19, డిసెంబర్ 2007, బుధవారం

దార్లు కొట్టేవాళ్ళూ డాక్టర్లను కొట్టేవాళ్ళూ

దోపిడీ దొంగలు, దార్లు కొట్టేవాళ్ళూ ఎలా పనిచేస్తారు? అవకాశం చూసుకుని ఒక్కసారిగా మీదపడి, దౌర్జన్యం చేసి, ఎంత హఠాత్తుగా వచ్చారో అంతే అకస్మాత్తుగా మాయమైపోతారు. మళ్ళీ తరువాతి దోపీడీ దాకా కనబడరు.

ఆ ఎమ్మెల్యేల మాట సాధారణంగా వినబడదు పత్రికల్లో, శాసనసభలో కూడా. ఈ మధ్య మాత్రం అన్ని పత్రికల్లోనూ పతాక శీర్షికలకెక్కుతున్నారు. తస్లీమా నస్రీన్‌ను కొట్టి ఓ రోజు, నీలోఫర్లో ఓసారి, ప్రసూతి ఆసుపత్రిలో ఓసారి డాక్టర్లను కొట్టి వార్తల్లోకెక్కారు. కొట్టి వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళ మాటా పేరూ వినబడవు.., తరువాతి దౌర్జన్యం వరకూ. ఈలోగా ప్రభుత్వం మాత్రం ఆ దెబ్బలు తిన్నవాళ్ళ మీదే కేసులు పెట్టి, ఎస్మాలు పెట్టి హడావుడి చేస్తూ ఉంటుంది.

మొన్న డాక్టర్లను కొట్టిన వాళ్ళు ఇప్పుడేమంటున్నారు.. డాక్టర్లు ముస్లిములకు వ్యతిరేకులట. ఎంత అసంబద్ధమైన మాట! తెలిసిపోతోంది కదా.. వీళ్ళ దొంగ బుద్ధి! తిప్పి తిప్పి మతం దాకా తెచ్చి, ఇదిగో ముస్లిములను రక్షించడం కోసమే మేమీ దాడులు చేస్తున్నాం. మేమే మీ రక్షకులం అని చెప్పుకోవడమన్నమాట. వారి కోసం మేము ఎంతో పాటు పడుతున్నామని చెప్పుకుంటూ, వారి ఓట్లు కొల్లగొట్టే చవకబారు ఎత్తు తప్ప మరోటి కాదు.

మరి ప్రభుత్వ నేతలెందుకు ఊరుకుంటున్నట్టు? వాళ్ళక్కూడా ఓట్లు కావాలి కదా, వాళ్ళకి మాత్రం చేదా. పైగా ఎమ్మైయెమ్ పార్టీ భుజాలెక్కి హైదరాబాదు ఎన్నికలను దాటాలని గదా, కాంగ్రెసు ప్రయత్నం! అంచేత, వాళ్ళీ దౌర్జన్యాలను పట్టించుకోరు. గట్టిగా మాట్టాడితే దెబ్బలు తిన్నవారిమీదే కేసులు పెడతారు, తస్లీమాపై పెట్టినట్టు!

మానవ హక్కుల సంఘాల వారు, పౌరహక్కుల సంఘాల వారు ఎక్కడా వినబడరూ, కనబడరే? పోలీసుల మీద ఒంటి కాలి మీద లేస్తారే.., మరి ఈ దౌర్జన్యాల గురించి మాట్లాడరేంటి?

కామెంట్‌లు లేవు:

సంబంధిత టపాలు