29, జనవరి 2008, మంగళవారం

రాబోయే పార్టీకి కాబోయే కార్యకర్తల దౌర్జన్యం!

కొట్టిందెవరో తెలీదు. గుంటూరు, సత్తెనపల్లి, హై.ల్లో దాడులు/దాడి ప్రయత్నాలు జరగడాన్ని బట్టి అభిమానులే చేసారనుకోవాలి. చిరంజీవి కూడా అభిమానులే చేసారనే ఉద్దేశ్యంతోనే ఉన్నాడు.. అందుకే తాను క్షమాపణలు చెప్పుకున్నాడు.

చిరంజీవి అభిమానుల ప్రవర్తన ఆశ్చర్యం గొలిపేది కాకపోవచ్చు. ఈరోజుల్లో హీరోలందరి అభిమానులూ ఇలాగే ఉన్నారు. సినిమాల్లోని హీరోయిజమే నిజజీవితానికీ ఆపాదించి తమ హీరో ఏదో మానవాతీతుడని భావిస్తారు. వాళ్ళని వెనకేసుకు వస్తున్న హీరోల ప్రవర్తనా ఊహించనిదేం కాదు.

కానీ రాజకీయాల్లోకి దిగి అందలాలెక్కదలచుకున్న వ్యక్తి, ప్రజలంటే అభిమానులు మాత్రమే కాదన్న సంగతి మరచిపోకూడదు. ఓటర్లంతా తన అభిమానులు కాదనీ తెలుసుకోవాలి. క్షమాపణలు చెప్పుకోవడం వరకూ బానే ఉన్నది గానీ.. అభిమానులు మనస్తాపం చెందారని ఓ ముక్క అన్నాడు. అది సమంజసమని కూడా అన్నాడు! క్షమాపణతో సాధించదలచిన ప్రయోజనం, ఈ సమంజస మనస్తాపంతో పోగొట్టుకున్నాడు! అభిమానులదేం ఉంది.. అలా వెనకేసుకురాకపోయినా బాధపడరు. కానీ ఇతరులు మాత్రం ఆ మాటను తేలిగ్గా తీసుకోలేరు.

రాజకీయాల్లోకి వస్తున్నారని పుకార్లొస్తేనే ఈ విమర్శ వచ్చింది. నిజంగా వస్తే దీన్ని మించిన విమర్శలనేకం వస్తాయి. మరి ప్రతీ విమర్శకూ అభిమానులు సమంజసమైన మనస్తాపం చెందుతారా?

ప్రతీసారీ దాడికి గురైనవాళ్ళ ఇంటికి పోయి క్షమాపణలు చెప్పుకుంటూ పోతాడు కాబోలు, చిరంజీవి!

11 కామెంట్‌లు:

  1. చదువరి గారు బాగా రాశారు.. అక్కడ ఏదో జరిగిపోయిందన్న భ్రమ మనస్తాపం అనే పదప్రయోగం వల్ల చిరంజీవి కల్పించారు.

    రిప్లయితొలగించండి
  2. మీరీ అంశం మీద బ్లాగుతారని ముందే తెలిసి నేను వ్యాఖ్య అనుకుని పెట్టుకున్నాను.
    నేను చిరంజీవి ఇంచిన క్షమాపణ చూసి ఆశ్చర్యపోయాను.
    ఇక చిరంజీవి ఎంటీయార్ బాటలో నడవాలనుకుంటున్నాడు కాబట్టి, ఆయనకీ ఈయనకీ వున్న తేడా ఒక్కటి గమనించగలడు. ఎంటీయార్ కి సమాజంలోని అన్ని వర్గాల్లోనూ అభిమానులూ వుండేవారు. కానీ చిరంజీవికి అలాంటి అప్పీలు లేదు. కనీసం రజనీకాంత్ కున్నంత కూడా లేదు (చంద్రముఖి వంటి సినిమాల పుణ్యమా అని). మొత్తానికి ఇలాంటి చర్యలను ఇంకా తీవ్రంగా ఖండించాలి. మీరు చెప్పినట్లు అభిమానులను మఱీ ఇంతగా వెనకేసుకుని రవలసిన అవసరం లేదేమో...

    రిప్లయితొలగించండి
  3. స్పైడర్ మాన్ అనే సినిమాలో ఒక అద్భుతమైన డయలాగ్ వుంది. నీవు ఎంత శక్తిమంతుడివైతే, అంత బాధ్యత నీ నెత్తి మీద వుంటుంది అని. అది ప్రపంచంలో అందరు సెలెబ్రిటీలకూ వర్తిస్తుంది. సచిన్ కు చిరంజీవి కంటే కనీసం వంద రెట్ల ప్రజాభిమానం వుంది. కానీ అతను దానినేమీ దుర్వినియోగం చెయ్యడం లేదే? ప్రజలు అభిమానించేది ఒక క్రీడాకారుడిగా మాత్రమే అని అతనికి తెలుసుకనక ఆ బాధ్యత అతను వహిస్తున్నాడు. చిరంజీవిని మనం ఎందుకు అభిమానిస్తున్నామో అని మూలాలు వెతుకుదాం. నిజ జీవితంలో హీరోనా ? ప్రజా కార్యక్రమాలలో అగ్రగామా? అద్భుతమైన వాదనాపటిమ, రాజ్యాంగ పరిణితీ? ఇందులో ఏ ఒక్కటీ మన కళ్ళకు ఇప్పటివరకూ కనిపించలేదు. సినిమాలో హీరోయిజమ్ వేరు, బయట హీరోలు వేరు. అది చాలా చిన్న విషయం. అర్ధం అవ్వటానికి పెద్దగా బుర్ర వుండనక్కరలేదు. అర్ధం కాకపోవటానికి వేపకాయంత వెర్రి చాలు.

    రిప్లయితొలగించండి
  4. సుధాకర్, అభిమానులను మధ్యతరగతి కళ్ళతో చూసి అర్థంచేసుకోలేము. సచిన్ వరుసగా విఫలమైనా తొలగించే ధైర్యం ఎందుకు చేయలేకపోయారు? అభిమానులకు భయపడే. రాజశేఖర్ చిల్లర ప్రవర్తనకు చిరంజీవి హుందాగా వ్యవహరించాడు. నీవు చెప్పిన అర్హతలకంటే మనిషిలో మంచితనం ముఖ్యం. అది చిరంజీవిలో చూస్తే ప్రజలు ఆదరిస్తారు. లేకుంటే నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు.

    చదువరి: అభిమానులు మనస్తాపం చెందారు అన్నాడు చిరు. అందులో తప్పు ఏముంది. రాజశేఖర్ దురుద్దేశంతోనే ఇంకా పార్టీనే పెట్టని చిరంజీవి గురించి అనవసర వ్యాఖ్యలు చేశాడు.

    రిప్లయితొలగించండి
  5. దేవుడా..ఇంత చిన్న చిన్న మనుషులకు అంత పెద్ద పెద్ద ముసుగుల భారం ఎందుకు వేశావు స్వామీ

    రిప్లయితొలగించండి
  6. శ్రీధర్ - నెనరులు.
    రాకేశ్వర - పార్టీ పెట్టిన కొత్తల్లోనూ, ఆ తరవాతా ప్రత్యర్థులు రామారావు మీద వేసిన జోకులు, చేసిన విమర్శలు ఇన్నీ అన్నీ కావు. కానీ ఎక్కడా దాడులు జరగలేదు. అది రామారావు గొప్పో కాదో గానీ ఖచ్చితంగా అభిమానించిన ప్రజలది మాత్రం గొప్పే!
    సుధాకర్- ఈ దాడిని ఖండించడంలో మాత్రం చిరంజీవి పరిణతి చూపించలేకపోయాడు.
    తెలుగు అభిమాని - ఒక అభిమాని దృష్టితో కాకుండా మామూలుగా ఆలోచించండి. "రాజశేఖర్ దురుద్దేశంతో", "రాజశేఖర్ చిల్లర ప్రవర్తన" - ఇవి జరిగిన దాడిని సమర్థిస్తున్నాయి.

    వైజాసత్య - లార్జర్ దేన్ లైఫ్ సైజనా మీ ఉద్దేశ్యం?

    అందరికీ - ఒక సూచన.. డా. సమరం కూడా చిరంజీవికి అభిమానే కదా (అంతలా బయటపడి చిరంజీవి పట్ల తన అభిమానాన్ని వెల్లడించిన మరొక ప్రసిద్ధుడు లేడనుకుంటా).. దాడి గురించి ఆయనేమంటాడో చూద్దాం!

    రిప్లయితొలగించండి
  7. సచిన్ ని తొలగించకపోవటానికి అభిమానులు కారణమా? ఇదేదో కొత్తగా వుంది. అతనికి కనీసం సౌరభ్ కి కోల్కతాలో వున్నటువంటి రకం అభిమానులు కూడా లేరే? పక్కన పెట్టినా నిరసనలు కూడా లేవే? ఇప్పటికీ మడమ తిప్పని యోధుడిలా సెంచరీలు సాధిస్తుంటే ఎవడు మాత్రం తీస్తాడు? ఇవన్నీ పక్కన పెట్టి ఆ క్రెడిటంతా అభిమానిజానికి ఇచ్చెయ్యటం సచిన్ ని అవమానించినట్లే. ఆ లెక్కన చిరంజీవికి అంత సీను లేదు, అభిమానులదే ఆ సీనంతా అంటారా? అలాంటి సీను చిరంజీవి లాంటి నటుడికి అవసరం లేదనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  8. రాజశేఖర్ అభిప్రాయం లో తప్పొప్పులు గురించి పక్కన పెడితే,రాజకీయాలలో ఒకరిమీద ఒకరు విమర్శలు చెయ్యడం సహజం,దానికి ఫాన్స్ ఇంతలా జోక్యం చేస్కొని దాడి చెయ్యడం,చిరంజీవి గారు అభిమానుల మనస్తాపం సహజమేనని చెప్పడం, ఇదంతా రాజకీయ ప్రవేశం చెయ్యబోతున్న చిరంజీవి మీద కొద్దిగా నెగటివ్ అభిప్రాయాన్ని తప్పకుండా కలగచేస్తాయి.

    రిప్లయితొలగించండి
  9. రావు గారు
    మధ్యలో సచిన్ ని ఇన్వాల్వ్ చేయొద్దు
    చిరంజీవికీ సచిన్ కి చాలా తేడా ఉంది.
    సచిన్ కదన రంగంలో నిరంతరం పోరాడే సైనికుడు

    రిప్లయితొలగించండి
  10. మీ టాపా చాల బాగుంది. అభిమానులను మా సోదరులు, పిల్లలు అని వెనకేసుకొని రావడం తప్పితే, వాలు చేసే గొడవలను మాత్రం ఆపడానికి ప్రయత్నం చెయ్యడు చిరంజీవి. ఇది మొదటి సారికాదు, సినమాలకు గొడవలు, పవన్ కల్యాణ్ కోర్టు కేసులో గొడవలు.

    రిప్లయితొలగించండి
  11. స్వతంత్రదేశంలో ఎవరికైనా విమర్శించే హక్కు ఉంది. అది మర్చిపోతే అది గూండారాజ్యమే. ఎవరిమీదైనా ఏ కారణం మీదైనా దౌర్జన్యం చెయ్యడం ఎలా సమంజసం అవుతుంది?

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు