15, ఫిబ్రవరి 2010, సోమవారం

శ్రీకృష్ణ కమిటీ - సరైన మధ్యవర్తి!

రెండు పక్షాల వారు తమలో తాము సంప్రదింపులు చేసుకుని ఒక అంగీకారానికి వచ్చే అవకాశం కోల్పోయిన ప్రస్తుత పరిస్థితిలో మూడో పార్టీ రంగ ప్రవేశం చేసి మధ్యవర్తిత్వానికి శ్రీకృష్ణ కమిటీని సిద్ధం చేసింది. ’ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమస్యపై సమాజంలోని వివిధ పార్టీలు, వర్గాలతో విస్తృత స్థాయి చర్చలు జరిపేందుకు గాను’ ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దాని పనులేమేంటో కూడా తేల్చింది. కమిటీ విధుల జాబితా మూడు భాగాలుగా ఉంది..

  1. విధులు: కమిటీ ఏమేం పనులు చెయ్యాలి అనేది మొదటి భాగం. ఇందులో నాలుగు పాయింట్లున్నాయి
    • రెండు ఉద్యమాల నేపథ్యంలో ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిని మదింపు వెయ్యడం
    • ఆంధ్రప్రదేశ్ అవతరణ నుండి ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు, వివిధ ప్రాంతాల అభివృద్ధిపై ఆ పరిణామాల ప్రభావాన్ని పరిశీలించడం
    • రాష్ట్రంలోని ప్రస్తుత పరిణామాలు సమాజంలోని వివిధ వర్గాలపై ఏవిధమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనే విషయాన్ని పరిశీలించడం
    • పై మూడు అంశాలను పరిశీలించడంలో తప్పనిసరిగా దృష్టిపెట్టాల్సిన కీలకమైన అంశాలను గుర్తించడం
  2. విధానాలు: పై మూడు పనులను ఎలా చెయ్యాలి అనేది ఈ భాగంలో చెప్పారు. ఇందులో రెండు పాయింట్లున్నాయి
    • పై అంశాలపై సమాజంలోని రాజకీయపార్టీల అభిప్రాయాలను తీసుకోవడం, పరిష్కారమార్గాలను వెతకడం, వాటి ప్రకారం ఒక కార్యాచరణ ప్రణాళికను తయారుచెయ్యడం
    • పై అంశాల విషయంలో సమాజంలోని అన్నివర్గాల ప్రజల, సంస్థల అభిప్రాయాలను సేకరించడం. (ఈ పనిలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి అనే అంశానికి ప్రాధాన్యతనివ్వాలి అనేది గమనించాల్సిన సంగతి)
  3. ఇక మూడోదానిలో ఒకటే పాయింటు.. పై పరిశీలనలను బట్టి, కమిటీ తన అభిప్రాయాలను, సలహాలు, సిఫార్సులను ఇవ్వాలి.
డిసెంబరు 9 నాటి ప్రకటనలో కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ, అది తెలంగాణ ఏర్పాటుకు సానుకూలమైన ప్రకటన అనేది నిజం. కానీ తరవాత 23 న చేసిన ప్రకటనతో కేంద్రం ఒకడుగు వెనక్కు వేసింది. ఫిబ్రవరి 2 న తెలంగాణ మాట ఎత్తకుండా, రాష్ట్ర భవిష్యత్తు విషయమై విస్తృతస్థాయి చర్చల కోసం కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఇంకాస్త వెనక్కు పోయింది. ఇప్పుడు కమిటీ విధివిధానాలను బైటపెట్టాక, పూర్తిగా వెనక్కు పోయి, 2009, డిసెంబరు 9 ప్రకటన ముందు ఉన్న పరిస్థితికి చేరుకుంది. ఆనాడు తనకు తానే వేసుకున్న సంకెళ్ళను విజయవంతంగా తొలగించుకుంది. ఇప్పుడు ఈ కమిటీ నివేదిక వచ్చాక, ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ వచ్చేసింది కేంద్రానికి. 
.............................................

అనుకున్నట్టుగానే ఉంది తె.వాదుల స్పందన. తెలంగాణ ఎలా ఏర్పాటు చెయ్యాలి అనే సంగతిని నిశ్చయించేందుకు కమిటీ వెయ్యాలిగానీ, తె.వాదాన్ని, సమైక్యవాదాన్నీ పరిశీలించేందుకు, విస్తృత సంప్రదింపుల కోసమూ వెయ్యడమేంటని అడుగుతున్నారు వారు. దిక్కుమాలిన కమిటీ అన్నారు, పదినెలలు ఇక్కడేం జేస్తది, గడ్డి పీకుద్దా అని అడిగారు.  రాజీనామాలు చెయ్యబోతున్నారు. ఇప్పుడు వాళ్ళముందున్న లక్ష్యం ఒక్కటే -శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను మార్పించడం, లేదా దాన్ని నిర్వీర్యపరచడం. దానికోసం మళ్ళీ ఉద్యమిస్తారు. వాళ్ళలో కొందరు దుస్సాహసాలు చేసే అవకాశమూ లేకపోలేదు.

తె.వాదులతో సమస్య ఒకటుంది.. అది –“రాష్ట్రాన్ని చీల్చడం, తెలంగాణ ఏర్పాటు చెయ్యడం అనేది నిశ్చయమైపోయిన సంగతి, అది చర్చనీయాంశం కాదు. ఇప్పుడు ఆలోచించాల్సింది..  విభజన ఎలా జరగాలనేదే” అనే భావన! అందుకే కమిటీ పనులజాబితా చూడగానే అడ్డగోలుగా మాట్టాడుతున్నారు.  అసలు రాష్ట్రాన్ని చీల్చడమనేది తమకు మాత్రమే సంబంధించిన సంగతని వీళ్ళు ఎలా అనుకుంటారో అర్థం కాదు. తెలంగాణ  ఇచ్చెయ్యమనే డిమాండంటే తెలంగాణను విడదీయడం కాదు, కోస్తా సీమలను పొమ్మనడం అనేది వీళ్ళు గుర్తించరు. ఈ సమస్య పరిష్కారంలో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల వాళ్ళకు కూడా భాగముందనే సంగతిని పట్టించుకోరు వీళ్ళు.  ఆయా ప్రాంతాలవాళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న ఇంగితం వీళ్ళకు లేదు. పైగా ఆ వివేకం చూపినవాళ్ళను బండబూతులు తిడతారు.

తె.వాదులతో ఇంకో సమస్యుంది.. ’కమిటీ పనుల జాబితా డిసెంబరు 9 నాటి నిర్ణయానికి అనుగుణంగానే జరగాలి, కానీ ఇప్పుడు ప్రకటించిన జాబితా అలా లేదు’ అని వాదిస్తున్నారు. డిసెంబరు 9 న ప్రకటన చేసిన ఆ కేంద్రమే 23 న మరో ప్రకటన చేసిందన్న సంగతిని వీళ్ళు మర్చిపోతారు.

అన్నిటినీ మించి, తె.వాదులకు అసలు సమస్య ఒకటుంది -జాబితా లోని రెండో పాయింటుతో వచ్చిన సమస్య అది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని పరిశీలించాలని ఆ అంశం చెబుతోంది.  కమిటీ పనిలోకి దిగి, వివిధ ప్రాంతాల్లో అభివృద్ధిని పరిశిలించడం మొదలెడితే అసలు కథంతా బైటికొస్తది. చిదంబరాలకు, సోనియాలకు, ఢిల్లీలో కూచ్చున్న ఇతర సూత్రధారులకు, సత్రకాయలకూ అసలు సంగతులు, అధికారికంగా , తెలిసిపోతాయ్. ఎంచేతంటే, అంకెలు అబద్ధాలు చెప్పవు, మనుషుల్లాగా. ఎంపీ కావడానికి ముందో మాట, తరవాతో మాటా, మంత్రి కావడానికి ముందో మాట, అయ్యాకింకో మాటా.. ఇలా ఉండదు గదా అంకెల్తో వ్యవహారం.   దీనికితోడు,  ఆత్మగౌరవం, స్వపరిపాలన  అంటూ సాగిపోయే తె.వాదుల సోదివాదనలు కమిటీ ముందు సాగవు. ఇన్నాళ్ళూ వెనకబడ్డాం వెనకబడ్డాం అంటూ వేస్తున్న దొంగ నాటకాలు కమిటీ ముందు చెల్లవు! 

వాళ్ళకు ఈ సమస్యలున్నాయిగానీ,  'ఒక మధ్యవర్తి ముందు  మన తెలంగాణ కష్టాలను సరిగ్గా ఎందుకు చెప్పలేకపోయారు, ఇన్నాళ్ళూ మీరు మాకు చెబుతున్నదేగా ' అని తెలంగాణ సామాన్యులు అడుగుతారనే భయం లేదు వీళ్ళకి. ఎందుకంటే, వీళ్ళ దగ్గర  ఒక సమాధానం తయారుగా ఉంటది.. 'ఆంద్రోళ్ళందరూ కలిసి కమిటీని సభ్యులకు పైరవీలు చేసి, తమకు కావలసినట్టు నివేదిక ఇప్పించుకుని తెలంగాణ రాకుండా చేసారు' అని చెప్పేస్తారు. ఇప్పుడు చెప్పటంలా.. 'సమైక్యవాదుల కుట్ర వల్లే ఈ కమిటీ ఏర్పడింది, వాళ్ళే  కమిటీ విధివిధానాలను తయారుచేసారు' అంటూ? (అసలీ విధివిధానాలను తయారుచేసింది కావూరి సాంబశివరావని చెప్పాడొహ జోకరు! )

తమ సోమరితనాన్ని, తమ చవటాయిత్వాన్ని, తమ స్వార్థాన్ని, తమ నిష్క్రియత్వాన్నీ 'ఆంద్రోళ్ళ' చాటున దాచిపెట్టడం తెలంగాణ రాజకీయ నాయకులకు అలవాటైపోయింది. తామూ, తమ సహచరులూ శాసనసభ్యులై, మంత్రులై, ముఖ్యమంత్రులై , అధికారోన్మత్తులై సకల భోగాలూ అనుభవిస్తూ, చెయ్యాల్సిన పనులు చెయ్యకుండా.. ఆ పనులు కాకపోవడానికి కారణం 'ఆంద్రోళ్ళే' అని తర్జని చూపిస్తారు. రేపు ఈ కమిటీ నివేదికలో ఏమాత్రం తేడా జరిగినా వాళ్ళు ఇదే పాట పాడతారు.

---------------------------
ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం.. కమిటీ పనులను నిశ్చయించడంలో కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరించింది. నిష్పక్షపాతులం, తటస్థులం అని చెప్పుకుంటూ తె.వాదపు కొమ్ముకాస్తూ, మాయలమారి వంకరమాటలు మాట్టాడే వక్రవాదుల కంటే, నిష్పాక్షికంగా వార్తలనందించడం మానేసి తె.వాదాన్ని వినిపించడంలో తలమునకలుగా ఉన్న టీవీ చానెళ్ళూ పత్రికల కంటే - కేంద్రం చాలా చాలా నయం. రెండు వర్గాలు తగువులాడుకుంటున్నపుడు ఒక మధ్యవర్తి ఏమేం పనులు చెయ్యాలని భావిస్తామో ఆ పనులనే కమిటీకి అప్పగించింది.

రెండు వాదాలకూ సమానమైన అవకాశాలను కల్పించింది కేంద్రం! ఇన్నాళ్ళూ కోస్తా, సీమల వాసలు తమ వాదాన్ని ఎక్కడా సరిగ్గా వినిపించిన జాడలేదు. నిజానికి వాళ్ళకు ఆ అవకాశాలు రాలేదు. టీవీలు, పత్రికలు అన్నీ కూడా తె.వాదంలో మునకలేస్తున్నాయి. ఇప్పుడు ఈ కమిటీ రూపంలో తమ గొంతు వినిపించే అవకాశం సమైక్యవాదులకూ వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నిజాల్ని కమిటీ ద్వారా దేశప్రజలకు తెలియజెప్పాలి. ఆ సమయం వచ్చింది.

తె.వాద విశ్లేషకుల దొంగ నిష్పాక్షికత గురించి నా గత టపాల్లో కొంత రాసాను. ఇప్పుడు ఇంకో సంగతి.. ఇది రాజకీయ విశ్లేషకుడు ఘంటా చక్రపాణి గారి ’నిష్పాక్షిక ద్వంద్వ నీతి’ గురించిన ఒక ఘటన. హెచ్చెమ్‍టీవీ వాళ్ళు నెల్లూరులో జరిపిన దశ-దిశ కార్యక్రమంలో ఆయనో గొప్ప నిష్పాక్షిక వ్యాఖ్య చేసాడు. తెలంగాణ ఉద్యమం గురించి మాట్టాడుతూ... ’ఎవరో రెచ్చగొట్టినంత మాత్రాన ప్రజా ఉద్యమాలు రావు. ప్రజల్లో సహజంగా ఉప్పొంగిన చైతన్యమే తెలంగాణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది.’ అని తెలంగాణ ఉద్యమాన్ని ఘనంగా కీర్తించాడు. సరే, బానే ఉంది, తమను తాము కీర్తించుకోవచ్చు. అది నిజమేనని కూడా అనుకుందాం. మరి, కోస్తా, సీమల్లో వచ్చిన ఉద్యమం గురించి చెప్పే సమయాన అదే నాలుక ఎన్నెన్ని వంకర్లు తిరిగిందో మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ’కోస్తా సీమల్లో జరుగుతున్న ఉద్యమం కేవలం నాయకులు చేస్తున్నదేగానీ ప్రజల్లోంచి వచ్చినది కాదు’ అంటూ ఆయన నిష్పాక్షిక తెలంగాణవాద టీవీల్లో చెబుతూండగా విన్నాం. వీరి ఉద్యమమేమో సహజ చైతన్యం కారణంగా వచ్చినదంట, వారిది నాయకులు రెచ్చగొడితే వచ్చినదంట! ఇదీ చక్రపాణి గారి వక్రవాణి! 
అన్నట్టు, ఈయన అదేదో యూనివర్సిటీలో ప్రొఫెసరంట! ఈ బాపతు మేతావులు  రేపు శ్రీకృష్ణ కమిటీ ముందు  కూడా ఇలాటి వంకరమాటల్నే వినిపించబోతారు! కోస్తా సీమల ప్రొఫెసర్లూ..  మీరేమీ వీళ్ళలాగా వంకరమాటలు చెప్పనక్కర్లేదు. ఉన్నదున్నట్టు చెప్పేస్తే చాలు, వీళ్ళ బండారాలు కమిటీ ముందు బైటపడడానికి.

7 కామెంట్‌లు:

  1. టీవీలు, పత్రికలు అన్నీ కూడా తె.వాదంలో మునకలేస్తున్నాయి.
    ఇది ముమ్మాటికీ నిజం.

    రిప్లయితొలగించండి
  2. అంకెలు తెలవాల్సిందే అందరికీ, కానీ, తెలంగాణ ప్రాంత గణాంకాలు చూపేటప్పుదు హైదరబాదు లో ఖర్చు చేసినవి మాత్రం సెపరేట్ గా చూపాలి.

    అలాగే, జలయజ్ఞం విషయం లో, ప్రాజెక్టు విలువ ఎంతా.. ఇప్పటి వరకు ఎంత ఖర్చు చెసారు... ఎంత శాతం పనులు పూర్తి అయ్యాయొ సవివరంగ చెప్పాలి

    ఫణి

    రిప్లయితొలగించండి
  3. హీ ఎం టివి దశ-దిశ తిరుపతిలో జరిగినప్పుడు ఫ్రొఫసర్ తిమ్మారెడ్డి, విశాఖపత్నంలో కొందరు యునివెర్సిటీ ప్రొఫసర్లు మంచి విస్లెషనలు చేసారు. టివి వారికి సరిగా కవరేజి ఇవ్వలేదు

    రిప్లయితొలగించండి
  4. చదువరిగారు,
    సీమాంధ్ర నాయకులు తెలివైనవాళ్లు, సమర్ధులు (మంచివారని కాదు). మా తెలంగాణ నాయకులు తెలివిలేని అసమ్మర్ధులు. డిశంబర్ 9 ప్రకటన మరునాడు చంద్రబాబు, జగన్ నాయకత్వం లో ఒకే రోజు 150 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినారు.అసెంబ్లిలో గౌరవ స్పీకర్ రాజీనామాల వేలం పాట అతి సంతోషంగా పాడారు.
    అదే డిశంబర్ 23 తదనంతరం తెలంగాణ జనమంతా కోరుతున్న తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండ ఇదే చంద్రబాబు, జగన్ చూస్తున్నారు.
    సీమాంధ్ర నాయకత్వం ఉన్నంతవరకు మా నాయకులేమి చేయలేరు వారి ఊడిగం తప్ప. చివరకు భార్యలవద్దకు పోవద్దన్న మారుమాట్లాడకుంట వింటారు.
    శ్రీక్రిష్ణ కమిటి ప్రభుత్వ లెక్కల మీద ఆధారపడుతుంది. ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవు. ఇచ్చేవి దొంగలెక్కలు. ఇచ్చేది ఎవరొ చెప్పాలా? ప్రభుత్వ లెక్కల విశ్వసనీయత ఎంతొ ప్రభుత్వం తొ పనిచేసే వారికి తెలుస్తుంది. అభివృద్ధి కొలమానాలకు ప్రాతిపదిక ఎంటొ తెలియదు. హైద్రాబాద్ లొ ఖర్చు పెట్టింది కూడా తెలంగాణలొ జమకడుతారు. సీమాంధ్రకు ఖర్చు పెట్టినది సీమాంధ్రులకె చెందొచ్చు. కాని తెలంగాణ కు వచ్చిన నిధులలో సీమాంధ్రులు కూడా లబ్ధిదారులు.
    విచిత్రమైన విషయం ఒకసారి టివి లొ దగ్గుపాటి సినిమా పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమలు, ఫార్మసిటికల్ పరిశ్రమలు, _________ అన్ని తెలంగాణలోనె ఉన్నాయని అన్నారు.
    ఇంతకంటె అపహాస్యం ఏముంటుంది.
    ఎక్కడ అభివృద్ధి అయినదన్నదే కాదు, ఎవరు అభివృద్ధి అయినారన్నది కూడా తేల్చాలి. ఇక్కడే అసలు సంగతి దాగి ఉన్నది.
    లెక్కల తమాషా కూడా చూద్దాం.

    రిప్లయితొలగించండి
  5. సమతలం: అసమర్ధులా.. భలే! యాపారాలు చేసి కోట్లకుకోట్లు సంపాదిస్తున్నవాళ్ళు అసమర్ధులా? ఎన్నికల్లో వోట్ల కోసం కోట్లు పారెయ్యగలిగినవాళ్ళు అసమర్ధులా? ఇంట్లోనే బాంబులు చేయించగలిగినవాళ్ళు అసమర్ధులా? ఇక్కడే కాదు ఇతర దేశాల్లో కూడా యాపారాలు చెయ్యగలిగేవాళ్ళు అసమర్ధులా? (ఒక పెద్దాయన ఈ మధ్య గుజరాతులో ఓడలో ఓడరేవులో కొనిపారేసాడంట.. కర్ణాకర్ణిగా విన్నాం) వీళ్ళా అసమర్ధులు? తన పనులు చేసుకోవడానికి కడు సమర్ధుడైనవాడు మన పనులకాడి కొచ్చేసరికి అసమర్ధుడెలా అయ్యాడు? ఎందుకు మీరీ నాయకులను ఇలా ఎనకేసుకొస్తున్నారు? అయితే గియితే వాళ్ళు పాక్షిక అసమర్ధులు కావాలి, సెలెక్టివ్ మయోపియాలాగా!

    తెదేపాకు బాబు నాయకుడు. బానే ఉంది. కానీ, బాబు ఒక్కడు, ఏకాకి!! 39 మంది సభ్యులు, వందలమంది సభ్యులు కానివారు, వేలమంది 'అసభ్యులు' -వీళ్ళంతా ఒక వైపు - తెలంగాణ వైపు - ఉండి కూడా, ఒక్ఖ బాబును చూసి భయపడిపోతున్నారా? అందరూ కట్టుగా ఒకమాట మీద ఉన్నాగానీ బాబు వీళ్ళ నోళ్ళు మూయిస్తున్నాడా? హవ్వ! ఎవణ్ణి నమ్మించడానికి ఈ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నార్సార్? ఎందుకు మిమ్మల్ని మీరు ఇలా మోసం చేసేసుకుంటారు? మీ నాయకులు ఎంత చవట సన్నాసులో, ఎంతటి మోసకారులో చూస్తూ కూడా అవతలి నాయకులను అంటే మీకేమొస్తది? అవతలోడు గొప్ప మొనగాడని నా ఉద్దేశమేమీ కాదు. అందరూ ఒక తానులోని ముక్కలే. కానీ మనోడు పని చెయ్యనపుడు ఆణ్ణే అడగాలి అవతలోణ్ణి అంటే ఒరిగేదేముంది?

    సరే తెదేపా సంగతి పక్కనుంచండి. కాంగ్రెసనగానే జగను గుర్తుకొచ్చాడు మీకు. కాంగీయులకు నాయకుడు జగనా? మీకు సోనియా, డీయెస్, మొయిలీ వగైరాలు కనబళ్ళేదా? జైపాల్ రెడ్డికి, మధు యాస్కీకి కూడా జగనే నాయకుడా? కేకేకి, వీహెచ్చికి కూడా జగనేనా? జానా, దామోదరరెడ్డి, చెరుకు ముత్యంరెడ్డిలకు కూడా జగనే నాయకుడా? వంకలు చెప్పడానికి కూడా ఒక పద్ధతి ఉండాలి మాస్టారూ! అవతలోణ్ణి తిట్టడమే ధ్యేయంగా పెట్టుకుంటే సరే, తిట్టండి. కానీ, ఈ నాయకులు ఏ రకం మనుషులో మర్చిపోయి, కేవలం అసమర్ధులు మాత్రమేనంటూ వాళ్ళను ఎనకేసుకు రావడం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. కావాలని వ్యూహాత్మకంగా అలా మాట్టాడుతున్నారా? లేక నిజంగానే మీ నాయకులు పాక్షిక అసమర్ధులనే భావన మీకుందా?

    ఇది మొదటి సగానికి నా సమాధానం, మీ బ్లాగులో ఇచ్చిన సమాధానమే! అదే ప్రశ్న ఇక్కడా కనబడేసరికి మళ్ళీ రాసాను. ఇహపోతే మిగతా సగానికి..

    "శ్రీక్రిష్ణ కమిటి ప్రభుత్వ లెక్కల మీద ఆధారపడుతుంది. ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవు. ఇచ్చేవి దొంగలెక్కలు. ఇచ్చేది ఎవరొ చెప్పాలా? ప్రభుత్వ లెక్కల విశ్వసనీయత ఎంతొ ప్రభుత్వం తొ పనిచేసే వారికి తెలుస్తుంది." - ఎవర్ని నమ్ముతారు మీరు? ఏ లెక్కల్ని నమ్ముతారు? కేసీయారూ చెప్పే లెక్కలనా? హై.లో 2 లక్షల మంది కోస్తా సీమల జనం ఉన్నారంట. దీన్ని నమ్ముతారా?

    "అభివృద్ధి కొలమానాలకు ప్రాతిపదిక ఎంటొ తెలియదు. హైద్రాబాద్ లొ ఖర్చు పెట్టింది కూడా తెలంగాణలొ జమకడుతారు. సీమాంధ్రకు ఖర్చు పెట్టినది సీమాంధ్రులకె చెందొచ్చు. కాని తెలంగాణ కు వచ్చిన నిధులలో సీమాంధ్రులు కూడా లబ్ధిదారులు." - ఏఁ ఈ ముక్క హై. మాదే అని దబాయించేటపుడు గుర్తుకు రాదే? మీకనుకూలంగా ఉన్నపుడు హై.ని కలుపుకుంటారు, లేనపుడు తీసేస్తారా? మీ నాయకులు తమ కుటిలనీతిని మీమీద ప్రయోగిస్తే మీరు మామీద ప్రయోగిస్తున్నారా?

    "ఎక్కడ అభివృద్ధి అయినదన్నదే కాదు, ఎవరు అభివృద్ధి అయినారన్నది కూడా తేల్చాలి. ఇక్కడే అసలు సంగతి దాగి ఉన్నది. లెక్కల తమాషా కూడా చూద్దాం." ఎలా తేలుస్తారు? ఏ లెక్కలపై ఆధారపడతారు, ఎవరి లెక్కలపై ఆధారపడతారు? ఏదీ చెప్పండి, లెక్కలేం చెబుతున్నాయో చూద్దాం.

    రిప్లయితొలగించండి
  6. సీమాంధ్ర నాయకులు గజదొంగలు, తెలంగాణ నాయకులు (టీఅరెస్ నాయకులు కూడా)దొంగలు. అనుమానం లేదు.
    తెలంగాణ ఉద్యమానికి ఊపిరి రాజకీయేతరులు. ఈ ఉద్యమాన్ని తెలంగాణ రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటున్నారు. సీమాంధ్ర నాయకులు(2004లొ కాంగ్రెస్, 2009లొ టిడిపి) ఉపయోగించుకున్నారు. ఏ రాజకీయ పార్టీని, నాయకున్ని వెనకేసుకరావడం లేదు. కాంగ్రెస్, టిడిపి, టీఅరెస్ లోని నాయకులలో మెజారిటికి తెలంగాణ రావటం కంటె వారి రాజకీయ భవిషత్తు ముఖ్యం. సీమాంధ్ర వారితొ వ్యాపార భాగస్వామ్యాలున్న కొందరు తెలంగాణ నాయకులకు తెలంగాణ రావటం ఇష్టం లేదు.
    సీమాంధ్ర నాయకులనే మేము నిందించడం లేదు.
    గణాంకాల సంగతి తర్వాత చూద్దాం.

    రిప్లయితొలగించండి
  7. చదువరి గారూ !
    మీకు శ్రీ వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో...

    - శిరాకదంబం

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు