19, జనవరి 2009, సోమవారం

హద్దులేని అధికార పక్షం - అడ్డలేని ప్రతిపక్షం

ఐదేళ్ళుగా ఈ అధికారపక్షం ఆంధ్రప్రదేశ్‌ను ఎన్ని రకాలుగా దోచుకోవచ్చో అన్ని రకాలుగానూ దోచుకుంటోంది. కుంభకోణాల యజ్ఞాలు చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం వారిని అడ్డుకోలేకపోతోంది. ప్రతిపక్షం ఎలా వ్యవహరిస్తే ప్రభుత్వం తప్పులను బయటపెట్టవచ్చో, ఒకప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షానికి తెలిసే ఉండాలి. కానీ ఈ ప్రతిపక్షం అలా తెలిసినట్టుగా వ్యవహరించడంలేదు.


ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని తప్పులను ఎత్తి చూపినా.. ఏఁ మీరు చెయ్యలేదా, మీరు చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్పూనా? అనేదే ఈ ఐదేళ్ళుగా అధికార పక్షపు సర్వసిద్ధ సమాధానం. ఇవ్వాళ్టికి కూడా అదే సమాధానం! మరి ప్రధాన ప్రతిపక్షం ఏంచేస్తోంది.. "మేమలా చెయ్యలేదు, చేసిన సందర్భం చూపించండి" అంటూ సవాలు చేసి, సదరు సందర్భాల్లో తాము ఎంత చక్కగా వ్యవహరించామో దృష్టాంతాలతో వివరించిందా? లేదు.

శాసనసభలో జరిగిన చర్చల్లో అర్థవంతంగా, సమర్థవంతంగా మాట్లాడ్డం ఎన్నిసార్లు జరిగింది? ఎంతసేపూ  అల్లరి చెయ్యడం, గొడవలుపట్టం, పోట్టాడుకోడం తప్పించి సజావుగా సమస్యలపై మాట్టాడింది చాలా తక్కువ. ఆ రకంగా గొడవలు చేస్తూ, అధికారపక్షపు వ్యూహంలో చిక్కుకుపోయారు. ఆ అల్లరిలో అధికార పక్షం అసలు సమస్యల నుంచి తప్పించుకోగలిగింది. రాత్రికి రాత్రే ప్రాజెక్టు అంచనాలను 400 కోట్లు పెంచేసిన కుంభకోణం ఎల్లంపల్లి ప్రాజెక్టులో జరిగింది. పత్రికలు కోడై కూసాయి. దీనిపై శాసనసభలో జరిగిన చర్చ తెలుగుదేశం అసమర్థతకు ఒక ఉదాహరణ. రెండు పక్షాలూ ఒకదాని మీద ఒకటి దుమ్మెత్తి పోసుకున్నాయి, అధికార పక్షం ప్రతిపక్షాన్ని తేలిగ్గా తోసేసి బయటపడింది. ఈ చర్చ సందర్భంగానే సెల్ఫ్‌గోలు చేసుకున్నారని కూడా అధికారపక్షం చేత అనిపించుకున్నాడు ప్రతిపక్ష నేత.

హై. రింగురోడ్డు మీద జరిగిన చర్చలో దేవేందర్ గౌడ్ చక్కగా మాట్లాడుతూ అధికారపక్షపు తప్పులను బయటపెడుతూ ఉండగా అధికారపక్ష సభ్యులు ఆయన మీద ఏవో వ్యాఖ్యలు చేసారు. అంతే.. అసలు విషయం పక్కకు పోయింది. కులాల మీదకి చర్చ మళ్ళిపోయింది. బీసీలను అణగదొక్కుతున్నారని గౌడ్ ఆరోపించడం, అవతలి వాళ్ళు ఎదురు ఆరోపించడం,.. అలా అది ముదిరి, పెద్ద గొడవై, సభ వాయిదా పడింది. చర్చ చంకనాకిపోయింది. సమర్థమైన ప్రతిపక్షం చేసే పనేనా ఇది?

ఓబులాపురం గనుల కుంభకోణాలు చూసొస్తామంటూ వెళ్ళి, తెలివితక్కువగా మాట్టాడి, వెనక్కొచ్చిన సంగతి గుర్తుకు తెచ్చుకోవాలి మనం. అసలా పర్యటనలో ఏం సాధించారు? హెలికాప్టరులో "గాలి" తిరుగుళ్ళు తిరిగొచ్చారంతే!  కోర్టు మాత్రం  హై.లోనే ఉండి,  ఫైళ్ళు చూసి, చెప్పింది -తేడాలున్నాయని.

వోక్సువాగన్/వశిష్టవాహన్, రింగురోడ్డు, గురుకుల ట్రస్టు, సొంత సిమెంటు, ఉక్కు కర్మాగారాలు, భూకుంభకోణాలు (భూ కుంభకోణాన్ని ఉత్త "కుంభకోణం" అని చెప్పేసి ఊరుకోలేం.. పృథ్వీ భంజనమది), జలయజ్ఞం పేరిట జరిగిన అవినీతి మహాజాతరలూ, డిపెప్ దారుణం,.. ఎన్నని! ఇన్ని ఘోరాల్లోను ఒక్కదానిలోనైనా ఈ ప్రతిపక్షం అధికారపక్షాన్ని  తప్పుకు కట్టెయ్యగలిగిందా?

కాందిశీకుల భూమి అంటూ వందల కోట్ల విలువ చేసే భూములను అయినవాళ్ళకు అప్పనంగా అప్పగించినపుడు ఏం చేసింది ప్రతిపక్షం? దశాబ్దాలుగా కుటుంబ ఆస్తిగా అనుభవిస్తూ ఉన్న ప్రభుత్వ భూమిని ఇప్పుడే కళ్ళు తెరిచి చూసినట్టుగా, తేలు కుట్టిన దొంగలా అప్పగించినపుడు కూడా ఏమీ దద్దరిల్లలేదు.

ఏం దిగుల్లేదు, ఎరువులు ఉన్నాయి, లేవని తప్పుడు కథలు చెబుతున్నారన్నారు. తరవాత, కేంద్రంపై వత్తిడి తెస్తున్నామన్నారు. ఆపైన, మనకు రావాల్సిన ఓడలను హైజాకు చేసారు అంచేతే ఎరువులు సరిపడా లేవన్నారు. ఇన్ని రకాలుగా మాటలు మారుస్తూ ఉంటే  ప్రతిపక్షం ఎలా వ్యవహరించాలి?  సహజ ప్రతిస్పందనగా రైతుల్లో కనిపించిన కోపం, ప్రతిపక్షం చూపించిందా? ఎరువుల కోసం, కరెంటు కోసం రైతులు చేపట్టిన ఉద్యమాల స్థాయిలో ప్రతిపక్షం ఉద్యమించిందా?

భూమ్మీదా భూగర్భంలోనూ ఈ ప్రభుత్వం చేస్తున్నన్ని అవినీతి కృత్యాలు మునుపెన్నడూ ఎరగనివి అంటూ రామచంద్ర సమాల్ చెప్పినపుడు ఏం చేసారు ప్రతిపక్ష నాయకులు?

బినామీ పేర్లతో కంపెనీలు పెట్టబోయి, సంగతి బైటపడినపుడు సదరు మంత్రి నన్ను నమ్ముకున్నవాళ్ళకు ఓ ఆధారం కల్పించబోవడం తప్పా అని సిగ్గులేకుండా సమర్థించుకున్నపుడు కూడా ఏ ఉత్పాతమూ జరగలేదు.

అనంతపురంలో రెండు లక్షల కోట్ల పెట్టుబడుల పథకం కథ ఏమైందో, ఫ్యాబ్ సిటీ ఎందుకు వెనక్కి పోయిందో ఈ ప్రతిపక్షం పట్టించుకుందా?

మొన్నటికి మొన్న ఒక మంత్రి లంచాలు మేసాడని మరొక మంత్రి ఆరోపించి, నిరూపిస్తానని సవాలు కూడా చేస్తే ముఖ్యమంత్రి వాళ్ళిద్దరికీ సర్దుబాటు చేసాడు. ఆ మీదట ఆరోపణల్ని చాప కిందకు తోసేసారు. ఇదేమైనా వాళ్ళ ఇంటి సమస్యా? వాళ్ళ పార్టీ సమస్యా? ఏడుకోట్ల రూపాయల ప్రజల సొమ్ము అది. ఆయినా ఏ ఉద్యమాలూ రాలేదు.

పరిపాలనలో జరుగుతున్న అనేక తప్పులను ఎత్తిచూపే పనిని ప్రతిపక్షం సమర్థంగా చెయ్యలేదు. రాజకీయంగా సవాలు విసిరే పనులను మాత్రం చేసిందంతే - అదీ గత సంవత్సరంగానే!
-----------------------------

ప్రతిపక్షమంటే ప్రభుత్వం చేసే తప్పులను సమర్థవంతంగా ఎత్తిచూపి దాన్ని కట్టడిలో పెట్టగలగాలి. కట్టడిలో పెట్టలేకపోతే కనీసం ముట్టడిలోనైనా పెట్టగలగాలి. తప్పులను ఎత్తి చూపడమంటే శాసనసభను స్థంభింపజెయ్యడం, రాజీనామాలు చెయ్యాలని ప్రకటనలివ్వడం.. ఇవి మాత్రమే  కాదు. తార్కికంగా మాట్లాడి, అవసరమైన ఆధారాలతో చర్చించాలి. ప్రజలకు చెప్పాలి. అధికారపక్షం ప్రతిపక్షాన్ని ఎద్దేవా చేసుకుంటూ, వాళ్ళంటే కించిత్తు కూడా భయపడకుండా,  ప్రజల పట్ల వీసమెత్తు పూచీ లేకుండా, వ్యవస్థల పట్ల పూచికపుల్లంత గౌరవం లేకుండా, యథేచ్ఛగా తప్పులు చేసుకుంటూ పోతూంటే, సాధారణ ప్రజల్లాగా (ప్రేక్షకుల్లాగా) చూస్తూండిపోయిందీ ప్రతిపక్షం. పత్రికలే సరైన ప్రతిపక్షంగా వ్యవహరించాయి.

ఈ అధికార పక్షం అధికారంలో ఉండకూడని పార్టీ ! అవినీతిలో వాళ్ళ సామర్థ్యం అనుపమానం, అనితర సాధ్యం. వాళ్ళ తప్పులను బయట పెట్టాలంటే చురుకైన ప్రతిపక్షం ఉండాలి.

14 కామెంట్‌లు:

  1. మీరన్నది కొంత వరకు నిజం.. కాని,ఎక్కొడో రైల్ ప్రమాదం జరిగితే,రాజీనామ చేసిన లాల్ బహుదుర్ శాస్త్రి ఎక్కడా? అధికారం కోసం వేయ్యి సార్లు ఐన వూపించు కోవడానికి సిద్ధం అనే ఈ ప్రభుత్వం ఎక్కడ? .. అలాగే, డబ్బు లొస్తయంటే, వేయ్యిhttp://lekhini.org/ సర్లు సిగ్గు లేకుండ తుడుచుకొవడానికి సిద్దం!! ఎక్కువ మాట్లడితే, వ్యక్తిగత దూషణకి వెనుకాడరు..

    చూచరుగ, భిం రాం సంఘటనలో ,ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్న, 'రాజ ' వారి ప్రభుత్వానికి చీమ కుట్టి నట్లు కూడా లేదు..ముంబై దాడుల్లో తీవ్రవాదులకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసన తెలీచెస్తుంటే , మజ్లిస్ ని వురికొల్పి వినోదిచడం ఈ ప్రభుత్వం దివళాకోరు తనానికి పరాకష్ట!!
    ఇంకా ఎక్కువ మాట్లాడితే, వెకిలు నవ్వులు హేళనలు ...
    గత ప్రభుత్వాలు కొంతలో కొంతైన ప్రతి పక్షాల విమర్సలకు విలువిచ్చేవి .. ఈ ప్రభుత్వం అన్నింటికి అతీతం .. ఎంతైన దేవుడి పాలన కధ.. సాక్షులని రాత్రికి రాత్రి చంప గలరు.. ' ధన ' యజ్ఞం చేయ గలరు.. అన్ని రకాల అవినీతిని , పత్రిక " సాక్షి " గ సమర్ధించు కొ గలరు..

    దీనికి పరిష్కారం, ప్రజలే!! వొటేసి , 5 సంత్సరాలు, అంతా ప్రతిపక్షాల మీద భారం మోప కుండా, తప్పు చేసిన ప్రతిసారి ప్రజలు కుడా ప్రభుత్వాన్ని నిలెయ్యలి ..అప్పుడే మార్పు సాధ్యం..

    రిప్లయితొలగించండి
  2. చురుకైన ప్రతిపక్షం కాదేమో కావాల్సింది . నిజాయితీ ఉన్న , నిఖార్సయిన నాయకులు . పక్షం ఏదయినా ఉన్నది అవినీతి నాయకులయినప్పుడు సభలో ఏ పక్క కూచొంటే ఏం లాభం ? ప్రతిపక్షం అడ్డుకట్ట వేయలేక పోడానికి కారణం అందరికీ తెలిసిందే, అధికార పక్షం చెప్తున్నదే .

    వ్యాఖ్య నాది , పేరు మరొకరిది :( . ఇంతకుముందు login అయిన వారి పేరుతో వస్తుంది కాబోలు :). ఆ తొలగించిన వ్యాఖ్యలలో మెయిలు కూడా తొలగించగలరు .

    రిప్లయితొలగించండి
  3. ఇప్పుడు రాజకీయ నాయకులేతప్ప "నాయకులు" లేరు. వీళ్ళు అధికారపక్షంలో ఉంటే ఎంత! ప్రతిపక్షంలో ఉంటే ఎంత? బుద్దులు మాత్రం మారతాయా?

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. కాంగ్రెస్ వాళ్ళ అవినీతికి అడ్డుతగిలితే, తీగ లాగి డొంకని లేపినట్టు గతంలో తెలుగు దేశం పాలనలో జరిగిన అవినీతినంతా కాంగ్రెస్ వాళ్ళు బయట పెడతారు. అందుకే అవినీతిని అడ్డుకోవడం తెలుగు దేశం పార్టీకి ఇష్టం లేదు. పైన పైన అవినీతిని వ్యతిరేకిస్తున్నట్టు నటిస్తున్నారు తెలుగు దేశం వాళ్ళు.

    రిప్లయితొలగించండి
  6. Too Good. నా మనసులో లో Raw format లో గందరగోళం గా పడున్న దాన్ని మీరు Refine చేసి చెప్పారు.) అబ్రకదబ్ర గారి బ్లాగు లోనూ నేను చెప్పాలని ప్రయత్నించింది ఇదే. కాకపోతే బొత్స విషయంలో నా వ్యాఖ్య కొంత వివాదాస్పదమైంది. నేను ధర్నాలు, మైకులు విరగ్గొట్టాలని కాదుగానీ ప్రజల్లో ఉన్న anger ని ప్రభుత్వానికి అర్ధమయ్యే రీతిలో చెప్తే బాగుండేదని చెప్పా. కాకపోతే రాజశేఖరుడి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మౌళిక సిద్ధాంతానికి కట్టుబడి ఉంది. అదేంటంటే, అందులోని ప్రతీవాడు.."నాకు సిగ్గులేదు, ఎదుటివాడు వెధవ అని మనసా, వాచా,కర్మణా భావించాలి".

    రిప్లయితొలగించండి
  7. నమస్కారం మీ అందరి అభిప్రాయాలూ చదివాను
    మీరు చెప్పిన అన్ని విషయాలతో నేను ఏకిభవిస్తున్నాను ఇక్కడ ప్రతిపక్షం సరిగా వ్యవహరించాలేకపాయిండ ,విఫలమయినదా అంటే విఫలం అని చెప్పలేము ఎందుకంటే ఎ ప్రభుత్వ్యం మొదటి నుంచి ఎదురు దడి అన్నిటికన్నా శ్రేయస్కరం అని భావిస్తూ వస్తుంది అంటే దొంగే దొంగ దొంగ అని అరవడం ఆన్నమాట ప్రతిపక్షం తెలుగు దేశం ఒక్కటే కాదు మిగత అన్ని పక్షలని కూడా అదే ఎదురు దాడి తో నేట్టుకోస్తుడి
    మంది బలం ఉన్నప్పుడు ఏదయినా చెల్లు బాటు అవుతున్దికద ,ఇది రాయలసీమ ఫాక్షన్ లో కనపడే లక్షణం అ లక్షణాలు పుణికి పుచుకున్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన మ్చట్ట సభలు ఇలానే ఏడుస్తాయి. ఎ ఎదురుదాడిని అర్ధంచేసుకోవటానికి కచుకోవటానికి ప్రతిపక్షాలకి ౩ సంవత్సరాలు పట్టినాయి .ఎన్ని విషయాలలో ప్రభుత్వం చేసిన తప్పులను అవినీతిని బయటపెట్టిన ఏదో ఒక వ్యక్తిగత దూషణతో చర్చని పక్క దరి పట్టించడం,లేదా సభాధ్యక్షుడిని ప్రభావితం చేయడం ,లేదా రోశయ్య లాంటి( ఈయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో సార్లు మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచాడు అయియన్ వీరు జనం నాదిబాగా తెలుసు అని చెప్పుకుంటారు ఈయన గారి నియోజకవర్గం చీరాల లో ప్రజలు ఎన్ని ఇబ్బండులుపడుతున్నారో ఎయనగారికి తెలియదు ఎ ప్రభుత్వంలనే ఎయనగారి ఊరు లో అంట అవినీతి ఉంది సుమ)వారి చేత గత ప్రభుత్వం మెడ విమర్శలుచేయించడం లేదా పనికిమాలిన వ్యేంగా వేఖయనాలు చేయించడం అనక తీరికగా ముఖ్య నాయకుడు వచ్చి ప్రతిపక్ష నేత అమ్మ గురించి మాట్లాడటం ఇలా చేస్తుంటే ఎ ప్రతిపక్షమే కాదు పుచ్చలపల్లి సుందరయ్య అయ్యదేవర కలేస్వర్ రా లాంటి మహా మహులు ఉన్నా కూడా ఏమిచేయలేని నిస్సహాయత
    ఇదంతా చూస్తూ మనకు కడుపు మండిన వల్లుమండిన ఏమిచేయలేని మన దౌర్భాగ్యం ని నిందించుకుంటూ చేతులు ముడుచుకొని చేవచచ్చి మల్ల ఎన్నికలు ఎప్పుడురా బాబు అని ఎదురుచూడటం తప్ప ఏమిచేయలేము
    పత్రికలూ తన గురించి తన ప్రభుత్వం గురించి తన మంత్రుల గురించి ఎంసరిగా రాయడంలేదని సొంత గ పత్రిక పెటుకున్న ముఖ్యమంత్రిని ,ఎవరుమాత్రం ఏమిచేయగలరు ( ఢిల్లీ కి మూటలు వెళ్తున్నతకాలం ఎవరు ఏమి చేయలేరు).మేమంతా అవినీతి చేయడంలేదా మా అధికారులు మత్రంచేస్తే తప్పు ఏమిటి అని అలోచించి అవినీతి నిరోధక శాఖ ఎ అధికారిని అతన్ని అరెస్టు చేయడానికి వీలులేదని శాసనం చేసిన ఘనత మన ప్రభుత్వానిది.ఇలాంటి ప్రభుత్వాన్ని ఎలాంటి నాయకులని ఇంక ఎంతకాలం భరించాలి ,వచేవాళ్ళు వేరికనన్ నీతిమంతులువస్తారని నమ్మకం ఏమిలేదు వీరు చూపిన దారిలో పయనించక పోతే అదేపదివేలు .నేను రెండు ప్రభుత్వాలని చాల దగ్గరగా చూసాను
    చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో ఇంట విచాలవిదితనము లేదు అని మాత్రం గట్టిగ చెప్పగలను
    అడినయకుడికి తెలిస్తే ఎక్కడ ఆపదవి ఊదిపోతదో లేక ప్రాధాన్యత తగ్గిపోతదోఅని ప్రతి మంత్రి బయపడేవాడు
    ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఆరోపణలు పత్రికల్లో వస్తే ఎలాంటి విచారణ ఎదుర్కోవాల్సి వస్తదోఅని అధికారులలో భయం ఉండేది
    దీని అర్ధం అంత బాగుందని కాదు కానీ ఇంత విచలవిడితనము అనేది లేదు
    న అభిప్రాయాలతో ఎంతమంది ఎకిభావిస్తారో తెలియదు కాని నేను చాలమంది ఎకిభావిస్తారని అసిస్తున్నౌఉ
    విజయ్ భాస్కర్

    రిప్లయితొలగించండి
  8. ముఖ్యమంత్రి రాజకీయాలు అచ్చంగా ఫ్యాక్షనిస్టు తరహావి. నిద్ర నటించేవాడిని లేపలేం కదా. ప్రతి సందర్భంలోనూ అడ్దగోలు ఎదురుదాడికి దిగటం, తనవారిని గుడ్డిగా వెనకేసుకు రావటం తప్ప ఎవరేమనుకుంటారో అని ఆలోచించే మనిషా ఆయన? అంత తోలుమందం ఉన్నవాడిని ఏ ప్రతిపక్షమూ ఏమీ చెయ్యలేదు. అతని ధాటికి తెలుగుదేశం చీలికలు పేలికలు కాకుండా ఇంకా మిగిలుండటం, ఉప ఎన్నికల్లోనూ, జిల్లా పరిషత్ వగైరా ఎన్నికల్లోనూ తన సత్తా చూపటమూ గొప్పే. ఆ రకంగా - ప్రతిపక్షంగా తెదెపా విజయం సాధించినట్లే.

    రిప్లయితొలగించండి
  9. నేను విజయ భాస్కర్, అబ్రకదబ్ర గారిలతో ఏకీభవిస్తున్నాను...

    కాంగ్రెస్ అధికారంలోకి రాగానే స్థానిక ఎన్నికలని పరోక్షం చేసి, కమిటీలకి పెద్ద పాత్ర వేసి తమ విజయాన్ని ఖాయం చేసుకున్నారు... అలా, ప్రతిపక్షాలు బలహీనపడిపోయాయి అని అంకెల గారడీతో చూపే ప్రయత్నం చేసింది... అలా వచ్చిన అధికారంతో అన్ని స్థాయిల్లోనూ విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించారు...ఇంత విచలవిడిగా ఉన్నా, ప్రత్యక్ష ఎన్నికలలో ప్రతిపక్షాలు సగం కన్నా ఎక్కువ వోటు, సీట్లు దక్కించుకోవడం పరిస్థితిని తేటతెల్లం చేస్తున్నాయి...

    GOVERNMENT'S DECISION ON INDIRECT POLLS DRAWS FLAK
    http://www.vizagcityonline.com/Vizagfeatures/2005/june.html

    Indirect polls help Congress, says Naidu
    http://www.hindu.com/2005/10/02/stories/2005100203700600.htm

    Coop polls: TDP cries foul

    http://www.hinduonnet.com/2005/10/28/stories/2005102808580400.htm

    రిప్లయితొలగించండి
  10. కత్తి మహేష్ కుమార్ గారు,
    "ఇప్పుడు రాజకీయ నాయకులేతప్ప "నాయకులు" లేరు. వీళ్ళు అధికారపక్షంలో ఉంటే ఎంత! ప్రతిపక్షంలో ఉంటే ఎంత? బుద్దులు మాత్రం మారతాయా?"

    ఇప్పుడు మీకొక ప్రశ్న.. :-) ఇప్పుడు వరకూ మీరు చూసిన నాయకులలో ( అంటే మీ పరీక్షకి గురి అయిన వాళ్ళల్లో) రాష్ట్రానికి నాయకత్వం (సాపేక్షికంగా) అందించారు అని మీకు అనిపించిన వాళ్ళల్లో ముందు వరసలో ఎవరుంటారు? రేపటి ఎన్నికలలో నిలబడే వారినుండి మాత్రమే మీరు ఎన్నుకోవాలి :-)

    రిప్లయితొలగించండి
  11. యోగి,

    టి వి 9 గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది... ఈ నాలుగున్నరేళ్ళ కాలంలో అది ప్రతిపక్షాలని ఇరకాటంలో పెట్టే ప్రయత్నమే చేసింది కానీ, ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశాలని ఉపయోగించుకోవడంలో క్రియాశూన్యత ప్రదర్శించింది... బహుసా టి వి 9 సిద్ధాంతం అధికారంలో ఉన్నవాళ్ళకి అనుకూలత అనుకుంట! పోనీ రాజకీయాలు పక్కన పెడితే మిగిలిన విషయాల్లో సంచలనం, చెప్పిందే చెప్పడం, ప్రసార మాధ్యమం గా తెలుగుని గౌరవించకపోవడం... యాక్!

    రిప్లయితొలగించండి
  12. పత్రికలూ, ఆకాశవాణీ లేదా ఇతర శ్రవణ-మాధ్యమాలూ, దూరదర్శన-మాధ్యమాలూ ఏమీ చెయ్యలేవని ఎలాగూ తేలిపోయింది. దేశాన్ని మన భవిష్యత్తునీ ఇటువంటి పాలకుల చేతిలో పెట్టేసి దణ్ణం పెట్టడం తప్పితే ఎన్నికలు కాక మనకి ఆయుధాలు ఏమీ లేవా? మనం మౌనప్రేక్షకులలాగ చూస్తూ ఉండడం తప్పితే ఏమీ చెయ్యలేమా?!

    రిప్లయితొలగించండి
  13. ప్రతి పక్షం విఫలం కాలేదేమో ..
    నిజానికి చాలా విషయాలలో - ప్రతిపక్షాలు అన్నీ కలసి ఐక్యం గా చర్చకు దిగినప్పుడు కూడా - అధికార పక్షం చిన్న విషయాన్ని తీసుకొని చిలికి చిలికి గాలి వాన చేసి అసలు విషయాన్ని పక్కదోవబట్టించిన సంధర్భాలు ఉన్నాయి.
    గత సమావేశాలను విపక్షాల అభీష్టానికి వ్యతిరేకం గా 5 రోజులే నిర్వహించారు..
    బాబు ప్రభువ్తం మీద 20 దాకా కమీషన్లు వేసారు .. సాధించింది శూన్యం..
    "సొమ్ములు పోనాయ్ ఇంకేటి చేస్తాం" అంటే ప్రమోషను..
    డిపేప్ కూంభకోణం నిజం అని తేలితే . ఎవరి మీద చర్యలు లేవు..
    అందులో ఉన్నారన్న సొంత మనుషులకి యోగ్యతా పత్రాలిచ్చేది వీళ్లే..
    ఇసక తగాదాలు తీర్చేది వీళ్లే ..
    మేటాస్ ప్రమేయం ఉందో, కేవలం సత్యం ప్రమేయం ఉందో చెప్పేది వీళ్లే..
    సోదరుడు గురుకుల భూమిని ఉంచుకోవాలో తిరిగీవ్వాలో నిర్ణైంచేదీ వీళ్లే..
    పోలీసులు సమయానికి రాకపోతే, సెజ్ లను వ్యతిరేకిస్తూ ధర్నా చేశే రైతులను కొట్టేదీ వీళ్లే..
    ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పై చర్చ చూడడండి .. ఎవరు భాధ్యతా యుతం గా ప్రవర్తించారో తెలుస్తుంది..

    ఏ పక్షపు నాయకుడు ఏ పక్షపు నాయకుడిని ఏక వచన సంభోధన చేసాడో చూడండి..

    గత శాసన శభలకి ఈ శాసన సభకి గణాంకాలు చూడండి ఎన్ని సార్లు సభ్యులు సస్పెండ్ చేయబడ్డారో
    ఫలాన అధికార పక్ష సభ్యుడు శాంతము ఓర్పు తో వ్యవహరించారని చెప్పండి,
    బి.ఏ.సీ లు కూడా సక్రమం గా జరిగింది లేదు..
    నాలుగు ఎస్టేట్లలో దేన్నీ గౌరవించకపోతే .. ఎవరు మాత్రం ఏమి చేస్తారు?

    రిప్లయితొలగించండి
  14. ప్రతిపక్షం విఫలమైందనడం సరికాదేమో ! తోలుమందాలు అరచేతి లావున పెఱిగిపోయిన సిగ్గూ, శరం లేని తరహా (కాంగ్రెస్) మనుషుల్ని, ఈ ధన/అధికార దుర్మదాంధుల్నీ ఎవరూ నియంత్రించలేరు. "ఇది మా ప్రభుత్వం, మేము చెప్పినట్లు జరగాలి" అనే మొండి-బండ అప్రజాస్వామిక ధోరణి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానిది. "నోరుమూస్కో చంద్రబాబూ ! నోరు మూస్కో !" అని నాయుడుగారిని, "ఎయ్ ! కూర్చోవయ్యా ! నువ్వు కూడా మాట్లాడేవాడివే" అని ఇంకో మాజీ మంత్రిని అనడం అందరికీ ఎఱుకే. ఈ రకమైన హీనపదజ్జాలాన్ని చట్టసభలో ప్రయోగించిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రచరిత్రలోనే కాదు, ప్రపంచచరిత్రలో కూడా ఎక్కడా లేడు. ఈ రకమైన జులాయి అధికార పక్షాన్ని ఎదుర్కోవాల్సి రావడం ప్రతిపక్షానిక్కూడా పెద్ద దిగ్భ్రాంతే.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు