29, మే 2011, ఆదివారం

మహానాడులో చంద్రబాబు ముగింపు ప్రసంగం

మహానాడులో చంద్రబాబు ముగింపు ప్రసంగం చూసాను. మనిషిలో, మాటలో చాలా తేడా కనిపించింది. ప్రసంగంలో నేను గమనించిన కొన్ని విశేషాలు.

మఖ్యమైన విశేషమేంటంటే -
మామూలుగా చంద్రబాబు ప్రసంగం బోరు కొడుతుంది, వినబుద్ధి కాదు. సాధారణంగా నాయకుల ప్రసంగాల్లో ఫిల్లరు పదాలు ఉంటూంటై. కానీ చంద్రబాబు ప్రసంగంలో ఫిల్లర్లుగా ’పదాలు’ కాకుండా ఏకంగా ’వాక్యాలే’ ఉంటై. ముఖ్యమైన విషయాలు కూడా ఈ ఫిల్లరు వాక్యాల మధ్య నలిగిపోతూంటాయి (విలేకరులు భలే వెలికితీస్తూంటారు వాటిని).  ఇవ్వాళ్టి ప్రసంగం మాత్రం ఆ శైలి నుండి చాలావరకు మారింది. ధారాళంగా వెలువడింది, వినాలనిపించేలా ఉంది. కార్యకర్తలను ఉత్తేజపరచేలా సాగింది.

ఆత్మపరిశీలన, తప్పుల ఒప్పుకోలు, తనపై పదేపదే వచ్చే కొన్ని విమర్శలపై వివరణలు, ప్రత్యర్థులపై దాడి వంటివి ఆయన ప్రసంగంలో ప్రధానంగా కనిపించాయి. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తప్పని ఒప్పుకోవడంవాటిలో ఒకటి. హరికృష్ణ గొడవను ప్రధానంగా ప్రస్తావించాడు.

వెన్నుపోటు అరోపణలపై:’ఎన్టీయారుపై తిరుగుబాటు చేసానని నన్ను కొందరు విమర్శిస్తూ ఉంటారు. నేను ఎన్టీయారును మామగారిగా కాక, నా నాయకుడిగా, గురువుగా చూసాను. ఆయనతో క్లోజుగా పనిచేసాను, క్రమశిక్షణ వంటివెన్నో ఆయన వద్ద నేర్చుకున్నాను. ఆయన నాయకత్వంలో పనిచేసాను. కానీ ఒక దుష్టశక్తి ఆయన పక్కన చేరి పార్టీని భ్రష్టు పట్టించే ప్రయత్నాలు చెయ్యడం గమనించి పార్టీని కాపాడుకోవడానికే నేను ఆనాడు అధికార మార్పిడికి పాల్పడవలసివచ్చింది. దాన్ని రెండు వందలమంది దాకా ఎమ్మెల్యేలు కూడా సమర్ధించారు’, అని చెప్పాడు.

అసలు ఈ వ్యవహారం గురించి మాట్టాడాల్సిన అవసరం ఇప్పుడు ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. బహుశా హరికృష్ణ వ్యవహారం ఈ అవసరాన్ని తెచ్చిపెట్టినట్టుంది. ఈ వివరణ కుటుంబ సభ్యులకు అయి ఉండొచ్చు. నేపథ్యంలో బాగానే రచ్చ జరుగుతూ ఉండి ఉండాలి. అయితే రాజకీయుల చర్చల్లో మాత్రం ఇది కొన్నాళ్ళపాటు తాజాగా మళ్ళీ నలుగుతుంది. ప్రజలకు కాలక్షేపం  కలిగిస్తుంది.

కాంగ్రెసుతో మ్యాచి ఫిక్సింగు చేసుకున్నాడన్న ఆరోపణపై:
నేను సమస్యల మీదా, వ్యవస్థల మీదా, కాంగ్రెసుపైనా పోరాటం చేస్తున్నాను. ఎప్పుడూ కాంగ్రెసుతో లాలూచీ పడలేదు.  ఆ అవసరమూ లేదు. రాశేరె అధికారానికొచ్చాక, మన పార్టీ కార్యకర్తలు వందల మందిని చంపిస్తూ ఉన్నా వెరవకుండా పోరాడామే తప్ప, ఎన్నడూ రాజీ పడలేదు. ఏనాడూ వ్యాపారాల కోసమో, లైసెన్సుల కోసమో ఆ పార్టీతో బేరాలాడలేదు.

హరికృష్ణ వ్యవహారంపై:
పేరు పెట్టి చెప్పకుండా హరికృష్ణ వ్యవహారాన్ని ప్రస్తావించాడు. ’భారతీయ కుటుంబ వ్యవస్థపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఆ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీద ఉందనేది నా అచంచల విశ్వాసం. అదే సమయంలో పార్టీ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత నాపైన ఉంది. ఆ విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు పోతానని మనవి చేస్తున్నాను. రాజకీయాలు వేరు, కుటుంబం, బంధుత్వాలూ వేరుగా చూస్తాను. ఇన్నేళ్ళ నా రాజకీయ జీవితంలో నా కుటుంబ సభ్యులు జోక్యం చేసుకున్న సందర్భం లేదు. మన కార్యకర్తలు నా కుమారుడి ఫ్లెక్సీల పెడితే నేను మందలించాను. మనలో మనం రాజకీయాలు చేసుకోవడం మంచిది కాదు, అలా చెయ్యవద్దని నేను మందలించాను. పార్టీని నడిపించే విషయంలో కుటుంబ సంబంధాలను పక్కన పెడతాననే సందేశాన్ని హరికృష్ణకు, జూనియరుకూ ఇచ్చినట్టే.

నేను అందరితోటీ బాగా క్లోజుగా ఉంటాను. ఫ్రాంక్ గా ఉంటాను, మీరూ అలాగే ఉండండి. మనందరం కలిసి పనిచేద్దాం అని కార్యకర్తలకు పిలుపిచ్చాడు.

తెలంగాణపై:
కరీంనగరు సభ విజయవంతం కావడం అతడిలో ఉత్సాహం తెచ్చినట్టుంది. తెలంగాణ గురించి తన వైఖరిని మరోసారి స్పష్టం చేసాడు. ’పార్టీ అధ్యక్షుడిగా రెండు ప్రాంతాల ప్రయోజనాలనూ కాపాడాల్సిన అవసరం నాపై ఉంది. మీరు మాత్రం మీమీ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకొమ్మని మన నాయకులకు చెప్పాను’, అని అంటూ,  ’తెలంగాణలో మనపై దాడి చేసే వారి గురించి భయపడొద్దు, వారిని రాజకీయంగా దీటుగా ఎదుర్కొందాం’ అని కార్యకర్తలను ఉత్తేజపరచాడు. ’మేధావులకు, విద్యార్థులకు మన విధానాన్ని వివరిద్దాం’ అని చెప్పాడు. తెలంగాణ గురించి చంద్రబాబు ఇంత వివరంగా మాట్టాడ్డం గతంలో నేను చూళ్ళేదు.

మామూలుగానే ఈ వివరణను తెవాదులు తమ కళ్ళజోడులోంచే చూస్తారు కాబట్టి కొత్తగా అక్కడ ఒరిగేదేమీ లేకపోయినా కార్యకర్తల్లో మాత్రం ఉత్సాహం కలిగిస్తుంది.

కమాన్ జగన్.. బస్తీ మే సవాల్!
జగనుపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా కనిపించింది. ’నాకు ఇంతమంది సభ్యుల మద్దతు ఉందని చెప్పుకున్నావు గదా, ఈ ప్రభుత్వం నా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతుకున్నదని అన్నావు కదా.. రా, ఈ ప్రభుత్వంపై నీ దయను ఉపసంహరించుకో, గవర్నరు దగ్గరికి నీ ఎమ్మెల్యేలను పంపించి ఈ ప్రభుత్వానికి నీ మద్దతును వెనక్కి తీసేసుకో. ఆ పని చెయ్యకుండా నన్ను అవిశ్వాసం పెట్టమని అడుగుతావేంటి?’ అంటూ ధాటిగా మాట్టాడాడు.

ఈ విషయం గురించి మొన్ననే మాట్టాడి చంద్రబాబు జగన్ని డిఫెన్సులో పడేసాడు. ఇవ్వాళ ఆ దాడిని ముమ్మరం చేసాడు.

మొత్తమ్మీద చంద్రబాబు ప్రసంగం వినబుల్గా సాగింది. కార్యకర్తలకు ఉత్తేజం కలిగించే ఉంటుంది. ఇకపై పార్టీని మరింత చురుగ్గా నడిపించే నిశ్చయం అతడిలో ఉన్నట్టుగా అనిపించింది. మహానాడు కూడా బాగానే జరిగినట్టుంది, ఆ ఉత్సాహం అతడి ప్రసంగంలో కనబడింది.

అయితే తనపై వస్తూ ఉన్న విమర్శలకు సమాధానాలు చెప్పడం, సదరు విమర్శకులను ధీటుగా ఎదుర్కొనే మార్గాలను పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం చాలా ఆలస్యం చేసాడు. ఎప్పుడో పదేళ్ళ కిందట చెయ్యాల్సిన ఈ పనులు ఇప్పుడు చేసాడు.

14 కామెంట్‌లు:

 1. .... '' తెలంగాణా వాదులు తమ కళ్ల జోడులోంచే చూస్తారు కాబట్టి '' ... ఎంత ముందు జాగ్రత్తండీ!
  తమరు ఏ వాదులో? తమరి కళ్లజోడు రంగేమిటో? కూడా స్పష్టం చేస్తే బాగుండేది.

  మహానాడులో చంద్రబాబు తెలంగాణా గురించి తన వైఖరిని మరోసారి స్పష్టం చేశాడా!!?
  ''... స్పష్టం...! సుస్పష్టం ... చిత్తశుద్ధి...'' ఎంత భ్రష్టుపట్టించారు రాజకీయ నేతలు ఈ పదాలను !
  మనం కూడా గుడ్డిగా వారి అడుగులకు మడుగులొత్తాలా ఈ విషయంలో?!
  మీకు ఆయన వైఖరి సుస్పష్టం అనిపిస్తోందా? అసలు ఒక రాజకీయ పార్టీ అనుసరించాల్సిన వైఖరేనా ఇది. ఇలాంటి వైఖరితో ఏ సమస్యనైనా

  పరిష్కరించగలరా? దేశం ముందుకు పోగలదా దీంతో?

  '' పార్టీ అధ్యక్షుడిగా రెండు ప్రాంతాల ప్రయోజనాలనూ కాపాడాల్సిన అవసరం నా పై వుంది...! ''
  ఇదేనా రెండు ప్రాంతాల ప్రయోజనాలను కాపాడే పద్ధతి?
  తన పార్టీ సభ్యులతో నాయకులతో ఇక్కడ '' జై తెలంగాణా ''అనిపించడం... అక్కడ '' జై సమక్యాంధ్ర '' అనిపించడమే రెండు ప్రాంతాల

  ప్రయోజనాలను కాపాడడం అవుతుందా?

  ఆనాడు పార్టీపరంగా - కమిటీ వేసి విస్తృతంగా చర్చించి తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ప్రకటించినప్పుడు, టీఆర్‌ఎస్‌తో

  పొత్తుపెట్టుకుని తెలంగాణాలో జైతెలంగాణా అని ప్రచారం చేసినప్పుడు, బాహాటంగా తెలంగాణా అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చినప్పుడు, ప్రణబ్‌

  ముఖర్జీ కమిటీకి తెలంగాణాకు అనుకూలంగా బాజాప్తా లేఖ యిచ్చినప్పుడు, డిసెంబర్‌ ఎనిమిదిన అఖిలపక్షంలో, అసెంబ్లీలో మీరు తీర్మానం

  పెట్టండి మేం బలపరుస్తాం అని వాగినప్పుడు ఏమై పోయాయి రెండు ప్రాంతాల ప్రయోజనాలు?

  సమస్య సత్వర పరిష్కారంలో రెండు ప్రాంతాల ప్రయోజనం వుంటుందా? - లేక - సమస్యను రావణకాష్టం చేయడంలోనా?
  పరిష్కారం మా చేతుల్లో కాదు కేంద్రం చేతుల్లో వుందంటాడు. కేంద్రం సానుకూల ప్రకటన చేస్తే వ్యతిరేకిస్తాడు. ఇదెక్కడి దగుల్భాజీ విధానం! దీని

  వల్ల ఎవరికి లాభం?
  మేధావులకు, విద్యార్థులకు ఈ విధానాన్ని హర్షిస్తారా?
  దీనివల్ల ఓట్లు పడతాయా ఏ ప్రాంతంలోనైనా?
  ఇప్పటి వరకూ తెలంగాణాలో, రాయలసీమలో జరిగిన అన్ని ఉపఎన్నికలలో డిపాజిట్లు జప్తు అయినా ఒక్క కన్నైనా తెరుచుకోదా.
  దీనిని చూసేనా ''తెలంగాణా గురించి చంద్రబాబు ఇంత వివరంగా మాట్లాడ్డం గతంలో నేను చూళ్లేదు... తన వైఖరిని స్పష్టం చేశాడు...'' అని

  పరవశించి పోతున్నారు మీరు?

  కరీంనగర్‌లో సభ విజయవంతం అయిందా? 30 మంది ఎంఎల్‌ఎలు పాల్గొన్న సభకు ఎంఎల్‌ఎ ఒక్కంటికి వెయ్యి మంది చొప్పునైనా వచ్చారా

  జనం. పోలీసుల, ప్రభుత్వ సహకారంతో డబ్బులు ఖర్చుపెట్టి జరిపిన బడాయి సభ వల్ల ఏం బావుకున్నారు?
  చదువరి గారూ పునరాలోచించండి.
  - యాదగిరి, హైదరాబాద్‌

  రిప్లయితొలగించండి
 2. >>> '' తెలంగాణా వాదులు తమ కళ్ల జోడులోంచే చూస్తారు కాబట్టి '' ... ఎంత ముందు జాగ్రత్తండీ!
  తమరు ఏ వాదులో? తమరి కళ్లజోడు రంగేమిటో? కూడా స్పష్టం చేస్తే బాగుండేది.


  కమ్మజోడు!!

  రిప్లయితొలగించండి
 3. అజ్ఞాత,

  One simple question? How come Eenadu and Jyothi offices in Telengana were untouched so far despite so much violence on private properties incl. hyderabad? TRS enta nokkEsimdi vaaLLa daggara?

  mumdu mI nalupu choosukOmDi :-)

  రిప్లయితొలగించండి
 4. యాదగిరి గారూ, ఇవ్వాళ్టి చంద్రబాబు ప్రసంగంపై నా వ్యాఖ్యానం మీకు రుచించకపోవచ్చు. నేను అర్థం చేసుకోగలను. మీరు లేవనెత్తిన పాయింట్లకు నా సమాధానాలు:
  "తమరి కళ్లజోడు రంగేమిటో? కూడా స్పష్టం చేస్తే బాగుండేది." - నాది వేర్పాటు వ్యతిరేక కళ్ళజోడు. కళ్ళజోడు ఏదైనా సరే.., వివిధ పార్టీల తెలంగాణ ప్రతినిధులు తెలంగాణకు అనుకూలంగా ఉద్యమిస్తే నేను వాళ్ళను తిట్టను. నా ప్రాంత ప్రతినిధులు వేర్పాటును వ్యతిరేకించినపుడు తెవాదులు వాళ్ళను బూతులు తిడితే ఊరుకోలేను.

  "అసలు ఒక రాజకీయ పార్టీ అనుసరించాల్సిన వైఖరేనా ఇది. ఇలాంటి వైఖరితో ఏ సమస్యనైనా పరిష్కరించగలరా? దేశం ముందుకు పోగలదా దీంతో?" - అసలు తెలంగాణ విషయమై తెవాది కోరుతున్న పరిష్కారం సబబైనదేనా? ముందు ఫలానా పరిష్కారం ఒకటి కావాలని కోరుకుని తదనుగుణంగా సమస్యను, కారణాలనూ సృష్టించుకున్నారు/మార్పుచేర్పులు చేసుకున్నారు. ఆయా కారణాలను ప్రజల్లో వ్యాప్తి చేసారు. నిజమైన సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరించదలిస్తే దానికి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం బహుశా ఎప్పుడో దొరికేది. తదనంతర కాలంలో శ్రీకృష్ణ కమిటీ అలాంటి పరిష్కారాన్ని సూచించింది కూడా. తెరాసకు అసలు తెలంగాణ సమస్యలను పరిష్కరించే ఆలోచ ఉంటే గదా!!

  "...ఏమై పోయాయి రెండు ప్రాంతాల ప్రయోజనాలు?" - ఇప్పుడు తెలంగాణ ఇవ్వరాదని ఏ పార్టీ చెప్పింది? తెదేపా చెప్పలేదే! కాంగ్రెసు కూడా చెప్పలేదే! రాష్ట్ర విభజనను మొదలెడతామని కేంద్రం ప్రకటించగానే రెండో ప్రాంతం నుండి వచ్చిన నిరసనను ఆ పార్టీలు పరిగణనలోకి తీసుకున్నాయి. ప్రజల నిరసనను గణించకుండా ఏ పార్టీయైనా ఎలా ఉంటుంది? మీ ప్రతినిధి మీకు అనుకూలంగా మాట్టాడాలన్న మీ డిమాండు ఎలాగుందో, నా ప్రతినిధి నాకు అనుకూలంగా మాట్టాడాల్సిందేనన్నది నా డిమాండు. అలా చెయ్యకూడదని అనడానికి మీరెవరు? మావాడు కూడా మీకు అనుకూలంగా ఎందుకు మాట్టాడాలి?

  "మేధావులకు, విద్యార్థులకు ఈ విధానాన్ని హర్షిస్తారా?" - ఏ ప్రాఅంతపు మేధావులు, విద్యార్థులు? వేర్పాటును వివిధ పార్టీలు వ్యతిరేకించకపోయినా, కనీసం మా మనోభావాలను ప్రతిబింబించే మా ప్రతినిధుల అభిప్రాయాలను వాళ్ళు గణిస్తున్నారు. ఆ వర్గాల వాళ్ల సంగతేమోగానీ, నేను మాత్రం దీన్ని హర్షిస్తాను.

  "..అని పరవశించి పోతున్నారు మీరు?" - :) నేను పరవశించి పోవడం లేదండి. కానీ తెలంగాణలో తెదేపా తిరిగి చురుగ్గా పనిచెయ్యడం మాత్రం మీకు కలవరం కలిగిస్తున్నట్టుంది. బహుశా అందుకేనేమో.. కరీంనగరు సభ విజయవంతమవడం మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. తెవాదుల, తెరాస వాళ్ళ నియంతృత్వ, అరాచక ధోరణులను ఎదుర్కొని సభను నిర్వహించడం విజయవంతం కాకపోతే మరేంటి? (సభ జయప్రదమవడం గురించి పేపర్లలో వచ్చిన వార్తలను చూడండి) సభ విజయవంతం కావడం తెరాసకు ఎదురుదెబ్బే, తెవాదులకు కలవరం కలిగించేదే. ఇలాంటి సభలు మరిన్ని జరగాలనే నేను కోరుకుంటాను. అప్పుడే ఈ అరాచకవాదుల అకృత్యాలు ఆగుతాయి.

  రెండో అజ్ఞాత: ఒకవేళ నిజంగానే నేను ఆ కళ్ళజోడు పెట్టుకునుంటే.. అది పోవాలంటే కళ్ళజోడు తీసి అవతల పెడితే సరిపోతుంది. కానీ మీ కులగజ్జిని మాత్రం ఏ జాలిమ్ లోషన్ కూడా వదిలించలేదు. వ్యాఖ్యల్లో పడి గోక్కుంటూనే ఉండండి. మీ బతుకంతే, ఆ గజ్జి పుడకలతో పోవాల్సిందే! మీకు నా సానుభూతి.

  రిప్లయితొలగించండి
 5. బాగా విశ్లేషించారు.

  ఇక్కడి అజ్జాతలు చదువరిగారిని కులదృష్టితో దూషించడాన్ని ఖండిస్తున్నాను. చేతనయితే సబ్జెక్టు మాట్లాడాలి. టాపిక్ మాట్లాడాలి. అసందర్భాలు తీసుకురావద్దు. తామేమో అజ్ఞాతలుగా ఒక అడ్వాంటేజిలో ఉన్నారు.

  అప్‌డేట్ అవ్వడం అంటే మనుషుల్లో వచ్చిన మార్పుని అది వచ్చిందని ఒప్పుకొని ఆమోదించి అడ్మైర్ చేయడం కూడాను ! అంతే తప్ప జన్మజన్మలకూ ఒక రాజకీయవాదిని ద్వేషించడం కోసమే నిష్కారణంగా ద్వేషించడం ఛాందసవాదమూ, పిడివాదమే అవుతుంది. నాకు తెలిసి చదువరిగారు చంద్రబాబుకు అభిమాని కారు. ఆయన లోక్‌సత్తా సానుభూతిపరుడు. ఆ దృష్టితో ఈ వ్యాసాన్ని చూడకూడదేమో ! కాస్తో కూస్తో నాబోంట్లే చంద్రబాబు అభిమానులు.

  రిప్లయితొలగించండి
 6. చదవరి గారు మీ విశ్లేషణ సహేతుకంగానే వున్నది. ఇక విమర్శలంటారా..! వర్గాలుగా, గ్రూపులుగా విడిపోయినవారెప్పుడు ఒకే కోణంలో అంటే వారికి నచ్చే, ఇష్టపడే కోణంలోనే చూస్తారు. అది సర్వసాదారణం కూడాను.

  యాదిగిరి గారు ఒక ప్రశ్న వేశారు.." '' పార్టీ అధ్యక్షుడిగా రెండు ప్రాంతాల ప్రయోజనాలనూ కాపాడాల్సిన అవసరం నా పై వుంది...! ''
  ఇదేనా రెండు ప్రాంతాల ప్రయోజనాలను కాపాడే పద్ధతి?
  తన పార్టీ సభ్యులతో నాయకులతో ఇక్కడ '' జై తెలంగాణా ''అనిపించడం... అక్కడ '' జై సమక్యాంధ్ర '' అనిపించడమే రెండు ప్రాంతాల " ఇది ఆయన అనిపించనవసరంలేదు..నిజంగానే రాయలసీమ, కోస్తా సర్కారు ప్రాంతాలలో ప్రజలు అలానే ఆలోచిస్తున్నారు..రెండు వైపుల ఉన్న రాజకీయ పార్టీలకు తప్పదు ఆ అవస్థ.అందుకే రెండు కళ్ల సిద్దాంతం. టి.ఆర్.ఎస్ కి ఆ బాద లేదు ఒక ప్రాంతంలో వున్న పార్టిమ, అదీను రాష్ట్ర బవిభజనే ధ్యేయంగా ఉన్న పార్టి..కాబట్టి వారికి మిగతా పార్టీల బాదలు అర్థంకావు.
  ఒక చిన్న ఉధాహర చెబుతాను.చంద్రబాబు డిసెంబర్ కన్న ముందు అసెంబ్లీలో నోరు జారి చేసిన ప్రకట డిసెంబర్ 9 తర్వాత జరిగిన రాయలసీమ ప్రాంతాల ఉద్యమాలలో చంద్రబాబుని కాంగ్రెస్స్ వారు భయంకరంగా బద్నాం చేశారు..అందుకు మంచి ఉదాహరణ్ మా వూరే..! మనకున్న టెక్నాలజీ వలన చంద్రబాబు ఖడ్గం పట్టుకొని మేడమ్ సోనియాగాధి చేతికి అందిస్తున్నట్లు పోటోషాప్ ద్వార కొన్ని పోటోస్ క్రియేట్ చేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారు మా వూరిలో..కాంగ్రెస్స్ వారు చాలా తెలివిగా చంద్రబాబుని ఇరికించేశారు..అదే భావన జనాల్లో ఉండిపోయింది.. మరి ఇలాంటి సంఘటనల వలన చంద్రబాబు రెండు కళ్ళ సిద్దాంతాలను పాటించడంలో తప్పేమి కనపడలేదు. అది రెండు వైపుల పార్టీ వున్న వారికి తెలుస్తుంది ఆ బాదలేంటో..!

  ఈ బ్లాగ్ ప్రపంచంలో ఎవరన్న ఒక వ్యాసాన్ని వ్రాస్తే అందులోని విషయాన్ని చర్చించకుండా వ్యాస రచయతని వ్యక్తిగతంగా దెప్పిపొడుస్తూ కులం అనో లేక ప్రాంతమనే కోణం నుండి చర్చిస్తారెందుకు..? మరీ మన తెలుగు వాళ్ళు అంత మూర్ఖుల్లా తయారయ్యారేంటీ..? చాలా దారణంగా వున్నాయి మనుషుల కుత్సితత్వాలు.

  రిప్లయితొలగించండి
 7. చంద్రబాబు తన చేత్తో ఖడ్గాన్ని సోనియా మేడం ఇస్తూ..! " మేడం ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజన చేయండి " అని వ్యాక్యానం చేశారు ఆ పోస్టర్‌లో...! అంటే విభజనకు ముఖ్యకారకడు చంద్రబాబే అని కాంగ్రెస్స్ వారు భయంకరమైన బద్నాం చేశారు. ఆ విషయంలో కాంగ్రెస్స్ వారు చాలా వరకు విజయం సాదించారు.. అపర చాణుక్యుడు అనుకొన్న చంద్రబాబు ఎంత సులభంగా దొరికిపోయాడురా కాంగ్రెస్స్ వారికి అని అనుకున్నాను

  రిప్లయితొలగించండి
 8. బాగా రాసారండి ! వరుస గా రెండు సార్లు అధికారం లోకి రాకపోయినా పార్టీని సాధ్యమైనంత క్రమశిక్షణ లో నడపడటం అనేది చాలు ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయక్వత్వాన్ని మెచ్చుకోవటానికి .

  రిప్లయితొలగించండి
 9. తాడేపల్లి గారూ, నెనరులు.

  కమల్ గారూ, ఆ అజ్ఞాత వ్యాఖ్య చూడగానే అది రాసినది ఫలానా సంఘానికి చెందిన వ్యక్తి అయ్యుంటాడని అనుకున్నాను. తీరా పరిశీలించి చూస్తే, ఆ రాసిన వ్యక్తి ఒక తెలంగాణ వాది. ప్రవాసుడు. కొంతమంది తెవాదుల్లాగా బూతుకూతలు కూయకుండా, వాదన తర్కబద్ధంగా చేస్తాడు. రెండు మూడు పేర్లతో రాసేవాడు, అయినా ఎప్పుడూ ఇలా రాయగా చూళ్ళేదు. చక్కగా ఛందోబద్ధంగా పద్యాలు కూడా రాస్తాడు. ఈ కారణంగా ఆయనపై మరింత గౌరవం నాకు.

  శ్రావ్య గారూ, నెనరులు.

  రిప్లయితొలగించండి
 10. అజ్ఞాత గారూ, ఇదివరకు ఓ సారి చంద్రబాబు మీదో, బాలకృష్ణ మీదో ఈ బ్లాగు సొంతదారుడు "వంశగర్జన" అని ఒక టపా వ్రాసి ఏకారు. బహుశా అది చదివి ఉండరు మీరు.

  రిప్లయితొలగించండి
 11. ఇదేమి కులగజ్జో ఈ మేధావులకి. వ్యతిరేక మైన వ్యాఖ్య రాగానే ఎదుటోడెవరో తెలియకుండా తమ ఎగస్పార్టీ కులమని అనుకుని, కులగజ్జి వుందని తీర్మానించేసి, తమనోటి దురద తీర్చేసుకుంటారు. అయ్యాక తమ కులం వాళ్ళకు మద్దతుగా ఓ స్టేట్మెంట్ పడేస్తారు. అందుకు మద్దతిచ్చేందుకు కొందరు బందూకులమని వస్తారు, వాళ్ళకు అక్కడ మర్యాదలు జరుగుతాయి. మతమేలేదని అనుకున్నా తమ కులానికి అన్యాయాలు జరిగాయని అందుకే సూర్యచంద్రులున్నంతవరకూ అందరినీ ముఖ్యంగా అగ్రకులాలని ఆడిపోసుకుంటామని, అది తమకులం జన్మహక్కు అని అవిరాళంగా సిగ్గులేకుండా చెప్పుకునే నాస్థిక కేతివాదులు కొందరు. ఇలాంటివి ఓ నాలుగైదు కులగజ్జి మేతావుల బ్లాగులు చూశాను. ఒకడు మొదలెట్టగానే అది వేరే కులం వాడేఅని వత్తాసు పలికే అజ్ఞాతల అమూల్యాభిప్రాయాలు మాత్రం మోడరేషన్లో ఈజీగా నెగ్గుకు రావడం గమనిచాల్సిన విషయం.

  ఓ చదువరీ ఈ చదువుకున్న సన్నాసులకు ఎందుకీ కుల జంజాటం? దీనికి మార్గంబెయ్యది చెపుమా.

  రిప్లయితొలగించండి
 12. In the history of AP no other politician faced the systematic character maligning campaign morethan chandrababu. Hatsoff to his courage. But the sad part is one can see the ill effects of this campaign in his atittude. for eg. money transfer schemes etc.

  రిప్లయితొలగించండి
 13. చదువరి గారు, తెల౦గాణా గురి౦చి చ౦ద్ర బాబు చెప్పిన వివరణ సమ౦జస౦ గానే ఉ౦ది.

  ఇక మీ వ్యాస౦లొ ఈ వ్యాఖ్య : @@ముందు ఫలానా పరిష్కారం ఒకటి కావాలని కోరుకుని తదనుగుణంగా సమస్యను, కారణాలనూ సృష్టించుకున్నారు/మార్పుచేర్పులు చేసుకున్నారు@@

  నిజానికి సమస్య లేదు అ౦టారా, సమస్య లేకు౦డా నే ఇన్ని దశాబ్దాలు గా ఉద్యమ౦ చేయగలుగుతారా ! కొ౦త వరకు మీరు వారిని అవమానిస్తున్నారు.

  రిప్లయితొలగించండి
 14. Mauli: నిజంగా సమస్య లేదు అనేది నా ఉద్దేశం కాదండి. సమస్యలున్నై. మిగతా ఏ ప్రాంతంలోనైనా ఉండే సమస్యలే ఇక్కడా ఉన్నై. రాష్ట్రాన్ని చీలిస్తే తప్ప పరిష్కారం కాని సమస్యలేమీ కావవి.

  పోతే నేనా ముక్క ఎందుకన్నానంటే.. ఈ తెవాదులు ముందుగా ఉద్యమాన్ని మొదలెట్టింది - ’వెనకబడిపోయాం, అందుక్కారణం కోస్తా సీమల జనం’ అని. ఆ వాదనలో సరుకు లేదని అనుకున్నాక, దాన్ని మార్చారు. స్వపరిపాలన, ఆత్మగౌరవం, సెంటిమెంటు, సాంస్కృతిక దాడి, వగైరాల పేరు చెప్పి చీల్చాల్సిందే అని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ వేస్తున్నట్టు ప్రకటించినపుడు ఒక చర్చలో వి.ప్రకాశ్ చెప్పాడు, ’మేం తెలంగాణ రాష్ట్రం అడుగుతున్నది వెనకబడ్డామని కాదు, ప్రజల్లో ఉన్న సెంటిమెంటు, ఆత్మగౌరవం వగైరాలే కారణం’ అని. (తీరా ఆ కమిటీ కూడా తెలంగాణ వెనకబడి లేదని తేల్చి చెప్పింది.)

  రాష్ట్ర వేర్పాటు కోసం మొదట చెప్పిన చాలా కారణాలకు మద్దతుగా సరైన అంకెలు, వాస్తవాలూ లేనందువలన, పైగా వాళ్ళు చెప్పేవి అబద్ధాలని నిరూపించేందుకు అవసరమైన రుజువులు ఉన్నందున, అంకెలతో సంబంధం లేని ఉద్వేగభరితమైన కారణాలను వాళ్ళు వెతుక్కున్నారు. ప్రజల్లోని ఉద్వేగాలను రెచ్చగొట్టడానికి ఈ కారణాలు వాళ్ళకు బాగా ఉపయోగపడ్డాయి.

  అందుకే నేనన్నది..
  ఉన్న సమస్యలకు పరిష్కారంగా కోరుతున్న వేర్పాటు కాదిది.
  వేర్పాటు కోసం తయారు చేసుకున్న/మార్పుచేర్పులు చేసుకున్న సమస్యలు.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు