21, మే 2009, గురువారం

తెలంగాణపై రహస్య సమావేశం

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కల సాకారమయ్యేందుకు అవసరమైన అనుకూల వాతావరణం ఏర్పడింది.  ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏర్పడిన తెలంగాణ-అనుకూల పరిస్థితులు ఇంతకు ముందెన్నడూ లేవు. త్వరలో రాష్ట్ర విభజన మొదలయ్యేందుకు రాజకీయ సమీకరణాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి.


తీర్మానం  పెడితే, రాష్ట్ర శాసనసభలో 289 -5 వోట్ల తేడాతో గెలుస్తుంది. లోక్‌సభలో కనీసం 500  వోట్లు అనుకూలంగా వస్తాయి.
  1. కాంగ్రెసు పార్టీ చూడండి. అందులోని తెలంగాణా నాయకులంతా ప్రత్యేక రాష్ట్ర అనుకూలురే, తెలంగాణ ఏర్పాటును బలంగా కాంక్షించేవారే -కనీసం అలా చెబుతున్నారు మనకు. అలా కాంక్షించనివారు కూడా మేడమ్‌గారి నిర్ణయాన్ని నెత్తిన పెట్టుకునేవాళ్ళేగానీ మరోలా ఆలోచించేవారు కాదు. ఈ ముక్కముఖ్యమంత్రి దగ్గరినుండి ప్రతీ కాంగ్రెసు నాయకుడూ చెప్పేదే.  మొన్నటిదాకా యూపీయేలోను బయటా అనేకమంది మీద ప్రభుత్వం ఆధారపడి ఉండేది. ఇప్పుడలా కాదు.. మేం మద్దతిస్తామంటే మేమిస్తామంటూ వెంటపడుతున్నారు. కాబట్టి తెలంగాణ ఇస్తామంటే వాళ్ళెవరూ కిక్కురుమనరు. ఇస్తామంటే కాదు, అమ్మేస్తామన్నా వాళ్ళు సరేనంటారు. 
  2. బీజేపీ, యానీ.. ఎన్‌డీయే:  వీళ్ళ సంగతి చెప్పేదేముంది? కిందటి సారే చెప్పారు.. మీరు బిల్లు పెట్టండి, మేం మద్దతిస్తాం అని. ఇప్పుడూ సిద్ధంగానే ఉంటారు. పైగా వంద రోజుల్లో తెలంగాణ అనే నినాదం ఒకటి ఉండనే ఉంది.
  3. తెలుగుదేశం:  సమైక్య వాదులు కాస్తా వేర్పాటువాదులయ్యారు కాబట్టి, వీళ్ళూ అడ్డు చెప్పరు.
  4. కమ్యూనిస్టులు: వాళ్ళెవరూ అని అడక్కండి.. ఉన్నారు! ఒకరు అనుకూలం, ఇంకోరు వ్యతిరేకం. (ఇంకా ఉన్నారుగానీ, వాళ్ళ లెక్క నాకు తెలవదు, తెలిసినా మనకనవసరం.) అయితే వీళ్ళ మాటను వినిపించుకునే వాడు లేడు, వాళ్ళ అభిప్రాయాలు ఎవడికీ అక్కర్లేదు.
  5. ప్రజారాజ్యం, లోక్‌సత్తా:  వీళ్ళు కూడా తెలంగాణకు అనుకూలంగా ఉన్నారనే చెప్పారు, కాబట్టి దిగుల్లేదు.
  6. ఇహ, తెరాస . తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ ఇది. కాబట్టి వ్యతిరేకించదు. 
ఇవన్నీ ఒక సాధారణ పౌరుడిగా నా అనుకోళ్ళు. "నీమొహం, తెలంగాణకు అనుకూలమని పైకి అందరూ చెప్పేవారేగానీ ఇవ్వాలని ఎవ్వడికీ లేదు, చివరికి తెరాసకు కూడా" అని మీరంటే నే చెప్పేదేమీ లేదు.

కింది చర్చ చూడండి .  రాత్రి నాకొచ్చిన కలలో జరిగిందిది. నాకొచ్చిన కల కాబట్టి నాకు నమ్మాలనిపిస్తోంది. మీరు నమ్మకపోతే మీ ఇష్టం. తెలంగాణ ఎప్పుడిద్దామా అని వీళ్ళంతా ఎంతో ఆత్రంగా ఉన్నారు. ఖచ్చితంగా త్వరలో తెలంగాణ వస్తది.
------------------------------------------------

 ఎన్నికల ఫలితాలు రాగానే తెలంగాణ అంశాన్ని ఎలా తేల్చాలనే విషయంపై ఒక రహస్య సమావేశం జరిగింది. అన్ని పార్టీలూ ఈ సమావేశంలో పాల్గొన్నాయి. వాళ్ళ సంభాషణ ఇది:


పాల్గొన్నవారు:
  1. రాజశేఖరరెడ్డి
  2. కేవీపీ
  3. రోశయ్య
  4. చంద్రబాబు నాయుడు
  5. కె నారాయణ
  6. రాఘవులు
  7. కేసీయారు

ప్రధాన ఎజెండా: తెలంగాణ వెంఠనే ఇవ్వడం ఎలా?
ముఖ్య నిబంధన: శాసనసభలో లాగా మాట్టాడుకోరాదు. రహస్య సమావేశం కాబట్టి పెద్దగా అరవరాదు.

రోశయ్య, నారాయణ, రాఘవులు కూచ్చుని మాట్టాడుకుంటున్నారు. మిగతావాళ్ళు ఇంకా రాలేదు. ఏంటీ వీళ్ళింకా రాలేదు అని నారాయణ అడిగాడు.

రోశయ్య: వచ్చారు. బాబు రాజశేఖరరెడ్డి గారితోటీ, కేసీయార్ గారు కేవీపీగారితోటీ విడిగా సమావేశమయ్యారు. వచ్చేస్తార్లెండి.

రాఘవులు: వాళ్ళూ వాళ్ళూ మాట్టాడుకునేదానికి ఇక మేమెందుకిక్కడ? నారాయణా పద పోదాం.

రోశయ్య: ఆగండాగండి, వచ్చేస్తున్నారు. వాళ్ళకీ వాళ్ళకీ సవాలక్ష ఉంటాయి. ఇలాటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్టాడుకుంటారు?

అంటూండగానే ఓ గదిలోంచి బాబు, రాజశేఖరరెడ్డి, మరో గదిలోంచి కేసీయారు, కేవీపీ వచ్చారు. అందరూ కూచ్చున్నాక,
నారాయణ: ప్రజారాజ్యాన్ని పిలవలేదేంటండి?
రోశయ్య: పిలిచామండి. మాకు తెలంగాణ గురించి పెద్దగా తెలీదు, రామని చెప్పారు. తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరున్నారుగానీ, వాళ్ళ మెదళ్ళకు తాళాలేసి, అరవిందు పట్టుకుపోయాడు, అ సంగతేదో మీరే చూచుకోండని చెప్పారు.

నారాయణ: మరి లోక్‌సత్తాయో?
రోశయ్య: వాళ్ళనీ పిలిచాం. "తెలంగాణ ఇచ్చేందుకు మీరెవరు? మీరేమన్నా దేవుళ్ళా? మీరెవరండీ ప్రజలపై మెహర్బానీ చూపించడానికి? ఏఁ మీ జేబులోంచి ఇస్తున్నారా? అసలు మీరివ్వడమేంటి, చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే పరిపాలన బాగుంటుందని ప్రజలు అనుకుంటే వాళ్ళే తీసుకుంటారు,.."  అంటూ ఇంకా ఏంటో చెప్పారు, నాకు అర్థం కాలేదు. సరే రారు కాబోలని అనుకున్నాను.

రోశయ్య: సరే ఇక ఆ సంగతులను పక్కకు పెట్టి మనపని చూచుకుందాం. తెలంగాణను ఇచ్చే విషయాన్ని చర్చించేందుకు  మేం మిమ్మల్ని పిలిచాం.ఇప్పుడూ..
కేసీయారు: నువ్వు తెలంగాణ ఇచ్చెటోనివి, నేను తీసుకునెటోన్నా? గట్లని చెబితే వచ్చెటోన్ని కాదుగదా. రాజశేఖర్, ఏందయా మాట్టాడవ్?
రాజశేఖరరెడ్డి: రోశయ్యగారూ, పాయింటుకు రండి!
రోశయ్య: సరే.. తెలంగాణ ఇచ్చే విషయంలో మనందరం అనుకూలమే కాబట్టి ఎలా ఇవ్వాలనే విషయంపై మాట్లాడుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసాము.   
రాఘవులు: మేం తెలంగాణకు వ్యతిరేకమని చెప్పాం గదా, నన్నెందుకు పిలిచినట్టు?

రోశయ్య: మీరు లేకపోతే ఈ పని సానుకూలపడదండి, అందుచేత పిలిచాము. కాస్త ఓపిగ్గా వినండి.

అని చెప్పి రోశయ్య కొనసాగించాడు..

రోశయ్య: మనందరం తెలంగాణకు అనుకూలమే కాబట్టి, వెంటనే ఆ దిశగా చర్య తీసుకోకపోతే మనమీద వత్తిడి వస్తుంది. జాప్యమెందుకవుతోంది అని అడుగుతారందరూ. దానికి సమాధానం చెప్పటం అంత తేలిక కాదు. బాబూ,  నువ్వు చెప్పు అవునా కాదా?

బాబు: అవును.
రోశయ్య: తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రంలో ఇప్పుడు మాకు అడ్డేమీ లేదు. రాష్ట్ర శాసనసభలో 288 మంది తెలంగాణకు అనుకూలం. అర్జెంటుగా తెలంగాణ ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టాలి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడం గురించి ఇప్పుడు మనం చర్చించాలి.

వెంటనే బాబుకు ప్రణబ్ ముఖర్జీ కమిటీ గుర్తుకొచ్చింది. "మళ్ళీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేయిద్దామా?" అని అడిగాడు.

రాఘవులు: ఇంతకీ అసలు సంగతేంటో చెప్పండి, ఇలా డొంకతిరుగుడు మాటలెందుకు?
రాజశేఖరరెడ్డి: ఇదిగో రాఘవులూ, చెబుతున్నాం గదా, కాస్తాగు, రోశయ్య గారూ, మీరు కానీండి.
రోశయ్య:  ప్రణబ్ ముఖర్జీ కమిటీ పాతది. మళ్ళీ అలాటి కమిటీ వేస్తే మనం జాప్యం చేస్తున్నామని తెలిసిపోతుంది. అందుచేత మనం వేరే మార్గమేదైనా కనుక్కోవాలి.
నారాయణ: ఏముంది, ఇద్దామనుకున్నాం, ఇచ్చేద్దాం. అంతే!
రాఘవులు: ఏంది ఇచ్చేది, మీ ఇష్టమేనా?
నారాయణ: నా అభిప్రాయం చెప్పడం కూడా నా ఇష్టం కాదా? ఇలా మాట్లాడితే ఎలాగండీ రాఘవులు గారూ?
రాఘవులు: రాష్ట్రం ఏర్పాటు చెయ్యడమంటే మంగళగిరిలో పోటీ చేసినట్టు కాదు.
నారాయణ: ఓహో.. అయితే ఖమ్..
రాజశేఖరరెడ్డి: అబ్బబ్బ..బాబూ ఏంటయ్యా ఇది? నువ్వన్నా చెప్పు వీళ్ళకి.

బాబు: ఏంటి రోశయ్య గారు? కూటమి అన్నాక ఆ మాత్రం తగువులు ఉండవా ఏంటి? మీకివన్నీ కొత్తైనట్టు మాహాడుతున్నారేంటి? రాఘవులూ, నువ్వాగు. నారాయణా, ఆయన చెప్పేది విను ముందు.

రోశయ్య:  ఇవ్వొచ్చు, ఇవ్వాలి కూడా. కానీ ఆ ఇచ్చే పద్ధతే ఎలాగా అని మనం తేల్చుకోవాలి.

నారాయణ: ఏముంది, శాసనసభలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపిద్దాం. లోక్‌సభ కూడా ఒక తీర్మానం పెట్టి ఆమోదిస్తుంది, అంతే!
రోశయ్య: అబ్బ, ముఖ్యమంత్రి గారూ నారాయణ గారికి చెప్పడం నావల్ల కాదిక. మీరే చెప్పండి.

రాజశేఖరరెడ్డి: నారాయణా,  ముందు మన చర్చ కానివ్వు. తరవాత.. నీ ప్రశ్నలు, సలహాలు, సూచనలు. సూరీడూ, భోజనాలు తీసుకురా!

రాజశేఖరరెడ్డి: కేవీపీ , నీ అభిప్రాయం చెప్పు
కేవీపీ: అందరికీ పనికొచ్చే ఉపాయం ఒకటుంది.. వెంటనే రెండో ఎస్సార్సీ వేద్దాం
కేసీయార్ ఉలిక్కిపడ్డాడు. "అదేంటి, మాకది పనికి రాదు. మేం ఎస్సార్సీకి వ్యతిరేకం"
కేవీపీ: సరే అయితే, నారాయణ చెప్పినట్టు తీర్మానాలు చేసేద్దాం, పనైపోద్ది.
కేసీయారు: ఒద్దొద్దు.. ఎస్సార్సీయే వేద్దాం.
నారాయణ: కేసీయార్ గారూ అదేంటండి.. తీర్మానం చేస్తే మంచిదేగదా మీకు, వెంటనే మీ డిమాండు నెరవేరుద్ది గదా!
కేసీయారు: (ఆ తరవాత నేనేం చెయ్యనూ? ) ఎస్సార్సీ వేస్తే పని జర స్పీడుగైతదండి.
నారాయణ: అదెలాగ?


కేవీపీ: నేజెపుతా. ఇప్పుడూ.. రాష్ట్రాన్ని చీల్చేటపుడు ఆస్తి పంపకాల దగ్గర గొడవలౌతాయి కదా.. వాటిని పరిష్కరించుకోడానికి ఒక కమిషను ఎలాగూ వెయ్యాల్సి ఉంటుంది. అదేదో ఎస్సార్సీ వేస్తే పనిలోపనిగా ఆ పని కూడా అయిపోద్ది గదా, దాంతోటి తెలంగాణ రెట్టింపు వేగంగా వచ్చేస్తుంది.

రాఘవులు: తెలంగాణ వచ్చీ రాగానే తెరాసలో ఆ ఏడెనిమిదిమందిని కూడా మీరు లాగేస్తారు గదా. ఇక అందులో కేసీయారు, ఆయన కొడుకూ అల్లుడే మిగులుతారు.
కేసీయారు: సూరీడూ, దూపయితాంది, నీల్లియ్యి. రాగవులు గారూ, గిదేం మంచిగ లేదు. ఈ మీటింగుకు ముందె గద, కేవీపీతో మాట్టాడిన.. గట్ల జెయ్యనని చెప్పిండు!
రాఘవులు:నువ్వు నమ్మేసావు! సరే కానివ్వు. అయినా నువ్వు చేసిన పనికి మీవాళ్ళు నీమీద తిరుగుబాటైనా చేస్తారు చూడు.
కేవీపీ : రాఘవులూ కాస్త ఆపుతావా? ...అంచేత, ఎస్సార్సీ వేద్దాం.

బాబు: కానీ ఆ ఎస్సార్సీ తన నివేదికను వెంటనే ఇవ్వాలి కదా?
కేవీపీ: కమిటీ తన నివేదికను ఆగమేఘాల మీద ఇచ్చే ఏర్పాటు మనం చేద్దాం, మన చేతిలోని పనేకదా
నారాయణ: ఎలా?
కేవీపీ: ఆ కమిషనులో మా లగడపాటినీ, సర్వే సత్యనారాయణనీ వేద్దాం.
రోశయ్య (చప్పట్లు కొడుతూ): భలే, భలే! చక్కటి కాంబినేషను.

బాబుకు రాఘవులుకు ఆసక్తి కలిగింది. ఉత్సాహంగా చర్చలో పాల్గొన్నారు.
బాబు: మా యనమల రామకృష్ణుణ్ణి కూడా వేద్దాం.
రాఘవులు: గాదె వెంకటరెడ్డినీ, టీజీవెంకటేషును కూడా వెయ్యండి.
రాజశేఖరరెడ్డి: కేవీపీ, అవునయ్యా, టీజీవెంకటేషును కూడా వెయ్యి. కమిటీ పని వేగవంతం అవుతుంది. అవునూ మధు యాస్కీని, గోనె ప్రకాశరావును కూడా వేస్తే బాగుంటుందేమో!?
కేవీపీ: బ్రహ్మాండం, కమిటీ మంచి తూకంగా ఉంటుంది. చంద్రశేఖర్రావ్, మీవాళ్ళ పేరేదైనా చెప్పు.
కేసీయారు: ఎవరో ఎందుకూ? నేనే ఉంటా.


రాఘవులు: మా పార్టీ తరపున తమ్మినేని వీరభద్రాన్ని పెడదాం.

నారాయణ: ఎస్సార్సీలో రాజ్యంగ నిపుణులు ఉండాలేమో కదండీ. రాజకీయ నాయకులను వేసేస్తున్నారేంటి?
రాజశేఖరరెడ్డి: అదేమంత గొప్ప సంగతేమీ కాదులేవయ్యా. నేను చూసుకుంటాలే!.
రోశయ్య: మా లగడపాటి రాజ్యాంగ నిపుణుడేగా. ఆయన కంటే ఎక్కువ రాజ్యాంగం తెలిసినవాళ్ళున్నారా? పైగా మొదటి ఎస్సార్సీ నివేదికను క్షుణ్ణంగా చదివాడు కూడాను.

నారాయణ:  కమిటీ చేస్తున్న పని గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పేందుకు మంచి అధికార ప్రతినిధి ఉండాలండి.
రాజశేఖరరెడ్డి: ఒక్కడు కాదయ్యా, ఇద్దర్ని వేద్దాం. మా జానారెడ్డి, కేశవరావు ఉన్నారు గదా!  వాళ్ళైతే అన్ని వివరాలనూ ప్రజలకు అర్థమయ్యేలా చక్కగా చెబుతారు.

బాబు: బావుంది. సభ్యులు ఎంత చురుకైన వాళ్ళున్నా.. అధ్యక్షుడు స్పీడుగా లేకపోతే పని చకచకా సాగదు. దానికి సరైన వ్యక్తి ఎవరో?
కేవీపీ: ఇంకెవరు, మా ప్రణబ్ ముఖర్జీ ఉన్నాడు గదా. ఆయనే దీనికి సరైన వ్యక్తి.

నారాయణ:
ఏమోనండి, ఈ ఎస్సార్సీ అదీ.. అంత తొందరగా తేలే వ్యవహారంగా అనిపించడం లేదు. నేరుగా సభల్లో తీర్మానాలు పెట్టి తేల్చేయకుండా ఎస్సార్సీ అంటున్నారు.
కేసీయారు: నారాయణ గారూ.. ముందు మీ పళ్ళెం దిక్కు చూడండి.. రాగవులు మీ చికెను ముక్కల్ని తీసుకుంటాండు.
నారాయణ: బాబు గారూ ఏంటండీ ఇది? నేనసలు రాఘవులు గారి పక్కన కూచ్చోనని చెప్పాను. మీరేమో బర్దన్‌తో చెబుతానని భయపెట్టి బలవంతాన ఇక్కడ కూచ్చోబెట్టారు. ఇప్పుడు చూడండి.. నాలుగు ముక్కలు తగ్గాయి.
బాబు: ఇక ఆపవయ్యా నారాయణా. పోదాం పదండి. మనం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ సుడిగాలి వేగంతో ముందుకు పోతుంది.  
కేవీపీ: ఇంకో సంగతి.. ఎస్సార్సీ పని అనుకున్నంత వేగంగా జరగడం లేదని ఎప్పుడైనా మనకు అనిపిస్తే, దాన్ని బలోపేతం చేసేందుకు కొందరు రిజర్వులను కూడా ఆలోచించి పెట్టుకున్నాం.
బాబు: ఎవరు?
కేవీపీ: మమతా బెనర్జీ, సుబ్రహ్మణ్యం స్వామి
రాజశేఖరరెడ్డి: బాగుంది, బాగుంది. ఇక తెలంగాణ ఏర్పడకుండా అడ్డుకోవడం ప్రపంచంలో ఏ శక్తికీ సాధ్యం కాదు.

సమావేశం ముగించి అందరూ వెళ్ళిపోయారు.

28 కామెంట్‌లు:

  1. మీ "ఉహ" చాలా బాగుంది. ఇక సంభాషణలు అదుర్స్!

    రిప్లయితొలగించండి
  2. టీవీ నైన్ వాడి లేటెస్ట్ కామెడీ కార్యక్రమంలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  3. ఇలాంటి Highly Confidential Secrets ని ఇలా బ్లాగులో వ్రాస్తే ఎలాగండీ బాబూ!! :)

    రిప్లయితొలగించండి
  4. మీరు సరదాగా రాశారో, నిజంగానే రాశారో తెలియదు కానీ ఇదేదీ జఱగదని మాత్రం అనిపిస్తోంది. తెలంగాణా ఒక ఇష్యూగా రాష్ట్రచరిత్రలోనే అంతరించిపోయినట్లు కనిపిస్తోంది. వై.ఎస్. ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణలో "తె" అనే అక్షరం కూడా పలకనివ్వడు, హైకమాండ్ లో గానీ లోకమాండ్ లో గానీ !౨౦౦౯ ఎన్నికల్లో తెలంగాణ పెద్ద ఇష్యూ అవుతుందని అందఱమూ అనుకున్నాం. అలాంటిదేమీ జఱగలేదు. ఇహ రాబోయే ౨౦౧౪ ఎన్నికలకి అసలది ఇష్యూ అవుతుందా ? అని !

    -తాడేపల్లి

    రిప్లయితొలగించండి
  5. >> "తీర్మానం పెడితే, రాష్ట్ర శాసనసభలో 289 -5 వోట్ల తేడాతో గెలుస్తుంది"

    అంత కధా చెప్పారుగానీ ఆ ఐదుగురూ ఎవరో చెప్పనేలేదు. వాళ్లలో ఒకడు మాత్రం కేసీయార్ కొడుకు, ఇంకొకడు ఆయన మేనల్లుడు అయ్యుంటారు. మిగిలిన ముగ్గురూ బాబు, రెడ్డి, రాఘవులునా?

    రిప్లయితొలగించండి
  6. kaadu naku telisi YS jagan , lagadapaati, MIM and muslim league

    రిప్లయితొలగించండి
  7. గుడ్ కామెడీ షో, నేను ఖమ్మం జిల్లా కు చెందిన ఒక చిన్న గ్రామం నుంచి, మా గ్రామం నికి మూడు వయుపుల ఆంధ్ర నే, కాని అది తెలంగాణా అని ఇది ఆంధ్ర అని ఏమి తేడ లేదు ఉండదు, మా గ్రామం లో కొన్ని పూర్వ కథలు ఉన్నాయ్, ముసలోళ్ళు చెప్తే విన్నాను, తెలనగన కు చెందిన మా గ్రామం స్వాతంత్రానికి ముందు నిజాం పరిపాలన లో ఉండేవి, సరిహద్దు గ్రామాలు ఆంధ్ర పరిపాలన లో ఉండేవి. నిజాం సైన్యం వస్తే విల్లు ఆంధ్ర లో దాక్కునేవారు, అలాగే తెల్ల దొరలు వస్తే వాళ్ళు తెలంగాణా లో దాక్కునే వారు. దీనిని బట్టి నేను చెప్పేదేంటంటే ప్రజలలో మేము తెలంగాణా వాళ్ళు ఆంధ్ర అని లేదు. అది ఉన్నది ఓన్లీ నాయకులలోనే.
    దాని చరిత్ర ఏంటంటే, పూర్వం ఎప్పుడో తెలంగాణా కాంగ్రెస్ వాళ్ళకి ఇందిరమ్మ మీద కోపం వచ్చింది, తెలంగాణా ఉద్యమము స్టార్ట్ చేసారు, దాని పర్యవసానమే జలగం ముఖ్యమంత్రి అయ్యాడు.
    మల్లి అది రామ రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత మల్లి స్టార్ట్ చేసారు, ఆంధ్ర దొరలు పెత్తనం అని చెన్న రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.
    దాని తర్వాత తే దే పా రెండు సార్లు వరుసగా గెల్చి కాంగ్రెస్ ఇంకా రాష్ట్రము లో కష్టమా అన్న టైం లో మల్లి కాంగ్రెస్ తెలంగాణా వాదులూ ఢిల్లీ కి వెళ్లి లొల్లి మొదలు పెట్టారు, ఈ అవకాశాన్ని కే సి ఆర్ అంది పుచుకున్నారు పార్టి పెట్టారు . వై అస్ అర్ ముఖ్యమంత్రి అయ్యాడు, మల్లి కాంగ్రెస్ వాళ్ళు ఈ వాదన తేవలంటే నాకు రెండు మూడు సార్లు కాంగ్రెస్ వాడాలి, మల్లి తే-వాదాన్ని నేత్తి మీద పెట్టారు.
    నేను ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే పైన ఎవరో తెలంగాణా కి వ్యతిరేకం ఫలానా వాళ్ళు వోట్ చేస్తారు అన్నారు కదా బహుశ ఆయనికి తెలంగాణా కాంగ్రెస్ ఉద్యమము గురుంచి తెలియక మాట్లాడుతున్నారు అని రాస్తున్నాను.
    తెలంగాణా కి ప్రజలు వ్యతిరేకం కాదు అనుకూలం కాదు. కుహనా రాజకీయ నాయుకులుకు అది ఇచేస్త్తే ఒక అస్రం తగ్గుతుంది, కష్టాలలో కాంగ్రెస్ ని ఆదుకునే వాదమే తెలంగాణా వాదం నేను నమ్ముతున్నా

    రిప్లయితొలగించండి
  8. telangaana lo reddy lu telangaanaki droham chestunnanta varaku telangaana raadu raaneeyaru

    రిప్లయితొలగించండి
  9. తెలుగు దేశంతో చేతులు కలిపి తెలంగాణాకి ద్రోహం చేసిన KCR రెడ్డి కాదు, అతను వెలమ దొర. జనానికి పంగనామాలు పెట్టడానికి ఏ కులం వాడైతేనేం? ఏ రాయి అయితేనేం పల్లు ఊడగొట్టుకోవడానికి అన్నట్టు!

    రిప్లయితొలగించండి
  10. ప్రవీణ్ గారి తో , కాంగ్రెస్ తో కలిసినప్పుడు ద్రోహం కానిది తే దే పా తో కలిస్తే ద్రోహం ఎలా అవుతుంది? తెలుగు దేశం తెలంగాణా ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసిందా కాంగ్రెస్ లాగ? లేకపోతె తెలంగాణా లో elections అయిన తరవాత ప్లేట్ ఫిరయించిండ కాంగ్రెస్ లాగ? 60 సంత్సరాల నుంచి తెలంగాణా స్లోగన్ ని వడుకున్నది వాడుకునేది కాంగ్రెస్

    రిప్లయితొలగించండి
  11. అందరికీ నెనరులు.

    తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం: ఏర్పాటు ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు, రాజకీయ వ్యతిరేకత అడ్డురాకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే, లోపలెలా ఉన్నా పైకి చెప్పే మాటల ప్రకారం చూస్తే ప్రస్తుతం దాదాపుగా అన్ని పార్టీలూ తెలంగాణకు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి, వాళ్ళు తలచుకుంటే తెలంగాణ ఇట్టే ఏర్పడుతుంది, ఏర్పడాలి. కానీ ఈ పార్టీల్లో ఎక్కువ శాతం దొంగ కబుర్లు చెప్పే బాపతే అని నా ఉద్దేశం. అంచేతే నా కల అట్టాగుంది.

    అబ్రకదబ్ర, మహేష్ బాబు: పిచ్చిబోలెడుమంది తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని చెప్పడమే ఆ అంకెల్లో నా ఉద్దేశం. ఖచ్చితంగా చెప్పాలంటే అది 286-8 గా ఉండాలేమో! :)

    రిప్లయితొలగించండి
  12. ముప్పై ఏళ్ళ క్రితం తెలుగు దేశం పార్టీ ఉనికిలో లేదు కాబట్టి ఆ పార్టీ తెలంగాణా పేరు వాడుకోలేదు. ఇప్పుడు ఆ పార్టీ ఉనికిలో ఉంది కాబట్టి ఆ పార్టీ కూడా తెలంగాణా పేరు వాడుకుంటోంది, అంతే. ఏదైనా ఉనికి (existence) మీదే ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఉద్యమాన్ని ఓపెన్ గా వ్యతిరేకించిన రోజులు ఉన్నాయి. కాంగ్రెస్ కంటే తీవ్రంగా చంద్రబాబు నాయుడు తెలంగాణాని వ్యతిరేకించాడు. ఇక KCR విషయానికి వస్తే, అతను పొలిటికల్ ప్రాస్టిట్యూట్. ఒక బజారు వేశ్య రోజుకి ఒకసారి తనని తాను అమ్ముకుంటుంది, బజారు పురుషుడు (KCR) ఐదేళ్ళకొకసారి తన పార్టీని ఇంకో పార్టీకి అమ్ముకుంటాడు.

    రిప్లయితొలగించండి
  13. అవును చంద్ర బాబు తెలంగాణా ని వ్యతిరేకించాడు, ఎందుకంటే ఆ రోజు వాళ్ళ సిద్దాంతం అది, కాలానుగుణం గా ప్రజాభిప్రాయానికి విలువ ఇచి మార్పూ చేసుకున్నారు, తెలంగాణా కి మేము అనుకూలం అని. అంతే కాని కాంగ్రెస్ లాగ మేము తెలంగాణా ఇస్తాము అని చెప్పి అధికారం లోకి వచ్చిన తర్వాత మరిచిపోయారా? . మొదటి విడత లో తెలంగాణా కి అనుకూలం అని చెప్పి రెండో విడత లో తెలంగాణా ఇస్తే మనం విదేసియులం అని రెచగొట్టి తెలంగాణ ని మోసం చేసారా?
    KCR ప్రోస్తిటుటే అయితే ఆయన తో పొత్తుపెట్టుకున్న సోనియా, రాజ శేకర్ రెడ్డి , చంద్ర బాబు పొత్తు పెట్టుకోవాలి అనుకున్న చిరంజీవి కూడా అదే వరుస లో కి వస్తారు. 2004 లో కే సి రావు కి కాంగ్రెస్ ఎంత ఇచింది, ఒక పార్టి కి సిద్దాంతాలు ఉన్నప్పుడే వేరే పార్టి గురుంచి మాట్లాడాలి.

    రిప్లయితొలగించండి
  14. కల అదిరింది! కథ బాగుంది!!
    "బజారుపురుషుడు" ... క్యా పదబంధ్ హై!! :))

    రిప్లయితొలగించండి
  15. తెలుగు దేశం ఒకవేళ మళ్లీ అధికారంలోకి వచ్చినా వాళ్ళు కూడా తెలంగాణా డిమాండ్ ని చెత్త బుట్టలో పడేస్తారు. ఇప్పుడు కూడా కొంత మంది తెలుగు దేశం నాయకులు TRSతో పొత్తు పెట్టుకోవడం తప్పైపోయిందని, తెలంగాణా డిమాండ్ అంత బలంగా లేదని వాదిస్తున్నారు. తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు కానీ పార్టీల మీద నమ్మకం లేక వోట్లు వెయ్యలేదు. అంత మాత్రాన తెలంగాణావాదం బలంగా లేదు అనుకోలేం. రాష్ట్ర విభజన జరిగి హైదరాబాద్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతే హైదరాబాద్ లో చంద్రబాబు ఆస్తుల విలువ కూడా తగ్గిపోతుంది. కనుక తెలుగు దేశం పార్టీ ఎప్పటికైనా తెలంగాణావాదాన్ని పూర్తిగా వదిలేస్తుంది.

    రిప్లయితొలగించండి
  16. కాంగ్రెస్ ఆల్రెడీ చెత్త బుట్ట లోనే పడేసింది. భవిష్యుతూ లో ఇలా జరుగుతుంది అని చెప్పడానికి లేదు . అది నీ ఉహా. ప్రజలు ఒక్క సారే మోసపోతారు. కాంగ్రెస్ తెలంగాణ lo వోట్లు ఐపోగానే దాని విషాన్ని కక్కినది. తెలంగాణ ని రాజ శేకర్ మోసం చేసాడు .దానర్థం ఏమిటి మేము ఇలా చేసాము కాబట్టి ఎదుటివాడు కూడా అలానే తెలంగాణ ni చెత్త బుట్ట లో పడేస్తాడు అనా? అధికారం లో లేని తే దే పా గురుంచి అనవసరం, వాళ్ళు ఎమన్నా చేయాలి అనుకున్న ఏమి చేయలేరు. మరి 5 years కింద తెలంగాణా కి అనుకూలం అని చెప్పి అధికారం లోకి వచ్చిన రాజ శేకర్ ఎందుకు తెలంగాణా ఇవ్వటం లేదు? ఆయన 2 లక్షల కోట్ల ఆస్థి 20 వేల కోట్లు అవుతుంది అనా ?
    రాయాలసీమ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనే విషయం రాజ శేకర్ కి తెలంగాణా లో ఎన్నికలు అయిన తర్వత గుర్తు వచ్చిందా?

    రిప్లయితొలగించండి
  17. కాంగ్రెస్ ఆల్రెడీ చెత్త బుట్ట లోనే పడేసింది. భవిష్యుతూ లో ఇలా జరుగుతుంది అని చెప్పడానికి లేదు . అది నీ ఉహా. ప్రజలు ఒక్క సారే మోసపోతారు. కాంగ్రెస్ తెలంగాణ lo వోట్లు ఐపోగానే దాని విషాన్ని కక్కినది. తెలంగాణ ని రాజ శేకర్ మోసం చేసాడు .దానర్థం ఏమిటి మేము ఇలా చేసాము కాబట్టి ఎదుటివాడు కూడా అలానే తెలంగాణ ni చెత్త బుట్ట లో పడేస్తాడు అనా? అధికారం లో లేని తే దే పా గురుంచి అనవసరం, వాళ్ళు ఎమన్నా చేయాలి అనుకున్న ఏమి చేయలేరు. మరి 5 years కింద తెలంగాణా కి అనుకూలం అని చెప్పి అధికారం లోకి వచ్చిన రాజ శేకర్ ఎందుకు తెలంగాణా ఇవ్వటం లేదు? ఆయన 2 లక్షల కోట్ల ఆస్థి 20 వేల కోట్లు అవుతుంది అనా ?
    రాయాలసీమ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనే విషయం రాజ శేకర్ కి తెలంగాణా లో ఎన్నికలు అయిన తర్వత గుర్తు వచ్చిందా?

    రిప్లయితొలగించండి
  18. అంటే ఇప్పుడు రాజ శేఖర్ రెడ్డి ఆస్తులు విలువ తగ్గుతుందని తెలంగాణా ఇవ్వటం లేదా? చంద్ర బాబు కి హైదరాబాద్ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా ? మీకు తెలిస్తే సాక్షి పేపర్ వాళ్ళకి చెప్పండి, జనాలు అందరికి తెలిస్తే మంచిది కదా, రెండు రూపాయల కే కిలో పేపర్, సారీ 2-50 ఇప్పుడు

    రిప్లయితొలగించండి
  19. టపా రాయక నెలరోజులా నెలరోజులా ?

    రిప్లయితొలగించండి
  20. ఏంటిసార్, ఎన్నికలైపోయాయని బ్లాగు మర్చిపోయారా? కీబోర్డు బూజుదులపండి

    రిప్లయితొలగించండి
  21. బద్జెట్ సమావేశలలో - అన్ని గొడవలు...
    పార్టీ దూకుళ్లు గెంతుళ్లూ - ఇన్ని జరుగుతుంటే ... మీరు ఒకా టపా కూడా వ్రాయలేదా?
    ముసయిదాలో పెట్టి ప్రచురించడం మర్చిపోయారా లేక సంకేతపదమే మర్చిపోయారా
    ఏమైనా రెండు మూడు రోజుల్లో ఓ టపా రాయకపోతే నేనే ఓ రాజకీయ టపా రాయాల్సివస్తుందని బెదిరిస్తున్నాను.
    ( ఇది అన్ పార్లమెంటరీ ఎమో ఉపసంహరించుకుంటున్నాను) హెచ్చరిస్తున్నాను అని చదువుకోండి

    రిప్లయితొలగించండి
  22. ' తెలంగాణపై రహస్య సమావేశం'

    ఊ, ఆ విదంగా తమరు( చదువరి) పగటీ నిద్ర నుంచి లేచారు అన్నమట.. బాగుంది

    రిప్లయితొలగించండి
  23. అజ్ఞాత: ఔను, నేను 2009 మే 21 నాడే పగటి నిద్ర నుంచి లేచాను. తమరికి మాత్రం ఇంకో సంవత్సరన్నర తరవాత తీరింది. బావుంది, బావుంది.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు