26, ఫిబ్రవరి 2007, సోమవారం

దొంగ సాధ్వులు, సాధువులు

అవీ-ఇవీ లో సిగ్గు! సిగ్గు!! జాబుకు నా స్పందన ఇది. తమకు మాయలున్నాయనీ, మంత్రాలున్నాయని, మహిమలున్నాయని, దేవుణ్ణో, దేవతననో చెప్పుకునే సాధ్వీమణులు, సాధువులు ఎక్కువైపోయారు. ఆధ్యాత్మికతను వ్యాపారం చేసేసిన క్షుద్రదేవుళ్ళు, దేవతలు వీళ్ళు. తమ ప్రభను, లేని ప్రతిభను వ్యాప్తి చేసుకోవడం కోసం పత్రికల్లోను, టీవీల్లోనూ అడ్వర్టైజుమెంట్లు ఇస్తూ ఉన్నారు కూడాను. వ్యాపారాభివృద్ధికి ప్రకటనలు ఓ ముఖ్యమార్గం కదా! ఇలాంటి దొంగ సన్నాసుల కాళ్ళు కడిగి ఆ నీళ్ళను నెత్తిన జల్లుకునే వారున్నంత కాలం అమ్మలూ బాబాలు విరాజిల్లుతూనే ఉంటారు. ఇలాగ జాతి గౌరవాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టే తెలివితక్కువ పనులు చేస్తూనే ఉంటారు. తమ మానాభిమానాలను ఎవరి కాళ్ళ దగ్గరైనా పరవొచ్చు, కాళ్ళ కిందైనా పరచొచ్చు.. ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ జాతి గౌరవ చిహ్నాలను ఇలా కించపరుస్తారా?

చాలా సందర్భాల్లో ప్రజల అమాయకత్వమే దొంగ సాధువులను నమ్మేందుకు కారణం. నమ్మకమే దీనికి పునాది. ఆ మాయలు, మహిమలూ లేవని తేలితే ఇలాంటివి జరగవు. దానికో మార్గముంది. మాయలూ మంత్రాలు వచ్చని చెప్పుకునే వారిని వాటిని నిరూపించమనాలి. అలా నిరూపించిన వాళ్ళకు ఆ మహిమలను ప్రాక్టీసు చేసుకునే లైసెన్సులు ఇవ్వాలి. ఎంబీబియ్యెస్ ప్యాసైన వాళ్ళకు సర్టిఫికేటు ఇచ్చి, ప్రాక్టీసుకు అనుమతి పత్రం ఇచ్చినట్టుగానన్నమాట. ప్రభుత్వం ఆ పని చెయ్యలేకపోవచ్చు. అలాంటపుడు మరో మార్గముంది..

ఈ దొంగ సాధ్వులను, సాధువులను గుంజక్కట్టేసి, చర్నాకోలతో.. "నాకు మాయలూ, మంత్రాలేమీ తెలీదు బాబోయ్, నేనో దొంగను" అనే దాకా, "ఈ గుబురు జుట్టు తీసేసి, గుండు చేయించుకుంటాను" అని అనేదాకా.. "మహిమలున్నాయన్నావు కదా, ఏదీ నిన్ను నీవు రక్షించుకో" అంటూ..

4 కామెంట్‌లు:

 1. ప్రజలలో మానసిక బలహీనతలను వీళ్లు సొమ్ము చేసుకుంటారు. మన దేశంలో ఎన్ని సార్లు ఎంత మంది మోసపోయినా ఈ బాబా పోస్టులకు కొరతే లేదు. నేను కూడా ఆలోచిస్తున్నాను ఈ జాబ్ లో జాయినవుతే ఎలా వుంటుందా అని. చెయ్యాల్సిందంతా ఎవ్వరికీ అర్ధం కాకుండా వేదాంతం మాట్లాడమే కదా..రెండు మూడు ట్రిక్కులు, ఒక నాలుగు TV Ads ఇవ్వాలి., బాగా జుత్తు షాంపు చేసుకుని ఒక పది నిమిషాలు ఎలక్ట్రిక్ షాక్ తీసుకుంటే జుత్తు కూడా వింతగా నిలబడుతుంది కదా..ఎవరు చెప్పొచ్చారు CM నాకు శిష్యుడిగా మారొచ్చు.బెంజి కారులోనూ తిరగొచ్చు.

  రిప్లయితొలగించండి
 2. మీడియా లో ఈ బాబాల వింత వేషాల గురించి చదివినప్పుడెల్లా నాకు విపరీతమైన నిస్పృహ ఆవహిస్తుంది.

  ఎంతో "చదువుకున్న వాడూ", ఈ దేశ యువతకు "ఆరాధ్య దైవం" అయిన అబ్దుల్ కలాం కూడా పుట్ట బాబా కాళ్ల వద్ద కూర్చుంటే ఇక మామూలు ప్రజల మాటేమిటి...

  రిప్లయితొలగించండి
 3. భావి తరాలకు ఈ పిచ్చి అంటకుండా వుంటే చాలు.

  రిప్లయితొలగించండి
 4. మనం మాత్రం వారికి శిష్యులుగా మారకపోతే చాలు.తక్కిన గొడవ మనకెందుకు ? మోసాలు అనేక రకాలు.సైన్సు మోసాలు కొన్ని. అధ్యాత్మిక మోసాలు కొన్ని. దేశాలు రాజ్యాంగాలు జాతీయ జెండాలు లౌకిక దృష్టిలో చాలా విలువైనవే గాని.ఆధ్యాత్మిక దృష్టిలో వాటికి విలువ లేదు. ఇది దృష్టిభేదం మాత్రమే. మనం ఊరికే ఆవేశపడడం అనవసరం.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు