3, ఆగస్టు 2010, మంగళవారం

తెలుగులో వెతకటం అంత వీజీ కాదు గురూ!

(ఈ వ్యాసంలో కొన్ని పదాల పక్కన బ్రాకెట్లలో అంకెలు చూపించాను. అవి - ఆగస్టు 2 రాత్రి ఆయాపదాల కోసం గూగిలించినపుడు వచ్చిన ఫలితాల సంఖ్య. మళ్ళీ వెతికితే ఈ ఫలితాలు కొద్దిగా అటూఇటూ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రాసినదంతా గూగుల్లో వెతకడాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినదే. గూగిలించడం అంటే google.com లో వెతకడం.) 
-----------------------------
జాలంలో ఏదైనా సమాచారం కోసం వెతకాలంటే సెర్చింజనే గతి. సెర్చింజనుకు మారోపేరు గూగులైపోయింది కాబట్టి, గూగులే గతి అన్నమాట. ఆ గూగులుకేమో తెలుగు రాదు. పదం తప్పుగా ఇచ్చినా దానికి తెలీదు. పైగా తెలుగు పదాలను రకరకాలుగా రాస్తూంటాం. (రాస్తూ ఉంటాం, రాస్తూ ఉంటాము, రాస్తూంటాం, రాస్తుంటాం, రాస్తుంటాము, ఇలా రకరకాలు, కొన్ని ఒప్పులు, కొన్ని తప్పులూను. ఇది కాకుండా ’వ్రా’సే గోల ఒకటుంది. దాని జోలికిపోతే బుర్ర ఖరాబౌద్ది కాబట్టి నే బోను). ఇహ, పదబంధాలను రాసే విధానాలు కొల్లలు. ఇతర భాషల నుంచి తెచ్చుకున్న పదాలూ అంతే. ఫలానాది రైటనీ మరో ఫలానాది తప్పనీ అంటానికి లేదు. ఇన్ని బాధలకు తోడు, ఆయా పదాల కోసం వెతికేవాడి బాధ చూడండిక! ఈమధ్య కొత్తపాళీ గారు ఒక వ్యాఖ్యలో రాసిన ఒక పదబంధం కోసం వెతికాను. ఆ కథ చెబుతాను, చిత్తగించండి. అసలా కథ కోసమే ఈ ఉపోద్ఘాతం.

మాలతిగారి బ్లాగులో కొత్తపాళీగారు వ్యాఖ్య రాస్తూ ’కుప్పుస్వామయ్యరు మేడ్దిఫికల్టు’ అని రాసారు.  అది చాలా ప్రసిద్ధమైన  చెతురు, గురజాడ కన్యాశుల్కంలో రాసినది.  గూగుల్లో వెతకబోయాను దాని కోసం. వెతికాక, జాలంలో అదేమంత ప్రసిద్ధమైనది కాదని తెలిసింది. ఎందుకంటే, దీనికి రెండంటే రెండే ఫలితాలొచ్చాయి. ఫలితాలు రెండైనా, రెంటిలోనూ  టెక్స్టు ఒకటే -ఆయన రాసినదే!  ఒకటి ఒరిజినలు, రెండోది దాన్ని చూపించిన అగ్రిగేటరు.

ఇదేంటి, ఇంత ప్రసిద్ధమైన ప్రయోగాన్ని మనవాళ్ళు అసలు వాడటం లేదా అని అనుమానం వచ్చి,  కొద్దిగా మార్చి,  కుప్పుసామయ్యరు, కుప్పుసామయ్యర్, కుప్పుస్వామయ్యరు, కుప్పుస్వామయ్యర్ ఇలా వివిధ వికల్పాలతో వెతికితే, కింది ఫలితాలొచ్చాయి:

కుప్పుసామయ్యరు మేడ్డిఫికల్టు -- 1
కుప్పుసామయ్యర్ మేడ్డిఫికల్టు -- 2
కుప్పుస్వామయ్యరు మేడ్డిఫికల్టు -- 2
కుప్పుస్వామయ్యర్ మేడ్డిఫికల్ట్ -- 2
ఆశ చావక, మళ్ళీ కొద్ది మార్పుచేర్పులతో వెతికాను.  ఇంకోటి దొరికింది.
"కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్ట్" - (ముందు 109 అని చెప్పింది, తరవాత 10 అని చూపించింది. ఏంటో మరి!)

అంటే ఏంటనమాటా..? వెతికేటపుడు ఆయా పదాలకు సంబంధించిన  ఇతర రూపాల కోసం కూడా వెతకాలి. అప్పుడే మనకు అవసరమైన దాన్ని పట్టుకోగలుగుతాం. అలాగే, రాసేవాళ్ళు కూడా పదాలను రాసేటపుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సందేహం వచ్చినపుడు ఒకసారి గూగులించి చూస్తే, తప్పులను నివారించవచ్చు.

(ఇలా వెతుకుతూండగా.. నా బ్లాగులోనే నేను దీన్ని రెండుచోట్ల రెండు రకాలుగా - కుప్పుసామయ్యర్ మేడ్డిఫికల్టు అనీ, కుప్పుసామయ్యరు మేడ్డిఫికల్టు అనీ -  రాసినట్టు గ్రహించాను. అసలందుకే ఈ వ్యాసం రాయాలనిపించింది. నేను చేసిన తప్పును మనందరం చేస్తున్నట్టుగా కతల్జెబుతున్నాను చూసారా? తెల్లోడి తెలివితేటలు!)

సరే, వెతికేటపుడు మనక్కావల్సిన పదం కోసమే కాక, దానికి కాస్త అటూ ఇటూగా ఉండే తప్పొప్పుల కోసం కూడా వెతకాలన్నమాట. స్థూలంగా, కొన్ని సూత్రాలు గుర్తెట్టుకోవాలి:
 1. పరాయిభాష - ముఖ్యంగా ఇంగ్లీషు - లోని మాటకోసం వెతుకుతూంటే,  ఆ పదం యొక్క అజంత, హలంత రూపాలు రెండింటి కోసమూ వెతకండి. ఉదాహరణకు, డిఫికల్ట్ (136) కోసం వెతుకుతూంటే డిఫికల్టు (1) కోసం కూడా వెతకండి.
 2. అనుస్వారంతో అంతమయ్యే పదాల కోసం వెతుకుతున్నపుడు, ’ము’ తో అంతమయ్యే రూపం కోసం కూడా వెతకండి. ’భయం’ (2,21,000)  కోసం వెతికేటపుడు, ’భయము’ (9,010)  కోసం కూడా చూడండి.
 3. పదబంధం కోసం వెతుకుతున్నపుడు, అందులోని పదాలను విడదీసి, కలిపేసి -రెండు రకాలుగానూ వెతకండి.  ఉదాహరణకు  బట్టతల  (4,790) కోసం వెతకబోయినపుడు "బట్ట తల"  (2,020) కోసం కూడా వెతకండి (డబులు కోట్‍లు పెట్టండి, లేకపోతే బట్టల్నీ తలల్నీ కూడా చూపించేస్తది)
 4. ఇహ మధ్యలో పొల్లు వచ్చే పదాలుంటాయి. వాటి కథ భిన్నంగా ఉంటది. అది మరోసారి.
 కంప్యూటరు కీబోర్డు మీద ఎడాపెడా వాయించేటపుడు ఒక అక్షరం బదులు మరో అక్షరం పడుతూంటుంది.  ఇది అందరికీ పడదులెండి,  వేళ్ళు మందంగా ఉన్న నాబోటి వాళ్ళకి మాత్రమే ఇది జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు టైపించేటపుడు గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘమూ తప్పులు పడుతూంటాయి. ’కు’ బదులు ’కి’, ’కీ’ బదులు ’కూ’ ఇలాంటి టైపాట్లు పడుతూంటాయి.  ఏం చేస్తాం, మనిషికో వైకల్యం మహిలో సుమతీ!

ఇవీ, ఇలాంటి ఇతర తప్పులనూ అలాగే ఉంచి ప్రచురించడం వలన, అవి జాలంలోకి చేరుకుంటున్నాయి. బద్ధకించి కొందరు, తప్పులు కనబడక కొందరు, అవి తప్పులని తెలీక కొందరూ వదిలేస్తారు. కొందరుంటారు, ’ఏఁ, తప్పు రాస్తే ఏంటంట? కొంపలంటుకుంటాయా? ’అని వదిలేస్తారు . ఎలాగన్నా వదిలెయ్యనీండి, తప్పులు జాలంలోకి దొర్లుకొస్తాయి. 

మరి గూగులు తెలివైన దంటారే...? 
నిజమే, గూగులు తెలివైనదే. ఒక్కోసారి మనం పదాన్ని కొద్దిగా అటూ ఇటూగా, స్పెల్లింగులు తేడాగా  ఇచ్చినా, ’ఏంటి బాబూ, నువ్వు అడగదలిచింది ఇదిగానీ కాదు గదా : ’అంటూ అసలుదాన్ని చూపిస్తుంది. అయితే ఇంగ్లీషు భాషకో, మరోదానికో చూపిస్తుందిగానీ, తెలుక్కి చూపించదు.  పాపం దానికింకా పూర్తిగా తెలుగు రాదు.

పదబంధాల్లోని పదాలను కలిపి రాయాల్సిన చోట విడదీసి, విడదీసి రాయాల్సిన చోట కలిపీ రాస్తూంటాం కదా.. ఉదాహరణకు వేటగాడు అనే మాట చూడండి, దీనిలోని వేట గాడు అనేవి మాటలను విడిగా రాయకూడదు. కానీ వీటిని విడదీసి రాస్తూంటారు.  వెతుకులాటలో తేడాలొస్తాయి. వేటగాడుకు 5,390 ఫలితాలొస్తే, "వేట గాడు"కు 4 ఫలితాలొచ్చాయి.  ఇలాంటి మాటలు రాసేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. విశేషమేంటంటే, వేటకాడు అని కూడా కొన్నిచోట్ల రాసారు. వెతుకులాటలో దీనికి 29 ఫలితాలొచ్చాయి.

మనుషుల పేర్లను కూడా రకరకాలుగా రాస్తూంటాం. ఉదాహరణకు నందమూరి తారకరామారావు, నందమూరి తారక రామారావు, నందమూరి తారక రామా రావు అని రకరకాలుగా రాస్తూంటాం. అంతెందుకు.., ఉత్త నందమూరి అనే పేరును నంద మూరి అని విడగొట్టి రాస్తున్నారని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నందమూరికి  2,71,000 ఫలితాలొస్తే, "నంద మూరి" కి 123 ఫలితాలొచ్చాయి.  చిత్రమేంటంటే, క్షమాపణ (87,700)ను "క్షమా పణ " (47) అని కూడా రాస్తున్నారు.

ఇంకో చిన్న పరిశీలన. తెలంగాణ ను ఎన్ని రకాలుగా రాస్తామో చూడండి:
 • తెలంగాణ (4,37,000)
 • తెలంగాణా (4,34,000)
 • తెలంగానా (26,300)
 • తెలంగాన (14,400)
 • తెలింగాణా (47)
 • తెలింగాణ (7)
 • తెలింగానా (44)
 • తెలింగాన (2)
 • తెలగాణ (2,230) 
 • తెలగాన (6)
 • తెలగానా (3)
 • తెలగాణా (59)
తెలంగాణ కోసం వెతికేవాళ్ళు, తెలగాన  కోసం కూడా వెతికే అవకాశం చాలా తక్కువ.  మనం మన వ్యాసంలో  తెలగాన అని రాసి ఉంటే, గూగులు ద్వారా అది చదువరులకు అందే అవకాశం దాదాపు లేనట్టే - ఇహ,  ప్రత్యేకించి లింకులిచ్చుకుంటూ ప్రచారం చేసుకోవాల్సిందే.

ఒక్కమాట - ’ఆ, ఇప్పుడు నేను రాసే బోడి రాతలు వెతుకులాటలో కనబడకపోతే మాత్రమేంటిలెండి ’ అని మాత్రం అనకండి.  ఎక్కడినుంచో కాపీకొట్టి, దించిపారెయ్యనంతవరకు ఏదీ బోడిరాత కాదు. అన్నీ అవసరమే!  కాదేదీ సెర్చి కనర్హం!  ఇంకోటి - మనం రాసేది, పాఠకులను చేరటానికి.  పాఠకుణ్ణి చేరాలంటే జనం గూగిలించినపుడు మనమూ ఫలితాల్లో కనబడాలి.

మనం తప్పులు దిద్దుకోవాలని చెప్పకుండా గూగులుకు తెలుగు నేర్పమంటావేంటయా అని నన్నడగొద్దండి. ఆ రెండోదే తేలిక.  ఎందుకంటే,  తెలుగు ఎట్టా ఏడ్చినా ఫర్లేదులెమ్మని మనలో చాలామందిమి అనుకుంటాం. అదే.., ఇంగ్లీషులో చిన్నవెఁత్తు తప్పు దొర్లితే భ్రూణహత్య చేసినంత పాపంగా భావించి, తల్లడిల్లిపోతాం.
--------------------------------------------------
(బ్రాకెట్లలో ఇచ్చినవి - ఆగస్టు 2 న ఆయాపదాల కోసం గూగిలించినపుడు వచ్చిన ఫలితాల సంఖ్య. మళ్ళీ వెతికితే ఈ ఫలితాలు కొద్దిగా అటూఇటూ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రాసినదంతా గూగుల్లో వెతకడాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినదే. గూగిలించడం అంటే google.com లో వెతకడం.)

20 కామెంట్‌లు:

 1. మీ పరిశీలన ఉపయోగకరంగా ఉంది.

  పదాలు విడదీసి రాయడానికి ఒక ముఖ్యకారణం Google Transliterator. విడదీయకపోతే అది సరిగా translate అవదు. చాలామంది తిరిగి వెనక్కి వచ్చి కలపడానికి ఓపిక లేక అలాగే వదిలేస్తారు. అయితే ఇది లేఖిని, బారహాల కంటే కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

  రిప్లయితొలగించండి
 2. బాగున్నాయండి మీ పరిశీలనలు !
  ఆ చివరి పేరా మాత్రం కొంచం గట్టి గా తగిలింది నేను చాలా తప్పులు రాసే బాపతు కాబట్టి , తెలుగేగా అని కాదు బ్లాగులేగా అని కొద్ది గా నిర్లక్ష్యం అంతే :)

  రిప్లయితొలగించండి
 3. చాలా బాగుంది మీ పరిశీలన..నిజమే కదా అనిపించింది...కానీ కొన్ని సార్లు మనం టైపు చెయ్యలనుకున్నది చెయ్యటం వీలుకాదండీ..నేను Indic Input Extension అనే Add-on నా మొజిల్లా బ్రౌజర్లో వేసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ కాపీ,పేస్టు అవసరం లేకుండా టైపు చేసుకుంటాను..అయితే దీనిలో కొన్ని విడదీయాల్సి వస్తుంది..ముఖ్యంగా చివరలో పొల్లు వచ్చే పదాలకు ఆ తర్వాత ఏ అక్షరం పెట్టినా అది కాస్త పదంలో ఇరికింపబడుతుంది..అచ్చంగా ఇలాంటి సందర్భంలోనే పదాన్ని విరగొట్టడం జరుగుతుంది...ఉదా: 'బ్లాగ్ స్పాట్' అనే పదాన్ని నా ట్రాన్సలేటర్ కలిపినట్లయితే 'బ్లాగ్స్పాట్' అని వస్తుంది...కానీ పదం మద్యలో స్పేస్ ని రిమూవ్ చేసి కలపదు...

  రిప్లయితొలగించండి
 4. @చదువరి,

  మంచి పరిశోధన. నేను రెండు మూడు వైవిధ్యాలతో వెతికి సరిపెట్టేస్తుంటా. అన్ని ఫలితాల కోసం ఇక వీలైనన్ని అచ్చుతప్పులూ విడదీతలతో కూడా ప్రయత్నించాలన్నమాట!

  @శేఖర్ పెద్దగోపు,

  పొల్లు చివర వచ్చే పదాలకి తర్వాత పదాలు కలిసిపోకుండా ఉండాలంటే, ^ (Shift + 6) ని ఉపయోగించి చూడండి. (లేఖినిలో పనిచేస్తుంది. ఇండిక్ ఇన్‌పుట్ పొడగింతలో కూడా ^ పనిచేస్తుందనే గుర్తు.)

  లేదా, HTML కోడులో అయితే "బ్లాగ్‌స్పాట్" అని ఉపయోగించవచ్చు. కనబడేటప్పుడు "బ్లాగ్‌స్పాట్" అని కనిపిస్తుంది.

  రిప్లయితొలగించండి
 5. లేఖిని, బరహ - ఈ రెండూ ఇన్‌పుట్ ఎక్స్‌టెన్షన్ల కంటేను, ట్రాన్స్‌లిటరేషన్ టూళ్ళ కంటేను చాలా చాలా సౌకర్యవంతమైనవి, ఇంకా అభివృద్ధి చెందినటువంటివి కూడా. అంటే, మనకు తెలుగుభాషా గుణితాలు సరిగా తెలిస్తే ! కానీ అలా తెలియనివారి విషయంలో - మనం ఏదో పదాన్ని ఇంగ్లీషు స్పెల్లింగులలో టంకించుకుంటూ పోతే రకరకాల గుణిత వికల్పాల (spelling options) ను ఆబ్జెక్టివ్ టైపులో ప్రదర్శించే సాంకేతిక కొసఱులు (add-ons) బావున్నట్లు అనిపిస్తాయి. కానీ మీరు ఒక మంచి సంస్కృత శ్లోకాన్ని గానీ, గ్రాంథిక తెలుఁగు పద్యాన్ని గానీ ఈ కొసఱుల సహాయంతో టంకించడానికి ప్రయత్నించి చూడండి. మీ వల్ల కాదు. ఎందుకంటే ఈ కొసఱులు కేవలం సర్వసాధారణమైన వ్యావహారిక భాష కోసం ఉద్దేశించినవి. ఇవి తెలుఁగు యొక్క సర్వసమగ్ర స్వరూపాన్ని ఎలక్ట్రానిక్ గా పొడకట్టించజాలవు.

  రిప్లయితొలగించండి
 6. వీవెన్ ఇలా చెబుతున్నారు:

  కొందరు అక్షరాల్లో సున్నాకి బదులు అంకెల్లో సున్నాని ఉపయోగిస్తునారు. అంటే, అందం అని రాయడానికి అ౦ద౦ (155 గూగుల్ ఫలితాలు) అని రాస్తున్నారు. బరహాలో సున్నాని రాయడానికి Shift + Mని ఉపయోగించాలని తెలియకపోవడం ఇందుకు కారణమనుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 7. హరి దోర్నాల: గూగుల్ పరికరాన్ని మొదట్లో వాడి చూసానండి. నాకది అంత నచ్చలేదు. పొరపాటున ఏదన్నా తప్పు టైపిస్తే, దాన్ని సరిదిద్దుకోడానికి కాస్త తిప్పలు పడాలి అందులో. ఇప్పుడెలా ఉందో తెలీదు.
  Sravya Vattikuti: అంటే నేను ఎవరో ఫలానా కొందర్ని ఉద్దేశించి రాసినది కాదండి. సాధారణ తెలుగువాడి మనస్తత్వమది అని నా ఉద్దేశం. :)
  శేఖర్ పెద్దగోపు: ఈ పొల్లు వచ్చే పదాలతో తలకాయనెప్పేనండి. మనం కాస్త అలవాటు పడాలి. చాలా సందర్భాల్లో క్యారట్ (shift+6) పనికొస్తుంది.
  తాడేపల్లి: అయితే పద్మ పొడిగింత బానే పనిచేస్తుందండి. లేఖినిలో ఉండే విశేషాలన్నీ పద్మలోనూ ఉన్నాయనుకుంటాను.
  వీవెన్: మంచి చేర్పు! నెనరులు.

  రిప్లయితొలగించండి
 8. మంచి టపా అందించారు. థాంక్స్ టు నాగరాజు గారు.. హీహీ(నాగరాజు గారి బజ్ నుండి ఇటొచ్చాను మరి!...)

  రిప్లయితొలగించండి
 9. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్లతో పెద్ద పని ఉండదు అనుకుంటాను. తెలుగులో ఆరు అగ్రెగేటర్లు ఉన్నాయి, నేను డిజైన్ చేసిన http://teluguwebmedia.asia కలిపి. చదువరి గారు చెప్పినట్టు అక్షరాలలోని సున్నా కాకుండా అంకెలలోని సున్నా కలిపితే తేడా నిజంగానే వస్తుంది. SUSE లినక్స్ సిస్టమ్ లో అంకెలలోని సున్నా మరీ పెద్దగా కనిపిస్తుంది. అక్కడ తేడా స్పష్టంగా తెలిసిపోతుంది.

  రిప్లయితొలగించండి
 10. @వీవెన్ గారు,
  థాంక్యూ సో మచ్..ఎందుకంటే ఇంతకాలం కొన్ని రాస్తున్నవి తప్పు అని తెలిసినా కూడా అవే రాసే పరిస్థితినుండి కొంతైనా మీరిచ్చిన వివరం వలన సరిదిద్దుకోగలిగినందుకు...ఇంకో చిన్న సహాయం..నాకు విసర్గహ రాయాల్సివచ్చేటప్పుడు కీ బోర్డులోని రెండు చుక్కలు నిలువుగా పెట్టాల్సివస్తుంది..దీనికేమైనా ఉందంటారా?

  @తాడేపల్లి గారు,
  >>>కొసఱులు కేవలం సర్వసాధారణమైన వ్యావహారిక భాష కోసం ఉద్దేశించినవి..
  మీరన్నది చాలా కరెక్ట్..ఆ విషయం ఆ కొసరులు వాడుతున్నప్పుడే తెలిసిపోతుంది ఎవరికైనా..కాకపోతే కాస్త సౌలభ్యం వల్ల అలాంటివి ఆశ్రయించక తప్పట్లేదండి...

  రిప్లయితొలగించండి
 11. @శేఖర్ పెద్దగోపు,

  విసర్గ కొరకు @h అని ఉపయోగించి చూడండి.

  రిప్లయితొలగించండి
 12. మీ చర్చకు సంబంధించినదని ఈ విషయం రాస్తున్నాను.

  Google లో ఇప్పుడు తెలుగులో కూడా Search చేయొచ్చు. ఇందులో మీరు ఇంగ్లీషులో టైప్ చేస్తే తెలుగులో prompt వస్తుంది.

  http://www.google.co.in/webhp?hl=te

  Dileep

  రిప్లయితొలగించండి
 13. మంచి టపా. మీరు అరసున్నను మరచిపోయినట్టున్నారు. తెలఁగాణ అని వెతికితే మరికొన్ని ఫలితాలు వస్తాయి. :)

  రిప్లయితొలగించండి
 14. Dileep: నెనరులు
  రానారె: అవును మర్చిపోయాను. తాడేపల్లిగారి వ్యాఖ్య చూసాక అరసున్నల సంగతి గుర్తొచ్చింది గానీ తెలఁగాణ ఉంటదని మీ వ్యాఖ్య చూసేదాకా తట్టలేదు. :)

  రిప్లయితొలగించండి
 15. Nice work, really impressed.Here is my 2 cents. This kind of problem is there for all languages including English. for ex. for Anjalina jolie people use not less than 100 different variations. Google learns from its own results. If some body searches for Anjalina but clicks on a Anjaleena link, it gives a loose link between these two words.. as the time passes, if this rank increases it automatically suggests the users also clubs the results. for all this to happen, all it needs is some time.

  2nd thing is, regional search engines are always better, for example baidu for chineese. manadeshamlo anthaga evadu cheyyaledu kaani, chinese ki baidu is far better than google

  రిప్లయితొలగించండి
 16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 17. thank you for this nice article. Just wanted to share with you (after my friend, Nagaraju Pappu prompted me to do so) about a search technology developed by SETU Software systems (www.setusoftware.com) a start-up incubated in IIIT Hyderabad.

  SETU makes its Indian language search available through rediff.com http://ilsearch.rediff.com Please check Telugu search with all examples you have mentioned in your article. You will find that it handles sandhi and samasams of all agglutinative languages better than other search engines and hence you will get more results.

  There are years of research behind this work. Those interested in technical details may refer to http://web2py.iiit.ac.in/research_centres/publications/view_publication/phdthesis/1

  SETU offers its Indian language search through rediff.com and 23 other agglutinative languages on its own portal www.setooz.com

  SETU is also working with some Indian language media/publication houses to provide simple language tools like spell checking, grammar checking, finding Indian Language equivalent words for English/foreign words when mixed language sentences are used.

  రిప్లయితొలగించండి
 18. చాలా ఉపయోగకరమైన టపా.నా లాంటి బద్ధకస్తులు చదువరి గారి శ్రమ దోపిడి చేస్తున్నాము.ఇంగ్లిషులో నామవాచకానికి క్రియా రూపం జో్డిస్తే అది క్రియ ఐపోతుంది.Ex: Water>watering. తెలుగులో కూడా ఈ విధంగా ఉంటే బాగుంటుంది.అదే పద్ధతిలో మీ పద ప్రయోగం "గూగులించడం" బాగుంది-అదే ఇకనుంచి ఉపయోగించడం మేలు.

  రిప్లయితొలగించండి
 19. Fee reimbursement> సరైన తెలుగు పదం సూచించగలరా?

  రిప్లయితొలగించండి
 20. చాలా బావుంది, నిజమేగా అని అనిపించింది
  శిరీష్ గారు మొదటి రెండు పదాలు తెలంగాన తెలంగాణా ఇప్పుడు గూగుల్ చేసి చుడండి, రిజల్ట్స్ పది ఇంతలు అయ్యాయి
  బహుశ తెలంగాణా గొడవల ఎఫ్ఫెక్ట్

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు