2, ఏప్రిల్ 2009, గురువారం

రెండు చర్చలు

ఇవ్వాళ టీవీ ఛానళ్ళలో రెండు చర్చలు చూసాను.  రోజూ చూస్తాననుకోండి, ఎందుకో ఈ రెంటి గురించీ రాయాలనిపించింది. కాస్త సమయమూ చిక్కింది. ముందుగా..

ఓటరును అవమానపరచిన క్షణం
భిక్కనూరులో ముఖ్యమంత్రి ప్రచారంలో ఉండగా, శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి,  2004 లో తెలంగాణా ఇస్తామని నమ్మించి ఎందుకు మోసం చేసారని. ఆయన్ను ప్రశ్నించాడు. ఆ మాట అడిగినందుకు శ్రీధర్ రెడ్డిని పక్కకు  లాగిపడేసారు. ఆ తరవాత కాంగ్రెసు కార్యకర్తలు ఆయనపై చెయ్యిచేసుకున్నారట కూడాను. నేను చెబుతున్న అవమానం ఇది కాదు; ఇది చిన్నది. అసలు అవమానం ఇవ్వాళ - ఏప్రిల్ 2న - ఐన్యూస్ ఛానల్లో జరిగిన చర్చలో జరిగింది.

ఈ చర్చలో కమలాకర్ (కాంగ్రెసు), చంద్రశేఖర్ (తెదేపా), శ్రవణ్ (ప్రారాపా), ఘంటా చక్రపాణి (స్వతంత్ర పరిశీలకుడు) పాల్గొన్నారు. మామూలుగానే అరుపులూ కేకలు జరిగాయి. ఈ చర్చలో విశేషమేంటంటే, చర్చ సగంలో ఉండగా ఐన్యూస్ నిజామాబాదు స్టూడియోకి శ్రీధర్ రెడ్డిని పిలిచి ఆయన్నూ మాట్టాడించారు. చక్కగా మాట్టాడాడాయన.

"ముఖ్యమంత్రి మా ఊరు వచ్చారు, మాకే వోట్లు వెయ్యమని అడిగారు. తెలంగాణా ఇస్తామని 2004 లో మీరు చెప్పారు కాబట్టి, నేను మీకు వోటేసాను. ఈ ఐదేళ్ళూ మీరు ఏమీ చెయ్యలేదు. మళ్ళీ ఇప్పుడొచ్చి, వాళ్ళు దొంగలు, వీళ్ళు మోసగాళ్ళు అని చెబుతున్నారు, అసలు మీరేంచేసారు?" అని నేను ముఖ్యమంత్రిని అడిగాను, నాయకుణ్ణి ఒక వోటరుగా ప్రశ్నించాను." అని చక్కగా చెప్పాడాయన.

దానికి కమలాకర్, కాంగ్రెసు వాళ్ళు మామూలుగా చెప్పేదే చెప్పాడు. "ఎస్సార్సీ వేస్తామని చెప్పాము, కేసీయారు వద్దన్నాడు. పైగా అన్ని పార్టీలు కలిసి రాలేదు. సొంతంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేంత బలం మాకు లేదు. ఈసారి మాకు వోటేస్తే ఏర్పరుస్తాం" అని చెప్పాడు. అక్కడితో ఆగలేదు, "అసలు ఈ వ్యక్తి ఏదో పార్టీకి చెందినవాడిలాగా ఉన్నాడు ఎవరో ప్రేరేపిస్తే అలా మాట్టాడాడు", అని ఆరోపించాడు. శ్రీధర్ రెడ్డి, నేను మహాకూటమికి వోటేస్తాను అని నిజాయితీగా చెప్పాడు. 

ఇక కమలాకర్ రెచ్చిపోయి, "అదిగో, తాను మహాకూటమి మనిషినని ఆయనే చెబుతున్నాడు", అన్నాడు. అదేదో కాంగ్రెసును విమర్శించేవాళ్ళంతా ప్రతిపక్ష పార్టీలే, వాళ్ళ కార్యకర్తలే అన్నట్టు ఆరోపించాడు. కాంగ్రెసుకు వోటు వెయ్యని వాడికి దాన్ని విమర్శించే హక్కు లేదన్నట్టు మాట్టాడాడు. శ్రీధర్ రెడ్డిని మాట్టాడనివ్వలేదు. వోటరుగా నాయకులను ప్రశ్నించడం శ్రీధర్ రెడ్డికున్న హక్కు. చర్చలో ఆయనపై ఎదురుదాడి చేసి, ఆయన్ను ఓ పార్టీకి కట్టేసి, కమలాకర్ ఆయన్ను అవమానించాడు. నాయకుల దురుసుతనానికిది నిదర్శనం.

చివరికి, "ఎదురుదాడి చెయ్యడం ముఖ్యమంత్రి మీకు బాగా నేర్పించాడు, అందుకే ఇలా ఎదురుదాడి చేస్తున్నారు" అంటూ శ్రీధర్ రెడ్డి కూడా గట్టిగానే చెప్పాడు. కాంగ్రెసువాళ్ళ ఎదురుదాడి వైఖరిని తేటతెల్లం చేసాడు.

శ్రీధర్ రెడ్డి  ఇంకోమాట కూడా అడిగాడు.. "సభలో మెజారిటీ లేకపోయినా శాసనమండలి బిల్లును, అణుఒప్పందాన్నీ నెగ్గించుకున్నారు. మరి తెలంగాణకు అడ్డేమొచ్చింది? బిల్లు పెట్టండి, మేము మద్దతిస్తాం అని బీజేపీ కూడా చెప్పిందికదా" అని అడిగాడు.

ఇది తప్పించి ఆ చర్చా కార్యక్రమంలో కొత్తగా చర్చించిందేమీలేదు, గుర్తు పెట్టుకోవాల్సిందీ లేదు. ప్రజారాజ్యపు శ్రవణ్ మాత్రం శ్రీధర్ రెడ్డిని అభినందించాడు.

శ్రీధర్ రెడ్డి గారూ, నా అభినందనలు కూడా అందుకోండి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని, వోటర్లందరమూ అలా ప్రశ్నించిన రోజున, మన దగ్గరకొచ్చి అవాకులు చవాకులూ పేలే నాయకులు ఒళ్ళు దగ్గరపెట్టుకుంటారు.

----------------------------------------

ఇక, ఓ ముఖాముఖి గురించి..

రాజమండ్రి లోక్‌సభ అభ్యర్థులు మురళీమోహన్ (తెదేపా) , ఉండవల్లి అరుణ్‌కుమార్‌ (కాంగ్రెసు)ల మధ్య ముఖాముఖి చర్చ జరిగింది, ఎన్‌టీవీలో. ఈ ఎన్నికల్లో జరిగిన ముఖాముఖీల్లో నేను చూసిన మొదటిదిది. ఉండవల్లి చాలా సమర్ధవంతంగా వాదించాడు. చక్కటి వాగ్ధాటి, వాదనాపటిమ ఉన్నాయాయనకు. మురళీమోహన్‌కు వాగ్ధాటీలేదు, వాదించేందుకు విషయమూ లేదు. అసలా ప్రాంతపు సమస్యలేంటో కూడా తెలిసినట్టులేదు. ఈ చర్చకోసం సరిగ్గా తయారైనట్టు కూడా లేదు.

మురళీమోహన్ అచ్చు చిరంజీవి లాగానే మాట్టాడాడు. తానెంతో మంచివాడినన్నట్టు, సచ్ఛీలుణ్ణన్నట్టు  ప్రదర్శించుకోబోయాడు. "నేను ఉండవల్లికి ఒక ప్రతిపాదన చేద్దామనుకున్నాను - నా వోటు  ఆయనకు, ఆయన వోటు నాకూ వేసుకుందామని చెబుదామనుకున్నాను. కానీ నా వోటు హై.లో ఉండటం వలన ఆ ప్రతిపాదన చెయ్యలేదు" అని అన్నాడు. అసలీ ముక్క ఎందుకు చెప్పాడంటే, అంతకుముందు - ఎప్పుడో మరి - మనిద్దరం కలిసి, ఒకే వాహనంలో తిరిగి ప్రచారం చేద్దామని ఉండవల్లి ప్రతిపాదించాడట. దానికి ప్రతిగా నన్నట్టుగా వాడాడీ తెలివితక్కువ డైలాగు. ఉండవల్లి, "నేను మురళీ మోహనుకైతే వేసేవాణ్ణిగానీ, ఆయన వెనకాల తెదేపా ఉంది కాబట్టి, ఆయన ప్రతిపాదనను ఒప్పుకునేవాణ్ణి కాను" అని తేల్చి చెప్పేసాడు.

అంతేకాదు, చర్చలో కనీసం నాలుగైదు సార్లు మురళీ మోహన్ అవగాహనాలేమిని బయటపెట్టాడు, ఉండవల్లి. చుట్టూ చేరిన ప్రేక్షకులతో (అంతా వివిధ పార్టీల కర్యకర్తల్లాగానే ఉన్నారు) "ఈయనకు ఈ రంగం కొత్త, ఇలాంటి ప్రశ్నలడిగి ఇబ్బంది పెట్టకండి" అంటూ చెణుకులూ విసిరాడు. మీరు నియోజకవర్గానికి కొత్త, మీకు సంగతులు తెలీవు,  అంటూ అన్యాపదేశంగాను, సూటిగాను కూడా అన్నాడు.

మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అని ఇద్దరినీ అడిగాడు నిర్వాహకుడు. ఉండవల్లి, రెండు గోదావరి జిల్లాల్లోను పోలింగు రోజుదాకా ఎవరనేది చెప్పలేం, మిగతా రాష్ట్రంలో మాత్రం తెదేపానే నన్నాడు. మురళీ మోహనేమో, నేను కొత్తవాణ్ణి, ఉండవల్లి, కృష్ణంరాజు (ప్రరాపా అభ్యర్థి. చర్చలో ఈయన ఎందుకు పాల్గొనలేదో మరి!) ఇద్దరూ సీనియర్లు.. అంటూ ఏదేదో చెప్పాడు.

చివర్లో ప్రేక్షకుల్లోంచి ఓ పాత్రికేయుడు అడిగాడు, "మరి మీరిద్దరూ కలిసి ప్రచారం చేసే సత్సంప్రదాయాన్ని మొదలుపెడతారా" అని. మురళీమోహన్ కృష్ణంరాజు గారిని కూడా అడిగి అప్పుడు చూద్దాం అని అన్నాడు. ఉండవల్లి, "నాకేం అభ్యంతరం లేదు, నేను ఇంకా వాహనాల కోసం పురమాయించలేదు కూడా. మురళీమోహన్ గారి పసుపు బండిలో ఎక్కి ప్రచారం చేద్దామంటే నేను సిద్ధమే" అని అన్నాడు.

ఉండవల్లి, చర్చ రూపంలో వచ్చిన ఈ అవకాశాన్ని చక్కగా వాడుకున్నాడు. అంబేద్కరును విమర్శించిన ఘటనకు సంబంధించి, తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేసాడు, అందుకు బాగా సిద్ధమై వచ్చాడు కూడాను. తాను గత ఐదేళ్ళలో ఏమేం చేసాడో చక్కగా చెప్పాడు. తెదేపాను గట్టిగా విమర్శించి, కాంగ్రెసుపై మురళీమోహన్ చేసిన పేలవమైన విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టాడు.

ఉండవల్లి వాదనాసమర్ధతా, మురళీమోహన్ అవగాహనాలేమి, అనుభవలేమి, వాక్చాతుర్యలేమి -రెండూ కలిసి, చర్చ ఏకపక్షమైంది. అది చూసిన తటస్థ వోటరెవరైనా ఉండవల్లి వైపుకే మొగ్గుతారు.

9 కామెంట్‌లు:

 1. శ్రీధర్ రెడ్డి గారికి నా తరపున కూడా అభినందనలండీ. మీరన్నట్లు ఇటువంటి చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలి.

  రిప్లయితొలగించండి
 2. బాగుంది.
  సినిమా హీరో అనో, లేక మా పార్టీ అనో గుడ్డి అభిమానం ఉన్న వారి సంగతి పక్కన పెట్టండి. సాధారణ పౌరులకి ఉన్న సమస్య లేమిటి? ఆయా నియోజక వర్గాల్లో ప్రజ లెదురుకుంటున్న సమస్యలేవిటి? ఇప్పుడూన్న ప్రభుత్వం గానీ, లేదా ఇప్పుడూ పదవిలో ఉన్న ఎంపీ ఎమ్మెల్లేలు గానీ ఏంఇ సాధించామని చెప్పుకుంటున్నారు. ఇదేదీ వినబడదేం ఎక్కడా?

  రిప్లయితొలగించండి
 3. పార్టీలకు అతీతంగా నియోజకవర్గం అభివృద్ధి గురించి చర్చించే ప్రచారసభలు ఎప్పుడొచ్చేనో!

  రిప్లయితొలగించండి
 4. మనకి పార్టి కాదు ముఖ్యం ! పార్టీ కి మనప్రాంతపు నాయకుడు ముఖ్యం. మన ప్రాతం లో పొటీ లో ఉన్న నాయకులలో మంచి వ్యక్తి కి పట్టం కడదాం. ప్రతీ పౌరుడు మూడం గా ఒటేయడం మానెశి, గత ఎన్నికలలో తన ఓటు ఏ పార్టీ కి ఎందుకు వెసాడో గుర్థు తెచ్హుకుని మరీ ఈ సారి సామన్య ఓతరు వ్యవహరిస్తాడు అని తలుద్దాం.
  మనం ఎంత అలోచించినా మన నయకుల ఆలొచనా ధొరని అయొమయమే !!

  రిప్లయితొలగించండి
 5. మీరు చెప్పిన రెండవ చర్చ నేనూ చూసాను. ఉండవల్లిది దాదాపు ఒన్ మేన్ షో లా జరిగింది. భలే వర్ణించారు మీరు.

  రిప్లయితొలగించండి
 6. నమస్కారం !
  నా కొత్త తెలుగు బ్లాగు లో ఒక కొత్త టపా రాసాను - "బూటు గొప్పా ? పెన్ను గొప్పా ? "
  మీ అభిప్రాయాలు తెలుపగలరు!

  రిప్లయితొలగించండి
 7. మీరు వ్రాసినది అక్షరాలా నిజం.ఆ చర్చ నేనుకూడా చూశాను.పొలవరం గురించి మురళీమోహన్ కి ఏమీ తెలిసినట్లులేదు.అస్తమానూ ఏదొ అనడం, దానికి ఉండవిల్లి సమాధానం ఇవ్వగానే--" పోన్లెండి ఆ విషయం వదిలేద్దాం" అనడం తప్ప మురళీమోహన్ ఒక్క విషయాని గురించీ సరీగ్గా మాట్లాడ లేకపోయాడు.అదే కాదు మురళీ మోహన్ ఎత్తిన ప్రతీ విషయం గురించీ ఉండవిల్లి సరి అయిన సమాధానం ఇచ్చారు. నా ఉద్దేశం లో కృష్ణంరాజు వచ్చినా ఇలాగే ఉండేది. మార్గదర్సి విషయం లో ఉండవిల్లి చాలా స్కోర్ చేసి ప్రజలలో మంచి పేరు తెచ్చుకొన్నారు.

  రిప్లయితొలగించండి
 8. meru velli okasaari vinandi boss..prajala voice.....akkada nadaru mana niyojaka vargam gurinchi pattinchukokunda..veedu eeevo comapanies pattinchukuntunnadu enti ra ani andaru anukuntunnaru............one thing........meeru enduku vaakpatimaku anta preference istaaro anku artham kaavatla..............

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు