27, నవంబర్ 2008, గురువారం

దిగులుగా ఉంది

మనం రోడ్డు మీద వెళుతూంటేనో, రైలు టిక్కెట్టు కొనేందుకు వరసలో నుంచుంటేనో, ఏ కూరగాయలు కొనుక్కుంటున్నపుడో మనకు అటుగానో, ఇటుగానో నిలబడి తుపాకీతో టపటపా పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసి, తాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు.


నువ్వు ఫలానా మతం వాడివి కదా.. ఐతే ఇదిగో నీకిదే గతి అంటూనో, నువ్వు ఫలానా దేశం వాడివి కదా అయితే అనుభవించు అంటూనో మన కణతలోకి గుండేసి చంపేస్తారు ఆ తరవాత ఓ ఇద్దర్నో ముగ్గుర్నో పట్టుకుని పక్కనున్న ఇంట్లో దూరి, ఆణ్ణొదలండి, ఈణ్ణొదలండి అంటూ డిమాండ్లు పెడతారు.

లక్ష్యాలను ముందే ఎంచుకుని, చక్కగా ప్లానేసి, రెక్కీలు చేసి, వీలైతే రిహార్సళ్ళు వేసుకుని, తీరుబడిగా పడవల్లోనో, ఓడల్లోనో దిగబడి, ఓ నగరాన్ని చుట్టుముట్టగలరు, దాడి చెయ్యగలరు. మొత్తం నగరాన్నే బందీగా పట్టుకోగలరు. గంటా రెండు గంటలు కాదు, ఒకటి రెండు రోజుల పాటు దేశంలోని అత్యున్నత స్థాయి భద్రతా దళాలను కూడా ఎదుర్కొని పోరాడగలరు. అందుకు తగ్గ ఆయుధ సంపత్తిని చేరేసుకోగలరు కూడా. ఏకకాలంలో పది చోట్లకు పైగా దాడి చేసి వందల మందిని బలి తీసుకోగలరు.

దాడుల తీవ్రత ఎలా పెరుగుతోందో చూస్తే భయమేస్తోంది. బాంబులెయ్యడం, చాటుమాటుగా బాంబులు పెట్టడం పోయింది. ఇప్పుడిక నేరుగా దాడే! సాక్షాత్తూ యుద్ధమే!!
  • ఈ దాడులు మనమెంత చవటలమో చూపిస్తున్నాయి. 
  • మన నాయకుల నేలబారు నాయకత్వమెంత సిగ్గుమాలినదో చూపిస్తున్నాయి. చొక్కాల కాలర్లను ఏకే 47 తుపాకీల మొనలతో పట్టి పైకెత్తి ఈ నాయకులను దేశానికీ, ప్రపంచానికీ చూపిస్తూంటే, ఆ తుపాకీలకు వేళ్ళాడుతూ, తలకాయలు వేళ్ళాడేసుకుని, భుజాలు జారేసుకుని, కళ్ళు వాల్చేసుకుని, కాళ్ళు మడతేసుకుని, దీనంగా, చవటల్లాగా, సన్నాసుల్లాగా మనల్నేలే నేతలు కనిపిస్తున్నారు. 
  • ఈ దాడులు మన భద్రత లోని డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. బయటకు పోతే, రాత్రికి తిరిగి ఇంటికి చేరుకోగలమో లేదోననే భయం కలుగుతోంది. 
కానీ ఈ భయానికి మించి... ముందుముందు మరిన్ని దాడులు జరక్కుండా ఈ వెన్నెముక లేని నాయకుల నాయకత్వంలో కాచుకోగలమని మనం నమ్మగలమా?

నాకా నమ్మకం కలగడంలా! అదే నాకు బెంగగా ఉంది. గుండెల్లో దిగులుగా ఉంది. నోరు చేదుగా ఉంది. ఊపిరాడనట్టుగా ఉంది. ధైర్యం అడుగంటి, ఆలోచనల్లో దైన్యం ఊరుతూ, ఒళ్ళంతా వ్యాపిస్తోంది.
------------------------------------------------------------------------------
ముంబై దాడుల్లో బలైనవారి కుటుంబాలకు నా శ్రద్ధాంజలి. ఈ పోరులో ముష్కరులను ఎదుర్కొని, తమ ప్రాణాలొడ్డి, వందల మంది ప్రజలను కాపాడిన ధీరోదాత్తులైన సైనికులకు, పోలీసులకు ఈ పనిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నా సెల్యూట్!

24 కామెంట్‌లు:

  1. టి.వి.లో చూస్తుంటే కడుపులో దేవినట్లుగా ఉంటోంది.ఈ మారణ కాండను ఆపడానికి మనం మన పరిధిలో ఏం చెయ్యగలం? అందరూ కలసి ఆలోచించాల్సిన సీరియస్ విషయం ఇది.

    రిప్లయితొలగించండి
  2. గత 24 గంటలనుండీ TV లొ చూస్తూనే వున్నాను...దీనికి ముగింపు ఎప్పుడో..ఇంకా ఎంతమంది అమాయకులు బలవ్వాలో!

    నిజంగా బెంగగా ఉంది...మీరన్నట్టు ధైర్యం అడుగంటింది.

    రిప్లయితొలగించండి
  3. నిజమేనండీ, తెల్లరి లేస్తే మళ్ళా ఆ రోజు క్షేమంగా ఇంటికి అందరూ చేరే వరకూ భయపడాల్సి వస్తోంది. హాయిగా ఏ పల్లెటూరికో వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తోంది, అన్నిటికన్నా ముందుగా నా భారత దేశాన్ని రక్షించగలిగే మహాత్ముడో, సుభాష్ చంద్రబోసో, భగత్ సింగో మళ్ళి అవతరిస్తే బాగుండు అనిపిస్తోంది

    రిప్లయితొలగించండి
  4. నిజంగా ఇది మన నేతల సిగ్గుమాలిన తనం.

    ముంబై లో ప్రాణాలు కోల్పోయిన వారికి బాసటగా నిలవాలి.

    వాళ్ళకి శ్రద్ధాంజలి.

    రిప్లయితొలగించండి
  5. టెర్రరిస్టుల మూల ఉద్దేశమైన భయాందోళనలు సృష్టించడంలో ‘మీరు’ సఫలమయ్యారు. బద్రతపైన అపనమ్మకం,వ్యవస్థమీద నిరాసక్తత,ప్రాణం మీద భయాన్ని సృష్టించడం. మనకు మరో గతిలేదన్న దిగులును కలిగించడం వారి ఆశయం. చక్కగా వారు కోరుకున్నట్లు దిగులుపడదాం! భయపడదాం!!వ్యవస్థ పనికిరాలినది తీర్మానించేసి మనమూ మరో రాజకీయపార్టీ నాయకుల్లాగా మాట్లాడుకుందాం!!!

    ఫలించిన ప్రతిదాడి వెనుకా విఫలంచెయ్యబడ్డ వంద దాడులుంటాయి. అయినా మనం మన భద్రతావ్యవస్థని నమ్మొద్దు. రాజకీయనాయకుల ప్రతి వెధవ కామెంటు వెనకా అనునిత్యం పనిచేస్తున్న నిఘా-రక్షణ వ్యవస్థలున్నాయి. అవన్నీ మర్చిపోదాం.

    కేవలం నిరాశని నింపుకుని వ్యవస్థని తెగుడుదాం. రాజకీయనాయకుల్ని చేతకానివాళ్ళని చెప్పుకుని, ఎన్నుకున్న మన తప్పుల్ని కప్పిపుచ్చుకుందాం.దిగులు పడదాం...కేవలం భయంతో దిగులుపడదాం!!!!

    రిప్లయితొలగించండి
  6. @ Mahesh

    "" ఫలించిన ప్రతిదాడి వెనుకా విఫలంచెయ్యబడ్డ వంద దాడులుంటాయి. అయినా మనం మన భద్రతావ్యవస్థని నమ్మొద్దు. రాజకీయనాయకుల ప్రతి వెధవ కామెంటు వెనకా అనునిత్యం పనిచేస్తున్న నిఘా-రక్షణ వ్యవస్థలున్నాయి."" idhi nijjam

    Well Said !! i DO agree with you.

    రిప్లయితొలగించండి
  7. మహేష్ గారితో పూర్తిగా ఏకీభవిస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో మనం ముందుగా చెయ్యాల్సింది ధైర్యంగా వుండటం. నిజమే! మీరన్నట్టు భద్రతా వైఫల్యాలు వున్నాయి. నాయకత్వలోపమూ వుంది. కానీ అవన్నీ మాట్లాడేందుకు సరైన సమయం కాదిది.

    రిప్లయితొలగించండి
  8. నా నిరాశ మన పోలీసులపై కానే కాదు.. అది ఇక్కడ గానీ, గత జాబుల్లోగానీ సుస్పష్టం.

    నా నిరాశ నాయకత్వంపైనే! ఇక నాయకత్వ లోపానికి కారణాలు.. ఓ వారంలో!

    రిప్లయితొలగించండి
  9. దారుణమైన ఉదంతమది.
    పాపం బద్రతా సిబ్బందే చనిపోతూ ఉన్నప్పుడు వారిని నిందించి ప్రయోజనం లేదేమో. కొన్ని వైఫల్యాలు ఉండవచ్చు. మహేష్ గారన్నట్లు ఎన్ని విఫలం చేయబడ్డ దాడులు ఉంటాయో అన్న ప్రశ్న ఆలోచించదగ్గదే.
    హేమంత్ కార్కర్ ఎవరా అని నెట్ లో అతని గురించి తెలుసుకొని హృదయం ద్రవించింది.

    రిప్లయితొలగించండి
  10. అసలు ఇంత అసమర్థుడైన ప్రధానిని,ప్రభుత్వాన్ని, ఇంతవరకూ చూడలేదు.


    స్టార్ హోటళ్ళలో అందులోనూ విదేశీ దౌత్య వేత్తలు, టూరిస్టులు బస చేసే హోటళ్లలోకి చక్కగా ఉగ్రవాదులు బోలెడు సామాగ్రిని తెచి మనింట్లో స్టోర్ రూం లో బియ్యం బస్తాలు దాచినట్లు దాచగలిగారంటే ఇంతకంటే భద్రతా వైఫల్యం ఏముంటుంది? కనీసం హోటళ్ళ ప్రైవేట్ భద్రతా సిబ్బంది కూడా ఏమి చేస్తున్నారో తెలియదు.

    ఇలాంటి లైవ్ దాడులను, ప్రజా జీవితంలోకి చొచ్చుకొచ్చి,వీధుల్లో మిలటరీ దిగి చేసే యుద్ధాలు మధ్య ప్రాచ్య దేశాల్లో, దక్షిణ అమెరికా దేశాల్లో జరిగినపుడు, గుండెల మీద చెయ్యేసుకుని "ఇంకా నయం,మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి సరిపోయింది. అలాంటి దేశాల్లో జనం ఎలా బతుకుతారో " అని ఆశ్చర్యపోయేవాళ్ళమొకప్పుడు. ఎలా బతుకుతారో ఇప్పుడు ఈ దేశ ప్రజల్ని చూస్తే తెలుస్తోంది.

    విఫలం చెందిన దాడులు ఎన్నో నా దగ్గర గణాంకాలు లేవు గానీ, సఫలం చెందిన దాడుల తాలూకు జ్ఞాపకాలు మాత్రం పచ్చిగానే ఉన్నాయి. ఆరనిచ్చిందెప్పుడు గనుక?

    అసలు పోలీసులు, ఇంటలిజెన్స్, భద్రత, నిఘా వ్యవస్థ...వీటన్నిటికీ స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి. తెగించి సాహసోపేతమైన నిర్ణయాలు అప్పుడే తీసుకోగలుగుతారు.రాజకీయ నాయకుల కనుసన్నలలో ఈ వ్యవస్థలు మెలగాల్సి రావడం దురదృష్టం!

    రిప్లయితొలగించండి
  11. 2006 జూలై 11 నాడు లోకల్ రైళ్ళలో బాంబులు పేలిన రోజు నేను ముంబాయిలోనే ఉన్నాను. ఆ ఘటన నించీ తేరుకోవడానికి నాకు చాలా రోజులు పట్టింది. మళ్ళీ అంతలా నిన్న వణికిపోయాను. భయంతో కాదు.... బాధతో! ఒక మనిషిని చంపడం అంత సులువా? ఈ చనిపోయిన వాళ్ళంతా ఆ ఉగ్రవాద ఉన్మాదుల్ని ఏమి చేసారు? కేవలం భారతీయులుగా పుట్టడమే వారు చేసిన నేరమా? అసలు ఈ ఉగ్రవాదానికి అంతమే లేదా?

    అమాయకుల ప్రాణాలు హరించి వారి లక్ష్యాలు చేరుకోగలమనే భ్రమ నించీ ఈ ఉగ్రవాదుల్ని బయట పడెయ్యాలి. ముందు అలా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశాలన్నిటినీ ప్రపంచంలో మిగతా దేశాలు వెలి వెయ్యాలి. వారికి అన్నమూ నీళ్ళూ పుట్టకుండా చెయ్యాలి. వారి మీద సైనిక చర్య తీసుకోవడం కన్నా..... వారికి తిండి దొరకకుండా చేస్తే అప్పుడు తెలుస్తుంది... వారి చేతిలో ఉన్న తుపాకులు కడుపు నింపవని......!! ఇలా మనుషుల్ని చంపేవాళ్ళని చిత్రవధ చేసి చంపాలి.... !! వారిలో ఒక భయాన్ని కలిగిస్తే అప్పటికైనా ఆ ఉన్మాదం లోంచీ బయట పడతారేమో?

    రిప్లయితొలగించండి
  12. మహేష్గారూ, ప్రస్తుత పరిస్ధితుల్లో కావాల్సింది ఇలాంటి కత్తులే. ఇవే ఆలోచనలకు పదును పెట్టాలి. ఇప్పడేకాదు ఎప్పుడూ ప్రజల్లో కూడా చైతన్యముండాలి. ప్రక్క ఫ్లాటులో ఎవరున్నారో మాకు తెలియదు అనే హైటెక్కుల నుంచి బయటపడి చుట్టుప్రక్కల జరిగే వాటికి ప్రతి ఒక్కరూ స్పందించటం నేర్చుకోవాలి.
    psmlakshmi
    psmlakshmi.blogspot.com

    రిప్లయితొలగించండి
  13. ముస్లిమ్ వోట్లు పోతాయని భయపడి తీవ్రవాదులపై దేశంలో విస్తరించిన వారి విషజాలాన్ని రూపుమాపటానికి చేతగాక చేష్టలుడిగి కక్కినకూటికై ఆశపడుతూ చూస్తున్న రాజకీయ నాయకులు, హిందుత్వ టెర్రర్ అని సిగ్గులేకుండా శీర్శికలు పెడుతూ హిందువులను అవమానపరుస్తున్న పత్రికలు (హిందూ పత్రిక పేరుకు మాత్రమే), దివాళాకోరు చానెళ్ళు కూడ దీనికి కారణం.

    రిప్లయితొలగించండి
  14. బాగా రాసారు. హృదయవిదారకమైన సంగతి. ఇక్కడ టీవీలో చూస్తుంటే నాక్కూడా దేశం ఏమయిపోతుంది అనిపిస్తోంది. బహుశా అన్నిదేశాలు అనాలేమో. బాధితులందిరికి నాసానుభూతి.

    రిప్లయితొలగించండి
  15. ధైర్యంగా ఉండాలి అని నీతులు చెబుతున్న వారికి .. ప్రస్తుత పరిస్థితి భయాందోళనలు కలిగిస్తోందని నేను గానీ చదువరి గానీ అంటే మేమేదో ఇక్కడ భయంతో వణికి ఛస్తున్నామని కాదు. మేకపోతు గాంభీర్యం ఎవరికీ అక్కరకి రాదు. భద్రత నిజ పరిస్థితి ఎలా వుంది, ఎక్కడ బాధ్యతలు విఫలమవుతున్నాయి అని మన కర్త్వ్యాన్ని మనం గుర్తు చేసుకునేందుకే ఇటువంటి మాటలు అనుకోవడం. అంతేగానీ మాకు భయం అని కాదు, ఇంకోళ్ళకి పిరికి మందు నూరిపొయ్యడానికి కాదు.

    రిప్లయితొలగించండి
  16. తొడగొట్టి శతృవును ఎదుర్కునే భారతీయ పౌరుషాగ్నిని మరచి మన నాయకత్వాలఎన్నికలోనే తప్పులుచేసుకుంటున్న మనబాధ్యతలేదాఈవైఫల్యాలలొ.
    భారతమాత కోసం తమప్రాణాలను తృణప్రాయంగా త్యజించిపోరాడిన ,అమరులైనధర్మవీరులకు శిరసావందనం.

    రిప్లయితొలగించండి
  17. ఇక్కడెవ్వరూ వణికి చావడం లేదు.
    బాగా చెప్పారు. అసలు ధైర్యంగా ఉండటం అంటే ఈ సందర్భంలో ఏమిటో చెప్పండి."ఆవేశ పడండి, తొడగొట్టండి(ఎవరిమీదో)" అని చెప్పడమేనా?

    ప్రస్తుతం కళ్ళముందు నాన్ స్టాప్ గా నడుస్తున్న ఘోర ఉదంతాన్ని చూసి గుండే జలదరించడమే భయం! "ఎలా? ఏమై పోతుందీ దేశం? " అని ఆవేదన పడటమే భయం! అంతే గానీ "మనల్ని కూడా చంపేస్తారేమో" అని దుప్పటి ముసుగేసుకోడం కాదు!

    ఇలాంటప్పుడు మానవ సహజ లక్షణం.."భయపడటం"! ఇంకేదైనా చెప్తే అది ముసుగే!

    రిప్లయితొలగించండి
  18. కొత్త పాళీ, అజ్ఞాత బాగా చెప్పారు!

    రిప్లయితొలగించండి
  19. ఏ దాడి విఫలమైందబ్బా ఇప్పటివఱకు? అన్నీ సఫలమౌతున్నట్లే కనిపిస్తోంది. లేకపోతే మూడు నెలల వ్యవధిలో ౪౦ కిరాతక దాడులు, పోయిన ప్రాణాలు ౫౦౦ పైగానే ! ప్చ్ ! చవట ప్రభుత్వాల చవటతనాన్ని ఏ అభిమానుల వ్యంగ్యాలూ కప్పిపుచ్చజాలవు. అమెరికాలో ౧౧/౦౯ WTC Towers దాడి తరువాత మళ్ళీ ఇప్పటిదాకా దాడులు జరగలేదు. ఇక్కడ అవి మామూలైపోవడాన్ని క్షమించేసి ప్రభుత్వానికి భాజాభజంత్రీలు మ్రోగించాలా ? తన ముడ్డి కాదు గనక కాశీ దాకా డేకమన్నాడట వెనకటికొకడు. మన ప్రాణాలు భద్రంగా ఉన్నాయనే కారణం చేత ఈ ప్రభుత్వాన్ని మన్నించాలా ?

    ప్రభుత్వ వీరాభిమానుల సంగతెలా ఉన్నా జనమేం అనుకుంటున్నారో అది చాలా ముఖ్యం. ముస్లిముల వోట్ల కోసం ఈ పార్టీ, ఈ ప్రభుత్వం ఉగ్రవాదుల బాహుమూలాల్ని ఆస్వాదిస్తోందనే నిశ్చితాభిప్రాయంలోకి వచ్చేశారు జనం. పాపం, ఎవరో అభాగ్య మధ్యతరగతి జీతగాళ్ళయిన జవాన్ల త్యాగాల్ని తమ ప్రభుత్వపు ఘనతగా డప్పుకొట్టుకోవడం కాదు, ఈ అభిప్రాయాన్ని పోగొట్టడానికి ఈ ప్రభుత్వం ఇంతవఱకు తీసుకున్న ముందస్తు చర్యలేంటి ? నాకది కావాలి.

    రిప్లయితొలగించండి
  20. So far I have not come across comments from Laalu,Communist party members etc., in NDTV or CNN-IBN English news channels. I am curious to know what they are doing right now. We have to wait and watch what is there strategy on this incident.

    రిప్లయితొలగించండి
  21. తాడేపల్లి వారు చెప్పింది అక్షరాలా నిజం. తీవ్రవాదం గురి తప్పిన ఆనవాళ్ళు మనదేశంలో పెద్దగా లేవు. ఇంకో నెల తిరిగ్గానే ఈ దాడిగురించి పాటిల్, మన్మోహన్ సింగ్ లు మరిచిపోయి, 'అఫ్జల్ గురు ను ఉరినుండి ఎలా కాపాడాలబ్బా' అన్న ఆలోచనలో పడిపోతారు, మరో నెల తరువాత, మరింత పకడ్బందీగా, మరో ఊరిలో, మరో హోటల్లో (అమంగళం ప్రతిహతమగుగాక)ఇంకో దాడి జరిగినా ఆశ్చర్యం లేదు. అందుకని, ఇప్పటినుండే ధైర్యంగా ఉండడానికి అలవాటు చేసుకొందాం. అసలే ఎన్నికల వేళ, ఉగ్రవాదం గురించి మాట్లాడి మైనార్టీ మతపు ఓటుబ్యాంకును దూరం చేసుకొనే మూర్ఖ రాజకీయుడెవడైనా ఉంటాడా!

    రిప్లయితొలగించండి
  22. lalitaa paaraayana yaagam praarambhamavutunnadi. bloglo vivaraalu choodamdi
    durgeswara.blogspot.com

    రిప్లయితొలగించండి
  23. ఈ లాగే ప్రతిసారి మనమే ఎందుకు దౌర్జన్యానికి గురి కావాలి?,
    మన ఇన్వెస్టిగేటివ్ బృందాలు పాకిస్థాన్ లోని నిరాశా,నిస్పృహలను రెచ్హగొట్టి సామాన్య ప్రజలు ఇబ్బంది రుచి చుపెడితే వారికి కూడా మన బాధ అర్ధం అవుతుందనుకుంటా ....

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు