9, డిసెంబర్ 2007, ఆదివారం

"మహాకవి శ్రీశ్రీ" జీవిత చరిత్ర

"1983లో అతడు భౌతికంగా మరణించినా మరికొన్ని సహస్రాబ్దాల పాటు అతడి కవిత్వం బతికే ఉంటుంది. తన జీవిత కాలంలోనే చరిత్ర ప్రసిద్ధుడైన శ్రీశ్రీ అనంతర కాలంలోనూ అలాగే జీవిస్తాడు. కవిత్వమున్నంత కాలం, కవిత్వ రసాస్వాదన ఉన్నంత కాలం కవితానుభూతి ఉన్నంత కాలం అతడు ఉంటాడు. " శ్రీశ్రీ జీవిత చరిత్ర పుస్తకాన్ని ముగిస్తూ రచయిత రాసిన వాక్యాలివి.

"కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది". శ్రీశ్రీ కవిత, "కవితా ఓ కవితా" గురించి రాస్తూ ఆ పుస్తకంలోనే రచయిత అన్న మాటలివి.

"ఎన్నోసార్లు నిరీశ్వరవాదినని బడాయి మాటలు చెప్పిన శ్రీశ్రీ తిరుమల కొండ మీద శాస్త్ర సంప్రదాయానుగుణంగా తన కొడుకు ఉపనయనం చేశాడు. ఢిల్లీ కన్నడ సాహిత్య పరిషత్తు వారు బహూకరించిన మురళీ కృష్ణుడి చందన విగ్రహాన్ని ఆత్రంగా పొట్లాం విప్పి, బహిరంగంగా కళ్ళకద్దుకున్నాడు." ఇవీ ఆ పుస్తకంలోని వాక్యాలే!

కేంద్ర సాహిత్య అకాదెమీ వాళ్ళు వేసిన ఈ "మహాకవి శ్రీశ్రీ" ని రాసింది బూదరాజు రాధాకృష్ణ. ఆయన ముక్కుసూటి మనిషని, నిర్మొహమాటస్తుడని ఎక్కడో చదివాను. మరి శ్రీశ్రీ జీవిత కథను ఆయన ఎలా రాసిఉంటాడో నన్న కుతూహలం కొద్దీ ఆ పుస్తకం కొన్నాను.

జీవిత చరిత్రలను నేను చదివింది చాలా తక్కువ. చదివిన ఆ కాసిని చరిత్రలూ నాకొకలాగే కనిపించాయి. చిన్నప్పుడు ఎన్నో కష్టాలకోర్చి అనుపమానమైన కృషితో, పరిశ్రమతో పైకి రావడం, చివరికి ఏ రాష్ట్రపతో, ప్రధానమంత్రో, మంత్రో శాసనసభ్యుడో, గొప్ప సంఘసంస్కర్తో అవడం.. ఇదీ టూకీగా కథ. పుస్తకం మొత్తం ఒళ్ళు గగుర్పొడిచే గొప్పదనమే. పుస్తకం చదువుతూండగానే అంతకు ముందు చదివిన జీవితకథలు బుర్రలో రెక్కలు విప్పుకుంటూ ఉంటాయి.

అయితే ఈ పుస్తకం మాత్రం విభిన్నంగా ఉంది. రచయిత నిర్మోహంగా, నిర్మొహమాటంగా రాసాడా జీవిత చరిత్రను. వ్యక్తిగతంగా శ్రీశ్రీ లోని తప్పులను విమర్శించేందుకు ఆయన వెనకాడలేదు. "..శ్రీశ్రీ కి లేని వ్యసనం లేదు..", "..తాగి..", "..భగందరం అనే వ్యాధి వచ్చింది.." ఇలాంటి ఎన్నో వ్యాఖ్యలున్నాయి ఆ పుస్తకంలో. శ్రీశ్రీ వ్యక్తిత్వాన్ని మనముందు నిలబెట్టే రచన అది.. లేనిపోనివి కల్పించో, ఉన్నవాటిని దాచేసో చేసే మాయ కాదది. 8 అధ్యాయాలుగా విడగొట్టిన ఈ పుస్తకాన్ని ఇంగ్లీషు నుండి (ఇంగ్లీషులో రాసింది కూడా బూదరాజు గారే!) అనువదించారు. నాకు బాగా నచ్చిన జీవిత చరిత్ర ఇది. బహుశా శ్రీశ్రీ జీవితం ఎన్నో మలుపులూ మసాలాలతో కూడుకున్నది కావడం కూడా పుస్తకం ఆసక్తి కరంగా ఉండడానికి కారణం కావచ్చు.

"..తెలుగులో మొట్టమొదటిసారిగా పజిల్సు సృష్టించాడ"ని కూడా రాసారా పుస్తకంలో. పజిల్సంటే బహుశా గళ్ళ నుడికట్టే అయితే, తెలుగు గళ్ళనుడికట్టుకు శ్రీశ్రీయే ఆద్యుడన్నమాట! (శ్రీశ్రీ దానికి పెట్టిన పేరు పదబంధ ప్రహేళిక అనుకుంటా)

పుస్తకంలో ఆరుద్ర గురించి కూడా విమర్శనాత్మక వ్యాఖ్యలు ఉన్నాయి. ఒకచోట ఇలా రాసాడు.. "శ్రీశ్రీ షష్టిపూర్తి జరిగినప్పుడు, మదరాసులో శ్రీశ్రీ అంతిమ యాత్ర జరిగినప్పుడు ఆరుద్ర ప్రవర్తించిన తీరు కనీసం లోకందృష్టిలోనైనా హుందాగా లేదనిపించింది". అలాగే "ఒకటి మటుకు ఖాయం. చరమదశలో శ్రీశ్రీ మానసికంగా బాధపడ్డాడు ఆరుద్ర కారణంగా. తన బహిరంగ శత్రువులెవరూ శ్రీశ్రీ నింతగా బాధించలేదు." అనీ రాసాడు.

రాకేశ్వరుని బ్లాగులో శ్రీశ్రీ గురించి చదివాక నాకీ పుస్తకం గుర్తొచ్చింది. మళ్ళీ మొన్న బూదరాజు అశ్విన్ గారితో మాట్టాడుతూ ఉండగా ఈ పుస్తకం ప్రసక్తి వచ్చింది. శ్రీశ్రీ తన ఆత్మకథ అనంతంను కూడా ఇలాగే నిర్మొహమాటంగా రాసుకున్నారని అశ్విన్ గారు చెప్పారు. ఓ పాలి అది కూడా చదవాలి!

24 కామెంట్‌లు:

  1. చదువరి గారూ,
    నాకు బూదరాజు రాధాకృష్ణ పేరు వినగానే కొంత మైకం కమ్ముతుంది. బూదరాజుకు ఒక బిరుదు ఉంది. "నిండు మనంబు నవ్య నవనీతసమానము ,పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము " అని. విమర్శలో బూదరాజుకు సాటి లేరు. ఆయన సమీక్షిస్తారని తెలిసి జ్వరం తెచ్చుకున్న రచయితల గురించి నేను విన్నాను. ధీషణాహంకారి. అలాంటివాడే అయిన విశ్వనాథతో ప్రత్యక్షంగా ఢీకొట్టిన పండితుడు. సర్వస్వమూ అయిన పాండిత్యాన్ని వాడుకుని ఒక మహానుభావుడు చివరిక్షణంలో ఆయన్ని కష్టాల్లో వదిలేశాడన్న బాధ ఆయనకేమో గాని, ఆయన శిష్యులకు చాలా ఉంది. మీరు వీలయితే బూదరాజు సమీక్షలు,జీవిత చరిత్ర (విన్నంత కన్నంత) చదవండి. ఆయన ఎంత చండ శాసనుడో తెలుస్తుంది. ఇంక ఆరుద్ర విషయం, శ్రీ శ్రీ కి, ఆరుద్రకి ఆరంభంలో తప్ప ఆ తరువాత పెద్ద పడలేదు. ఎవరో ఆరుద్ర మీ శిష్య రత్నమేనా అని అడిగితే, శ్రీశ్రీ చెప్పిన జవాబు ఇది. " శిష్యుడంటే అతనొప్పుకోడు, రత్నమంటే నేనొప్పుకోను". బూదరాజు శ్రీశ్రీని విపరీతంగా అభిమానించాడు. అందువల్ల అనివార్యంగా ఆరుద్రను ద్వేషించాడేమోనని నాకు అనుమానం. ఆరుద్ర మొదట్లో కమ్యూనిష్టు జెండా పట్టుకున్న కవులతో చురుకుగా తిరిగాదు. తరువాత మాత్రం వేరే సంఘాలు, సంబంధాలు పెట్టుకున్నాడని ఎక్కడో చదివాను. బూదరాజు మాత్రం పరోక్షంగా కమ్యూనిష్టు జెండా మోశాడని నేను నమ్ముతున్నాను. కాని రచనలో మాత్రం బూదరాజు వ్యక్తిగత అభిప్రాయాలకు పెద్దపీట వేయడు. మాయాబజారు సినిమాలో చెబుతారే.. "శాస్త్రమెప్పుడూ ఏంచెప్పినా నిష్కర్షగాను, కర్కశంగానే చెప్తుంది" అని ఆయన అలాంటివాడు. ఆయన గురించి గుర్తు చేసినందుకు నెనర్లు
    బాలవాక్కు

    రిప్లయితొలగించండి
  2. చదువరి గారూ,
    మరొక్క మాట, శ్రీశ్రీ నిర్మొహమాటంగా రాసుకునే విషయం నిజమే కావచ్చు కాని, అవన్నీ నిజాలు కాకపోవచ్చని పెద్దల వద్ద నేను విన్నాను. అది "అనంతం" కావచ్చు, మరొకటో కావచ్చు.
    నెనర్లు
    బాలవాక్కు

    రిప్లయితొలగించండి
  3. బూరా అరసం సభ్యుడు,అయన ప్రత్యక్ష శిష్యుడిగా నేను గమనించింది హిపోక్రసి అంటే ఆయనకు ఒళ్ళు మంట.నేను గుంటూరు జిల్లా వాడినని,గర్వంగా కాదు ఎంతో ఆనందంగా చెప్పుకునేవాడు.బూరా ప్రేమించిన వాటినన్నిటినీ మనం ప్రేమించక్కర్లేదు.కానీ మేష్టారు ద్వేషించిన వాటిని మనం నిర్మొహమాటం గా ద్వేషించవచ్చు.పర్ఫెక్షన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి తప్ప వచ్చేసిందనుకొవటం, రాదేమో అని ఏడవటం కూడదనేవాడు. ఆయనది ఒకటే మాట,పంచమహాకావ్యాల్లోనే ఒకటీఅరా లోపాలున్నప్పుడు,షేక్ స్పియర్ అంతటి వాడికే తప్పనప్పుడు మామూలు రచయితలు ఇంకెంత జాగ్రత్త రాయాలీ అనెవాడు, అలాగే గండభేరుండాలమని రెక్కలువిప్పేవారిని ప్రతిభను పుస్తకాల్లో చూపమనేవాడు.

    రిప్లయితొలగించండి
  4. కొన్నానండీ మీరు చెప్పిన పుస్తకము, చదివటము మొదలుపెట్టాను.

    రిప్లయితొలగించండి
  5. నేను ఇంకా కొంచెం వివరమగా రాయాల్సిందని ఇప్పుడు అనిపిస్తోంది.కుష్వంత్ సింగ్ ఒక సందర్భంలో ఆల్దస్ హగ్స్ లీ రచనలన్నె చదివేసానంటే, ఆ మిత్రుడు జాబితా చెప్పమంటాడు.అందులో పేర్లు విన్నాక సింగు గారు చదవనివి మరో మూడు పుస్తకాల గురించి చెప్పి వాటిని కూడా ఒక సారి చదవమంతాడు.నీడ్ ఫర్ ఏ న్యూ రెలిజియన్ అనే తన పుస్తకంలో స్వయంగా కుష్వంత్ ఈ మాటలు చెప్పుకొస్తాడు.నాకు తెలిసి మనదేశంలో ఫలానా రచయిత మీద అధారిటి అని చెప్పదగ్గ వ్యక్తులు దాదాపుగా లేరు.ఒకవేళ ఉన్నా అందరిమీద ఎక్కువ తెలిసిన వారు తప్ప ఆకవి సృజనాత్మకత మీద సార్వభౌమత్వం చాటుకోగలిగిన వారు బహు అరుదు.ఉదహరణకు గురజాడ విషయం తీసుకోండి.ఆయనకు తమదైన గుర్తింపు ఇవ్వలనే ఆదుర్దాతో మనకవి,రచయిత,విమర్శకాగ్రేసరులు ఎన్ని కుప్పిగంతులు వేశారో అర్ధమవుతుంది. శ్రీశ్రీని ఆరుద్ర ద్వేషించాడని బూరాగారు ఆరుద్రను అకారణంగా ద్వెషించాడు అంటే నేను అంగీకరించను.బూరా పైకి చెప్పని,చెప్పలేని కారణాలు వేరే ఎమన్నా ఉన్నాయేమో నాకు తెలియదు. అవసరమైన దానికన్నా ఎక్కువ ద్వెషింటం అంటే ఏమితో నాకు అర్ధం కాలేదు.కాబట్టి నేను ఏమీ చెప్పలేను.

    ఇక గుంటూరు విషయానికొస్తే ..1970 ఫిబ్రవరి రెండో తారీకున ఒంగోలు జిల్లా ఏర్పడింది పాత గుంటూరు జిల్లాలోని అద్దంకి,చీరాల,ఒంగోలు తాలూకాలతో కలసి.1932లో చీరాలపక్కనే ఉన్న వేతపాలేంలో పుట్టిన బూరా జీవితాంతం నేను గుంటూరు జిల్లావాడిని అనే చెప్పుకున్నాడనే సందర్భంలో ఆ ప్రస్తవన నేను తెచ్చాను.
    పీవి గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంతే వాళ్ళిదరిది కొన్ని దశాబ్దాల పరిచయం,బూరా తెలుగు అకాడమి కాలం ఉపసంచాలకుడుగా పనిచేసిన సంగతి అసలు తెలుగు అకాడమిని స్థాపించింది పీవి కాబట్టి వారిద్దరి మధ్య అలాంటివి మీరు పేర్కొన్న సన్నివేశాలు ఎన్నో మాకు కొన్ని చెప్పారు కానీ వాటికిది వేదిక కాదు,సంధర్భమూ సరికాదు.అలాగే హిపొక్రసి గురించి కూడా బూరా కు ఉన్నా నిశ్చితాభిప్రాయాలకు కూడా పైన మాటే వర్తిస్తుంది. మీరు మీ గోదావరి ని గూర్చి నిర్భయంగా ఆనందించండి ఆల్ ద బెస్ట్

    రిప్లయితొలగించండి
  6. ఇది రాజేంద్రకుమార్ గారి వ్యాఖ్య కు ముందు చదువుకొన ప్రార్థన,
    సాంకేతిక సమస్యల కారణమగా మకతిక జరిగినది,క్షమించగలరు.
    నెనర్లతో బాలవాక్కు
    అధ్యక్షా...(చదువరిగారూ)
    శాసనసభావిధానం ప్రకారం మీ బ్లాగులో మేమూ మేమూ మాట్లాడేసుకోవటం బాగోదు. అందువల్ల తమరి ద్వారా రాజేంద్రకుమార్ గారికి నా సందేహాలు తెలుప ప్రార్థన. మేష్టారు ప్రేమించినవన్నీ మనం ప్రేమించక్కర్లేదని చెప్పారు సరే, కాని ఆయన ద్వేషించినవన్నీ మనం ద్వేషించాలనటం న్యాయమేనా. బూదరాజుగారయినా ఇది అంగీకరిస్తారా.. ఆయన ఎంతో ప్రేమించిన శ్రీశ్రీలోని లోపాలను ఆయనే విమర్శించలేదా.ఆరుద్ర విషయంలో ఆయన అవసరమయిన దానికన్నా ఎక్కువ ద్వేషించాడనేది నా ప్రగాఢ విశ్వాసం.
    ఇక గుంటూరు అభిమానం గురించి - గుంటూరు మండలంలోని ఆ ఆనందం ఎమిటో బూరా ఎప్పుడయినా చెప్పారా... పైగా ఒకసారి పీవీ నరసింహారావు ఆయన్ని "గుంటూరు పండితులేమంటారని" వెక్కిరించాడు కూడా...ఆయన గుంటూరు గురించి తలచుకుని ఆనందిస్తే మేము గోదావరిని తలచుకుని ఆనందిస్తాం. అవునూ, గుంటురు జిల్లా గురించి ఎందుకువచ్చిందిక్కడ, హిపోక్రసీ గురించి ఉదాహరణలేమీ లేవా........హిపోక్రసీ విషయంలో ఆరుద్ర ఎంతో శ్రీశ్రీ కూడా అంతే అని నా నమ్మకం.
    అశ్విన్ గారు కొన్న పుస్తకమేమిటో, వీరూ బూదరాజు సంస్థానంలోని వారేనా.... బూదరాజు గారి వారసులు విదేశాల్లో ఉన్నట్లు విన్నాను అలాంటి బంధుత్వమేమయినా ఉందా....
    నెనర్లతో బాలవాక్కు

    రిప్లయితొలగించండి
  7. బాలవాక్కు,
    మీరూ మీరూ మాట్టాడేసుకోవడం బాగానే ఉందిలెండి. :) "శిష్యుడంటే అతనొప్పుకోడు, రత్నమంటే నేనొప్పుకోను" - ఈ మాటలు బూరా కూడా పై పుస్తకంలో రాసారు. అశ్విన్ గరు కొన్న పుస్తకం, "మహాకవి శ్రీశ్రీ" యే! ఇక బూరాకూ ఆయనకీ ఉన్న సంబంధం గురించి నాకు తెలీదు.

    రాజేంద్ర, బూరా గురించి నాకు తెలిసినది అతి తక్కువ. మీరిద్దరూ ఆయన గురించి చెప్పిన విషయాలకు గాను నెనరులు.

    అశ్విన్, :)

    రిప్లయితొలగించండి
  8. నా కవితలు వ్రాయడం ఎలా టపాలో ప్రస్తావించిన శ్రీశ్రీ జీవిత చరిత్ర పుస్తకం ఇదే. అలానే మంగతాయారు టపాలో చెప్పినట్లుగా, శ్రీశ్రీని రెండు సార్లు మానసికాసుపత్రిలో చేర్చారన్న విషయం కూడా నాకు ఈ పుస్తకం నుండే తెలిసింది.
    దాన్ని నాతో బాటూ బెంగుళూరు, ముంబయ్యి వగైరా తీసుకువెళ్లినా దాన్ని ఇంకా పూర్త చేయలేదు.

    రిప్లయితొలగించండి
  9. ఓహ్! బూరా గారు ఈ పుస్తకం కూడా రాసారా! నాకు తెలీదు అసలు! ఈసారి దొరికితే చదువుతాను తప్పక. ఆయనతో పర్సనల్ పరిచయం ఉండి కూడా దాని విలువ తెలిసేసరికి ఆయన మరణించారు. నేనెంతసేపు ఆయన్ని ఓ "మొదలుపెడితే...ప్రవాహంలా కబుర్లు చెబుతూ, అందర్నీ విమర్శించే పెద్దాయన" గానే చూసాను కానీ... ఆయన గొప్పదనం ఆయన పోయాక శిష్యులు వెలువరించిన "సదాస్మరామి" పుస్తకం చదివాకగానీ తెలీలేదు. మంచి పరిచయానికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. బూ.రా. గారి ఏకలవ్య శిష్యుడిగా నన్ను నేను భావించుకొంటాను.ఈనాడు ఆదివారంలో తెలుగు జాతీయాలు నాకత్యంత ఇష్టమైన శీర్డిక. ఆయన దగ్గర శిష్యరికం చేసిన రాజేంద్ర గారిని చూసి అసూయ కలుగుతోంది. తెలుగు భాషా పరిపుష్టికి ఆయన చేసిన కృషి అమోఘం.తొందరగా ఈ పుస్తకాన్ని తెప్పించుకోవాలి.

    రిప్లయితొలగించండి
  11. మీరు నమ్ముతారో లేదో గానీ మొన్న ఏదో సంధర్భవశాత్తు అలా రాయాల్సి వచ్చింది కానీ నేనెప్పుడూ బూరా శిష్యుడిని అని చెప్పుకోలేదు.అలా చెప్పుకోవటం వల్ల గురువుగారికి ఎక్కడ చెడ్డపేరు వస్తుందో అనే భయంచేత. తెలుగు జర్నలిజానికి దూరమై చాలా కాలం కావటం,రచనలు చేసినా ఎవరన్నా చదువుతారేమో అనే భయంతో ఎవరికీ పంపకపోవటం ఇలాంటి విశిష్ఠతలు నాకు చాలా ఉన్నాయి. వారం క్రితం వరకూ నా భార్యకు నేను రచనలు చేస్తాను అనే సంగతే తెలియదంటే మీరు అర్ధం చేసుకోవచ్చు.

    బూరా తనస్వంత గ్రంధాలయాన్ని వారి స్వగ్రామం వేటపాలెం లైబ్రరీకి అప్పచెప్పారు.ఒక రచయితను మహా అని ఆకాశానికి ఎత్తటం వరకూ బాగానే ఉంటుంది,కానీ మన తర్వాత తరాల వారు రుజువులూ,సవబులూ చూపమన్నప్పుడే ప్రచారకులు తడబాటుకు గురవుతున్నారు.గతంలో కొందరు పెద్దలు మధ్వచార్యుల పద్ధతిని అవలంబించేవారు,ఇప్పుడు మాత్రం సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. మహా అనే ప్రతి దానికి ఇదే వర్తిస్తుంది.
    మహాత్ములను వారి లోపాలతో పాటు ప్రేమించనీయకుండా,వారసలు మనభోంట్లు కాదంటూ మాట్లాడటం ఎక్కడి సంస్కారమో నాకు అర్ధం కాని విషయం. ప్రపంచ సాహిత్య చరిత్రలో మానవపరిమితులను అధిగమించి రచనలు చేసిన వారున్నారే గాని మానవసహజ బలహీనతలను నిలువరించిన వారు దాదాపు శూన్యం.ఎంచేకొద్దీ కంతలు వస్తూనే ఉంటాయి,అలాగని వాటిని వదిలేయ కూడదు,వాటినే పట్టుకోని వేళ్ళాడకూడదు.

    రాజేంద్ర కుమార్ దేవరపల్లి

    రిప్లయితొలగించండి
  12. "ఒక రచయితను మహా అని ఆకాశానికి ఎత్తటం వరకూ బాగానే ఉంటుంది,కానీ మన తర్వాత తరాల వారు రుజువులూ,సవబులూ చూపమన్నప్పుడే ప్రచారకులు తడబాటుకు గురవుతున్నారు.గతంలో కొందరు పెద్దలు మధ్వచార్యుల పద్ధతిని అవలంబించేవారు,ఇప్పుడు మాత్రం సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. మహా అనే ప్రతి దానికి ఇదే వర్తిస్తుంది.
    మహాత్ములను వారి లోపాలతో పాటు ప్రేమించనీయకుండా,వారసలు మనభోంట్లు కాదంటూ మాట్లాడటం ఎక్కడి సంస్కారమో నాకు అర్ధం కాని విషయం. ప్రపంచ సాహిత్య చరిత్రలో మానవపరిమితులను అధిగమించి రచనలు చేసిన వారున్నారే గాని మానవసహజ బలహీనతలను నిలువరించిన వారు దాదాపు శూన్యం.ఎంచేకొద్దీ కంతలు వస్తూనే ఉంటాయి,అలాగని వాటిని వదిలేయ కూడదు,వాటినే పట్టుకోని వేళ్ళాడకూడదు. "
    Thanks! This is the expression I had been after. This is my feeling too. In my view the same applies to our heritage too.

    రిప్లయితొలగించండి
  13. శ్రీశ్రీ గారి అనంతం చదువుతూ ఈ టపా చదవటం బాగుంది. వీలైనంత త్వరలో పుస్తకం చదవాలి.

    నెనర్లు!

    రిప్లయితొలగించండి
  14. నేనీ పుస్తకం చదివేశానండీ! చాలా నచ్చింది. పరిచయం చేసినందుకు నెనర్లు!

    బూదరాజు గారి గురించి మరిన్ని విషయాలు / విశేషాలు తెల్సుకోవడమెలా?

    రిప్లయితొలగించండి
  15. అనంతం చదివి నేను కొంచెం నిరాశకు లోనయ్యాను. అందులో శ్రీ శ్రీ ఆయన పాఠకులకు, లేదా ప్రజలకు అవసరం లేని విషయాలెన్నో రాసి పారేశాడు.(మహాకవులకు కూడా వ్యక్తిగత జీవితం ఉండొచ్చు కానీ అది మనకు జుగుప్స కలిగించేదిగా స్వీయ చరిత్రలో వర్ణించుకోనక్కర్లేదనిపించింది) ఈ పుస్తకం మీద రంగనాయకమ్మ దుమ్మెత్తి పోస్తూ ఒక రివ్యూ రాశారు.(అది స్త్రీ స్వేచ్చ అనే వ్యాసాల సంకలనం లో ఉంది)

    ఆ తర్వాత ఆయన భార్య సరోజ ఒక వీక్లీ లో రాసిన "సంసారంలో శ్రీ శ్రీ" అనే పుస్తకం భాగాలు ఒక పాత పుస్తకాల షాపులో దొరికితే చదివాను. అందులో ఆవిడ సినిమా సోది ఎక్కువ! అయినా శ్రీ శ్రీ మనస్థత్వం, కొంతవరకు అర్థం కావడానికి అది కొంచెం తోత్పడింది.ఆ పుస్తకం చివర్లో ..శ్రీ శ్రీ అంతిమ యాత్రలో ఎవరెలా ప్రవరించిందీ కొన్ని పత్రికల్లో వచ్చీ వార్తల తలూకు కటింగ్స్ కూడా ప్రచురించారు, ఫొటోలతో పాటుగా! ఇదే పుస్తకంలో..తామిద్దరూ (మొదటి భార్య రమణమ్మ, ఈవిడ..సరోజ) శ్రీశ్రీ కి ఇష్టం లేకున్నా బలవంతం గా ఒప్పించి మరీ ఆయన కొడుకు ఒడుగు సంప్రదాయ బద్ధంగా చేసినట్లు ఆమె రాసింది. అది కూడా వారి ఇంట్లోనే, తిరుపతిలో కాదు.

    బూదరాజు గారు ఈ పుస్తకం కూడా రాశారని ఇప్పుడే తెలిసింది. తప్పక కొని చదవాల్సిందిగా తోస్తోంది.

    రిప్లయితొలగించండి
  16. శ్రీశ్రీ స్వీయచరిత్ర, సరోజా శ్రీశ్రీ రాసిన "సంసారంలో శ్రీశ్రీ" చదివి నేను చాలా అసంతృప్తికి లోనయ్యాను. అంతవరకూ ఆయన కవిత్వం ద్వారామాత్రమే ఆయన్ని ఎరిగిన నేను, ఆయన పర్సనల్ విషయాలు (ముఖ్యంగా కొడుకు ఒడుగు గురించి, దాంపత్య జీవితం,వ్యసనాలు మొ||) చదివాక చాలా నిరాశ పడ్డా.

    నేను తొమ్మిదో తరగతిలో ఉండగా, మా ఇంగ్లీషు మాస్టారిద్వారా శ్రీశ్రీ కవిత్వానికి పరిచయమైన నాకు, "ఆలోచన" అలవాటు చేసింది మాత్రం శ్రీశ్రీ కవిత్వమే.

    బూదరాజు గారి పుస్తక తప్పకుండా చదువుతాను.

    రిప్లయితొలగించండి
  17. గిరీష్ గారు,
    శ్రీ శ్రీ భార్య రాసిన పుస్తకంలో దాంపత్య జీవితం, వ్యసనాలు ఇవే ఉంటాయి కదండి! ఆ పుస్తకం పేరే అది! శ్రీ శ్రీ గారి పర్సనల్ లైఫ్ సంగతేమిటో తెలుసుకోవాలని పత్రిక సర్క్యులేషన్ ఒక్కసారిగా పెరిగిపోయేంతగా జనం దాన్ని చదివారట అప్పట్లో!అందులో మనం సాహిత్యం వెదకటం కుదరదు. పైగా ఆవిడ ఎక్కువగా reported speechలో రాసినట్టు నాకనిపించింది.సన్మానాలు, విదేశీ ప్రయాణాలు...డబ్బింగ్ సినిమాల గోల..ఇలా!

    అనంతం చదివాక అది దొరకడంతో, అనంతం లో లేని మంచి విషయాలు ఆవిడేమన్నా రాసిందా, అరుదైన ఫొటోలేవైనా అందులో ఉన్నాయా తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఆ పుస్తకం చదివాను. అదిప్పుడు ప్రింట్ లో కూడా లేదు!

    బయట మనకు లభించని కొన్ని కవితలు ఆవిడ అందులో పెట్టినందుకు అభిందించాలి. ఆ కవితలు ఆ తర్వాత బయటకు వచ్చాయేమో తెలియదు.

    కవులు రాసిన కవిత్వం చదివి, వారిని ఉన్నతంగా ఊహించుకోవడం మనమంతా చేసే సహజమైన పని!కానీ వారి బలహీనతలు వారికుంటాయి. ఏం చేస్తాం? ఎవరో ఒకాయన (కవే అనుకుంటా)శ్రీ శ్రీ తాగుబోతనే విమర్శపై "నువ్వు రాసి పారేసిన కవిత్వం ఉండగా, నువ్వు తాగిపారేసిన సీసాల సంగతి నాకెందుకు" అన్నాడట!

    రిప్లయితొలగించండి
  18. శ్రీ శ్రీ అనంతం చదివినప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ కు గురవడం, రచయితలని వాళ్ళ రచనలంత ఎత్తుగా ఊహించుకునే పాఠకులకి సాధారణంగా జరిగే ప్రక్రియే. నాకూ అలాగే అనిపించినప్పటికీ ఆయన నిజాయితీ ఎక్కువ ఆకట్టుకొంది.

    కాని సరోజ శ్రీ శ్రీ గారి సీరియల్(స్వాతిలో అనుకుంటా) నేను చదివినప్పుడు, అప్పుడే నాకస్సలు నచ్చలేదు(చెత్త అనే పదం వాడాలనుంది, కాని పెద్దలు తిడతారని మానేస్తున్నా). దాంట్లో ఆవిడ అతిశయము, ఆవిడ స్వోత్కర్ష, ఆ ట్విస్టింగు అంతా, ట్రాన్స్పరెంట్ గా ఉండి, ఆవిడన్నా, ఆ రచనన్నా పెద్ద గౌరవం కలగదు. అదో పెద్ద టి వి సీరియల్.

    రిప్లయితొలగించండి
  19. కుమార్ గారు,
    ఎవరో తిడతారని ఊరుకుంటామటండీ, అది చెత్తే! నేను ప్రకటించేసాను. పర్వాలేదు. మీరు తిట్టినా నా వెనకే ఉండొచ్చు!

    రిప్లయితొలగించండి
  20. kumaar gaaroo.. కాని సరోజ శ్రీ శ్రీ గారి సీరియల్(స్వాతిలో అనుకుంటా).. ఆంద్ర జ్యోతి అనుకుంటా.. ఎందుకనో ఆ మహా సీరియల్ ని మధ్యలోనే ఆపేశారు.

    రిప్లయితొలగించండి
  21. సుజాత గారూ
    ఆ మాటలు అన్నది ప్రజాకవి కాళోజీ.
    అప్పట్లో జ్యోతి పత్రికలో అనుకుంటా శ్రీ శ్రీ దాశరధి ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. "ఒరే శ్రీ శ్రీ నీ మహాప్రస్థానం నీ పాలిటి మహా స్మశానం".. " నువ్వొక తాగు బోతువి" అంటూ దాశరథి తీవ్రంగా వ్యక్తిగత విమర్శలకు దిగినప్పుడు కాళోజీ కల్పించుకుని అన్న మాటలవి.

    "వాడు రాసిన కవితలు
    గుబాళిస్తున్నప్పుదు
    వాడు తాగిపారేసిన సీసాల
    కంపు మనకెందుకు?"

    ఇంకా ఏదో వుంది. కాళోజీ శ్రీశ్రీ సన్నిహిత మిత్రులు. శ్రీ శ్రీ వరంగల్ వస్తే కాళోజీ ఇంట్లోనే దిగే వారు.
    ఈసందర్భం గా ఒక చిన్న అనుభవం.
    ఒకసారి హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వార్షికోత్సవానికి శ్రీ శ్రీ ని ముఖ్య అతిధి గా పిలిచారు. సభ సాయంత్రం ఆరు గంటలకి కాగా ముందే వరంగల్ వచ్చిన శ్రీ శ్రీ నక్కల గుట్ట లోని కాళోజీ ఇంట్లో దిగి భోజనం చేసి (మందు కొట్టి?) ఓ కునుకు తీసారు. ఆరవుతుండగా శ్రీ శ్రీ ని తీసుకెళ్ళడానికి విద్యార్ధులు రావడంతో కాళోజీయే ఆయనను లేపారు. లేవడం లేవడమే సిరికిన్ జెప్పడు టైపులో చెప్పులు వేసుకోవడం కూడా మరచిపోయి పదండి (ముందుకు) అంటూ బయలు దేరారు శ్రీ శ్రీ. అప్పుడు కాళోజి కేకవేసి ఒరే చెప్పులు మరచి పోయావు అని గుర్తు చేస్తే శ్రీ శ్రీ ఒక్క క్షణం ఆగి "అక్కడ మరచి పోవడం కంటే ఇక్కడ మరచి పోవడమే సేఫ్ కదా" అన్నారు. ఆమాట కి విద్యార్హులంతా గొల్లుమన్నారు.

    రిప్లయితొలగించండి
  22. పూర్ణిమ" బూదరాజు రాధాకృష్ణ ఆత్మకథ "విన్నంత కన్నంత" చదివితే ఆయన గురించి మరింత తెలుస్తుంది.
    అందరికీ నెనరులు

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు