ్ళ పేర్లు చెప్పేందుకు నేనేమీ వెనకాడను అని అన్నాడు. చిన్న సినిమాలను విడుదల చేసేందుకు థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని చెబుతూ, "కరుణామయుడు" సినిమాను ఆ రోజుల్లో కాబట్టి, దాన్ని విడుదల చెయ్యగలిగాను గానీ, ఇవ్వాళ అది నా తరం కాదు, అన్నాడు.చిన్న సినిమాకు రోజులు కావివి అని ఆవేశంగా ప్రసంగించాడు.

చర్చలో కులం గురించిన  ప్రస్తావన ఎవరూ తేలేదుగానీ, ఒకాయన మాత్రం కులం పొలిమేర దాకా వెళ్ళి వచ్చినట్టనిపించింది.

చర్చ జరుగుతున్నంతసేపూ "ఆ నలుగురూ" ఎవరో ఎవరూ చెప్పలేదు. ఒకతను చెప్పాడుగానీ సరిగ్గా వినబడలేదు. ఎవరా నలుగురు ఏరా నలుగురు అంటూ మథన పడిన నాబోటిగాళ్ళు హమ్మయ్య అనుకునేలా, చివర్లో  ఆ నలుగురు ఎవరో చెప్పారు. ఆ పేర్లు చెప్పిన  వ్యక్తి త్రిపురనేని చిట్టి అనే దర్శకుడు. పేర్లు చెప్పాక, వీళ్లపై మనకు వ్యతిరేకత ఏమీ లేదు, కేవలం చిన్న సినిమాలను బతికించాలనే చెబుతున్నాం అని చెప్పాడు. ఆ పని చేసేలా దేవుడు వాళ్ళకు మంచి మనసు ఇవ్వాలని కోరుకుంటున్నాం  అని కూడా అన్నాడు.
  1. దగ్గుబాటి సురేష్
  2. అల్లు అరవింద్
  3. సునీల్
  4. దిల్ రాజు
ఇందులో ముగ్గురు తెలిసినవారే. ఆ సునీల్ ఎవరో మాత్రం నాకు తెలీలేదు. మీకు తెలుసా?

7 కామెంట్‌లు:

  1. 1. దగ్గుబాటి సురేష్
    2. అల్లు అరవింద్
    3. దిల్ రాజు
    4. రామోజీ రావు లేక దాసరి నారాయణరావు ( సిరి మీడియా)

    అనుకుంటున్నా ఇన్నాళ్ళవరకు కొత్తగా ఈ సునీల్ ఎవరో

    రిప్లయితొలగించండి
  2. "వెంకటేశ్వరరావనే ఒక ప్రేక్షకుడు చక్కగా మాట్టాడారు"
    నేను ఈ కార్యక్రమము చూడలేదు. మీరు రాసిన దానిబట్టి చూస్తే ఈ ప్రేక్షకుడొక్కడే కొంచెము లాజికల్ గా మాటాడినట్టుగా ఉంది. లేకపోతే ప్రకాష్ రాజ్ ని బాన్ చెయ్యమంటమేంటి వీళ్ళు? ఏమన్నా అర్థముందా? తెలుగేతర బొడ్డుభామల గురించి ఎవరైనా మాట్లాడారా? పాటలలో లేని శ్రావ్యత, తెలుగుతనం గురించి మాట్లాడారా? వారసనటుల నటసూన్యత్వం గురించి మాట్లాడారా? అసలు సినిమా అనే ప్రొడక్టు క్వాలిటీ గురించి మాట్లాడారా?

    డబ్బింగు సినిమాలను నిషేదిస్తే కొన్ని మంచి పరభాషా సినిమాలనైనా చూసే అవకాశము తెలుగు ప్రేక్షకులకు లేకుండా పోతుంది. అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు.

    ఇట్లు
    ఒకప్పటి తెలుగుసినిమాఅభిమాని

    రిప్లయితొలగించండి
  3. ఇదే రీజన్ తో మొన్నామధ్య ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా ఫేం రాజ కూడా ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఆనాడైతే బాహాటంగానే ఈ నలుగురిలో ముగ్గురి పై నిండా వేస్తూ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు కూడా చేసాడు .
    కానీ ఆ సునీల్ ఎవరబ్బా!!!
    రామోజీ రావు గారబ్బాయా?

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు