11, జూన్ 2006, ఆదివారం

తెలుగు సినిమా హీరోలు, అభిమానులు, ఇతర పాత్రలూ

3 కామెంట్‌లు
తెలుగు వారం సినిమా అభిమానులం! ఏదో రకంగా సినిమా మన జీవితాన్ని తడమని రోజే ఉండటం లేదు. సినిమా అంటే "హీరో", హీరోయే సినిమా అయిపోయిన కాలమిది. మన హీరోలకు అపరిమితమైన ప్రాముఖ్యత ఉంది. కానీ, వాళ్ళు నిజంగా హీరోలేనా?

హీరోలు:
మన తెలుగు సినిమా హీరోల పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. గానుగకు కట్టేసిన ఎద్దు ఎలా తిరుగుతుందో వీళ్ళ సినిమా జీవితాలూ అలాగే అయిపోయాయి. ఇమేజీ అనే గానుగకు కట్టేసిన ఎద్దులు వీళ్ళు. (అయితే తెలుగు సినిమా పరిస్థితి మరింత జాలిగొలుపుతుంది.. అది ఈ గానుగెద్దుల చుట్టూ తిరుగుతోంది) ఎరుపెక్కిన కళ్ళూ, పవర్‌ఫుల్ (చంపుతా, నరుకుతా లాంటి) డైలాగులూ, ఓ నలభై యాభై మంది కండలు తిరిగిన వస్తాదులను ఒంటిచేత్తో నలగ్గొట్టడం, హీరోయిన్ తో చేసే రికార్డు డ్యాన్సులు .. ఇవి ఉంటేనే వాళ్ళ సినిమాలు ఆడతాయి. ఏ మాత్రం సహజత్వం ఉన్నా ఆడవు. (ఈ మధ్య ఎలాంటివైనా ఆడటం లేదులెండి! అదొక మంచి మార్పు.) భుజకీర్తులు, వందిమాగధులు, భట్రాజుల మోతలకు వీళ్ళు దాసోహమైపోయారు. భేషజమనే ముస్తాబు లేకుండా కనబడరు వీళ్ళు. తమను ఇంద్రుడనీ చంద్రుడనీ కీర్తించే వాళ్ళంటే వీళ్ళకు కితకితలు. తమ సినిమాలకు వీళ్ళు చెప్పినవారే దర్శకుడు, సంగీత దర్శకుడు, కథకుడు, ఇతర నటులూ, సాంకేతిక నిపుణులూను. వీళ్ళతో సినిమాలు తీసి, వీళ్ళను పోషిస్తున్న నిర్మాతలకు వీళ్ళకున్న ప్రాముఖ్యతలో శతాంశం కూడా దక్కుతున్నట్టనిపించదు.

హీరోయినులు: తెలుగు సినిమాల్లో హీరోయిను ఓ ఆటబొమ్మ, అంగడి బొమ్మ! హీరోయిన్ల ప్రాముఖ్యత గురించి జెమినీ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల వ్యాఖ్య చూడండి. మామూలుగా అడిగే తెలివి తక్కువ ప్రశ్నలతో పాటు ఇలా అడిగాడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి.. మీ సినిమాల్లో హీరోయినుకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది ఎందుకు? అని. అదేం లేదు ప్రత్యేక ప్రాముఖ్యత ఏమీ ఉండదు, మన సినిమాల్లో హీరోయినుకు పాటల్లో తప్ప ఉనికే ఉండదు. నా సినిమాల్లో కాస్త మామూలు ప్రాధాన్యత ఉండేటప్పటికి మీకు అలా అనిపిస్తున్నట్లుంది అన్నారు, శేఖర్.

విదూషకులు: ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పవర్‌ఫుల్ హీరోలను వెధవాయిలను చేసి ఓ ఆటాడిస్తూ, తమ పబ్బం గడుపుకునే వర్గం ఒకటుంది మన పరిశ్రమలో. దాని పేరు విదూషక వర్గం . కమెడియన్లన్నమాట (అందరూ కాదు.., కానీ చాలామంది)! నటనాశక్తి పరంగా, ప్రతిభ పరంగా వాళ్ళు హీరోలకెందుకూ తీసిపోరు. అసలు వాళ్ళకంటే వీళ్ళే మెరుగు. ఈ విదూషకులు హీరోలను పొగడుతూ మాట్లాడే తీరు చూస్తుంటే మనకాశ్చర్యం వేస్తుంది. ఎందుకు వీళ్ళింతలా పొగుడుతున్నారు, ఏంటి వీళ్ళకీ ఖర్మ అని అనిపిస్తుంది. నిజానికది పొగడ్త కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. మామూలు మానవుడెవడైనా అంతటి పొగడ్తలను భరించలేడు. కానీ .. ఈ విదూషకులు వీళ్ళను తమ నాలుకల కొనలమీద నిలబెట్టి ఆటాడిస్తున్నారనీ, పొగడ్తలతో వాళ్ళను సంతోషపెట్టి తమ పనులను చేయించుకుంటున్నారనీ నిదానంగా మనకర్థమవుతుంది . (ఈ హీరోల పవరు పోయిన రోజున తుపుక్కున ఊసేస్తారేమో!)

హీరోభిమానులు: వాళ్ళ పొగడ్తలు నిజమేనని ఆ హీరోలు నమ్ముతారా అంటే.. సందేహమే! హిపోక్రసీకి పరాకాష్ఠ అయిన సినిమా లోకంలో ఎవడి మనసులో ఏముందో మరోడికి తెలీదు. పెదాలపై ఉన్న మాట హృదిలో ఉందని చెప్పలేం. కానీ ఇవి నిజమేనని నమ్మే వర్గం ఒకటుంది.. అదే వీరాభిమానుల వర్గం. చదువూ, సంధ్యల్ని గాలికొదిలేసి, ఉద్యోగం సద్యోగం చూసుకోకుండా ఈ హీరోల చుట్టూ తిరిగే వర్గమిది. తమ హీరో కోసం డబ్బులేం ఖర్మ, ప్రాణాలూ ధారపోస్తారు వీళ్ళు. హీరోలు, ఇతర నటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, పంపిణీదారులు, ప్రదర్శకులు, హీరోభిమానులు, మామూలు ప్రేక్షకులు భాగంగా ఉన్న తెలుగు సినిమా వ్యాపార వలయంలో అందరికంటే అమాయకులు హీరోభిమానులే! మామూలు ప్రేక్షకులు టిక్కెట్టు డబ్బులు మాత్రమే పెడతారు, అదీ సినిమా బాగుందంటేనే చూస్తారు. అభిమానులో.. సినిమా ఎంత చెత్తదైనా చూస్తారు (లేకపోతే వాళ్ళేం అభిమానులు?) సినిమాకూ హీరోకూ ప్రచారం కోసం పోస్టర్లూ, కటౌట్లూ, కరపత్రాలూ ఇలాంటివెన్నో! పైగా, సినిమా గురించి తమ తమ సంఘాల్లో చర్చలూ, గోష్ఠులు!

అభిమాన భారం: సినిమా విడుదలైన రోజున ఎగబడి చూసేది ఎవరు? హీరోభిమానులే! విడుదలైన మొదటి రోజుల్లో టిక్కెట్టు డబ్బులు పెంచడం మొదలెట్టారామధ్య, లాభం ఎవరికి? భారం ఎవరిపైన? హీరోభిమానులపై హీరోల అభిమానమిదీ!

8, జూన్ 2006, గురువారం

గూగుల్ ఎనలిటిక్స్

1 కామెంట్‌లు
గూగుల్ ఎనలిటిక్స్! ఇది మరో గణాంకాల సైటు, గూగుల్‌ది. అయితే గణాంకాలకు మించి ఇందులో ఇంకా ఉంది.. ముఖ్యంగా విశ్లేషణ. ప్రస్తుతం నేను దాని పరిశీలనలో ఉన్నాను. బ్లాగర్లు, సొంత వెబ్‌సైట్లు కలవారు, వెబ్ మార్కెటింగులో అభిరుచి, ఆసక్తీ గలవారు దీన్ని చూడాలి. ఇప్పటికే గూగుల్ అడ్‌వర్డ్స్ ఎకౌంటున్న వారికి ఇది మరింత ఉపయోగమనుకుంటా!

ప్రస్తుతం ఇది పరీక్షల స్థాయిలో ఉంది. ముందు మన పేరును నమోదు చేసుకోవాలి. గూగుల్ తనకు తీరుబడి దొరికినపుడు మనకు అవకాశం ఇస్తూ ఓ మెయిలిస్తుంది (జీమెయిల్ విషయంలో కూడా కొత్తలో అలానే చేసింది). అప్పుడు మనం దాన్ని వాడుకోడం మొదలెట్టొచ్చు.

6, జూన్ 2006, మంగళవారం

వర్డ్‌ప్రెస్సుకీ బ్లాగ్‌స్పాటుకీ పడదని తెలిసింది

0 కామెంట్‌లు
వర్డ్‌ప్రెస్‌లో ఓ విశేషముంది. ఇతర బ్లాగుల్లోంచి దాన్లోకి బ్లాగులను దిగుమతి చేసుకోవచ్చు. సరే అక్కడ ఓ బ్లాగు తయారుచేసి బ్లాగ్‌స్పాటులోని నా బ్లాగుల్ని దిగుమతి చెయ్యబోయాను. ఒకే ఒక్క జాబు దిగుమతి అయింది, మిగతావి కాలేదు, ఎంచేతో! సరే వచ్చింది చాల్లే అనుకున్నా. తరువాత, ఇక్కడికి వచ్చి చూద్దునుగదా.. బ్లాగు ఆకారమంతా (ఫార్మాటింగు) చెడిపోయింది. బొద్దక్షరాలూ, ఇటాలిక్సూ, లైను బ్రేకులూ ఏమీ లేవు. సరిచెయ్యబోతే ఒప్పుకోవడంలేదీ బ్లాగరు! సెట్టింగుల్లోకి వెళ్ళి లైను బ్రేకులను తిరగదోడాను, దాంతో ఓ రూపుకొచ్చింది.


వర్డ్‌ప్రెస్సుకీ బ్లాగ్‌స్పాటుకీ పడదు గామోసు! వర్డ్‌ప్రెస్సు వాడొచ్చి బ్లాగ్‌స్పాటులో బ్లాగుల్ని లాక్కోబోతే వీడూరుకుంటాడా మరి! తన బంగారు పుట్టలో వేలెడితే చీమే ఊరుకోదు!! కాబట్టి, మీరూ ఈ దిగుమతి వ్యవహారం చెయ్యదలిస్తే.. జాగ్రత్త సుమా!

5, జూన్ 2006, సోమవారం

వామపక్ష నాటకాలు

0 కామెంట్‌లు

రాష్ట్ర శాసనసభల ఎన్నికలు అలా ఐపోయాయి.. ఇదిగో ఇలా పెట్రోలు రేట్లు పెంచేసారు. ముడి చమురు ధరలు తెగ పెరిగి పోతున్నాయి కాబట్టి ధరలు పెంచక తప్పని పరిస్థితి! ప్రభుత్వ పరిస్థితిని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష బీజేపీ దీన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తుంది.. అది సహజం.

అయితే, వామ పక్షాల నాటకం చూడండి. వాళ్ళు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. రేట్లు పెంచడం ఇష్టం లేకపోతే.., వీల్లేదని కరాఖండిగా ప్రభుత్వానికి చెప్పేయాలి. రేట్లు పెంచకుండా ఏంచెయ్యాలో కూడా చెప్పాలి. వినకపోతే మెడలు వంచి ఒప్పించాలి. ప్రభుత్వ మనుగడ వీళ్ళ మద్దతు పైనే ఆధారపడి ఉన్నపుడు ఎందుకు వినరు, చచ్చినట్లు వింటారు! ఆ పనులు చెయ్యకుండా.. ఉద్యమాలు చేస్తాం, బందులు చేస్తాం, ఆందోళనలు చేస్తాం అని ఈ అరుపులేమిటి? ఎవరిని అలరించేందుకు ఈ ప్రకటనలు?


రేట్లపెంపు నిజంగా అసమంజసమైతే.. "ప్రభుత్వాన్ని నిలదీయండి. యూ పీ ఏ లో కాంగ్రెసును కడిగేయండి. పెంపును రద్దు చేయించండి. లేదూ.. మాట్లాడకుండా కూర్చోండి. పెరిగిన రేట్లకు ఎలాగూ అలవాటు పడతాం. మళ్ళీ బందులనీ, ఉద్యమాలనీ మమ్మల్ని బాదకండి."


ఒక వేళ.., "మీరు రేట్లు పెంచండి, మేం ఆందోళన చేస్తాం, అపుడు, పెంచిన దానిలో కొంత తగ్గించండి " అని కాంగ్రెసుతో ఒప్పందానికి గానీ రాలేదు కదా!?

4, జూన్ 2006, ఆదివారం

బూదరాజు రాధాకృష్ణ అస్తమయం

3 కామెంట్‌లు
ప్రసిద్ధ భాషావేత్త, తెలుగు భాషా శాస్త్రవేత్త బూదరాజు రాధాకృష్ణ జూన్ 4 న మరణించారు. ఈనాడు పత్రిక ద్వారా బూదరాజు రచనలు నాకు పరిచయం అయ్యాయి. వారం వారం తెలుగు మాటల గురించి పాఠం చెప్పేవారు. ఏది సరైన పదం, ఏది కాదు అనేది చక్కగా విడమర్చి చెప్పేవారాయన. తరువాత్తరువాత అవే పుస్తకాలుగా వచ్చాయి.

రాధాకృష్ణ గారి పుస్తకం మాటలూ-మార్పులూ పుస్తకంలోంచి కొన్ని మచ్చుతునకలు..
  1. స్మశానం తప్పు శ్మశానం సరైనది.
  2. రాబందు అనే మాట రామ బంధువు నుండి వచ్చింది. సీతాపహరణ వేళ రాముడికి సాయం చేసి, జటాయువు రామ బంధువై, రాంబంధువైంది. అదే రాబందు అయింది.
  3. ఋజువు తప్పు, రుజువు సరైనది
ఇలా మనం మామూలుగా చేసే ఎన్నో తప్పులను ఎత్తి చూపిన మాస్టారు ఆయన. వ్యవహార పదకోశాలు రాసారు. ఆయన మరణంతో తెలుగు భాష చిన్నబోయింది. వికీపీడియాలో బూదరాజు రాధాకృష్ణపై వ్యాసం చూడండి

3, జూన్ 2006, శనివారం

వినవచ్చిన వార్తలు, విన.. నొచ్చిన వార్తలు

2 కామెంట్‌లు
ఈ మధ్య కాలంలో వినవచ్చిన కొన్ని వార్తలివి. నీలాలు వార్తాంశాలు కాదు.
  1. నాగార్జున సాగర్ లో చేపల కూర పెట్టలేదని విద్యుత్తు, సమాచారశాఖ మంత్రి షబ్బీర్‌ అలీ గోల. ఉద్యోగాల్లోంచి పీకి పారెయ్యండి వాళ్ళను; మంత్రులు ఉన్నదే తినేందుకని తెలియని చవటాయిలకు ఉద్యోగాలు అనవసరం. (సంపాదన లేని మంత్రి పదవీ, చేపల కూర లేని సాగరు భోజనమూ ఎవడిక్కావాలండీ!)
  2. జర్నలిస్టులపై మరోసారి విరిచుకుపడ్డ జేసీ. కడుపుకు అన్నం తింటున్నారా జర్నలిస్టులసలు? "మీరంటే నాకిష్టం లేదు, నాక్కనపడకండి" అని ఓసారి చెప్పినపుడు వినాలి. ఇక లాభంలేదు, అనంతపురం తడాఖా చూపాల్సిందే!
  3. దేశంలో 22 నకిలీ విశ్వవిద్యాలయాలు - యూజీసీ వెబ్‌సైట్లో ప్రకటన. మరి వాటిని మూసేసి, వాటి నిర్వాహకులను బొక్కలో తొయ్యలేదెందుకో!?
  4. లాభసాటి పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధుల జాబితా, వాటిపై తీసుకున్న చర్యలతో సహా ఎన్నికల కమిషను వెబ్‌సైట్లో ప్రకటన. మరి వీళ్ళపై చర్యలేవీ? పై అంశంలో విశ్వవిద్యాలయాలను ఎందుకు మూయలేదో ఇప్పుడర్థమైంది! (యథా రాజా తథా ప్రజా)
  5. తనపేరు కూడా లాభసాటి జాబితాలో పెట్టారని లోక్‌సభ స్పీకరు గారు వేదనతో ఇలా అన్నారు - "ఇలా అవమానిస్తే ఇకపై ఇలాంటి పదవులను నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రారు." మంచిది మేష్టారూ, అసలా నిబంధన చెప్పేదీ అదే. తప్పుకోండి మీరంతా! ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పూర్తి సమయం పని చేయండి, చాలు. ప్రజలడిగేది అదే! ఇంతటి నిజాయితీ కబుర్లు చెప్పే మీరు వెంటనే శాంతినికేతన్ పదవికి రాజీనామా ఎందుకు చెయ్యలేదు? అసలు మీ అధ్యక్షతలోని SSDAనిర్వాహకత్వం గురించి ది వీక్ లో రాసారు చూసారా? మీకే లాభమూ లేకపోతే ఆ పదవిని పట్టుకుని ఇంకా ఎందుకీ పాకులాట? ఎందుకు దానిపై మీకంత యావ? నిజాయితీ పరుణ్ణి, నీతిమంతుణ్ణీనని మీరు చెప్పుకుంటే సరిపోతుందా. నైతికత పట్ల అంత నిబద్ధత ఉంటే.. గంగూలీని క్రికెటు జట్టు లోంచి తీసేసినపుడు ఎందుకు నిరసన తెలియజేసారు? క్రికెటు టీముకూ లోక్‌సభ స్పీకరుకూ ఏమిటి సంబంధం? అప్పుడేమైంది మీ నిబద్ధత? లోక్‌సభ సమావేశాలను హడావుడిగా, అర్ధంతరంగా ప్రభుత్వం రద్దుపరచినపుడు మీ గొంతు పెగల్లేదే? అప్పుడేమైంది మీ నిబద్ధత? (ఎదటి వారికీ .. చెప్పేటందుకె నీతులు ఉన్నాయీ..!)
  6. సింహాచల నరసింహస్వామి క్షేత్రంలో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి, దేహశుద్ధి చేసిన భక్తులు. పోపు గారికిది తెలిసిందనుకోండి, "గుళ్ళో చేసినా, బళ్ళో చేసినా.., ఊళ్ళో చేసినా, ఒళ్ళో చేసినా .. మత ప్రచారం చేసేవారు భగవద్బంధువులు, వారిని కొట్టడం పరమత సహనం లేకపోవడమే" అని నీతులు చెబుతారు, మన ప్రభుత్వానికి. (చెప్పేవాడికి వినేవాడు లోకువ!)

సంబంధిత టపాలు