23, జూన్ 2008, సోమవారం

తెలంగాణా ఉద్యమం చేతులు మారుతోంది

దేవేందర్ గౌడ్ రాజీనామా చేసాడు. తెలుగుదేశానికి దెబ్బ తగిలినట్టే! (దీన్ని పార్టీ చీలిక అనొచ్చా అనేది ఇంకో నాలుగైదు రోజుల్లో తెలియవచ్చు) అయితే, అంతకంటే పెద్ద దెబ్బ తెరాసకు తగలొచ్చు.

ఇక గౌడ్ ఏంచేస్తాడు? ఏదైనా పార్టీలో చేరొచ్చు. లేదా తానే ఒక పార్టీని పెట్టొచ్చు.

ఏ విధంగా చూసినా గౌడ్ తెరాసతో చేరే ప్రసక్తి లేదు. కేసీయారు నియంతృత్వం సంగతి తెలిసీ గౌడ్ ఆయనతో చేతులు కలపడు. ఇప్పటికే కేసీయారు కాస్త నీరసపడ్డాడు. తెరాస ప్రభ తగ్గింది. ప్రజల్లో కేసీయారు పట్ల వ్యతిరేకత మొన్న బయటపడింది. వేరే ఏదైనా పార్టీలో చేరతాడేమోగానీ.. తెరాసలో మాత్రం చేరడు. అందులో చేరి కోపైలట్‌గా ఉండాల్సిన అవసరం ఆయనకు లేదు. రాజకీయంగా, వ్యక్తిగత ప్రతిష్ట పరంగా కేసీయారు కంటే గౌడ్ బలవంతుడు. పైగా కులవంతుడు కూడాను -బీసీ నాయకుడిగా ఆయన మంచి స్థానంలో ఉన్నాడు. తెరాసపై ప్రజలకున్న అసంతృప్తి గౌడ్‌కు బాగా లాభిస్తుంది. కాంగ్రెసు, బీజేపీలతో చేరడు.పుట్టబోయే పార్టీలో చేరే అవకాశమూ తక్కువేననిపిస్తోంది. కాంగ్రెసు, తెరాస అసమ్మతివాదులకు గౌడ్ పార్టీ ఆశ్రయమివ్వవచ్చు. ఆ విధంగా కాంగ్రెసుకూ దెబ్బే!

ఇవన్నీ కాకపోతే తానే స్వంతంగా పార్టీ పెట్టొచ్చు -(తెలంగాణా దేశం?). ఏదేమైనా ఇక తెలంగాణా అంశాన్ని గౌడ్ ప్రభావితం చేస్తాడు. తెరాసది ఇక రెండో స్థానమే! తెలంగాణాకు అనుకూలంగా ఏర్పడిన మంచి పరిణామం ఇది.

17 కామెంట్‌లు:

  1. దెవేందర్ రాజీనామా ప్రభావం తెలుగు దేశం పైన, TRS పైనా తప్పక పడుతుంది. TRS మరింత బలహీన పడే అవకాశం ఉంది. ఇహ మనము చూడబోయేది K.C.R. తల్లి తరువాత దేవేందర్ తెలంగాణా తల్లి. ఈ తల్లి శిల్పం, రూపం ఎలా వుంటాయో తెలుసుకోవాలంటే కొంత కాలం వేచియుండాల్సిందే.

    రిప్లయితొలగించండి
  2. He Chiru supports separate telangana. Devender goud joins Chiru Party, i guess
    http://muralidharnamala.wordpress.com/

    రిప్లయితొలగించండి
  3. ఇదొక వింత పరిణామమే. కానీ ఇంతనాటకీయంగా జరగడం చూస్తుంటే .. తెరవెనక బాబూ గౌడుల మధ్య ఏమన్నా కుమ్మక్కు ఉందా అనే పురుగు నా బుర్ర తొలుస్తోంది.

    రిప్లయితొలగించండి
  4. కొత్తపాళీ గారికొచ్చిన అనుమానమే నాకూ వొచ్చింది. బాబు, దేవేందర్ ల గూడుపుఠాణీ
    దేవేందర్ వల్ల, తెలుగుదేశం పార్టీకి పెద్దగా నష్టం ఉండక పోవొచ్చు. ఎవరైనా నష్టపోయే అవకాశం ఉందంటే - అది తెరాసనే అవొచ్చు!

    సిరి

    రిప్లయితొలగించండి
  5. చంద్రబాబు ఇలాంటి అయోమయానికి గురిచేసే రాజకీయాలు చెయ్యడనుకుంటున్నాను. ఎందుకంటే అది అందరికి తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. ఇప్పటి వరకు అతన్ని గమనించినదాని ప్రకారం నేను అలా అనుకోవడం లేదు. ఒకవేల అది గూడు పుఠాణి అయి ఉంటుంది అనుకుంటే, అంటే మరల గౌడ టిడిపి లోకి వచ్చేస్తాడు అనుకుంటే, చంద్రబాబే దానికి పురమాయించాడు అనుకుంటే( గూడు పుఠాణిలో భాగంగా), దాని వల్ల వచ్చే లాభాలు. చిరు వర్గం ఏ విధంగా పావులు కదుపుతుందో, ఈ అయోమయంలో ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడం అని నాకనిపిస్తుంది. టి ఆర్ ఎస్ ని కుంగదీయడం. గౌడ ని పార్టీలోకి తిరిగి చేర్చుకుని తమ పార్టి నిజంగా తెలంగాణాకు బద్ధమై ఉంది అని ప్రజలకి నమ్మకం కలిగేట్టు చెయ్యడం.


    ఇక నేను గూడు పుఠాని కాదు అనుకుంటున్నాను.
    గౌడ పన్నిన రాజకీయ వ్యూహం అనిపిస్తుంది. తన లేఖలో పార్టిని విమర్శించలేదు. తెలంగాణ గురించి మాత్రమే మాట్లాడాడు.గమనిస్తే గౌడ తన రాజకీయ ప్రాభల్యాన్ని కోల్పోతున్నాడు. ఇప్పటి వరకు తను రంగారెడ్డిలొ తిరుగులేని వాడిగా, తెలంగాణలో అందరికన్న పైన ఉన్న నాయకుడిగా మీడియా చుపిస్తుంది. పార్టి కూడా దాన్ని ఖండించలేదు. కానీ ఆ స్థాయి నాయకుడు మొన్న జరిగిన ఎన్నికల్లో రంగారెడ్డిలోని జై తెలంగాణ అని కూడా వికారాబాద్లో పార్టి అభ్యర్ధిని గెలిపించుకోలేకపోయాడు. అంటే తన సమర్ధతను నిరూపించుకోలేకపోయాడని. మిగిలిన టిడిపి నాయకులు దీన్ని గమనించి అతని ఘాటైన మాటలని పట్టించుకోవడం లేదు. రాజీనామా చేస్తే ఒక్కసారిగా ప్రజల దృష్టిని సానుభూతిని పొందగలడు. తన వర్గాన్ని ఉత్తేజితం చెయ్యగలడు. ఎలాగూ పార్టీ నుండి రాయబారాలు నడుస్తాయి. మరలా టిడిపి లోకి రావొచ్చు.

    ఒక వేళ అది కూడా కాదు, నిజంగా తెలంగాణ కోసమే వచ్చాడు అనుకుంటే, ఇప్పుడు టిడిపి అధికారంలో లేదు. తన చర్య అతని అహాన్ని ప్రస్తుతానికి సంతృప్తి పరచవచ్చు. కానీ తను పార్టీ పెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేదు. అది కాంగ్రెస్స్ కి మరింత మేలు చేసినట్టు అవుతుంది. ఎన్నికల కోసం టిడిపి, కాంగ్రెస్స్ సమీకరించుకోగలిగినట్టు గౌడ డబ్బు ని సమకూర్చుకోలేడు. 1969 గౌడ నాయకత్వంలో పునరావృతం అవుతుంది అని తెలంగాణా వాదులు ఆశ పెట్టుకోవచ్చు. అంటే మెజారిటి లోక్ సభ స్థానాలు గెలుచుకోవడం. కానీ అప్పటిలా ఇప్పుడు తెలంగాణా ప్రజలు అంతటి భావోద్వేగంతో ఉన్నారా అని?

    రిప్లయితొలగించండి
  6. ఇది చంద్రబాబు వ్యూహం అనేసుకుంటే, దిలీప్ లేవనెత్తిన సందేహాలన్నీ ఫటాపంచలైపోతాయి. తెలుగుదేశం ఓపన్గా తెలంగాణా ని సపోర్ట్ చెయ్యలేదు గనక గౌడ్ చేత "తెలంగాణా దేశం" పెట్టించి, రాబొయే ఎన్నికల్లో కొన్ని సీట్లు రాబడతాడు. ఒకవేళ by mistake తెలంగాణా వచ్చేస్తే గౌడ్ ను ముఖ్యమంత్రిని చేసి..back seat driving ఎలాగూ చెయ్యొచ్చు.

    ఇలా plan చేస్తే, గౌడ్ కు డబ్బివ్వడానికి చాలా మంది తయారవుతారు(ముఖ్యంగా హైదరాబాదు లో invest చేసినవారు). డబ్బుంటే ఎన్నికలు గెలవడం పెద్ద సమస్య కాదు.

    రిప్లయితొలగించండి
  7. @కత్తి మహేష్ కుమార్ గారు
    రాజకీయం అంత తేలికైన ఆట కాదు కదా. మీరు గమనించారో లేదో పార్టీ మీద విమర్శ చెయ్యలేదు. చంద్రబాబు మీద వ్యక్తిగతమైన విమర్శ చేసాదు దేవేందెర్. చంద్రబాబు తన మీద కొందరు నాయకులు చేసిన విమర్శలని ఖండించలేదని భాధపడ్డాడట. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వాడు వెనకనుండి నడిపించాలనుకుంటాడని నేను అనుకోవడం లేదు :-) టిడిపి అంత వ్యవస్థీకరించబడిన పార్టి దేశంలో ఇంకోటి లేదు. కమ్యూనిష్టులు మినహాయింపు. వ్యవస్థీకరణం చెయ్యడం అనేది పూర్తిగా చంద్రబాబు ఘనత. దాన్ని అలాంటి వ్యూహాలతో పొడుచుకుంటాడా?

    రిప్లయితొలగించండి
  8. అదేంటోగానీ, ఎప్పుడో చల్లారిపోయిన తెలంగాణ గొడవ పోయినసారీ తెదెపా వల్లే పుట్టుకొచ్చింది (బాబు కెసియార్ కి పదవియ్యలేదని). ఇప్పుడు ఉద్యమం బలహీన పడే దశలో మళ్లీ తెదెపాలో గొడవలే దాన్ని పైకెత్తేటట్లున్నాయి. ఓ పక్క 2004లో గులాబీ కండువాలేసుకుని తిరిగిన కాంగ్రెసోళ్లు ఇప్పుడు హాయిగా ప్లేటు ఫిరాయించేస్తే, తెదేపా వాళ్లు మాత్రం తెలివితక్కువగా ప్రవర్తిస్తున్నట్లున్నారు.

    రిప్లయితొలగించండి
  9. దేవేందర్ రాజీనామా చేసినా, అతనితో పాటు తెలంగాణాలో ఇంకో పదిమంది రాజీనామా చేసినా దాని ప్రభావం తాత్కాలికమే. చెన్నారెడ్డికి, చంద్రశేఖరరావుకీ చేతకానిదేదో దేవేందర్ చెయ్యగలడని నేను అనుకోవడంలేదు. ఇది నాలుగురోజుల హడావిడి మాత్రమే. ఆ తరువాత ఎవరూ పట్టించుకోరు - ఇప్పుడు కేసీయార్ ని ఎవరూ పట్టించుకోనట్లే.

    రెండోది - దేవేందర్ పేపర్ టైగర్ మాత్రమే. నిజమైన టైగర్ కానేకాడు. అతన్ని అతిగా అంచనావెయ్యడం వృథా. అతను మొదట్నుంచి తెలుగుదేశం పార్టీని (read చంద్రబాబునాయుడు) ఆశ్రయించుకుని పైకొచ్చినవాడు. తనకంటూ ఏ గుర్తింపూ, వ్యక్తిత్వమూ లేనివాడు. అతని పరిధి మేడ్చల్ నియోజకవర్గం. అది దాటితే అతనికి నామరూపాల్లేవు. అతని మొహం మిగతా తెలంగాణాలో కూడా ఎక్కడా చెల్లదు. అతని సొంత జిల్లాలోనే అతని మాట వినేవాళ్ళెవరూ లేరు. ఈ రోజు హఠాత్తుగా ఆ గుర్తింపుని నిర్మించుకోవడం చాలా కష్టం - అందులోను ప్రత్యేక తెలంగాణలాంటి ఒక nearly dead issue ఆధారంగా !

    ఇహపోతే, ఇదేదో నాటకమని నేననుకోవడంలేదు. ఇది దేవేందర్ గౌడ్ తీసుకున్న, ఎప్పటికీ సరిదిద్దుకోలేని ఒక తప్పుడు నిర్ణయం. దేవేందర్ చేసుకుంటున్నది ఒక రాజకీయ ఆత్మహత్య. 20 ఏళ్ళనాటి మిత్రుల్ని నిర్దాక్షిణ్యంగా వదులుకున్న వ్యక్తిని నమ్మి కార్యక్రమాలు రూపొందించుకునేటంత తెలివితక్కువవాళ్ళెవరూ ఉండరు. కొందఱు తమ స్వార్థప్రయోజనాల కోసం ఆయన్ని దువ్వొచ్చు. అంతకన్నా ఎక్కువేమీ జరగదు. ఇందులో ఆవేశమే తప్ప తెలివితేటలు పూర్తిగా లోపించాయి. అయితే ఈ ఆవేశం తెలంగాణ గుఱించి కాదని నా అభిప్రాయం.

    అసలు విషయమేమిటంటే - దేవేందర్ కి మేడ్చల్ లో 40 ఎకరాల పొలముంది. దాని విలువ ఈరోజు దాదాపు 300-400 కోట్ల రూపాయల మధ్య ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక Outer Ring Road (ORR) అలైన్ మెంటు మార్చింది కదా ! ఆ మార్చడంలో యాదృచ్ఛికమో, ఉద్దేశపూర్వకమో, మొత్తమ్మీద కొన్ని ఎకరాల భూమి రోడ్డుగా మారిపోయింది. దాని గుఱించి అప్పట్లో దేవేందర్ రాష్ట్రశాసనసభలో గగ్గోలు పెట్టాడు కూడాను. కాంగ్రెస్ వినిపించుకోలేదు. ప్రతిపక్షంలో కూర్చోవడం చేత నాయుడుగారు కూడా ఏమీ చెయ్యలేకపోయారు. అలా ఆయన పొలం కొంత పోయింది. అప్పట్నుంచి దేవేందర్ ఉగ్రనరసింహుడయ్యాడు. ఒక దశలో "కావాలనే నాయుడు తన గోడు పట్టించుకోవడంలేదా ? లేదా ఈ రాయలసీమవాళ్ళిద్దరూ కలిసి తన ఆస్తికి ఎసరుపెట్టారా ?" అని అనుమానాలక్కూడా లోనయ్యాడు. అలా ఆయనలోని తెలంగాణావాడు మేల్కొన్నాడు. అప్పట్నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ఆరాటపడ్డం మొదలుపెట్టాడు. అందులో భాగంగానే గతసంవత్సరం తెలంగాణలో పాదయాత్ర, బాబ్లీ ప్రాజెక్టు స్థలం దగ్గర ధర్నా వగైరా డ్రామాలు ఆడాడు. ఈ మధ్య జరిగిన ఉప-ఎన్నికల్లో తె.రా.స. గెలుస్తుందని ఆశించాడు. ఆయన ఆశలు భగ్నమై అది డీలాపడిపోయింది. అంతకు ఏడాది ముందునుంచే ఆయన ఎవరి మాటా వినకుండా తయారై అందరినీ తానే దూరం చేసుకున్నాడు. మాట్లాడేవన్నీ మాట్లాడేసి ఇప్పుడేమో "తెలుగుదేశం పార్టీ నా నోరు నొక్కేసిం"దంటూ అచ్చంగా కేసీయార్ చెప్పిన డైలాగులే పొల్లుపోకుండా అప్పజెబుతున్నాడు.

    ఎన్నికల సంవత్సరమన్నాక చాలామంది ఇలాంటి హైజంపులూ, లాంగ్ జంపులూ చేస్తూనే ఉంటారు. రాజకీయ సమీకరణలు హఠాత్తుగా మారిపోతాయి. వాటిని గంభీరంగా పట్టించుకోలేం. పార్టీల సంఖ్య పెఱిగినకొద్దీ ప్రత్యేకతెలంగాణ నినాదం ఇంకా ఇంకా మూలపడిపోతుందే తప్ప మునుపటి ఊపు రావడం అసంభవం.

    రిప్లయితొలగించండి
  10. ఈ రోజు ఈనాడులో మైసూరారెడ్డి చెప్పిన సంగతులు చూడండి (రాజకీయాల్లో ఉన్న అతి కొద్దిమంది పెద్దమనుషుల్లో ఈయనా ఒకడని నా అభిప్రాయం). గత రెండు మహానాడుల్లోనూ పట్టుబట్టి సమైక్యాంధ్రే మా విధానమని తీర్మానం చేయించిన దేవేందర్ గౌడ్ కి హఠాత్తుగా తెలంగాణపై ప్రేమ పొంగి పొర్లటమేమిటన్నది మైసూరా సూటి ప్రశ్న. మరి దేవేందర్ సమాధానమేమిటో?

    రిప్లయితొలగించండి
  11. @ తాడేపల్లి గారు
    మీతో నేను ఏకీభవిస్తున్నాను. నేను ఇంక ఈ టపాలో రాయక్కరలేదేమో. ఆ 40 ఎకరాలే కాకుండా తనకి ఇంకొన్ని ఎకరాలు ఉన్నాయి అని వాటిలో కొంత బాగం ఏదో ఇండస్ట్రీ బోర్డు కోసం ప్రభుత్వం సేకరించదలచిందని, ఇలా వేరు పడితే అటు కాంగ్రెస్స్ నుండి పనులు చేయించుకోవచ్చని దేవేందెర్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని అనుకుంటున్నారు.

    రిప్లయితొలగించండి
  12. నేనూ దేవేందర్ చేసిన పనికి మాలిన పని గురించి రాద్దామని దిగాను. తాడేపల్లి గారి కామెంట్ చూశాక ఇంకేమీ రాయక్కర్లేదనిపించింది.

    అబ్రకదబ్ర,
    మైసూరా రెడ్డి కూడా కాంగ్రెస్ కి ఒకప్పుడు నమ్మినబంటేగా! ఆయనా ఏళ్ల తరబడి కాంగ్రెస్ లో ఉండి సీటు కోసమో,పదవి కోసమో(2004 ఎన్నికల్లో కాంగ్రెస్ మట్టిగొట్టుకుపోతుందని, తెలుగు దేశం దూసుకుపోతుందని) అకస్మాత్తుగా తెదేపా లోకి దూకిన వాడే! ఆయన్ ఎలా పెద్ద మనిషో అర్థం కావట్లేదు.

    రిప్లయితొలగించండి
  13. రాజకీయాలలో ఒక్క స్థానం ఖాళీ ఐతే దాన్లో కూర్చునేందుకు వందల మంది పోటీ పడతారు. ఏ పార్టీకైనా, నాయకులకన్నా కార్యకర్తలే ముఖ్యం. టీ.డీ.పీకి సమర్ధులైన నాయకులు, కార్యకర్తలు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. కార్యకర్తల్లో, క్రింది స్థాయి నాయకుల్లో ఐకమత్యం..అంకితభావం ఉన్నంత వరకు పది దేవేందర్లు పార్టీని వదిలినా..కలిగే నష్టం ఏమీ లేదు. జనాలు ఓట్లు వేసేది సైకిలు గుర్తును, మానిఫెస్టోను చూసి...దేవేందర్‌ను చూసి కాదు.

    సుజాత గారు,
    రాజశే'ఖరుని'తో శత్రుత్వమున్నోడెవ్వడైనా కాంగ్రెస్సులో మనగలుగుతాడా? అదీ ఒకే జిల్లాలో ఉండి. కాంగ్రెస్సులోనే ఉంటే మైసూరా ఎం.పీ కాదు కాదా కౌన్సిలరు కూడా కాలేడు...కానివ్వరు.

    రిప్లయితొలగించండి
  14. ఒక తెలంగాణా బ్లాగులో వాళ్లని మెచ్చుకున్నా కూడా నాకు తలంటేసారు.
    కనుక తెల........... అనే మాట కనిపిస్తే చాలు "No comment" అనదలచుకున్నాను.

    బొల్లోజు బాబా

    రిప్లయితొలగించండి
  15. సుజాత,

    మైసూరా పదవి కోసం పార్టీ మారాడో లేదో అనే విషయం ఆయన పెద్దరికాన్నేమీ తగ్గించేది కాదు. ఇన్నేళ్ల్లుగా రాజకీయాల్లో ఉన్నా కుంభకోణాల్లో ఆయన పేరెప్పుడూ వినలేదు నేను. కాంగ్రెసులో ఉన్నా, తెదెపాలో ఉన్నా ఆయన ఊరికే ఎదుటివారిపై నోరు పారేసుకోవటం నేనెరుగను. అసెంబ్లీలోనైనా, పార్లమెంటులోనైనా ఏదైనా విషయమ్మీద మాట్లాడేటప్పుడు చాలా స్టడీ చేసొచ్చిగానీ మాట్లాడడని మైసూరా రెడ్డికి పేరు. అవన్నీ వినీ, చదివీ ఆయన పెద్దమనిషి అని నేనౌకుంటున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే :-)

    రిప్లయితొలగించండి
  16. దెవేందర్ ది ముందు చూపు.. మొన్న ఉప ఎన్నికలు చూస్తే మూడు పార్టీలు పోటీపీవితే - ఎవరికీ వచ్చేదిఎమీలేదని తెలిసింది..
    తెలంగాణా లో తెరసా లెకా చిరంజిఇ రైలు వల్లా, కోస్తా ఆంధ్రాలలో చిరంజిఇ రైలు వల్లా, ఏ పార్టీ కీ మెజారిటీ రాకపోతే, ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ పార్తీలో చెరచ్చు.. పదవి ఇవ్వకపోరు.. అదే ఏకం గా తను తెలంగాణా లో పదో పన్నెండో గెలిస్తే అసలు - దబాయించి మరీ పదవి తీసుకోవచ్చు..
    ఇంకా, అవసరాన్నిబట్టి తిరిగి తెలుగు దేశం లో చేరతానన్నా వారు కాదనపోవచ్చు.. వేరే పార్టీ వాళ్ళూ ఒద్దుపొమ్మనరు..నిజం గా చిరంజీవి పార్టీ పెట్టి అధికారం లోకి వస్తే ఇంకా మెరుగు.. ఆ పార్టీకి దేవేందర్ లాంటి అనుభవశాలుర అవసరం చాలా ఉంటుంది.

    అంతా సజావు సాగితే ఇది.. ఒక వేళా... కమ్యూనిష్టులు .. నిజం గానే నిజం గా ప్రభుత్వాన్ని కూలదోస్తే .. చిరంజీవి కి దేవేందర్ కి పార్టీ ని స్థాపింఛి, వ్యవస్థీకరించే సమయం ఉంటుందా అనేది ప్రశ్న, దేవేందర్ - స్వతంత్ర అభ్యర్ధి గా పోటీ చేయవచ్చు... మరి అల్లు అరవింద్ గారు చెప్పిన రైలు రాకుండనే , కమ్యూనిష్ట్లు ఎర్రజెండా, ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపుతారేమో చూడాలి.

    రిప్లయితొలగించండి
  17. ప్రతీ వ్యాఖ్యలోనూ గుర్తుంచుకోదగ్గ వ్యాఖ్యానాలున్నాయి. చాలా ఆసక్తికరమైన చర్చ జరిపినందుకు వ్యాఖ్యాతలందరికీ నెనరులు.

    గౌడు, బాబు కుమ్మక్కయ్యారని నాకనిపించడం లేదు. అలా కుమ్మక్కై, విడిపోయినట్టుగా నాటకమాడి సాధించగల ప్రయోజనమేదైనా ఉంటుందనుకోను!

    గౌడు పార్టీ పెడితే స్వంతంగా సాధిస్తాడో లేదోగానీ, సరైన పొత్తులు పెట్టుకుని అధికారానికి దగ్గరగా వెళ్ళగలడు. కేసీయారుకు లేని అనుకూలతలు గౌడుకు కొన్నున్నాయి..

    1. కేసీయారు ఇప్పటికే తెలంగాణా పట్ల ప్రజల్లో ఒక ఉద్వేగాన్ని రగిలించి ఒక ప్లాట్‌ఫారము తయారుచేసి ఉన్నాడు. గౌడుకు అది ఉపయోగపడుతుంది. (ప్రజల్లో తెలంగాణా భావన లేదు అనే వాదనకు నేను ఒప్పను. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చెయ్యగల స్థాయిలో ఉందనే నేను నమ్ముతాను)
    2. కేసీయారు ప్రజల కోపానికి గురై, ప్రస్తుతం కాస్త వెనుకంజ వేసి ఉన్నాడు. గౌడు ప్రజల్లో చొరబడడానికి ఇదో సదవకాశం. ప్రజల్లో గౌడు పట్ల సానుకూలతేగానీ ప్రతికూలత ఉందనుకోను.
    3. వివిధ పార్టీల్లోని తెలంగాణా అనుకూల నాయకులు ఒకచోట చేరేందుకు ఇన్నాళ్ళూ వేదిక లేకపోయింది. కేసీయారు దుడుకుతనం వారిని తెరాస నుండి దూరంగా ఉంచింది. ఇప్పుడు గౌడ పార్టీ పెడితే వారికో అవకాశం.
    4. ప్రస్తుతమున్న బహు పార్టీల రాజకీయ వాతావరణంలో ఊదం గారు చెప్పినట్టు ప్రతి పార్టీకీ అవకాశాలున్నాయి -దేవేందర్ గౌడుకు కూడా.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు