16, నవంబర్ 2008, ఆదివారం

రండి, రండి! Welcome

Can't see Telugu on this page? Is your Computer showing series of boxes after this paragraph? It is because, it is not taught how to render Telugu. You can teach a lesson to it, so that it will surrender to the sheer beauty of those magnificent letters. Follow the steps given in this Wikipedia link or this link or this and implement the suggested changes in your computer... you will find yourself in the lap of Mother Telugu. Then, please come back and read the following few lines.

కొత్తగా బ్లాగుల గురించి తెలుసుకుంటున్న వారికి, ఈ బ్లాగుపై ఆంధ్రజ్యోతి సమీక్ష చదివి ఇక్కడికి వచ్చినవారికి, బ్లాగరులకు, బ్లాగ్వరులకు స్వాగతం! నాకు తెలిసిన నాలుగు ముక్కలను కొత్తవారికి చెప్పాలని ఇది రాస్తున్నాను.

  • మీకు కంప్యూటర్లో తెలుగు ఎలా రాయాలో తెలీకపోతే లేఖినికి వెళ్ళండి. మీరు రోమను లిపిలో రాసుకుంటూ పోతుంటే అది తెలుగు లిపి లోకి మార్చేస్తూ ఉంటుంది. నేను తెలుగులో రాయగలగుతున్నాను అని రాయాలనుకున్నారనుకోండి.. "nEnu telugulO raayagalagutunnaanu" అని అక్కడ రాస్తే చాలు.. మిగతా పని అదే చూసుకుంటుంది. కొత్తవారికి దీని కంటే మంచి గురువు మరోటి లేదు. కొన్ని ఆసక్తికరమైన లింకులివిగోండి:
  • తెలుగు విజ్ఞాన సర్వస్వ నిర్మాణం అనే ఒక బృహత్తర కార్యక్రమం నడుస్తోంది. తెలుగువారు తమకో విజ్ఞాన భాండాగారాన్ని తయారుచేసుకుంటున్నారు. మనలాంటి వాళ్ళంతా అందులో భాగస్తులే! ఆంధ్ర దేశంలోని ప్రతి ఒక్క ఊరి గురించి వివరాలు పొందుపరచాలనేది అక్కడి ఆశయాల్లో ఒకటి. అక్కడ మా ఊరి గురించి ఉంది, నేనే రాసాను. మీ ఊరి గురించి వ్యాసం ఉందో లేదో చూడండి. లేకపోతే మీరే రాయండి. ఉంటే.. దానిలో మార్పులు చెయ్యండి, కొత్త విషయాలు చేర్చండి
  • ఇక, బ్లాగులు ! బ్లాగులు రాసేందుకు పైసా ఖర్చు పెట్టక్కర్లేదు - నేను పెట్టలేదు. మీకు కావాల్సిందల్లా కంప్యూటరు, జాలంలో జొరబడేందుకు ఓ కనెక్షను -అంతే! ఇక మీ మనసులో ఉన్నదంతా బైటపెట్టడమే. చంద్రబాబును, రాజశేఖరరెడ్డిని, చిరంజీవిని, బాలకృష్ణను.. ఎవ్వర్నీ వదలొద్దు. ఛందోబద్ధమైన పద్యాలు, కథలు, కవితలు, వ్యాసాలు.. దేన్నీ వదలొద్దు. హాస్యం, వ్యంగ్యం, సీరియస్, విషాదం, వేదన, రోదన.. ఏదైనా సరే! పుస్తక సమీక్ష, సినిమా సమీక్ష, మీ చిన్ననాటి స్మృతులు, నిన్నామొన్నటి జ్ఞాపకాలు, కాలేజీ కబుర్లు.. ఆఫీసు కబుర్లు.. అన్నిటినీ మీ బ్లాగులో పరవండి. అంతా వచ్చి చదూకుంటారు.. మీ బ్లాగు గురించి ఏమనుకుంటున్నారో కూడా చెబుతారు.
  • బ్లాగుల్లో కనబడేవి.. వినూత్నమైన ఆలోచనలు, స్వంత భావాలు, చక్కటి భాష, నిర్మొహమాటంగా, నిర్మోహంగా సాగే రచనలు. కొన్ని చక్కటి బ్లాగుల్లోని కొన్ని మంచి టపాలను ఏరి కూర్చిన ఈ పుస్తకాన్ని చూడండి. (ఇదో పీడీయెప్ఫు పుస్తకం.. దించుకోడానికి కాస్త ఎక్కువ సేపే పడుతుంది.)
  • బ్లాగు ఎలా మొదలుపెట్టాలనే సంగతి నుండి.. బ్లాగుల విషయంలో ఏ సాయం కావాలన్నా.. తెలుగుబ్లాగు గుంపునడగండి.
  • బ్లాగుల్లో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేం రాస్తున్నారో తెలుసుకునేందుకు కూడలి, జల్లెడలను చూస్తూ ఉండండి. బ్లాగుల్లో కొత్త రచనలు రాగానే వీటికి ఉప్పందుతుంది. కొత్తగా ఏయే రచనలు వచ్చాయో తెలిసికొనేందుకు తెలుగు బ్లాగరులు ఈ సైట్ల వద్దే తారట్లాడుతూ ఉంటారు.
  • చక్కటి ఛందోబద్ధమైన పద్యాలు రాసేవారు ఇప్పటి కుర్రకారులోనూ ఉన్నారు తెలుసా? అంతర్జాలంలో అభినవ భువనవిజయాలు జరిగాయి కూడాను. ఛందస్సునూ, పద్యాల లక్షణాలనూ నేర్పే గురు బ్లాగులు బ్లాగురువులూ కూడా ఉన్నారు.
  • ఈమాట జాల పత్రికను చూడండి. అలాంటి ఉత్తమ సాహితీ విలువలున్న పత్రికను అచ్చులో చూసి ఎన్నాళ్ళైందో గుర్తుకు తెచ్చుకోండి.
  • గళ్ళ నుడికట్టు అంటే ఇష్టమా? అయితే పొద్దు దిక్కుకు తిరగండి. తెలుగులో మొట్టమొదటి ఆన్‌లైను గళ్ళ నుడికట్టు ఇది.
  • కొత్త సినిమాల దగ్గర మైకులు పట్టుకుని, జనాల చేత అబ్బో, బెమ్మాండం, సూపరు, వందరోజులు, వెయ్యిరోజులు అంటూ చెప్పిస్తున్నపుడు "ఆంధ్రదేశంలో ఒక్ఖడు కూడా.. సినిమా బాలేదనేవాడే వీళ్ళకి కనపడడు..ఛి..చ్ఛీ..దరిద్రం." అని టీవీల వాళ్ళను చీదరించుకున్నారా? అయితే నవతరంగపు తాజా గాలి పీల్చండి. నిష్పాక్షిక సమీక్షలే కాదు, సినిమాల గురించిన బోలెడు కబుర్లు తెలుసుకోవచ్చు. 
  • తెలుగును చూపించే విషయంలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరరు కాస్త మొహమాటపడుతుంది. పక్కనున్న స్క్రాల్ బారును పట్టుకుని పైకీ కిందకీ జరపబోతే మహా బద్ధకంగా కదులుతుంది. (మరి ఈ సమస్య నాకేనో ఇతరులకూ ఉందో తెలీదు.) ఈ సందర్భంలో ఫైరుఫాక్సు అనే బ్రౌజరును మనం స్మరించుకోవాలి. దానిలో ఈ ఇబ్బంది కనబడలేదు. అది తెలుగుతో చెలిమి చేసింది. మంటనక్కపై తెలుగు సవారీ నల్లేరుపై నడకే! అన్నట్టీ మంటనక్క అనేది ఫైరుఫాక్సు బ్రౌజరును మనాళ్ళు ముద్దుగా పిలుచుకునే పేరు. 
  • మంటనక్కలాంటి ముద్దుపేర్లే కాక, మనం నిత్యం వాడే అనేక ఇంగ్లీషు పదాలకు సమానార్థకమైన తెలుగు మాటలను వెలికితీస్తూ, నిష్పాదిస్తూ, కనిపెడుతూ, చెలామణీ చేస్తూ ఉన్నారు. మీరూ ఓ చెయ్యెయ్యండి. ఉదాహరణకు ఇంటర్నెట్‌లో ఉండే జనులను ఇంగ్లీషులో నెటిజెన్స్ అంటారు. మనాళ్ళు నెజ్జనులు అన్నారు. జాలజనులు అన్నారు. నెటిజనులు అన్నారు. మీరేమంటారో చెప్పండి.

14 కామెంట్‌లు:

  1. చాలా బాగుందండి ! నాలాంటి వాళ్ళకు చాలా ఉపయోగకరమైన టపా. ఈ సమాచారాన్ని పంచుకున్నందుకు కృతజ్ఞతలు - Sravya

    రిప్లయితొలగించండి
  2. చదువరిగారు,

    ఇప్పుడు ఉన్నట్టుండి ఈ టపా ఏమిటా అనుకున్నా.. తరువాత ఈనాడు చూశా.. సంధర్భోచితం.. మంచి ఆలోచన అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. చదువరిగారు అభినందనలు. మంచి వ్యాసాన్నందించారు. ఇది ఎంతో మంది కొత్త నెటిజన్లకు ఉపయోగపడుతునదనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  4. అభినందనలు. మీకు నేనో పెద్ద ఐదు టన్నుల ఏసీ మెషీన్ని. (విసనకర్రలూ, పంకాలూ గట్రా చాలవు)

    రిప్లయితొలగించండి
  5. ముందుగా, అభినందనలు, పత్రికలో మీ రివ్యూ వచ్చినందుకు.
    మనందరమూ ఈ టపాని రెణ్ణేల్లకోసారి అలా ప్రచురిస్తూ ఉంటే మంఛిది అనుకుంటా.

    రిప్లయితొలగించండి
  6. కందము:-
    చదువరి సంస్కారంబును.
    చదువరి సాహిత్య సేవ, చదువరి తలపున్
    బుధ కోటిని మెప్పించెను.
    చదువరులిక చదువు బ్లాగు, చక్కగ వ్రాయున్.

    తేట గీతి:-
    ధన్య వాదము చదువరీ! ధన్యుడవయ!
    తెలుగు తేజము దిశలెల్ల వెలుగ జేయ
    యత్న మొనరించి తెలిపితి నూత్న గతిని.
    నిత్య మాంధ్రామృతము గ్రోలు స్తుత్య వర్య!

    రిప్లయితొలగించండి
  7. చదువరిగారు మంచి ఇన్ ఫర్మేషన్ ఇచ్చారు, అలాగే ఈ-స్నిప్స్ లంకె ని ఎలా మన టపాలలో ఎలా అందించాలో కూడా చెప్పండి. నాలాంటి చాలమందికి ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  8. చదువరిగారు అభినందనలు.
    ఈనాడు లంకె ఇక్కడ వేయగలరు

    రిప్లయితొలగించండి
  9. చదువరి గారూ, బ్రహ్మాండమైన అవిడీయా అసలు. తెలుగు బ్లాగుగుంపులో తాలబాసు గారు సూచించే దాకా నాకు తట్టనుకూడా లేదు. వెలగంగానే ఎంత సంతోషం వేసిందంటే .. మిమ్మల్నిఅభినందించేందుకు మాటలు చాలట్లేదు. వేసుకోండి ఒక పది వీరతాళ్ళు!!

    రిప్లయితొలగించండి
  10. మంచి సమయస్ఫూర్తి చూపించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. Hello Sir,

    We heard about your blog from one of our team members. We would like to invite to create a blog at blog.co.in, india's leading blog network.

    We can provide you with premium name such as 'telugu' at free of cost.

    Your writings will be a great value add to our readers.

    Send us an email or using the contact form on the website.

    thanks

    రిప్లయితొలగించండి
  12. మన తెలుగు ను కాపాడుకోడానికి మంచి మార్గదర్శకం చూపించారు

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు