5, ఏప్రిల్ 2010, సోమవారం

మే..ధావుల ’వర్గవివక్ష’

తెలంగాణ వాదులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చి, తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యమని డిమాండుతున్నారు. అంటే వేరు పడతామంటున్నారు. వేర్పాటువాదులన్నమాట! కానీ, ’దాన్ని ప్రత్యేకవాదమని అనాలిగానీ, వేర్పాటువాదమని అనకూడదు’ అని పాత్రికేయుడొకాయన చెబుతున్నారు. ఈ ముక్క గతంలో కొందరు రాజకీయులూ అన్నారు. సమాధానం చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు. బ్లాగుల్లోనూ అన్నారు, అప్పుడూ తగు సమాధానాలే చెప్పారు. కాకపోతే ఇప్పుడు అంటున్నది, మేధావి వర్గానికి చెందిన పాత్రికేయుడు. ఏప్రిల్ 4, ఆదివారం నాడు హెచ్చెమ్ టీవీలో పాల్గొన్న పాత్రికేయులకు 'వేర్పాటువాదం’ అనే మాట తప్పనిపించింది. ఆ మాటను దేశం నుండి విడిపోవాలని కోరితేనే అనాలంట. తెలంగాణ డిమాండును ఆ పేరుతో పిలిస్తే ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల్ని అవమానించినట్టేనంట!! ఈ ముక్కలన్నది ఎ.శ్రీనివాసరావు. 


ఓ పాత్రికేయ మేధావీ.. మీ తెలంగాణ పక్షపాతం చూపించుకోడానికి పదాల అర్థాలను కూడా మార్చేస్తారా? ఇదిగో, బ్రౌణ్యం ఏం చెబుతోందో చూడండి.. http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B1%81&table=brown. వేర్పాటు అంటే ప్రత్యేకపడటమే! దేశం నుంచి విడిపోతారా, రాష్ట్రం నుంచి విడిపోతారా, తండ్రి ఆస్తిని విడగొట్టుకుంటారా,.. అనేవి ఆ పదానికి అనవసరం, దానికి వివక్షలేమీ లేవు. అంచేత, మీ తె.వాద పక్షపాతాన్ని చూపించుకోడానికి మరో పద్ధతిని - మరే పద్ధతినైనా - ఎంచుకోండి. భాషకు కొత్తర్థాలు చెప్పకండి.

’అన్నల్దమ్ముల్లాగా విడిపోదాం’ అనే మాట వినని ఆంధ్రుడున్నాడా ఇవ్వాళ?  ఇది తె.వాదుల ఊతపదం కాబట్టి, దాన్ని వాళ్ళు విచ్చలవిడిగా వాడతారు కాబట్టి ఇప్పుడే పుట్టిన పసిపిల్లాడు కూడా ఈ మాట బారిన పడకుండా తప్పించుకోలేడు. అన్నల్దమ్ములు విడిపోయి ఆస్తులు అప్పులూ పంచుకోడాన్ని ఏర్లు పడటం / వేర్లు పడటం / వేరు పడటం అనే అంటారు.వేరు పడటం అనే మాట తప్పేమీ కాదు, గౌరవహీనమైనదేమీ కాదు. కాకపోతే వేరుపడటం అనే పని ఏమంత ఉదాత్తమైనదేమీ కాదు, అంచేత ఆ మాట ఈ పాత్రికేయుడికి తప్పుగా అనిపించి ఉండొచ్చు.
 
ప్రత్యేకరాష్ట్రం కావాలని అడగడం వేర్పాటే. అలా అడిగేవాడు వేర్పాటువాదే! తె.వాదుల కోసం దాన్ని మార్చనక్కర్లేదు. ఈ మేధావులు తమ నూత్న తె.వాద మహా విజ్ఞానంతో టీవీ కెమెరాల ముందుకొచ్చి నిష్పాక్షికులమంటూ పోజు కొడుతూ అబద్ధాలు చెప్పుకుపోతూంటారు. మనకు జ్ఞానదానం చేసేద్దామని చూసేస్తుంటారు. పాత్రికేయుడు, ప్రొఫెసరు, ఆచార్యుడు,.. అంటూ తమకో ట్యాగు తగిలించుకు తిరుగుతూంటారు. వీళ్ళు చెప్పే అబద్ధాలు వింటూ, టీవీల లంగర్లు కొందరు పళ్ళికిలించి ఆహా ఓహో అని అంటూంటారు.

ఈ కార్యక్రమంలో ఆ లంగరు ’అదేంటండీ ఆ మాట తప్పెలా అవుతుంది’ అని అడగలేదు. లంగరు పని వాళ్ళ చేత వాగించడం వరకేను, సొంత అభిప్రాయాలు చెప్పడం కాదు అని అంటారా.. అది నిజమే, లంగరు వాళ్ళ చేత వాగించాలిగానీ తాను వాళ్ళ అభిప్రాయాలను ఖండించడం లాంటివి చెయ్యకూడదు. మరి అదే లంగరు ఓ పక్కన తిరపతి నుండి ఒక ప్రొఫెసరు గారితో కూడా మాటలు కలిపాడు. మాటల్లో ఆయనేదో చెప్పబోగా, ఈయన కలిగించుకోని ఆయన అభిప్రాయాలను తోసిపుచ్చాడు. ఈ లంగరుకెందుకంత పక్షపాతం?
................
 
నిష్పాక్షిక విశ్లేషకులమని చెప్పుకుంటూ ’వక్రవాణి’ వినిపించే ప్రొఫెసర్లు మనకు కొంతమంది ఉన్నారు. వీళ్ళతో పోలిస్తే, ఈ పాత్రికేయ మేధావులు చాలా నయం. మీరు ఏ టైములోనైనా టీవీ పెట్టండి.. ఏదో ఒక చానల్లో మొహం గంటు పెట్టుకునో, ఎవడో ఒకణ్ణి తిడుతూనో కనిపిస్తారీ వక్రవాణులు. అసలు వీళ్ళు కాలేజీలకి పోయి పిల్లలకు పాఠాలెప్పుడు చెబుతారో అర్థం కాదు. ఇక్కడ మాత్రం లంగర్లకు, తోటి విశ్లేషకులకు క్లాసులు పీకుతూంటారు.

ఈమధ్య ఐన్యూస్ లో ఒక చర్చ చూసాను. లంగరు పేరు అంకం రవి. ప్రభాకరు అనే తెరాస నాయకుడు, చక్రపాణి అనే ప్రొఫెసరు :) , ఈమధ్య కాలంలో ఉస్మానియా ఐకాసలో నాయకుడై ఆ తరవాత టీవీల్లో విశ్లేషకుడైన ఒక విద్యార్థి -ఈ ముగ్గురూ చర్చించేవారు.

తెరాస నాయకులు రాజీనామాలు చెయ్యగా ఏర్పడిన ఖాళీల్లోఆత్మహత్య చేసుకున్న కుర్రాళ్ళ కుటుంబీకుల్ని నిలబెట్టాలని ఆ కుర్రాడు (విద్యార్థి) అంటున్నాడు.  ప్రభాకరు, చక్రపాణీ కలిసి అతగాడి నోరు మూయిస్తున్నారు. ప్రభాకరు చాలా నయం.. నువ్వు అలా మాట్టాడ్డం తప్పు, ఇలా మాట్టాడ్డం తెలంగాణ ఉద్యమానికి చేటు అంటూ మాట్టాడుతున్నాడు. చక్రపాణి మాత్రం ఆ కుర్రాడి నోరు బలవంతానా నొక్కెయ్యాలనే చూసాడు (ఈయనలో తెలంగాణ పట్ల నిష్పాక్షికత ఎల్లప్పుడూ పొంగి పొర్లుతూ ఉంటుంది). ఇలాంటి వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చి చర్చలు పెట్టి తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు అంటూ లంగరు మీద ఆవేశపడి, ఆయాసపడి పోయాడు. ’ఇతణ్ణి మాట్టాడకుండా ఆపుతారా నన్ను వెళ్ళిపొమంటారా’ అని లంగరును బెదిరించాడు.

చక్రపాణి, ప్రభాకరు ఆ కుర్రాణ్ణి నానామాటలూ అన్నారు. మరో విద్యార్థి నాయకుడు ఫోనులో చెప్పిన మాటలను పట్టుకుని, నువ్వసలు ఉద్యమంలో పాల్గొననేలేదు, నువ్వు సమైక్యవాదుల తొత్తువు అనే అర్థం వచ్చేలా చిన్నబుచ్చబోయారు. ఇవన్నీ నేరుగా అతణ్ణి అనలేదు, తెలివిగా ఆ ఆర్థం వచ్చేలా మాట్టాడారు. నువ్వసలు తెలంగాణ వాడివే కాదు, ఖమ్మం జిల్లా సరిహద్దుకు చెందిన కృష్ణా జిల్లా వాడివి అనీ అన్నారు.

పాపం అతడు సమాధానం చెప్పుకోబోతే మధ్యలోనే అడ్డుపడి నోరు మూయించారు. నేను ఉద్యమంలో పాల్గొని జైలుకు పోయాను, చంద్రబాబు ఇంటిదగ్గర ధర్నా చేసి అరెస్టయ్యాను. అంటూ తన ఉద్యమ నేపథ్యాన్ని చెప్పుకోబోతే చక్రపాణి అరిచేసి నోరు మూయించాడు. ఏంమాట్టాడుతున్నావు నువ్వు అంటూ ఆ కుర్రాణ్ణి బెదిరించబోయాడు. ఆ కుర్రాడు చక్రపాణిని ఎదిరించేందుకు ప్రయత్నించాడు. అయితే చక్రపాణికి దీటుగా రౌడీతనం చెయ్యలేకపోయాడు పాపం! అంకం రవి ప్రేక్షకుడే అయ్యాడు.  ఇదే చక్రపాణి గతంలో ఒక కోస్తా ప్రాంతపు విద్యార్థిపై కూడా జులుం చేసాడు. అప్పుడు నే రాసిన టపా చూడండి.

ఇదే చక్రపాణి, నెల్లూరులో హెచ్చెమ్ టీవీ వాళ్ళ దశ దిశ కార్యక్రమంలో కూడా ఇలాంటి 'నిష్పాక్షిక' వ్యాఖ్యలే చేసాడు.. తెలంగాణ రాజకీయ నాయకులు విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తున్నారు అని వచ్చిన ఆరోపణను ప్రస్తావిస్తూ... ’ఎవరో రెచ్చగొట్టినంత మాత్రాన ప్రజా ఉద్యమాలు రావు. ప్రజల్లో సహజంగా ఉప్పొంగిన చైతన్యమే తెలంగాణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది.’ అని చెప్పుకుపోయాడు. కానీ, అదే లెక్క కోస్తా సీమల్లో వచ్చిన ఉద్యమానికి వర్తింపజేయడాయన. కోస్తా సీమల ఉద్యమం, కేవలం నాయకులు చేస్తున్నదేగానీ ప్రజల్లోంచి వచ్చినది కాదని టీవీల్లో చెబుతూంటాడిదే వ్యక్తి!

నిష్పాక్షిక విశ్లేషకులమని చెప్పుకుంటూ, టీవీల ముందు దొంగ కబుర్లు చెబుతూ, వక్రవాణి వినిపించే నిష్పాక్షికుల నోరు మూయించే రోజు ఎప్పుడొస్తుందో! ఈ మే..ధావుల వర్గవివక్ష నుండి సామాన్యులకు ఎప్పటికి విముక్తి కలుగుతుందో!!

21 కామెంట్‌లు:

  1. చదువరి గారు,
    మీ బ్లాగును నేను కనీసం ఒక వారం రోజులు ముందు చూసినా చేసినా బాగుండేది. ఒక మంచి టెంప్లేట్ కోసము నేను చాలా వెదికాను. మీ తెంప్లేట్ సింపుల్‌గా అన్ని సౌకర్యాలతో చాలా బాగుంది. ఇక ఆ సైటులో నాకు కావలసిన వాటిని వెతుక్కుంటాను. మంచి సైటును పరిచయం చేసినందుకు (of course, indirectly) నెసర్లు.

    రిప్లయితొలగించండి
  2. తమ వాదన వినిపించడం తప్పులేదు కానీ పిడి సిద్ధాంతాలూ ,వాదనలూ చేస్తూంటారు...అక్కడే మండుతుంది....మేము పూర్తిగా న్యూస్ ఛానెల్స్ చూడమ్ మానేసామ్...వీళ్ళ మూర్ఖపు వాదనలు వినలేక...very good post....

    రిప్లయితొలగించండి
  3. చదువరి గారూ..

    పేపర్లలో రాతలు రాసేవాళ్ళూ, టీవీల్లో కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళూ జర్నలిస్టులు అనుకుంటున్నారా? ఆ వృత్తిని వాళ్ళు ఎప్పుడో వదిలిపెట్టేశారు. వాళ్ళ పేర్లు ఎప్పుడో మర్చివేయవడ్డాయి. ఇప్పుడు వాళ్ళు చేసే పనికి చాలా చండాలమైన పర్యాయ పదాలున్నాయి.

    రిప్లయితొలగించండి
  4. పిడివాదం చేసేవారు రెండు వైపులా ఉన్నారు లెండి. ఆంధ్రా మేధావులు తెలంగాణా విద్యార్ధి ఉద్యమాల గురించి కూడా అలాగే మాట్లాడు తున్నారు. మీరు ఒక వైపే వేలెత్తి చూప నవసరం లేదు. కాకా పొతే తెలంగాణా మేతావులను వెల్ల మీద లెక్కించ గలం. ఆంధ్రా మేతావులను వెంట్రుకలతో లెక్కించాలి. సంఖ్యా బలం ఎక్కువ కాబట్టి.

    అయితే ఆంధ్రా మేధావులు ఏమి మాట్లాడినా అది అసహజం అనిపించదు, ఎందుకంటే అర్థ శతాబ్దంగా అలవాటు పడిపోయాం. ఒక విధంగా వారు చేపేది de-facto అయిపొయింది.

    అంతెందుకు? ఈరోజు టీవీ నైన్లో రజినీకాంత్ ఒక తెలంగాణా వాది ప్రశ్నను రిలే చేస్తూ లగడపాటిని ఇలా అడిగాడు. "పొట్టి శ్రీరాములు 'సమైఖ్యాంధ్ర' కోసం పోరాటం చేసాడు కదా? అది వేర్పాటు వాదం కాదా?" అని. అందులో 'సమైఖ్యాంధ్ర' అనే పదాన్ని స్వంతంగా చొప్పించాడు, పొట్టి శ్రీరాములు సమైఖ్యాంధ్ర కోసం ప్రాణ త్యాగం చేసినట్టు!

    రిప్లయితొలగించండి
  5. హరి దోర్నాల గారూ,
    అయితే రాజగోపాలుకూ చక్రపాణికీ తేడా లేదన్నమాటేగా? రాజగోపాలుకూ పాత్రికేయులకూ కూడా తేడా లేదన్నమాటేనా?

    నేను చెబుతున్నది రాజకీయ విశ్లేషకుల గురించి. నిష్పొక్షికంగా ఉంటారని చెప్పుకునే వ్యక్తుల గురించి! వాళ్ళకూ అభిప్రాయాలుండటంలో తప్పులేదు, ఉంటాయి కూడా. కానీ తమ విశ్లేషణలో ఈ అభిప్రాయాలను చొప్పించకూడదు. మీరు చెబుతున్నది చర్చలో ఒక పక్షాన్ని ఎంచుకున్న రాజగోపాల్ గురించి. అతడు తన కోణం నుంచే సమస్యను చూస్తాడు. అదే ధోరణిలో మాట్టాడతాడు. రెంటికీ తేడా లేదూ? కేసీయారూ చక్రపాణీ ఒకే ధోరణిలో మాట్టాడితే ఇక వాళ్ళిద్దరికీ తేడా ఏముంది?

    రిప్లయితొలగించండి
  6. నా వ్యాఖ్య మీరు సరిగ్గా గమనించి నట్టు లేదు. నేనన్నది రాజగోపాల్ గురించి కాదు, రాజగోపాల్ ని ప్రశ్నిస్తూ లోపాయికారీగా యాంకర్ సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడిన దాని గురించి.

    ఇక పోతే రాజకీయ పరిశీలకులతో సహా ప్రతి ఒక్కరు పక్ష పాత ధోరణి వహిస్తున్న విషయం సత్యం. చక్రపాణి - తెలంగాణా. తేలకపల్లి - సమైఖ్యాంధ్ర. సి. నరసింహా రావు - సమైఖ్యాంధ్ర. వగైరా.

    రిప్లయితొలగించండి
  7. తెలుగు పదం "వేర్పాటు వాదం", ఇంగ్లీషు separatism నుంచి వచ్చింది. separatism గురించి ఈ లింకు చూడండి.

    http://en.wikipedia.org/wiki/Separatist_movement

    By the way here the word State does not refer to a federal state or subnational entity like AP but refers to sovereign state.

    Don't try to apply too translational dictionary meanings to prove your point

    మీ దృష్టిలో పొట్టి శ్రీరాములు, చిన్న రాష్ట్రాలను సమర్ధించే బీజేపీ అంతా కూడా వేర్పాటువాదులేనా?

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. అవును పొట్టి శ్రీములు వేర్పాటు వాదే తప్పేముంది. అతను తమిళుల నుండీ ఆంధ్రులు వేరు పడాలన్నారు...అలానే తెలంగాణా వాదులందరూ వేర్పాటు వాదులే. దీంట్లోనూ తప్పులేదు.

    రిప్లయితొలగించండి
  10. మీ లెక్క ప్రకారం ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని ఈ క్రింది లిస్టులోని జమ్ముకాశ్మీర్, బోడోలాండ్, అస్సాం, గూర్ఖాలాండ్ వేర్పాటువాదాల సరసన చేర్చొచ్చు. అలా చేసి అమరజీవి పొట్టి శ్రీరాములును అవమానిస్తారా?

    http://en.wikipedia.org/wiki/Separatist_movements_of_India

    ఆ లంగరుకి ఈ విషయంలో మీకంటే కాస్త ఎక్కువ తెలుసేమో, అందుకే ఆయన అదేంటండీ అది తప్పు అని అడగలేదు.

    రిప్లయితొలగించండి
  11. హరి దోర్నాల: "ఇక పోతే రాజకీయ పరిశీలకులతో సహా ప్రతి ఒక్కరు పక్ష పాత ధోరణి వహిస్తున్న విషయం సత్యం." -నిజమేనండి!
    ------------
    Nachiketa: నేను అసలు ఇంగ్లీషు మాటలను రంగంలోకి తీసుకురాలేదు, కేవలం వేర్పాటువాదం అనే తెలుగు మాట గురించే మాట్టాడాను. మీరేమో సెపరేటిజమ్ అనే ఇంగ్లీషు మాటను తెచ్చి దానికి అనువాదాల కోసం వెతికి "translational dictionary meanings" చెప్పి ఆ పని నేను చేస్తున్నానని అంటున్నారు. :)

    "తెలుగు పదం "వేర్పాటు వాదం", ఇంగ్లీషు separatism నుంచి వచ్చింది." అని మీరు అంటున్నారు. తెలంగాణ వాదం వేర్పాటువాదం -అనగా సెపరేటిజమ్ - కాదు అని కూడా అంటున్నారు. మరి దాన్ని ఏమనాలో చెప్పండి. ఇంగ్లీషు మాట కూడా ఏంటో చెప్పండి. ఆ తరవాత మనం మీరిచ్చిన వికీపీడియా లింకుల గురించి మాట్టాడుకుందాం. అక్కడ ఆసక్తికరమైన లింకులు ఇంకా ఉంటాయి, వాటి గురించి కూడా మాట్టాడుకుందాం.

    రిప్లయితొలగించండి
  12. వేర్పాటువాదం అనే తెలుగు పదం ఇప్పుడు కొత్తగా డిసెంబరు పది చిదంబరం ప్రకటన తరువాత రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన పదం కాదు. ఇంగ్లీషు separatism కి సమానంగా తెలుగులో దేశాన్ని విడగొట్టడానికి ప్రయత్నించే శక్తులను ఉద్దేషించి మీడియాలో చాలా విరివిగా వాడే మాట. మీరు వింతగా బ్రౌన్ డిక్షనరీలో సెపరేట్ కి అర్ధాన్ని వెతికి దానికి పక్కన ఒక వాదాన్ని చేర్చే ఇదే మీ ఇజం అని తేల్చేసారు. ఏమైనా అడ్డంగా దొరికిపోయిన తరువాత కూడా మిమ్మల్ని సమర్ధ్నిచుకొనేందుకు బాగానే కష్టపడ్డారు, అందుకు మిమ్మల్ని అభినందించాలి. అయితే మీరే కనుక్కున్న ఈ అర్ధం తెలుసుకోనందుకు పాపం ఆ లంగరునెందుకు తిడతారు?

    రిప్లయితొలగించండి
  13. translational meaning వాడడం తప్పని నేననలేదు. too-translation, with literal meaning తప్పని అన్నాను. "వేరుపడటం" అనే పదం యొక్క అర్ధం మీరిచ్చింది నిజమే, కానీ పక్కన వాదాన్ని చేర్చినప్పుడు అర్ధం మారిపోతుంది. మీరు చెప్పినట్లు భాషకు కొత్త అర్ధం కాదు , అదే భాష యొక్క అర్ధం. దానిని తెలంగాణా వాదులు కనిపెట్టలేదు. అన్నదమ్ములు విడిపోవడం కూడా ఇంగ్లీషులో సెపరేట్ కావడమే కానీ అది separatism కాదు.

    రిప్లయితొలగించండి
  14. మీరు ఆంధ్రామృతం లో ప్రకటించిన పద్యాలు బావున్నాయి. శాసనసభ్యుడు తన నియోజకవర్గానికి వెళ్లినట్టుగా ఏడాదికి ఒకసారి గాకుండా మీరు తరచుగా పద్యాలు వ్రాయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  15. ఛాలా భాగా వ్రాస్తున్నారు, థాంక్ యూ.

    నేను తెలంగాణా వాడిని, సమైక్యఆంధ్ర ను మనస్పూర్థి గా కోరుకుంటాను. ఇది గట్టిగా అరిచి చెప్పటానికి నాలాంటి వల్లకు ఒక వేదిక కోసం చూస్తున్నాను. మీరు ఎమైనా సహయ పడగలరా?

    రిప్లయితొలగించండి
  16. I agree the term "separatist" is perfectly genuine in the context. However it applies equally to Potti Sreeramulu.

    రిప్లయితొలగించండి
  17. జార్జి గారూ, పొట్టి శ్రీరాములు ఉద్యమించినది కూడా వేరు పడేందుకే!

    రిప్లయితొలగించండి
  18. Babu Chaduvari......
    Nuvvu asalu Telangana valla gurunchi eantha vetakaram ga maatladutunnava, jai Telangana antay, andhra Down... Down..... ani kadu, mee andhra vaallu Tamilnadu nundi vidipotam ani aannappudu tamil vaallu mee gurunchi intha nithyam ga maatladukunivuntaru, aappudu eela Bolgs, Mails media,Leavu kkabatti mee gurunchi vallu eami anukunnaro meku teliyadu,. Meeru kuda 1953 lo "verupatuvadi"

    రిప్లయితొలగించండి
  19. బాబూ అజ్ఞాత, నువ్వు ఏం చెప్పావో అర్థం కాలేదుగానీ, బాగానే చెప్పావోయ్!

    రిప్లయితొలగించండి
  20. ఒకసారి,ఒక తెలంగాణావాది(ఎవరో మీకు తెలుసు.ఇక్కడ వ్యక్తిగత ప్రస్తావన ముఖ్యం కాదు) ఒక T.V.ఇంటర్వూ లో ఇలా అన్నాడు."1956 నవంబర్ 1 కి ముందు మాది ఒక ప్రత్యేక రాష్ట్రం.1956 నవంబర్ 1 న రెండు రాష్ట్రాల కలయిక ఈ ఆంధ్రప్రదేశ్.ఇప్పుడు మేమడుగుతున్నది 1956 కి ముందు ఉన్న మా రాష్ట్రం.అప్పటి రాష్ట్రం లో ఒక్క ఇంచ్ తక్కువైనా ఊరుకోం.ఆంధ్ర ప్రాంతం నుండి ఒక్క ఇంచ్ కూడా మాకు అక్కరలేదు"అని.

    నిజానికి 1956 నవంబర్ 1 కి ముందు తెలంగాణా రాష్ట్ర మనేది ఏదీ లేదు.నిజాం పాలన లో "16 జిల్లాలుగా గల హైదరాబాద్ రాష్ట్రం" 1948 సెప్టెంబర్ 17 పోలీస్ చర్య తరువాత ఇండియన్ యూనియన్ లో విలీనమైంది.అప్పటి నుండి 1956 నవంబర్ 1 న భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేవరకు హైదరాబాద్ ఒక రాష్ట్రంగా కొనసాగింది. అప్పటి "16 జిల్లాలుగా గల హైదరాబాద్ రాష్ట్రం"లో "8 జిల్లాలు గల తెలంగాణా ప్రాంతం(తరువాత 1978 లో రంగారెడ్డి,హైదరాబాద్ 9,10 వ జిల్లాలుగా ఏర్పడ్డాయి)" ఒక భాగం మాత్రమే.విలీనం తరువాత 1950 వరకు జనరల్ J.N.Chowdary సైనిక పాలన కొనసాగింది.తరువాత హైదరాబాద్ రాష్ట్ర తాత్కాలిక Civil Administrator గా M.K.Vellodi 1950 జనవరి 26 న భారత ప్రభుత్వం చే నియమింపబడ్డారు.1952 లో తొలి సారత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లు గల హైదరాబాద్ రాష్ట్రం లో 93 సీట్లు గెల్చుకొన్న కాంగ్రెస్ పార్టీ,బూర్గుల రామకృష్ణా రావు CM గా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.1955 లో 1st State Reorganisation Commission హైదరాబాద్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి కన్నడం మాట్లాడే 3 జిల్లాలని కర్ణాటక లో,మరాఠా మాట్లాడే 5 జిల్లాలని మహరాష్ట్ర లో కలిపి మిగిలిన "8 జిల్లాలు గా గల తెలంగాణా ప్రాంతాన్ని" ప్రత్యేక రాష్ట్రంగా గాని లేక అప్పటికే ఒక రాష్ట్రం గా ఉన్న ఆంధ్ర రాష్ట్రం లో గాని కలపవచ్చు అని సిఫార్సు చేసింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కోసం కేంద్రం ప్రయత్నిస్తున్న తరుణం లో తెలుగు మాట్లాడే ఆంధ్ర రాష్ట్రం పక్కనే తెలంగాణా ను ప్రత్యేక రాష్ట్రం చేయడంలో అర్థం లేదు.అలాగని అప్రజాస్వామికంగా కలుపలేరు కాబట్టి 1955 డిసెంబర్ లో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానం పెట్టగా హాజరైన 147 మందిలో 103 మంది తెలంగాణాను ఆంధ్ర రాష్ట్రం లో కలుపమని, 29 మంది వద్దని వాదించారు. 15 మంది తటస్థంగా ఉన్నారు.ఆ తరువాత కూడా తెలంగాణావాసుల అపోహలు తీరుస్తూ 1956 ఫిబ్రవరి 20 న పెద్దమనుషుల ఒప్పందం(Gentlemen's Agreement ) చేసుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక తెలంగాణా కు ప్రత్యేక హక్కులు,రాయితీలు కల్పిస్తామని ఆంధ్రనాయకులు హామీ ఇచ్చారు.దాంతో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో ఆ "8 జిల్లాల తెలంగాణా ",ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కావడానికి మార్గం సుగమమైంది. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసారు.
    ఔరంగాబాద్,బీడ్,నాందేడ్, పర్భాని ,ఉస్మానాబాద్ అనే 5 జిల్లాలను మహరాష్ట్ర లో(అప్పటికి దాన్ని బోంబే రాష్ట్రం అనేవారు) కలిపారు.
    బీదర్,గుల్బర్గా,రాయచూర్ అనే 3 జిల్లాలను కర్ణాటక లో కలిపారు.
    "మిగిలిన 8 జిల్లాల తెలంగాణా"ను అప్పటి ఆంధ్రరాష్ట్రంతో కలిపి 1956 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసారు.పై మార్పులన్నీఒకేసారి చేసారు.కాబట్టి తెలంగాణాను హైదరాబాద్ రాష్ట్రం నుండి వేరు చేయడం, ఆంధ్ర రాష్ట్రం లో విలీనం చేయడం రెండూ ఒకేసారి జరిగాయి.అంటే కనీసం ఒక్క రోజు కూడా తెలంగాణా ఒక ప్రత్యేక రాష్ట్రంగా గాని,కనీసం ప్రత్యేక పరిపాలనా విభాగం గా గాని చరిత్ర లో ఎప్పుడూ లేదు.మరి ఇప్పుడు తెలంగాణావాదులు అన్నట్టు అప్పటి హైదరాబాద్ రాష్ట్రం"ఒక్క ఇంచ్ కూడా" కోల్పోకుండా కావాలంటే మహరాష్ట్ర ని, కర్ణాటక ని కూడా అడగాలి.అడిగితే బాగుండేది వాళ్ళని "ఒక్క ఇంచ్ కోల్పోకుండా కావాలని ".అప్పుడు ఒక్క పంచ్ కూడా వేస్ట్ అవకుండా కుమ్మేస్తారు వాళ్ళు.అసలే ఆ రాజ్ ధాకరే మంచోడు కాదు

    రిప్లయితొలగించండి
  21. Truth teller గారితో ఏకీభవిస్తున్నాను. తెలంగాణ పేరుతో వీళ్ళు కోరుతున్నది నిండా ఒక కొత్త రాష్ట్రం, దేశచరిత్రలో ఎప్పుడూ, ఏ కాలంలోనూ లేని రాష్ట్రం. అయితే ఒక విషయం. ప్రత్యేకాంధ్ర అయినా, ప్రత్యేక సీమ అయిన ఐలాంటి లేని రాష్ట్రాలే.

    Truth Teller గారికి ఇష్టమైతే ఆయన మాటల్ని నా బ్లాగులో వాడుకుంటాను.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు