3, జూన్ 2007, ఆదివారం

ఏది చరిత్ర?

గజనీ మహమ్మదు మన దేశం మీదకి 17 సార్లు దండెత్తి వచ్చాడు. మన రాజులను చిత్తుగా ఓడించి దేవాలయాలను ధ్వంసం చేసి, సంపదలను దోచుకుపోయాడు.

ఇది మనం చదువుకున్న చరిత్ర.

కానీ పంజాబు రాజు ఆనందపాలుడు గజనీ మహమ్మదుకు రాసిన ఉత్తరం చూడండి ..

"నీ రాజ్యం మీదికి తురుష్కులు దండెత్తి వచ్చారని, ఖురాసాన్ ప్రాంతాన్ని ఆక్రమించారని విన్నాను. నువ్వు కావాలంటే ఐదువేల గుర్రాలతో, పదివేల సైనికులతో, నూరు ఏనుగులతో నేను నీకు సాయంగా వస్తాను. లేదా, నీకిష్టమైతే అంతకు రెట్టింపు బలగంతో నా కుమారుడిని పంపుతాను. నేనీ ప్రతిపాదన చేస్తున్నది నీ అనుగ్రహం కోసం కాదు. నేను నిన్ను చిత్తుగా ఓడించి పరాభవించాను. నీపై నేను సాధించిన పైచేయి నాకు తప్ప మరొకరికి దక్కకూడదని నా కోరిక"

ఈ ఉత్తరం గురించి రాసింది ఎవరో కాదు, సాక్షాత్తూ గజనీ ఆస్థానంలోని చారిత్రకుడు, అల్ బెరూనీ. అంటే దీనర్థం గజనీ మన మీదికి దండెత్తిన మొత్తం 17 సార్లూ గెలవలేదన్న మాట. మరి మనకలా ఎందుకు చెబుతున్నారు? ఎవరా చెప్పేది?

ఇదీ, ఇలాంటి అనేకానేక పాత వాస్తవాలు కొత్తగా తెలుసుకోవాలంటే (తెలుసుకోవాలి కూడా) ఎం.వి.ఆర్.శాస్త్రి గారు రచించిన ఏది చరిత్ర? అనే పుస్తకం చదవాలి. ఇదే కాదు దాని తరవాత వచ్చిన ఇదీ చరిత్ర కూడా చదవాలి.

రచయిత శాస్త్రి గారు ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకుడు.

ఈ పుస్తకాల గురించి నాకు చెప్పిన త్రివిక్రమ్ కు కృతజ్ఞతలతో..
- ఏది చరిత్ర? గురించిన వికీపీడియా వ్యాసం చూడండి. ఆ వ్యాసాన్ని విస్తరించండి.

4 కామెంట్‌లు:

 1. గజనీ 17 సార్లు ఓడిపోయాడనే విన్నట్లు గుర్తు- ఎవరైనా పరీక్షలో వరసగా ఫైలయితే గజనీ పోల్చేవారు. నేను చదివినదేంటటే, గజనీ అన్ని సార్లు ఓడిపోలేదని, ఆయన దండెత్తినది గుళ్ళళ్ళోని సంపద కోసం కాని గెలవడం కోసం కాదనిన్నీ. ఆయన కొల్లగొట్టడం జనాలు మళ్ళీ సంపద పోగెయ్యడం, ఆయన మళ్ళీ కొల్లగొట్టడం ఒక వలయంగా జరిగిందని చదివా.

  రిప్లయితొలగించండి
 2. సత్యసాయి కొవ్వలి said...ఆయన కొల్లగొట్టడం జనాలు మళ్ళీ సంపద పోగెయ్యడం, ఆయన మళ్ళీ కొల్లగొట్టడం ఒక వలయంగా జరిగిందని చదివా.

  ప్రస్తుత గవర్నమెంట్ టైపు లో అన్న మాట..

  రిప్లయితొలగించండి
 3. శ్రీ శాస్త్రి గారి ఇతర పుస్తకాలు 1)కాశ్మీర్ కథ 2) 1857 మనం మరచిన మహా విప్లవం. 3)మన చదువులు

  రిప్లయితొలగించండి
 4. దండయాత్ర చేసింది ఘజనీనా ఘోరీనా? ఘోరీ పృధీరాజ్ సమాకాలీకులు. పైన శాస్త్రిగారి తర్కంలో నేనేమైనా గ్రహించనిది ఉందా? ఈ ఉత్తరం రాసిన తర్వాత కాలంలో దండయాత్రలు చేసిఉండవచ్చు కదా. ఈ ఉదాహరణ ఎంత వరకు వాస్తవమో తెలియదు కానీ. మన చరిత్రంతా పాశ్చాత్యులు వక్రీకరించారని గోలపెట్టే వర్గానికి వాళ్ల వక్రీకరణలు ఎందుకో గుర్తుకురావు. కొన్ని కొన్ని మనకివి ఖచ్చితంగా తెలుసనుకున్నవి కూడా తప్పులుగా తేలటం ఏంతో ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు