24, జులై 2007, మంగళవారం

ధృతరాష్ట్రుడూ ఆయన సంతతీ!

14 కామెంట్‌లు
జూలై 23 న శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడినది చూసినవారు ఛి, చ్ఛీ అని అనుకోక మానరు. ముఖ్యమంత్రి అలా మాట్లాడేంటబ్బా అని విస్తుబోయేది కొంతమందైతే, స్పీకరుకు నోరు పడిపోయిందా ఏంటి అని ఈసడించుకునే వారు మరికొందరు.

మర్యాదస్తులు బయట కూడా అలా మాట్లాడుకునేందుకు వెనకాడుతారు; పోట్లాడుకునే సందర్భంలో కూడా!

అంత దారుణంగా మాట్లాడాక మళ్ళీ మామూలుగా ఉండగలరా? అసలిహ మొహం మొహం చూసుకోగలరా? కలిసికట్టుగా పనిచెయ్యలేని ఈ అధికార, ప్రతిపక్షాలు మనకెంతమాత్రం పనికొస్తాయి?

మనం వీళ్ళకి ఓట్లేసి సభకు పంపింది కలిసి పనిచెయ్యమని, కాట్లాడుకొమ్మని కాదు. ఇలా అసభ్యంగా మాట్లాడి - దూషించి- ముఖ్యమంత్రి తన విధిని మరిచాడు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన స్పీకరు - అసలు ప్రతి'పక్షపాతి'గా ఉండాలట - ముఖ్యమంత్రి అడుగులకు మడుగులొత్తుతూ తానా పదవికి పనికిరానని నిరూపించుకున్నాడు.
----
ముఖ్యమంత్రికి కోపం రావడానికి బోలెడు కారణాలున్నాయి..

  • ఉక్కు కర్మాగారం - తప్పుబట్టిన ప్రతిపక్షం
  • చుట్టాల గనులు - తప్పంటున్న ఘనులు
  • తోడల్లుడి పవరు ప్లాంటు - ఆపేయించిన ప్రతిపక్షాలు
  • ప్రాజెక్టుల్లో ప్రవహిస్తున్న అవినీతి - దానికి ఆనకట్ట కట్టబోయే పత్రికలు, ప్రతిపక్షాలు
  • హైదరాబాదు బ్రదర్స్ - కారు చిచ్చులు, వీధి పోరాటాలు
  • పోతిరెడ్డిపాడు - అద్భుత ప్రగతిని ఓర్వలేని ప్రతిపక్షాలు
  • అంతులేని భూయాగాలు - అయినా తీరని కోరికలు
  • ఆ రెండు పత్రికలు - కొరకరాని కొయ్యలు
  • కమ్యూనిస్టుల భూయజ్ఞం - అవి చాలవన్నట్టు నిరాహార దీక్షలు
  • ...
  • ...
  • పై తలనెప్పులకు తోడు శాసనసభ సమావేశాలు పెట్టక తప్పని పరిస్థితి. తప్పించుకుందామంటే లేదాయె!
ఇన్ని సమస్యలతో ముఖ్యమంత్రికి చావొచ్చి పడడంతో నిరంతర చిరుదరహాస పూరితమైన శివదేవుని ముఖబింబం చిన్నబోవడాన్ని మనమర్థం చేసుకోవచ్చు. పైగా ఆయన సొయానా దేవుడు గూడాను. దేవుడికి కోపమొస్తే మసే గదా!!
---

కానీ స్పీకరు.. కళ్ళుండీ కబోది అయ్యాడు. ముఖ్యమంత్రి అంతలేసి మాటలంటున్నా, విననట్టే ఉండిపోయాడు. వారించేందుకు నోరు పెగల్లేదు. రికార్డుల్లోంచి తీసేసేందుకు చేతులు రాలేదు, చేత కాలేదు. క్షమాపణ చెప్పించేందుకు చేవ లేదు.

మొత్తమ్మీద సభను కురుసభను తలపింప జేసారు. ముఖ్యమంత్రి దుర్యోధనుడుగా పరవాలేదు. స్పీకరు మాత్రం ధృతరాష్ట్రుడి పాత్రలో జీవించాడు. స్పీకరు ఎలా ఉండకూడదో ఒక ఉదాహరణగా నిలుస్తాడు!!

సంబంధిత టపాలు