14, సెప్టెంబర్ 2008, ఆదివారం

మరో 'పిరికి' చర్య

ఇంకోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. ఈ సారి ఢిల్లీ. ఊరు మారింది, స్థలాలు మారాయి.  బాంబులేసినవాళ్ళు వాళ్ళేనట -మేమేనని బోర విరుచుకుని మరీ చెబుతున్నారు.


మరో 'పిరికి' చర్యను ఖండించి పారేసారు భారత హోమ్ మంత్రి. ఢిల్లీలో జరిగిన దానికి నాకు చాలా విచారంగా ఉంది. మనకు ఇబ్బందులు కలగజేయాలనుకునేవారి కుట్ర ఇది. వాళ్ళ దుష్ట పన్నాగాలను పారనీయకుండా చెయ్యాలి. మనందరం ఐక్యంగా వీళ్ళను ఎదుర్కొందాం. సరిగ్గా ఇదేకాదు, ఇలాంటిదే ఏదో చెప్పేసాడు. ఖచ్చితంగా ఏం చెప్పాడో తెలుసుకునేంత ప్రాముఖ్యతేమీ లేదు. వాటిలో అంత పసేమీ ఉండదు. ఉత్త ఊకదంపుడు, ఉత్త పనికిమాలిన బుస, ఒఠ్ఠి చేతకాని కబుర్లు అంతే!  ప్రభుత్వ ప్రతినిధిగా, ఇలాంటివి జరక్కుండా నిరోధించాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయనీ ముక్కలు చెబుతున్నపుడు మూర్తీభవించిన అసమర్ధతగా కనిపించాడు. శాంతి భద్రతలు రాష్ట్రప్రభుత్వ విషయంగా చెప్పి తప్పించుకునే ఈ మంత్రి, ఢిల్లీలో, తన ఆఫీసుకు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ పేలుళ్ళకు ఏం జవాబు చెబుతాడు?  ఒకవైపు ఈ అసమర్ధ ప్రేలాపనలు సాగుతూండగా, అక్కడే..

ఒక్ఖ ముక్క కూడా మాట్టాడకుండా తాము చెయ్యాల్సిన దాన్ని చేతల్లో చూపించిన సమర్ధుల గురించి మనం చెప్పుకోవాలి. గాయాలపాలైన వారిని ఆస్పత్రులకి తీసుకెళ్ళడంలో చురుగ్గా పనిచేసినవారు.. వాళ్ల గురించి మనం చెప్పుకోవాలి. అంత గందరగోళంలోనూ పేలుడు శకలాలను తొలగించి సరైన ఆధారాల కోసం అణువణువూ గాలించిన వారు.. వాళ్ల గురించి మనం చెప్పుకోవాలి. పేలకుండా ఉన్న బాంబులను వెతికి, వాటిని పేలకుండా చేసిన వారు.. ఆ బాంబులు పేలితే తమ ప్రాణాలు ఎగిరిపోతాయని తెలిసీ వాటిని నిర్వీర్యం చేసినవారు.. వాళ్ల గురించి మనం చెప్పుకోవాలి.  వాళ్ళు ధీరోదాత్తులు, హీరోలు. చేతకాని వాళ్ళ నాయకత్వంలో 'పిరికి'వాళ్ళను ఎదుర్కొంటున్న ధీరోదాత్తులు, హీరోలు.

ఎన్నో కష్టాలకోర్చి, తాము పట్టుకున్న ముష్కరుల్ని మతం పేరుతో వదిలేసే రాజకీయులు, ఆ నేరస్తుల ఇళ్ళకెళ్ళి విందులు కుడిచే నాయకులు వాళ్ళకి బాసులు. ఉరిశిక్ష పడిన వాణ్ణి ఎలా వదిలెయ్యాలా అని ప్లాన్లేసే నాయకులు వాళ్ళ బాసులు. తమ వోట్ల కోసం, ఫలానా మతానికి చెందిన వాళ్ళు కాబట్టి, నేరస్తుల్ని ఏమీ చెయ్యకూడదనే కుచ్చితమైన ఆలోచనలు చేసే నేతలు వాళ్ళకి బాసులు.  ఈ రకం బాసుల కింద, ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఆ పోలీసులు, ఆ భద్రతా దళాలు హీరోలు కాక మరేంటి! ధీరోదాత్తులు కాక మరేంటి!!

శివరాజ్ పాటిల్ అక్కడికొచ్చి చెప్పింది అలా ఉంటే... ఇది 'పిరికి'చర్య అంటూ సోనియా చెప్పింది. ఈ పనికి పాల్పడిన వారికి సమాజంలో స్థానంలో లేదని కూడా చెప్పేసింది. మన్మోహన్ ఈ సంఘటనపై విచారం తెలిపి, ప్రజలను శాంతంగా ఉండాలని కోరాడు. అవే మాటలు, అదే మేకపోతు గాంభీర్యం. చేతకానితనమే చుక్కానిగా పరిస్థితులు ఎటేపు తీసుకుపోతే అటేపు, కాలంలో పడి కొట్టుకుపోతున్నారు వీళ్ళు. మనల్ని లాక్కుపోతున్నారు.

రేపణ్ణుంచి మాత్రం వాళ్ళే మళ్ళీ సిమీపై నిషేధం ఎలా ఎత్తేయాలా అని ఆలోచిస్తారు. మనం మాత్రం తరవాత జరిగే పేలుళ్ళ కోసం ఎదురుచూస్తూంటాం.

23 కామెంట్‌లు:

 1. నిజంగా హేయమయిన చర్యలు ఇవి...
  చేతకాని తనం మూర్తీభవించిన ప్రధానమంత్రి మనకి తగలడడం మనం చేసుకున్న పాపం. ఇన్ని బ్లాస్టులు జరిగినా, చేసింది మేమే అని సంస్థలు చెప్పుకుంటున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము.

  రిప్లయితొలగించండి
 2. ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి గనక వస్తే త్వరలో ఒక్క ఇండియాని కాదు, 28 ఇండియాల్ని చూస్తాం.

  రిప్లయితొలగించండి
 3. చివరికి దేఁవుడే దిక్కనే స్థితికి వచ్చాం. కనీసం మాటల్లో అయినా బుస్ బుస్ అనచ్చుగా.

  రిప్లయితొలగించండి
 4. మన కామెంట్లూ ప్రతిపక్షనాయకుల్ని తలపించాలా !

  రిప్లయితొలగించండి
 5. "పేలుళ్ళతో తల్ల ఢిల్లీ" అని ఈనాడు వార్త. ఇలా పేలుళ్ళలో మాంసంముక్కలు ఏరుకునే జర్నలిస్టులను చూస్తే ఉగ్రవాదులను చూసినంత కోపంగా ఉంటుంది నాకు. వీళ్ళ భాషా కౌశలాన్ని చూపించుకోవడానికి మంచిసందర్భాలే దొరకవా!

  రిప్లయితొలగించండి
 6. మహేష్,
  మరి ఏమనాలండి? నిజం మాట్లాడ్డానికి, ప్రభుత్వం చేతగాని తనాన్ని ఎత్తి చూపడానికి ప్రతి పక్ష నాయకులే కావాలా? "బాంబు పేలినప్పుడు మాట్లాడాల్సిన మాటలు" స్క్రిప్టు ఎక్కడుందో వెతికి దుమ్ము దులిపి మాట్లాడినట్టు లేదూ హోం మంత్రి మాటలు. రికార్డులు వెతికి చూడండి, పోయిన సారి బాంబులు పేలినపుడు కూడా సరిగ్గా ఇవే మాటలు మాట్లాడి ఉంటాడు.

  అయినా ఇంత క్లీన్ గా (కామెంట్ల స్థాయిలో)ప్రతిపక్ష నాయకులెప్పుడు మాట్లాడతారు?

  చదువరి గారు,
  చాలా ఆవేదనతో రాశారు. నిజంగా ఎప్పుడైనా సమయానికి సరిగ్గా స్పందించే సాధారణ మానవులే నిజమిన హీరోలు! గుర్తింపు కోరని ధీరో దాత్తులు! కెమెరాల్లో కనపడాలనే దుగ్ధ లేనివారు. వారెప్పుడూ నిశ్శబ్దంగా నే ఉంటారు.

  "మనం మాత్రం తరవాత జరిగే పేలుళ్ల కోసం ఎదురు చూస్తుంటాం" చాలా కదిలించింది ఈ వాక్యం!


  చంద్ర మోహన్ గారు,
  పత్రికలు ఇలాంటి శీర్షికలు పెట్టకుండా నిరోధించలేమండి! రచయిత్రి మాదిరెడ్డి సులోచన గ్యాస్ సిలిండరు పేలి మరణించినపుడు ఒక పత్రిక "మంటల్లో మాదిరెడ్డి" అని హెడ్డింగ్ పెట్టిందట! ఇక ఏమి చెప్తాం?

  రిప్లయితొలగించండి
 7. ఇలాంటివి జరగకుండా, జరిగినా ఓ జాతిగా దేముడు మీదో, లేక సుడొ సెక్యులరిసం నీడన ఆత్మనింద మీదో భారం వేయకుండా, ఏమి చేయలో అలోచించడం మంచిది.
  ఏది ఏమయినా, ఈ (కెంద్ర)ప్రబుత్వం ఉండగా మాత్రం, ఈ ఘాతుకాలకు పాల్పడెవాళ్లను పట్టుకుంటానికి చిత్తశుద్ది తో ప్రయత్నిస్తారన్న నమ్మకం మాత్రం నాకు కలగటం లేదు, అదీ ముఖ్యంగా ఎన్నికలముందు, ఎక్కడ ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయో అన్న భ్రాంతి (టెర్రరిస్ట్ హిందువు అయినా, ముస్లిం అయినా వాళ్లను అణచివెస్తే మేజారిటీ ప్రజలు ముస్లింలు అయినా, హిందువులు అయినా ఒప్పుకొంటారు అనే స్ప్రుహ ఈ తోలు మందం నాయకులకు ఎప్పుడు వస్తుందో!) లో ఈ ప్రభుత్వం ఉన్నదేమో అనిపిస్తుంది.
  చనిపోయిన వాళ్లలో, ఓ నలుగురు అయిదుగురు అయినా, ఇటాలియనులు ఉంటే (అల్లా అలోచించటం తప్పు అని తెలిసీనా), ఈ బంగారమ్మ అండ్ కంపేనీకి కొంచం చీమయినా కుట్టినంత బాధ కలుగుతుందేమో అన్న అలోచనలు కూడ వస్తున్నాయి.

  రిప్లయితొలగించండి
 8. ఊరు కాలిపోతుంటే పప్పులేరుకునేవారు కొంతమంది ఉంటారు (ఎక్కడైనా, ఎప్పుడైనా).

  రిప్లయితొలగించండి
 9. పార్లమెంటు మీద దాడి జరిగినప్పుడే ఏమీ అవ్వలేదు. ఇదొక లెఖ్ఖా..ఐ.ఎస్.ఐ వాళ్ళు ఈ దాడులు ప్లాన్ చెయ్యకముందు మనకు ఆ సంగతి తెలిసినా కూడా, అయ్యో వీడు చలికాలంలో ఆ పని చేస్తే ఆ బాంబుల మంటలతో భోగి మంటలు వేసుకుని చలికాచుకోవచ్చు అని అనుకుని, వాళ్ళకి ఆ విధంగా చెయ్యండి బాబులూ అని సలహా ఇచ్చే రకాలు మనవాళ్లు.. అదండీ...

  రిప్లయితొలగించండి
 10. పిరికి చర్యా ??
  ధైర్యంగానే పేల్చారు బాంబులు.

  రిప్లయితొలగించండి
 11. ఒక అసమర్థ ప్రధాని, విదేశీ బాస్(ప్రధాని, రాష్ట్రపతి, సైన్యాధిపతులకంటే అతీతమైన భాద్యతలు లేని అధికారం మాత్రమే వున్న పోస్టు), ఎక్కడున్నారో తెలియని రాష్ట్రపతి, ఒక నపుంసక హోమ్మంత్రి. ఇంతటి ఉద్దండపిండాలు పాలిస్తున్న మన దేశాన్ని తొక్కలో ఈ పిరికి వారు ఏమి చేయగలరు. ఎదో కొన్ని వందల మహా ఐతే కొన్ని వేల ప్రాణాలు తీయడం తప్ప. వీరన్నట్లు వారికి నిజంగా ధైర్యం వుంటే ఈ నాయకులనే బలితీసుకుంటే ఏమైనా ప్రయోజనం వుంటుందేమో. వారికి ధైర్యం కలగాలని ప్రార్థిద్దాం.

  రిప్లయితొలగించండి
 12. ప్రజలకి వాళ్ళమీద నమ్మకం లేకే కదా గత లోక్‌సభ ఎన్నికలలో మన్మోహన్‌సింగ్ ని శివరాజ్‌పాటిల్ ని చిత్తుగా ఓడించారు, అయినా మన నాయకులకి ప్రజాభిప్రాయం మీద గౌరవం ఉంటే ఇలాంటి నపుంసక వెధవని తెచ్చి హోంమంత్రి ని చెయ్యరు...చేతకాని దద్దమ్మలు...చేతకాని పనులు...అంతర్యుద్దాలతో అట్టుడుకుతూ సరైన ప్రభుత్వం లేని ఇరాక్, అఫ్గనిస్తాన్ లకి ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యం కల మన భారతదేశానికి పెద్ద తేడా కనపడటంలేదు(ఏట్ లీస్ట్ బాంబ్ బ్లాస్ట్ ల విషయలో..)పేరు గొప్ప ఊరు దిబ్బ ప్రభుత్వాలు...

  రిప్లయితొలగించండి
 13. వాళ్ళు కాదు పిరికివాళ్ళు, మనమే. ఈ దేశంలో ఏమైనా చెయ్యొచ్చనే ధైర్యం వాళ్ళకు ఎప్పుడో వచ్చేసింది. అందుకే వాళ్ళు చెప్పి మరీ పేలుస్తున్నారు. మనమేమో వారాంతాల్లో ఇళ్ళల్లో దాక్కుని, మన కుటుంబ సభ్యుల్ని బయట తిరగద్దని జాగ్రత్తలు చెప్తూ బ్రతుకుతున్నాం. మనం ఇంకా బ్రతికి వున్నామంటే, అందుకు కారణం కేవలం వారికి మన ఏరియాలో పేల్చాలన్న ఆలోచన రాకపోవటమే. we are all living at their mercy.

  రిప్లయితొలగించండి
 14. ప్రధానమంత్రిని చవటదద్దమ్మ అన్నా, సోనియాని ఆడిపోసుకున్నా, పాటిల్ ను వెన్నెముకలేనివాడన్నా అదిక్కడ అప్రస్తుతం. భారతదేశానికి టెర్రరిజంతో పోరాడటానికి సరైన "వ్యవస్థ" లేదనేదే నిజం. అది ఇప్పటి ప్రభుత్వమైనా, ఉక్కుమనుష్యులు పాలించిన బీజేజీ ప్రభుత్వమైనా రెంటికీ పెద్ద తేడా లేదు.

  రాజకీయ అవసరాలు,అవకాశాలేతప్ప దేశభద్రత, సమగ్రత మూలసిద్ధాంతంగా లేని రాజకీయాలు సాగుతున్నంతకాలం మన దేశం ఒక చేతకాని దేశంగా మిగలాల్సిందే.కనీసం ఇప్పుడైనా పార్టీరాజకీయాల స్థాయినుంచీ ఎదిగి, నాయకులందరూ ఏకతాటిపైన నడిస్తేగానీ ఈ సమస్యకు అంతం కనీసం దరిదాపుల్లోకూడా కనబడవు.

  రిప్లయితొలగించండి
 15. " మనం ఇంకా బ్రతికి వున్నామంటే, అందుకు కారణం కేవలం వారికి మన ఏరియాలో పేల్చాలన్న ఆలోచన రాకపోవటమే. we are all living at their mercy."

  ఇంత అద్భుతమైన వ్యాఖ్యని ఈ మధ్యకాలంలో చదవలేదు. చైతన్యకృష్ణగారూ ! వీళ్ళని మళ్ళీ ఎన్నుకుంటే వస్తాయి, ఆ "బంగారు" రోజులు కూడా !ఆ టెఱ్ఱరిస్టులు మన ఇళ్ళలో చొఱబడి మనందఱినీ మఱో లోకానికో మఱో మతానికో మార్చేదాకా ఇలా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటారు కాబోలు ఈ భస్మాసుర హస్తులు. లేదా అందఱమూ తలో పిస్టలూ, బాంబూ పట్టుకుని తిరిగే పరిస్థితికి తీసుకొస్తారు కాబోలు. వాళ్ళకేం ? వాళ్ళు హాయిగా ఇటలీకి పాఱిపోతారు.

  రిప్లయితొలగించండి
 16. paripaalakulu nibaddata kaliginavaaru kaanappudu manabratukulimte ani EdvaTammaatramE piriki janaaniki migilEdi. 200+200 samvatsaraalugaa pirikitanam mana naranaraalalO jIrnimchku pOyimdi. daanitO nE manam kukkalaku kooDaa lOkuvavautunnaamu.

  రిప్లయితొలగించండి
 17. 'పిరికి' అని నేనన్నది ఉగ్రవాదులను పిరికివాళ్ళుగా వర్ణించే మన నాయకులను విమర్శించే -విరక్తితో కూడిన వ్యంగ్య ధోరణిలోనేనన్నది గ్రహించగలరు.

  రిప్లయితొలగించండి
 18. uncle . ఉగ్రవాధులు ఎందుకు చంపుతున్నారు. వాళకి ఏమి కావాలి ట.? వాళ్ళు రాక్షసులే జాలి లేదు . ఏ కారణం లేకుండా ........అమాయకులను వాళ్ళు చంపుతున్నారు. ఇది మన దేశము . మన దేశమును ఎలా కాపాడాలో....................మరి.
  Sree vaishnavi
  lahari.com

  రిప్లయితొలగించండి
 19. మీ టపా శీర్షిక చూడగానే ఇది ఢిల్లీ లో బాంబు పేలుళ్ళ గురించి అని అర్ధమై, వాఖ్యలలో ఒకటో రెందో చదివి..ఇంకేమిటి కబుర్లు?

  రిప్లయితొలగించండి
 20. ప్రతి అనాగరికపు చర్య రాజకీయ నాయకుల దగ్గరే ఆగవలెనా???

  రిప్లయితొలగించండి
 21. ప్రధానమంత్రిని చవటదద్దమ్మ అన్నా, సోనియాని ఆడిపోసుకున్నా, పాటిల్ ను వెన్నెముకలేనివాడన్నా అదిక్కడ ఎందుకు అప్రస్తుతమో నాకు తెలియట్లేదు. వారే ప్రస్తుత మన పాలకులు. ఈ హోమ్మంత్రి ఇస్తున్న స్టేట్మెంట్లు చూస్తుంటే ఇటువంటి విషయాలు పాలనలో ఒక భాగమన్నట్లున్నాయి. ఇతణ్ణీ చూసి పోలీసులుకూడా తీవ్రవాదులను వెదకటం మానేస్తారు. అనుమానముంటే అతని స్టేట్మెంట్లు చూడండి. రాజకీయాలను పక్కన పెడితే మోడి చెప్పిన వార్థను కొంత పరిశొధించుంటే కొంచెమైనా ఫలితముండేది. దీనికి నేను మోడిని సమర్థిస్తున్నానని అతని విధానాలను ఇక్కడ పాడొద్దు. ఇక్కడ నా ఉద్దేశ్యం మన నాయకులకు విషయం ముందుగా తెలుసుననే.

  ఇక ముసుగులను తీసేసి మాట్లాడితే, కనీసం ఇటువంటి విషయాలలో భాజపా వారు కాంగ్రెస్స్ కన్నా మెరుగే.

  రిప్లయితొలగించండి
 22. ఎంథైనా గాందెయ వాదులు కదా .అందుకె ఒక చెంపపై కొడితె మరొ చెంప చూపమన్నట్లు ముంబై లొ పెలితె డిల్లి ని చూపించారు

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు