8, జూన్ 2007, శుక్రవారం

ఇన్నాళ్ళూ ఏమైపోయారు పాల్ గారూ?

కిలారి ఆనంద్ పాల్:
"ఎన్నికలప్పుడు రాజశేఖరరెడ్డి నన్ను 5 మిలియను డాలర్లు డబ్బులడిగాడు. నేనివ్వనన్నాను. అంచేత నాపై పగబట్టి ఆయనా సోనియాగాంధీ కలిసి నా గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ కు దేశంలో అనుమతి రద్దు చేసారు."

మూడేళ్ళ తరవాత ఆయనకీ సంగతి హఠాత్తుగా గుర్తొచ్చి, ఈ ముక్క పత్రికల వాళ్ళ దగ్గర బైటపెడితే, ముఖ్యమంత్రి ఫక్కున నవ్వేసాడు. (అంటే ఏదో ఉందన్నమాటే!)

అసలు పాల్ కు రాజకీయ నాయకులతో పనేంటి? కూటములు పెట్టి ప్రజలకు స్వస్థత ప్రసాదించే దైవజనుడు రాజకీయులతో అంత పూసుకు తిరగాల్సిన అవసరం ఏంటి? 108 దేశాల్లో తిరిగాను, 60, 70 మంది ప్రభుత్వ, దేశాధినేతలతో ప్రత్యక్షంగా పరిచయం ఉంది. ఇరాక్ లో నా శాంతి ప్రయత్నాలు విజయం సాధించే దశలో, అసూయతో బుష్షు అడ్డం పడి యుద్ధానికి వెళ్ళాడు. బుష్షూ రైసూ కలిసి సోనియా గాంధీతో కుమ్మక్కై నా సంస్థకు అనుమతులు రాకుండా చేసారు.. ఇలా ఆయన చెప్పుకు పోతుంటే మనకూ నవ్వొచ్చింది. ఆ రాత్రి టీవీ9 వాడి ఫోనాఫోనీ కార్యక్రమంలో చూడాలి అయ్యవారి తీరు.. అబ్బో..!

టీవీ 9 వాడి ఫోనాఫోనీ ఎంతో రంజుగా మంచి ఆరోగ్య కరమైన హాస్యాన్ని అందిస్తూ సాగింది. పైన చెప్పినవి కాక కొన్ని జోకులు చూడండి..

పాల్ ఆయన ఎదురుగా ఉన్న ఫైలు లేపి చూపిస్తూ మంత్రి మారెప్ప, రోశయ్య, నట్వర్ సింగు, ఇలా ఎందరో ఉత్తరాలు ఇచ్చారు. ఇందులో అందరి ఉత్తరాలు ఉన్నాయి. సమయం వచ్చినపుడు బయట పెడతాను అంటూ చెప్పినవాడు, టీవీ 9 రజనీకాంత్ "ఏదీ చూపించండి" అంటే వెతికాడు కానీ కనిపించలేదు.

ఈ లోగా మంత్రి మారెప్ప లైను లోకి వచ్చాడు..
పాల్ ఉత్సాహంగా ఆ మారెప్ప గారూ చెప్పండి అన్నాడు. మారెప్ప ఆయన్ని నిరాశ పరుస్తూ ఈ పాల్ చెప్పేవన్నీ అబద్ధాలు. నేను ఆయన తమ్ముడికి ఉత్తరం ఇచ్చిన మాట వాస్తవం అని అన్నాడు. వెంటనే పాల్, 'ఇదుగో మీరు రాసిన ఉత్తరం నా దగ్గరే ఉంది. అసలు అందులో మీరేం రాసారో చెప్పండి', అని అడిగాడు.

అప్పుడు "మంత్రి" మారెప్ప అద్భుతమైన డవిలాగు చెప్పాడు "అబ్బే నేనేం రాయలేదు, తెల్ల కాగితమ్మీద సంతకం పెట్టిచ్చాను". (ముఖ్యమంత్రి గారు ఫైలు చూడకుండానే సంతకం పెట్టానని చెప్పుకున్నాడు. వారి దర్బారులో మంత్రేమో తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టి ఇచ్చేస్తున్నాడు. శభాష్!) మతి పోయిన రజనీకాంత్ తేరుకుని "అలా తెల్ల కాగితమ్మీద సంతకం ఎలా పెట్టారండి" అనడిగితే ఈయన దైవజనుడు కదా అని పెట్టాను అని అన్నాడు.

అన్నిటి కంటే గొప్ప జోకు ఏంటంటే, పాల్ గారు పదే పదే చెప్పిన ఓ మాట..
"నా సంస్థను ఇలా అడ్డుకోవడం వలన వీళ్ళెంత తప్పు చేస్తున్నారో తెలుసుకోవడం లేదు.. ఎంతో మంది విధవరాండ్రకు అన్యాయం జరుగుతోంది. ప్రపంచంలోని వేలాది విధవరాండ్రకు (ముందు లక్షలాది అని అన్నాడు) నేను మేలు చేస్తున్నాను" ఇలా పదే పదే విధవరాండ్రు అని ఆయన అంటూ ఉంటే, నాకు గురజాడ వారి గిరీశమే గుర్తుకొచ్చాడు.

ఇహ జోకులాపి విషయానికొస్తే..

మూడేళ్ళ కిందట వీళ్ళు డబ్బులడిగారని పాల్ గారు చెబుతున్నారు. అది దిగ్భ్రాంతి కలిగించేంత, నమ్మలేనంత విషయమేమీ కాదు. అడిగే ఉంటారు! కానీ..
  • డబ్బుల సంగతి ఇన్నాళ్ళూ ఎందుకు దాచారు?
  • అసలు వాళ్ళతో ఈయనకు తగవు రావడానికి కారణం అదేనా, లేక.. ప్రజలకు చెప్పనిది, చెప్పుకోలేనిది ఇంకా ఏమైనా ఉందా?
  • డబ్బులివ్వనందున ఈయన సంస్థకు అనుమతులు ఇవ్వడం లేదంటున్నారు. అందుకే అ సంగతులన్నీ ఇప్పుడు బైట పెట్టానంటున్నారు. మరి అనుమతులు నిరాటంకంగా కొనసాగి ఉంటే బయట పెట్టేవారు కాదా?
  • ఇప్పటి వరకూ ఎవరెవరు ఈయన్ని డబ్బులడిగారు? ఎంతెంత ఇచ్చారు?
  • కూటముల మాటున ఈయన రాజకీయులతో అనైతిక సంబంధాలు పెట్టుకున్నట్టుగా అనుమానం కలుగుతోంది. ఏయే పార్టీలతో ఈయనకు సంబంధాలున్నాయి?
అసలు పాల్ కు అంతంత సొమ్ము ఇప్పించే స్తోమత ఎక్కడిది అనే సంగతి విచారించాలి. అలాగే పైదేశాల నుండి ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు తెస్తున్న ఇతర మత ప్రబోధకులు, ప్రచారకులను కూడా విచారించాలి. మత ప్రచారం పేరుతో వీళ్ళు ఏమేం పనులు చేస్తున్నారో ఆరా తీయాలి.

7 కామెంట్‌లు:

  1. దెవుడి మనిషి కధా ఎప్పుడన్నా చెప్పొచనుకున్నడెమొ.

    రిప్లయితొలగించండి
  2. వైయ్యెస్సారు హాస్యప్రియులు. పాల్ వేసిన జోకులను బాగా ఆస్వాదించినట్లున్నారు. అందుకే ఫక్కుమన్నారు. తనకంటే బాగా జోకులువేసిన పాల్‌ను అభినందించికూడా ఉండవచ్చు.

    రిప్లయితొలగించండి
  3. ఐనా దేవుడి పేరు మీద అన్ని కోట్లు సంపాదించడం ,,,దానం చెయ్యడం సాథ్యమా?????
    వై ఎస్ ఆర్ మీద నిందలు సరే//ఆయనని దించి రోశయ్యను ముఖ్యమంత్రిని చేయమనడమేంటి?? దీని మతలబు ఏమిటి తిరుమలేశా????

    ఇదంతా ప్రచారం కోసం చేసే జిమ్మిక్కు..నమ్మితే మనమే వెధవలం...

    రిప్లయితొలగించండి
  4. దృశ్యానుభవం కలిగింది మీ బ్లాగు చదువుతోంటే. మీ ప్రశ్నలు చాలా బాగున్నాయి. "అసలు వాళ్ళతో ఈయనకు తగవు రావడానికి కారణం అదేనా, లేక.. ప్రజలకు చెప్పనిది, చెప్పుకోలేనిది ఇంకా ఏమైనా ఉందా?" సమాధానం తెలిసిపోతోందికదా.

    నాదో సందేహం- పాల్ గారూ దేవుడి మనిషే, మనదీ దేవుడిపాలనే- సమస్యలు రాకూడదే? అంటే డబ్బు దేవుడికన్నా ప్రియమైనదన్నమాట!

    రిప్లయితొలగించండి
  5. పాలయ్యవారు 'నేను గా...ఠి గా తలుచుకుంటే బుస్షు మూడు నెలల్లో గద్దె దిగుతాడూ అని కూడా అన్నారు. ఇంతకంటే పెద్ద జోకు మరోటి వుంటుందా?

    రిప్లయితొలగించండి
  6. సదరు పాల్ గారు పూర్వాశ్రమంలో చేసిన అక్రమాల గురించి ఇప్పుడిప్పుడే వార్తలు బయటపడుతున్నాయి. మనవాడు అటు కాంగ్రెస్ తో ఇటు టీడీపీ తో ఏక కాలం లో స్నేహం నెరపిన గొప్పవాడు. అంతే కాదు బాల యోగి హెలికాప్టర్ ప్రమాదానికి గురై మరణించినప్పుడే అందులోంచి సూట్ కేసుల నిండా డబ్బు లభ్యమైందని వార్తలు వెలువడ్డాయి. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ కూడా పాల్ దే.

    మత ప్రచారం అంటూ సకల భోగాలూ అనుభవించే ఈ దొంగ దూతల అసలు రంగు అజ్ఞాన ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారో అర్ధం కాదు. హైదరాబాద్ శివార్లలో పాల్ కున్న 100 ఎకరాల "స్వచ్చంద సంస్థ" గుట్టు వెలికితీసేందుకు ప్రభుత్వ శాఖలు రంగం లోకి దిగాయి...పోయి పోయి కొరివి తో తలగోక్కున్నాడు మనవాడు...

    రిప్లయితొలగించండి
  7. కరెక్ట్‌గా చెప్పారు చదువరీ!! మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది పాల్‌కీ , వైయెస్స్‌కీ ఏమిటి బెడిసికొట్టిందనే, అది కూడా మూడేళ్ల తర్వాత!
    లేక ఇది ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేమో !!

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు