27, సెప్టెంబర్ 2008, శనివారం

పోస్టాఫీసుల్లో వోటరు నమోదు కేంద్రాల ప్రయోగాత్మక ఏర్పాటు

పోస్టాఫీసుల్లో వోటరు నమోదు కేంద్రాలనేర్పాటు చెయ్యాలనే విషయమై లోక్‌సత్తా ఎప్పటినుండో అడుగుతోంది కదా... దీనిమీద ఈమెయిలు గోల కూడా చేసాం. ఈమధ్య జయప్రకాష్ నారాయణ ఎన్నికల ప్రధాన కమిషనరుతో జరిపిన చర్చల తరవాత దీన్ని ప్రయోగాత్మకంగా హై. లో అమలు చెయ్యాలని నిర్ణయించారని తెలిసింది. 

శభాష్ ఎన్నికల సంఘం, జయప్రకాష్ నారాయణ!

దీనికి సంబంధించి సెప్టెంబరు 27న ఈనాడులో వచ్చిన వార్త ఉన్నదున్నట్టుగా ఇక్కడ:

తపాలా కార్యాలయాలద్వారా శాశ్వతంగా ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచిస్తోంది. ఇందులో మొదటి అడుగ్గా హైదరాబాద్‌లో ప్రయోగాత్మక ప్రాజెక్టు చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ తపాలాశాఖ నుంచి అధికారిక ప్రతిపాదనలు అందిన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణకు ఎన్నికల సంఘం హామీ ఇచ్చింది. 

ఓటర్ల జాబితాలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న తప్పులను సరిదిద్దడానికి తపాలా కార్యాలయాలద్వారా నమోదు చేపట్టాలంటూ జయప్రకాశ్ ఇదివరలో ఈసీకి ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలనలోకి తీసుకున్న ఈసీ శుక్రవారం ఆయనను ఢిల్లీకి పిలిపించి చర్చించింది. ఈ భేటీలో ప్రధాన ఎన్నికల కమిషనరు ఎన్.గోపాలస్వామి, కమిషనర్లు నవీన్ చావ్లా, ఖురేషీతోపాటు ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు. సుమారు గంటన్నరసేపు దీనిపై చర్చ జరిగినట్లు జయప్రకాశ్ తెలిపారు. దేశవ్యాప్తంగా 1.50 లక్షల తపాలా కార్యాలయాలున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో 12వేల పైచిలుకు ఉన్నాయని వివరించారు. ఇప్పుడున్న విధానంలో హైదరాబాద్‌లో కేవలం ఏడుగురు ఎన్నికల నమోదు అధికారులు మాత్రమే ఉన్నారని, అదే తపాలా కార్యాలయాలద్వారా చేపడితే నగరవ్యాప్తంగా 150 మంది పోస్టుమాస్టర్లు నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించవచ్చని ఆయన సూచించారు.
 
ప్రస్తుత ఓటర్ల నమోదు ప్రక్రియలో జరుగుతున్న తప్పులకు జయప్రకాశ్ ఓ ఉదాహరణ చూపారు. హైదరాబాద్ పరిసరాల్లో నివాసముంటున్న మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ జె.ఎం.లింగ్డోకు ఓటరు గుర్తింపుకార్డు రావడానికి మూడున్నరేళ్లు పట్టిందని తెలిపారు. ఈ మధ్య ఓ పెళ్లిలో కలిసినప్పుడు మాటల మధ్యలో ఆయన భార్యే ఈ విషయం చెప్పి వాపోయారని జయప్రకాశ్ వెల్లడించారు.

6 కామెంట్‌లు:

  1. చిన్నమయ్య గారూ, మీ అభినందనలకు నెనరులు.

    నిజానికి లోక్‌సత్తా ఎప్పటినుండో ఈ పని చేస్తూ ఉంది. జయప్రకాష్ నారాయణ ఎన్నికల సంఘాన్ని కలవడానికి నాలుగు రోజుల ముందు, ఈ ఈమెయిలు కార్యక్రమాన్ని తలపెట్టింది. అప్పటికే వాళ్ళు చేసిన కృషి ఫలితంగా పని సానుకూల పడింది. మన ఈమెయిళ్ళు దానికి మరింత ఊపునిచ్చి ఉండొచ్చు.

    రిప్లయితొలగించండి
  2. సమగ్రమైన ఓటరులిస్టులకొరకై మీ తపన, జయప్రకాష్ నారాయణ గారి తపన అర్ధం చేసుకోవలసినదే.

    కానీ...

    పోస్టాఫీసులకు మీరీమధ్య వెళ్ళారో లేదోగానీ అవి కూడా బాగా బూజుపట్టి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో కనీసం స్థానిక సంస్థల భాగస్వామ్యమైనా ఉంటుంది. వీళ్ళ మీద పర్యవేక్షణ ఎక్కడో ఢిల్లీ నుండి జరుగుతుంది కాబట్టి ఎలాంటి సంస్కరణలు లేకుండా తగలపడ్డారు.

    వోటరులిస్టులకైనా ఇతర అన్ని రకాల గుర్తింపులకు వీలుగా బహుళార్ధ సాధక ఏకాంకిత గుర్తింపు ఇవ్వాలి. ప్రణాళికాబద్దమైన, సమగ్రమైన కంప్యూటరైజ్డ్ నెట్ వర్క్డ్ డేటాబేస్ స్థాపించి నిర్వహించాలి. ఇంకా బ్రిటీష్ కాలం నాటి పద్దతులను నమ్ముకోకూడదు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు