12, సెప్టెంబర్ 2009, శనివారం

కంప్యూటరు ఈ యుగపు ఋక్కు

సమకాలీన తెలుగు కవుల్లో గరికపాటి నరసింహారావు ప్రసిద్ధులు. దేశవిదేశాల్లో దాదాపు 250 అవధానాలు చేసిన పండితుడాయన. టీవీల్లో కావ్యపఠనం చేస్తూ పండిత పామరులను అలరిస్తూ ఉంటారు. ఛందోబద్ధ పద్యాలను వినసొంపుగా పాడి పండిత పామరులను అలరిస్తూ ఉంటారు.

సాగర ఘోష ఆయన రాసిన పద్యకావ్యం. ప్రాచీన కాలం నుండి ప్రస్తుతం వరకు మానవాభ్యుదయం గురించి 1100 పద్యాల్లో రాసిన కావ్యమది. మానవ చరిత ప్రస్థానంలో చోటుచేసుకున్న యుద్ధాలు, సాంకేతిక ఆవిష్కరణలవంటి అనేక ముఖ్యఘట్టాలను, అనేకమంది ప్రముఖ వ్యక్తులను స్పృశిస్తూ సాగుతుంది ఈ కావ్యం. కంప్యూటరు ఆవిష్కరణ గురించి కూడా రాసారు. ఊరికినే రాయడం కాదు, కంప్యూటరుకు ఎంతో ప్రాముఖ్యతనిస్తూ ఏకంగా ఒక పెద్ద దండకమే రాసారు. కావ్యం రాసేసి చదూకోండి ఫోండ నలేదాయన, చక్కగా గానం చేసి, మనకు వినిపించారు. ఈ కంప్యూటరు దండకాన్ని ఇక్కడ వినిపిస్తున్నాను.


ముందు, కంప్యూటరు గురించి ఆయన రాసిన ఒక చక్కటి పద్యం.. లయబద్ధంగా అశ్వగతిలో సాగుతుంది, ఈ లయగ్రాహి పద్యం. (రాకేశ్వరుని లయగ్రాహి వివరణ గురించి చూసారా?) ఇదిగో ఈ పద్యం చదువుతూ, వినండి. వింటూ చదవండి.

లెక్కలను చెప్పగను చిక్కుముడి విప్పగను పెక్కుపను లొక్కపరి చక్కగను జేయన్
క్కరము లంపగను మక్కువలు నింపగను దిక్కులను చల్లగను చుక్కలను బంపన్
చుక్కలను సూక్ష్మమును ముక్కలును మూలమును ఒక్కటె సమస్తమను అక్కజము చూపన్
దిక్కెవరు ఈ యుగపు ఋక్కెవరు యంత్రముల దిక్కరివి నీవెగద మ్రొక్కులను గొమ్మా!


ఈ పద్యం తరవాత మొదలౌతుంది లయబద్ధంగా సాగే దండకం. కవికి, కంప్యూటరు విఘ్నేశ్వరుని తలపిస్తుందట -విఘ్నేశ్వరీదేవి యట! :)
మాహాశాస్త్రవేద్యా మహాతంత్ర విద్యా
మహాబుద్ధిసాధ్యా అసాధ్యా అభేద్యా


భవత్సృష్టి ఈ సృష్టి రూపంబు మార్చెన్, స్వరూపమ్ము దీర్చెన్
భవద్రూపమున్ జూడ నాకేలనో ఆదిదైవంబు విఘ్నేశ భావంబు దోచున్ మనంబందు


'ఎన్నడైనేన ఒక్కింత పాడైన చో నాడు మామోము మేమైన చూడంగ కీడౌనుగా ' అని అంటున్నాడు కవి.



వాన వెలిసినట్టుంది గదా! :) ఇంకా చూడండి..
కంప్యూటరు దేవీ! నీకెన్ని భాషలు తెలుసునో గదా! వేవేల భాషలు, లిపిలేని భాషలు, విశేషాల భాషలు, వినూత్నమైన భాషలు.. ఎన్ని తెలుసమ్మా నీకు!! పాస్కల్లు, లోటస్సు, డీబేసు, బేసిక్కు, కోబాల్, ఒరాకిల్లు, సీప్లస్సు, ప్లస్‌ప్లస్సు,..



నీ వ్యాప్తిని ఊహింపశక్యమే నాకు! పెళ్ళిళ్ళలో నీవె, పేరంటములలో నీవె, కాలేజిలన్నీవె, కాటేజిలన్నీవె, పెద్ద హోటళ్ళలో పూటకూటిళ్ళలో, అణ్వాయుధమ్మందు ఆఫీసు ఫైళ్ళందు, రోదశీ యాత్రలో ద్వాదశీ పూజలో.. పెద్దదో చిన్నదో నీ రూపమే కనిపించు గదా!


నీవు లేక మేము ఉండటమన్న ఆలోచనే పరిహాసముగా తోచుచున్నది. Y2K గండాన్ని గట్టెక్కి, ప్రపంచాన్ని గట్టెక్కించావు.


నీ దివ్యగాథలను చెప్పుకోడానికి శతాబ్దులు సహస్రాబ్దులూ సరిపోవు తల్లీ! ఆరోవేదానివి, ఏడోశాస్త్రానివి కంప్యూటరు తల్లీ!!



సాగరఘోష మొత్తం కావ్యాన్ని గరికపాటి నరసింహారావు గొంతులో ప్రవచనం.కామ్ లో వినండి.

11 కామెంట్‌లు:

  1. పద్యాలు భావయుక్తంగానూ, ఆడియోలో వింటుంటే వినసొంపుగానూ ఉన్నాయి. అందించినందుకు మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. చాలా మంచి పోస్టు వేశారు . నా లయగ్రాహి టపాలో ఆయన పాడిన తీరు వినిపించలేక, దాని ఔనత్యాన్ని పాఠకులకు తెలపలేకపోయనని బాధవేసింది.
    లోటుఁ దీర్చారు.

    కానీ ఈ కంప్యూటరు పొగడ్తలు విని నాకు నవ్వాలో ఏడ్వాలో అర్థంకాలేదు. కంప్యూటర్లు ఎంత డంబో NLP వంటి రంగాల్లో పని చేసేవారిని అడగాల్సిందే.

    అంతెందుకూ కంప్యూటర్లలో మొత్తం తెలుఁగు సాహిత్యం అంతా వుంది. http://ulib.org లో. ఐనా వాటికి ఏం తెలియవు. :(
    వాటిని యూనీకోడీకరించడానికే తాతలు దిగిరావాల్సివస్తుంది.
    దూరపు కొండలు నునుపంటే ఇదేనేమో.

    రిప్లయితొలగించండి
  3. చదువరి గారు,
    మీరిచ్చిన లంకే లో శబ్దం స్పష్తం గా ఉందా?
    ( అంటే సుజన్రంజని లో అంత స్పష్టం గాను )
    విరు ఈ కావ్యం మొత్తం సభా ముఖం గా ఢారణ చేజేసారు. ఆ సభా విశేషాలు కాప్యపటనము సురస లో ఉన్నయి కాని -

    రిప్లయితొలగించండి
  4. vookadampudu: సురసలో కేవలం కావ్యపఠనం ఉంది. పైగా స్పష్టంగా లేదు.. ప్రవచనంలో మాత్రం సుజనరంజనిలో ఉన్నట్టుగానే అర్థవివరణ సహితంగా, పూర్తి కావ్యం, అంతే స్పష్టంగా ఉంది. డౌనులోడు చేసుకునే శ్రమ, సమయం వెచ్చించవచ్చు. :)

    రిప్లయితొలగించండి
  5. మీకు చాలా ఓపిక ఎక్కువ ... మీ బ్లాగ్ బాగుంది ... మీరు మెయిల్ చిరునామా పంపండి ...

    రిప్లయితొలగించండి
  6. మీ బ్లాగు కొత్త థీమ్ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  7. సాంకేతికపరమైన విషయాన్ని అంత లయబద్ధంగా అచ్చంపుతెలుగు నుడికారంతో కమ్మనిగాత్రంలో వినడం నాకు ఇదే మొదటిసారి. అక్షరాలా అద్భుతంగా వుందండీ. మీకూ, నరసింహారావుగారికీ కూడా ధన్యవాదాలు.
    మాలతి

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు