30, ఆగస్టు 2008, శనివారం

కందానికో నూలుపోగు

ఏ యుగంలోనైనా అందం నాలుగు పాదాల మీదా నడిచే పద్యం, కందం. ఈ మధ్య బ్లాగుల్లో మళ్ళీ కంద పద్యం కాంతులీనింది -ముఖ్యంగా రెండు బ్లాగుల కారణంగా. కందపద్యం ఎలా చెప్పాలో రాకేశ్వరరావు సచిత్రంగా సోదాహరణంగా వివరించారు. కందపు గ్లామరును, గ్రామరునూ వివరిస్తూ చంద్రిమలో ఓ చక్కని జాబు వచ్చింది. ఈ రెండు చోట్లా బహు చక్కని వ్యాఖ్యలూ, వాటిలో అందమైన ఆశుకందాలూ వచ్చాయి. ఓపక్క అక్కడ వ్యాఖ్యలు రాస్తూనే రానారె తన బ్లాగులో ఒక సర్వలఘు కందాన్ని రాసారు. ఈ పద్యసంరంభం చూసాక నాకూ రాద్దామని ఉత్సాహం వచ్చింది. సూదీ దారం తీసుకుని పద్యాలు కుట్టేద్దామని కూచున్నా.. ఇదిగో ఇప్పటికయ్యింది. సరే, రాసిన రెండూ పద్యాలూ నా బ్లాగులోనే పెట్టేసుకుందామని, ఇదిగో ఇలా..మరిమరి తరచిన తదుపరి
తెరతొలగెను చిరువెలిగెను, నిలిచెను బరిలో
చిరపరిచిత తెర వెలుగునె
వరముగ మలచిన.. గడుసరి మదుపరి యతడే!

పార్టీ పెడితే చాలదు
హార్టీగా మాటలాడు టార్టే కాదోయ్!
కర్టుగ తిట్టిన గానీ
హర్టవ్వక నవ్వగలుగు హార్టుండవలెన్

పద్యాలు బాగున్నాయా.. అదే మరి కందం మహిమ!
బాలేవా! ఎంచేతబ్బా, ఇవి కందాలేనే !!

17 కామెంట్‌లు:

 1. చదువరి గారూ! మీరు పద్యాలు రాస్తారని నాకిప్పుడే తెలిసినది.చాలా బాగున్నాయి.శతకానికి ట్రై చేయకూడదూ!హాయిగా చదువుకుంటాము:).

  రిప్లయితొలగించండి
 2. బ్రహ్మాండం. చదువరిగారూ, పద్యాలు రాస్తే మీరు రాయాలి. గజ్జెల మల్లారెడ్డి అక్షింతల స్థాయిలో వుంటాయి మీ పద్యాలు.

  రిప్లయితొలగించండి
 3. "కర్టుగ తిట్టిన గానీ
  హర్టవ్వక నవ్వగలుగు హార్టుండవలెన్"

  Excellent!

  రిప్లయితొలగించండి
 4. గిరి: "మాటలాడుట" "ఆర్టే" లకు సంధి కుదిరి "టార్టే" అయింది.

  సరస్వతీకుమార్: భలేవారే, రెండు రాయడానికే గుడ్డెళ్ళుకొచ్చాయి సార్, శతకమే!!
  రానారె: ఓహ్, నెనరులు. గజ్జెల మల్లారెడ్డి వేసిన అక్షింతలతో వీటికి పోలికే!! (అన్నట్టు, అక్షింతలు పేరుతో డీవీనరసరాజు ఒక శీర్షిక నిర్వహించేవారు, ఈనాడులో.)
  చంద్రమోహన్: నెనరులు.

  రిప్లయితొలగించండి
 5. నేను కూడా టార్టే ఎంటా అనుకున్నాను. టాక్టుకు టార్ట్ అన్నారా అని సందేహపడ్డాను. తరువాత యతి చూసుకుంటే హ కి అ వస్తుందిగా అని చెప్పి సంధి విరిచాను. మొన్నే చంద్రమోహన గారు ఈ విరుపుల మీద టపా వేసారు. ర్ట అనే ఆంగ్ల ప్రాసని, ప్రాసయతిని గూడా బలే కుదిర్చారండీ..

  సర్వలఘు గురించి ఇక చెప్పనక్కరలేదు. ర అనుప్రాసతో బలే వుంది. ఎప్పటికైనా ఒక మంచి (యెలగెంటు) సర్వలఘు వ్రాయాలని ఆశగా వుంది.

  రిప్లయితొలగించండి
 6. మీ "చిరు"కందాలు అదిరేయ్. రెండోది మరీ బావుంది.
  కందాల సీజన్ మొదలయ్యినట్టుంది!
  సరే అయితే, ఓ విచిత్రమైన కందాన్నీ, దాన్నీ రాసిన మహానుభావుణ్ణీ త్వరలోనే పరిచయం చేస్తాను, నా బ్లాగులో.

  రిప్లయితొలగించండి
 7. చదువరి గారూ,
  పార్టీ కందం కేక...
  సర్వలఘు కందం కూడా బావుంది.
  కానీ, "త" కు "న" కు ప్రాస వేస్తే కామేశ్వర రావు గారు ఒప్పుకోరు.
  https://www.blogger.com/comment.g?blogID=26724004&postID=7345931191677156111

  భవదీయుడు
  ఊకదంపుడు

  రిప్లయితొలగించండి
 8. చదువరి! తెర చిరు చిరుబురు
  లదిరెను చురకలు నదిరెను లఘువుల నయితేఁ
  సదరు నతలకునుఁ యతులుఁ
  గుదరవు తెనుఁగునఁ తమరిది కొలది తలచుడీ.

  రిప్లయితొలగించండి
 9. ఊ.దం. గారు,
  మీరు భలే వారండి! మధ్యలో నేనెవర్ని ఒప్పుకోకపోడానికి? ఒప్పుకోనిది అప్పకవీ అతనికన్నా ముందున్న చాదస్తులూనూ :-)
  యతులు లేకుండా పద్యాలు రాస్తానన్నా నా కెలాంటి అభ్యంతరమూ లేదు! లేదు, యతిప్రాసలతోనే పద్యాలు రాస్తమూ అని మీరు పట్టుబడితే ఏదో నాకు తెలిసున్నది చెప్తానంతే :-)
  "త"కి "న"కే కాదు ఇది అన్ని వర్గాక్షరాలకీ వర్తిస్తుంది. మొదటి నాలుగు వర్గాక్షరాల మధ్యే యతి కుదురుతుంది, చివరి అనునాసికంతో కుదరదు.

  రిప్లయితొలగించండి
 10. అబ్బో ఇలాంటి చోట వేలు పెట్టకూడదు. చదివి ఆనందించాల్సిందే. అంతే.
  బొల్లోజు బాబా

  రిప్లయితొలగించండి
 11. మీ కందార్ట్‌కి మా హార్టీ కంగ్రాట్స్!

  రిప్లయితొలగించండి
 12. "అవును, టార్టా లేక టాక్టా?"
  చదువరిగారికి "టార్ట్" తో?
  :-)

  రిప్లయితొలగించండి
 13. First time here. Thanks for the advice in Maganti's blog about blogs. This is the kind of blogs I am looking for to understand a little about contemporary issues in A.P.
  Coincidentally, we seem to have grown up in nearby places. I grew up in Gudavalli and Chintayapalem which sre not far (resly) from Kavur and Ganapavaram. Thanks and regards,
  Swarup

  రిప్లయితొలగించండి
 14. రాకేశ్వరరావు: మీ సర్వలఘు కందం కోసం చూస్తాను.
  ఊదం, రాఘవ, భైరవభట్ల: మీరు ముగ్గురూ అన్నాక కాదనేదేముందండి.. ఎలా మార్చాలో చూస్తాను.
  సూర్యుడు: నెనరులు. చాన్నాళ్ళకు కలిసాం.
  బొల్లోజు బాబా: అంతేనంటారా?! సరే అలాక్కానీండి.
  నెటిజెన్: అసలు టార్టంటే ఏంటా అని నిఘంటువులు పట్టుకుని వెదికితే.. టార్టులు రెండున్నాయట, రెండో దాంతోటి దిగుల్లేదు. మొదటి దానికి రెండర్థాలున్నాయట. రెండో దాంతోటి దిగుల్లేదు. దాన్నిప్పించండి, చాలు.
  గద్దేస్వరూప్: ఓహో మనిద్దరం బాగా దగ్గరే!! మీరు చితాయపాలెంలో చదివారా? sirishtummala@జీమెయిలు.కాం కు రాయండి.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు