20, ఫిబ్రవరి 2006, సోమవారం

మనమూ మన భాషా..

2005 సెప్టెంబరు 19 న ఈ బ్లాగు యాహూ 360 లో రాసుకున్నాను. కానీ ఎంచేతో బయట పెట్టలేదు. సందర్భం (మాతృభాషా దినం) వచ్చింది కదాని ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాను.


తెలుగు భాషకు ఆదరణ కరువై పోతోంది, పరాయి భాష మోజులో పడి, మాతృ భాషను మరచిపోతున్నాం అంటూ గోల చేస్తూంటాం. ఆ చేసే గోలేదో తెలుగు లోనే చేద్దాం అనేది నా గోల. "చెయ్యొచ్చు, ఇదేమంత గొప్ప విషయమా ఏంటి" అని అనొద్దు. ఓ ప్ఫది నిముషాలు ఇంగ్లీషు మాటలు రాకుండా తెలుగులో మాట్లాడండి, చూద్దాం! పది కాదు, ఒక్క నిముషం మాట్లాడినా గొప్పే! కోడిగుడ్డుకు ఈకలు పీకే వారుంటారు..! "ఇంగ్లీషు మాటలు అసలు మాట్లాడకూడదంటే..అస్సలు కూడదు..రైలును రైలనొద్దు, బస్సును బస్సనొద్దు.." అని పేచీ పెట్టుకుంటారు. ఇతర భాషల నుండి ఎన్నో పదాలు తెలుగులో కలిసిపోయాయి. ఇతర భాషలలోనూ అలాగే జరుగుతున్నది. ఇంగ్లీషులో ఇలాగ కొన్ని వేల ఇతర భాషా పదాలు చేరి సొంతవై పోయాయి. బాండికూట్‌ అనేది తెలుగు "పందికొక్కు" నుండే వచ్చిందని చెప్తేనో చదివితేనో తప్ప మాటను బట్టి తెలియదు. బస్సు అనేదీ అంతే! అవి భాషలో ఇంతకు ముందు లేని వస్తువులు, వాటికి కొత్త మాటలు కనిపెట్టాలి, లేదా బయటి నుండి తెచ్చుకోవాలి. Aeroplane తీసుకోండి .. విమానం - చక్కటి పదం - మనకు ఉండనే ఉంది, కాబట్టి Aeroplane పదాన్ని వాడనక్కర లేదు.

కాని "ఇప్పుడు సిక్స్‌ థర్టీ అయ్యింది", "టు డేస్‌ తరువాత మీటవుతాను", "నేను ట్యూస్‌డే మా నేటివ్‌ ప్లేసుకు వెళ్తున్నాను" ఇలాగ మాట్లాడ్డం అవసరమా!? ఆరున్నర, రేండు రోజులు(రేండ్రోలు), మంగళ వారం, మా ఊరు అనలేమా? మనం అదే ఆలోచించాలి.

ఇంగ్లీషులోకి బయటి నుండి పదాలను తెచ్చుకున్నారు కాని వ్యాకరణాన్ని కాదు, వాకయ నిర్మాణాన్ని మార్చరు. కాని మనం వాక్యనిర్మాణాన్ని మారుస్తున్నాం. ఉదాహరణకు: డిసైడ్‌ చేస్తాను అంటాం..అదే తెలుగు మాటను వాడితే - నిర్ణయిస్తాను అంటాం కదా. అవసరం లేకపోయినా అరువు తెచ్చుకుంటే ఇలాగే ఉంటుంది.

అదే మనం ఇంగ్లీషులో ఎలా మాట్లాడతామో గమనించండి..తెలుగు మాటలు ఏమైనా కలిపేస్తున్నామా? (అసలీ ఆలోచనే చిత్రంగా ఉంది కదూ?) అలా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం..

I want to make స్నేహం with you. ---------- నాకు మీతో friendship చెయ్యాలని ఉంది.
He is walking down the మెట్లు ----------- అతడు steps దిగుతున్నాడు
It is very తేలిక ------------------------------ అది చాలా light గా ఉంది.

ఆ కుడి పక్కవన్నీ బాగుండి, ఎడం పక్కవి మాత్రం ఎబ్బెట్టుగా ఉన్నాయెందుకు?

3 కామెంట్‌లు:

  1. ఎబ్బెట్టుగా ఎందుకున్నాయంటే మనం తెలుగు భాషను తొక్కి పడేసి ఆంగ్ల భాషను ఎక్కడో చాలా......ఎత్తున కూర్చోబెట్టాం. (తప్పండోయ్! మరీ అంత ఎత్తున కాదు. సరిగ్గా మన నెత్తినే కూర్చోబెట్టుకున్నాం. ఐనా తెలుగు పదాలకు అది అందనంత ఎత్తే మరి!) "బోడి తెలుగు భాష సంకరమైపోతే మనకెందుకండీ బాధ?(అందుకే సంకర వాక్యాలు విరివిగా వాడతాం.)" ఇదీ ప్రస్తుత దుఃస్థితి.

    రిప్లయితొలగించండి
  2. guru gAru

    mI blAgu cAlA bAgundanDi. mI lAnTi vAru cAlA mandi kAvAli prastuta paristhitillO. lEkapOtE atyadbhutamayina mana bhAsha nAma rUpAlu lEkunDA pOtundi.

    mee ee vela lEni praytnAniki mana@hpUrvaka abhinandanalu

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు