1, నవంబర్ 2008, శనివారం

ఇడుపులపాయ ఎస్టేటు - ఆంధ్రప్రదేశ్ ఎస్టేటు

ఈ రెండూ శివదేవుడివే!

ఇడుపులపాయలో ఆసామికి తెలవకుండా ఒక్ఖ మొక్కజొన్న కండెను కాపలావాడు తెంపుకెళ్ళగలడా? నాలుగు మామిడికాయలను కోసుకెళ్ళి ఆవకాయ పెట్టుకోగలడా? ఆ సంగతి ఆసామికి తెలిస్తే వాడి కథేమవుతుంది? "అయ్యా ఫలానా మునిరత్నం దొంగతనంగా మామిడికాయలు కోసుకెళ్ళాడు" అని మరో వెంకటప్ప ఆరోపిస్తే ఏం జరుగుతుంది? పంచాయితీ జరుగుతుంది నిజమేమిటో తేలుతుంది. దొంగ అని తేలితే మునిరత్నం, ఆరోపణ తప్పని తేలితే వెంకటప్పల సంగతి తేలిపోతుంది. వాళ్ళిక పని చాలించి ఎస్టేటు బయటికి నడవాల్సిందే!


కానీ, అయ్యవారి ఆంధ్రప్రదేశ్ ఎస్టేటులో మాత్రం అలా జరగలా!

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక పన్ను కింద ప్రభుత్వానికి రావలసిన డబ్బులోంచి ఏడు కోట్లు తినేసారని మంత్రి గొల్లపల్లి సూర్యారావు (మొదటి సూర్యుడు) ఆరోపించాడు. తిన్నది మంత్రి దివాకరరెడ్డి (రెండో సూర్యుడు) అట. అదొక్కటే కాదు.. తాను జిల్లా పర్యటనకు వచ్చినపుడు తిరిగేందుకుగాను ఒక కొత్త కారు కొనిపించాడట. ఎవరెవరో తిరిగిన కారులో తిరగను, కొత్తకారు కావాల్సిందే అని చెప్పి మరీ కొనిపించాడట - స్వయంగా సూర్యారావు చెప్పిందే ఇది. వీళ్ళిద్దరికీ ఈ వివాదం విషయంలో ఉన్న తక్షణ సంబంధం ఏంటంటే.. దివాకరరెడ్డి తూగోజీకి ఇన్‌ఛార్జి మంత్రి. గొల్లపల్లి ఆ జిల్లాకు చెందినవాడు. మనకు తెలిసిందిది.., తెరమాటున ఇద్దరికీ ఎన్నున్నాయో ఆ శివదేవుడికే ఎరుక!

సరే వీళ్ళ గొడవిలా ఉంటే, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించవలసిన ముఖ్యమంత్రి ఏంచేసారు? దాని మీద విచారణ కోసం ఓ మంత్రుల కమిటీ వేసి నాటకమాడారు. వాళ్ళు విచారణ చేసిందేమిటి? నీ ఆరోపణలను ఉపసంహరించుకోమని మొదటి సూర్యుడికి చెప్పారు, నచ్చజెప్పారు. లేకపోతే నీ సంగజ్జూస్తామని బెదిరించి ఉంటారు. నీ నలుపును కూడా బయటపెడతాం గురివింద గింజా అని తర్జని చూపించి ఉంటారు. దెబ్బకి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి రెండో సూర్యుని మనసు నొప్పించినందుకు చింతించాడు. బయటికొచ్చాక, బయటపడ్డ చేపలాగా కాస్త గింజుకోజూసాడుగానీ, చివరికి లొంగిపోయాడు.

ఇంతకీ ఆ ఏడుకోట్లు ఉన్నట్టా, పోయినట్టా? మంత్రి తిన్నట్టా తిననట్టా? తిన్నట్టైతే రెండో సూర్యుడు ఇంకా మంత్రివర్గంలో ఎందుకున్నట్టు? తిననట్టైతే ఆ సొమ్ము ఎక్కడికి పోయినట్టు? ఆరోపణలు చేసిన మొదటి సూర్యుడు ఇంకా మంత్రివర్గంలో ఎందుకున్నట్టు? సాధారణ మానవుడికి తెలిసిందొకటే -ఇద్దరిలో ఎవరో ఒకరే మంత్రివర్గంలో ఉండాలి. ముఖ్యమంత్రి చెయ్యాల్సిందల్లా ఉండాల్సిందెవరో, బయటికి పంపాల్సిందెవర్నో తేల్చడం -అంతే! కానీ ఇదేమీ జరగకుండా అందరూ కలిసి ఏదో ఒప్పందానికొచ్చినట్టు కనబడుతోంది. ఏంటా ఒప్పందం?

ఆంధ్ర ప్రదేశ్ ఎస్టేటుతో ఒక సౌలభ్యం ఉంది. ఆస్తి ఆసామీది కాదు, జనాలది! ఆస్తి పరిరక్షణ మాత్రం ఆసామి పని. తనవాళ్ళు, తనకిష్టమైనవాళ్ళు ఆ ఆస్తిని నంజుకు తిన్నా.. ఆసామికి పోయేదేమీ లేదు. పరిరక్షుకుడుగా తాను ఉండాలి, అంతే!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఇడుపులపాయ ఎస్టేటులో కొంత ముక్క జనాలదే అని రాజావారు గతంలో చెప్పారు. మా పూర్వీకులు కలిపేసుకున్నారు అని ఆయనే చెప్పుకున్నారు. పెద్ద ఎస్టేటులోంచి చిన్నదాని లోకి మార్చుకున్నారన్నమాట!

10 కామెంట్‌లు:

  1. ఇలాంటి నాయకులు ఉండటం ప్రజల చేసుకున్న దౌర్భాగ్యం అని సరిపెట్టుకోవాలి

    రిప్లయితొలగించండి
  2. ఈ వ్యవహారం అంతా చూస్తువుంటే, దొంగతనం అయ్యాక, ఊరి చివర దోచుకున్న సొమ్ము పంపకాల దగ్గర తేడా వచ్చి దొంగలు తమలో తామే కొట్టుకున్నట్టు వుంది. దొంగల ప్రభువు కాబట్టి ఇంతకంటే ఏమి చేస్తాడు.

    రిప్లయితొలగించండి
  3. ఈ అభినవ భేతాళ ప్రశ్నలకి అలనాటి విక్రమార్కుడు కుడా సమాధానాలు చెప్పలేకపోయాడు. ఆవిధముగా భేతలుడికి మౌనభంగం కలుగాకపోవటముతో, నేటి ఆరాచకీయ 'రాజు' గారి పాలనలో (తప్పు, తప్పు .. కలియుగ దేవుడి పాలనలో), అమాత్యుల, నాయుకుల భుజాలపైకేక్కి, బుర్రలలో దూరి పైత్యవిన్యాసాలు చేయుస్తున్నాడు. ....... ఇక ఈ కధకి ముగింపు ఎప్పుడో?.

    రిప్లయితొలగించండి
  4. నా తల వెయ్యి చెక్కలవడం ఖాయం లా కనిపిస్తోంది.(జవాబులు తెలిసీ చెప్పలేని వారికి పట్టే గతి)

    రిప్లయితొలగించండి
  5. దేవుడి పాలనలో సమాధానం దొరకని ఎన్నో వేళ ప్రశ్నల్లో ఇదొకటి.

    రిప్లయితొలగించండి
  6. నా మట్టి బుర్రకి తట్టిన ఆలోచనలివి.

    బోడి ఏడు కోట్లకు మంత్రివర్గం నుంచి తీసేయాల్సిన రోజులు పోయాయి. కాంగీ స్టాండర్డ్స్ ప్రకారం కనీసం ఆ బొక్కిన సొమ్ము వందల కోట్లలో ఉంటే అప్పుడు అయ్యవారు ఆ విషయం ఆలోచిస్తారు. కానీ ఏమీ చేయరు, అది వేరే విషయం.

    ఇక మొదటి సూర్యుడు. ఇవి బోడి ఏడు కోట్లే కదా, నీకు కనీసం యాభై కోట్లు దొరికే "అవకాశం" చూపిస్తాలే అనుంటాడు అయ్యవారు.

    రిప్లయితొలగించండి
  7. ఇడుపులపాయ ఎస్టేటు కూడా జనాలదే కదండీ... అయ్యవారే జనాల భూమి ఆక్రమించుకున్నప్పుడు, పాపం అతి సామాన్యులు మంత్రులు 7 కోట్లు దోచుకుంటే ఏమైందండీ?!! అప్పుడు ఇడుపుల పాయని క్రమబద్ధీకరించినట్టు ఇప్పుడు 7 కోట్లనీ ఏదోకటి చేస్తారు... అప్పుడు అయ్యవారు రాజీనామా చేసారా అండి? ఇప్పుడు మంత్రులు రాజీనామా చెయ్యడానికి?

    you can jolly well file a case in court. And our reverebale ayya vaaru & co obey the court.

    రిప్లయితొలగించండి
  8. హహ్హహ్హహ్హా ! సుజాతగారూ...సుజాతగారు !
    :-)
    మనిషికి విలువ లేదనుకుంటున్నాం ఇంతకాలమూను. కాని ఇలా (పెద్దలు) అందఱూ దోపిడిదారులే అయినచోట డబ్బుక్కూడా విలువ ఉండదేమోనని నాకొక కొత్త ఆలోచన వస్తోంది.

    రిప్లయితొలగించండి
  9. @ తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు,
    ప్రపంచం లో చాలా మంది మనిషులు ప్రతి నిముషము విలువ వున్నదాని కి వలువలు వొలవాలాని ప్రయత్నిస్తుంటాదు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు