17, జూన్ 2008, మంగళవారం

లోకలు వార్మింగు

కొత్తపాళీ గారు అదిలించడంతో గ్లోబలు వార్మింగు పట్ల నేనూ కాస్త హడావుడి పడదామని త్వరపడ్డాను. నిజం చెప్పొద్దూ.. ఈ దీపాలార్పడంలో (ప్రతిపదార్థంలోనే తీసుకోండి సుమా!) నాకంత నమ్మకం లేదండీ. కానీ ప్రజల్లో అవగాహన కలిగించడం దీని ముఖ్య ఉద్దేశ్యం అని తెలిసాక, ఇలా అవగాహన కలిగించడం కోసం నేనూ ఏదైనా చెయ్యాలని తలపోసాను. పోసాక, ఏం చెయ్యాలో నిశ్చయించుకున్నాను. కున్నాక, పని మొదలెట్టాను. ఇక్కడో ముక్క చెప్పాలి:


గ్లోబలు వార్మింగు గురించి చెప్పడమే నా పని, చేసేదేమీ లేదు అని నేను అనుకున్నాను. అసలు నన్ను కర్తవ్యోన్ముఖుణ్ణి చేసిందే ఇది.

ముందుగా ఆఫీసులో జనాన్ని ఒకచోట కూలేసి, క్లాసు తీసుకున్నాను.

"చూడండీ, మీ పిల్లలకు ఆహార భద్రత, పర్యావరణ భద్రత, ఆరోగ్య భద్రత, వగైరాలను ఎలా ఇస్తారూ?" అని అడిగాను. వాళ్ళ తెల్లమొహాలను తనివితీరా చూసుకున్నాక, గ్లోబలు వార్మింగు గురించి చెప్పి "మీరూ లైట్లు ఆర్పండి, ఈ సంగతిని మీరు మరో పదిమందికి చెప్పండి. నేను కూడా మా అపార్టుమెంటులో పన్నెండు మందికి చెబుతున్నాను." అని అన్నాను.


~~~~~~~~~~~~~

ఇంటికి పోయాక, మావిణ్ణి, పిల్లల్ని సమావేశపరచి గ్లోబలు వార్మింగు గురించి ఉపన్యాసమిచ్చి, దీనిపై మనమంతా తక్షణమే స్పందించకపోతే మనకు పుట్టగతులుండవని హెచ్చరించాను. అంతటితో ఆగకుండా మా రక్షకుణ్ణి పిలిచి, ఓ కాగితం రాసిచ్చి మా అపార్టుమెంటు జనాలకు పంపించాను. అయినా నాకు తృప్తి కలగలేదు. భూతాపోద్దీపనపై పద్యాలు రాద్దామని సంకల్పించాను. కళ్ళు మూసుకుని పద్యాలు కుట్టడం మొదలెట్టాను. అప్పటికే నా హడావుడితోటి మావిడకి చిరాకెత్తి నట్టుంది. ఈ పద్యగానంతోటి వళ్ళు మండింది.. "పద్యాలు రాసుకుంటే రాసుకోగానీ, పాడకు. నాకు చిరాకు" అంది. పద్య సౌందర్యాన్ని చూసేందుకు ఈవిడ కళ్ళెప్పుడు తెరుచుకుంటాయో అని అనుకుంటూ కళ్ళు తెరిచాను. ఎప్పుడు జారుకున్నారోగానీ, పిల్లలిద్దరూ లేరు.

సృజనాత్మకమైన పనిని ఇలా చిన్నబుచ్చిందే అని మనసులో బాధపడి "అసలు గ్లోబల్ వార్మింగు ఎంత ప్రమాదకరమో నీకింకా అర్థమైనట్టు లేదు" అని అన్నాను, కాస్త నిష్ఠూరం ధ్వనిస్తూ. వెంటనే "వార్మింగు గురించి నాకు తెలుసులెమ్మం"టూ తాను రాసిన బ్లాగు చూపించింది. గుండె కలుక్కుమంది. ముందుగా నాకొక్ఖ ముక్క చెబితే ఏంబోయింది అని మనసు మూలిగింది.

"మరి, నువ్వు బ్లాగు రాసుకున్నావుగానీ, నేను పద్యాలు రాసి బ్లాగులో పెడదామంటే అడ్డుకుంటావే?" అని ఆక్రోశించాను.

"గ్లోబలు వార్మింగు గురించి కాదుగానీ లోకలు వార్మింగు గురించి ఆలోచించు చాలు" అంది.

'లోకలు వార్మింగా?' విస్తుపోయాను. నేను తేరుకునేలోపే "అందరూ గ్లోబలు వార్మింగును పట్టించుకునేవారే! కనీసం నీలాంటి చైతన్యశీలురన్నా లోకలు వార్మింగును పట్టించుకోకపోతే ఎలా" అని అంది.

అందులో ఎగతాళి ఏమైనా ఉందేమోనని సందేహించబోయానుగానీ, అయాచితంగా దొరికిన చైతన్యశీలి అనే గొప్ప మెప్పును అంత తేలిగ్గా కొట్టి పారేసేందుకు నాకు మనసు రాలేదు. కానీ ఈ లోకలు వార్మింగు ఏంటసలు? ఆమధ్య పొద్దులో భూతాపం గురించి త్రివిక్రమ్ గారు రాసినప్పుడూ, ప్రశాంతి, కొత్తపాళీ గారలు బత్తీబందు పెట్టి గ్లోబలు వార్మింగు గురించి చెప్పినప్పుడూ గ్లోబలు అని అన్నారు గానీ లోకలనలేదు. జాలంలో కూడా గ్లోబలు గురించి చాలానే సరుకు కనిపించింది గానీ ఎక్కడా లోకలు వార్మింగు గురించి కనబడిన గుర్తు లేదు. ఏంటబ్బా అది?

"అదేంటో నాకు తెలీదు, నువ్వేచెప్పు" అని అడుగుదామంటే.. "ఆ మాత్రం తెలీదా" అని నా దగ్గర ఆశ్చర్యపోవడం మాత్రమే కాకుండా, బ్లాగులో కూడా ఆశ్చర్యపోతుందేమోనని భయమేసింది. అంచేత "ఔనౌను, లోకలు వార్మింగు గురించి కూడా మనం జాగ్రత్త వహించాలి, నేనాపనిలో ఉంటానిక" అని చెప్పి అర్జెంటుగా బైటకు పోబోయాను, అక్కడే ఉంటే దాని గురించి తరచి అడుగుద్దేమోనని.

"అదేంటి వెళ్తున్నావ్, టీవీ ఎవరు కట్టేస్తారు, ఆ గదిలో లైట్లెవరార్పుతారు, ఫ్యానెవరు ఆపుతారు?" అని అడిగింది. నాకు జీవితంలో అస్సలు నచ్చని పని - ఈ కట్టెయ్యడాలు, ఆర్పడాలు, ఆపడాలు. చిన్నప్పుడు మానాన్న నా ప్రాణం తీసేవాడు - లైటు తియ్యి, లైటు తియ్యి అని. పెళ్ళయ్యాక మావిడ పుచ్చుకుంది ఆ బాధ్యత. నాకు చిరాకని తెలిసి కూడా అలా చెప్పడం మానదు. పైగా తీసేదాకా ప్రాణం తీస్తుంది. తప్పదు కాబట్టి, విరక్తిగానైనా టీవీ కట్టేసి, లైట్లార్పి, ఫ్యానాపి బయల్దేరాను. మావిడ తెలివైంది, ముందో రూలెట్టింది.. ఎవరేస్తే వాళ్ళే ఆర్పాలి అని. తానేమో ఫ్యాన్లూ, లైట్లూ వెయ్యదు, టీవీ పెట్టదు. నాకోసం కాచుక్కూచుంటుంది, నేనెలాగూ ఇంట్లోకి రాగానే ఓపెన్ సెసేమ్ అన్నట్టు అన్ని స్విచ్చిల్నీ టకటకా నొక్కేస్తాను గదా, అందుకోసం!

బయటికి పోయేందుకు చెప్పులేసుకుంటూండగా వెనకనుండి అంటోంది.. "లోకలు వార్మింగును తగ్గించడమంటే ఇదే! ఏడాదికోసారి గోవాడ తిరణాల జరిగినట్టు లైట్లార్పే పండగ చెయ్యగానే సరికాదు మేష్టారూ, రోజూ జాగ్రత్తగా ఉండాలి."


~~~~~~~~~~~~~

పని చెయ్యమని నోరు పెట్టుకోని ఉపన్యాసం ఇవ్వొచ్చు, ఓ పేజీ నిండా నోటీసు రాసి పంపొచ్చు.. కానీ మనమే ఆ పని చెయ్యాలంటే ఎలా?

చెప్పడమే నాకిష్టం, చెయ్యడం కాదు. సమాజం మాత్రం 'చెప్పడమే కాదు చెయ్యాలి కూడా' అంటోంది. 'ఎవడికి ఇష్టమైన పని వాడు చెయ్యాలి. సమాజమా గాడిదగుడ్డా.., దాన్నేం పట్టించుకోనక్కరలేదు' అని అనుకుందామనుకున్నా... నా విషయంలో మాత్రం 'ఆర్పమని చెవటమే కాదు, ఆర్పాలి కూడా' అనే సమాజపు ఎంగిలి విలువే చెల్లుబాటవుతోంది. ప్చ్! ఇకపై లోకలు వార్మింగును అరికట్టాలని నిర్ణయించుకున్నాను; తప్పేట్టు లేదు!

22 కామెంట్‌లు:

 1. చదువరి గారు,

  మంచి టచ్ ఇచ్చారు లోకల్ వార్మింగ్ అంటూ. ఈ సందర్భంగా ఆర్ధిక శాస్త్రం లో ఓ సూత్రం గుర్తొస్తోంది. సమాజంలో ఉన్న ప్రతీ వ్యక్తీ పూర్తి స్వార్ధంతో కేవలం తనకోసం మాత్రమే తాను పనులు చేసుకుంటూ బతుకుతున్నా, వాడికి తెలియకుండానే వాడు చేసే కొన్ని పనుల విలువ దేశ జీ.డీ.పీ కి కలుస్తాయి. దీనికో పేరుంది గానీ ఇప్పుడు గుర్తుకు రావట్లేదు.

  అలానే, ఈ వార్మింగు వార్మింగు అని చెప్పే బదులు, బాగా జంధ్యాల మార్కు పీనాసితనం ప్రోత్సహించి, మీకే డబ్బులు బాగా మిగులుతాయని ప్రచారం చేస్తే ఉభయ తారకంగా ఉంటుందేమో. ఎంతైనా భారతీయులు పొదుపరులన్న పేరు మొదట్నించీ ఉన్నదేగా. :-)

  రిప్లయితొలగించండి
 2. సెబాషో!
  మీకో వీరతాడు!!
  మీ శ్రీమతిగారికి రెండు!!! :-)

  రిప్లయితొలగించండి
 3. ఏం క్రియేటివిటీ చూపిస్తున్నారు జనాలు ఈ గ్లోబల్ వార్మింగు గురించి... భలే.

  రిప్లయితొలగించండి
 4. Think globally, act locally అంటారు. అంటే,ఎక్కడో ధృవాల దగ్గర మంచుటోపీ కరిగిపోతోందని ఆలోచించి, ఇంట్లో లైటార్పడం అన్నమాట.

  ఇందులో శ్రమ మీదైనా,ప్రశంస మాత్రం మీ ఆవిడగారికే చెందుతుంది.

  రిప్లయితొలగించండి
 5. చాలా బావుంది సారూ మీ లోకల్ వార్మింగు.
  మా యింట్లో కూడా అస్తమానూ వేసి ఉంచే చిన్నదైన వంటగదిలో లైటు నేనార్పినపుడల్లా నేను వేసి ఆర్పకుండా వదిలేసిన వాటి గురించి మా పనమ్మాయీ, మా ఆవిడా నా మీద డబుల్ క్లాసు కలిపి ఉమ్మడిగా తీసుకుంటుంటారు.

  రిప్లయితొలగించండి
 6. హిహిహి..అన్ని బత్తీబందు టపాల్లో నా ఓటు ఈ టపాకే
  వికటకవీ ఏనుగు కుంభస్థలం మీద కొట్టారు (nailed it)

  రిప్లయితొలగించండి
 7. స్థానికత లోనే సార్ధకత ఉందని చాలా బాగా చెప్పారు.కానీ చావుకు పెడితే తప్ప లంఖణానికి దిగని జనానికి కాస్త మోతాదు ఎక్కువగానే ఇవ్వాల్సుంటుంది.నాలాంటివాళ్ళు స్థానికంగా చిన్నచిన్నప్రయత్నాలు చేస్తున్నాము.ఆసికానికనుకున్నా వికటకవిగారి వాక్కుకు కార్యాచరణరూపం కల్పించినా మంచి ఫలితాలు రాబట్టచ్చు.పర్యావరణాన్ని కాపాడండి మొర్రో అని ఒక లక్ష కరపత్రాలు ఎంపికచేసిన స్తలాల్లో పంచబోతున్నాను,నా చేతుల్తో స్వయంగా.ఆ వివరాలు త్వరలో మీ ముందుకు..

  రిప్లయితొలగించండి
 8. మా ఇంట్లోనూ డిటో డిటో డిటో...చీ చీ, ఈ భార్యామణులెప్పుడింతే..అని పెళ్ళయిన ఉదయ కిరణ్ లా బాధ పడ్డా మీ టపా చూసి..

  రిప్లయితొలగించండి
 9. ఇంతకీ మీ శ్రీమతిగారు హెచ్చరించిన లోకలు వార్మింగంటే మీరు గంటకోసారి కాల్చిపారేసే గోల్డు-ఫ్లేకులేమో కాస్త కనుకున్నారా? పోస్టు అదిరింది - దీన్నసలు పొద్దు సంపాదకీయాల్లో పెట్టాల్సింది.
  ఛీర్స్,
  సిముర్గ్

  రిప్లయితొలగించండి
 10. కొత్తపాళీగారు చెప్పారని అందరూగోల చేస్తుంటే మీరు కూడా కాస్త ఆలోచించి రాసారు . సరే. కాని ఇంత కష్టపడి రాసినా, అభినందనలు మీ ఆవిడకే వెళ్తున్నాయే. ఐనా లోకల్ వార్మింగ్ తగ్గిస్తే మీ పర్సు వార్మింగ్ కూడా తగ్గుతుంది కదా. ఆ రూట్‍లో ఆలోచించండి..

  రిప్లయితొలగించండి
 11. హ్హ హ్హ భలే నవ్వించారు.
  "నా దగ్గర ఆశ్చర్యపోవడం మాత్రమే కాకుండా, బ్లాగులో కూడా ఆశ్చర్యపోతుందేమోనని " ఇది మాత్రం నాకింకా నవ్వు తెప్పిస్తోంది. అయ్యో నా శ్రీమతి నా బ్లాగులు చదవదే అని బాధ పడేవాన్ని. శ్రీమతి బ్లాగులు చదవకపోతే ఎంత బ్లాగానందమో, తను రాయకపోతే ఇంకా అంత భయరాహిత్యం అని మీ బ్లాగు ద్వారా తెలిసిపోయింది.

  --ప్రసాద్
  hhtp://blog.charasala.com

  రిప్లయితొలగించండి
 12. ది బెస్టు పోస్టు!
  సిముర్గ్ ఏదో అంటున్నారూ ...?
  ఆయనక్కూడా చెప్పడమంటే ఇష్టమున్నట్టుంది. :)

  రిప్లయితొలగించండి
 13. మీ బ్లాగుని "మళ్లీ" ముస్తాబు చేశారే...
  టపా బావుంది..
  నా శ్రీమతి ఈ లోకల్ వార్మింగ్ వంకతో ఒంటిపూట వంట కార్యక్రమం ఆరంభించింది :(

  రిప్లయితొలగించండి
 14. మళ్లా రూపు రేకా విలాస లావణ్యాలు మార్చినారా? అయ్యో! మీకంత సమయమెక్కడిది?

  నాకయితే పాతదే నచ్చింది.

  ఈ పోస్టు బాగానే ఉన్నట్టున్నది, అందరూ అదే అంటున్నారు కదా! నాకయితే మరీ ఇలా ఫామిలీ విషయాలు బ్లాగులకెక్కడం నప్పదు :)

  రిప్లయితొలగించండి
 15. భూతాపోద్దీపనమా... ఇలావింటుంటే ఇదే భూతాలకూ... దయ్యాలకూ.. సంబంధించిందిలాగుంది. చాలాబాగుంది పోష్టు.

  రిప్లయితొలగించండి
 16. అభినందించిన అందరికీ నెనరులు.

  వికటకవి: అలాగన్నా చెయ్యాలి, లేదా ప్రభుత్వమే బలవంతంగా చేయించాలి.

  రాజేంద్రకుమార్: విజయోస్తు!

  సిముర్గ్: ఇదివరకది బర్నింగు! తగ్గించి వార్మింగుకు తెచ్చాను. :)

  రానారె: సిముర్గ్ సంగతేమోగానీ, నాకు మాత్రం.. "చెప్పుటలో ఉన్న హాయీ..." :).

  ఊదం: ఆ "మళ్ళీ" తరవాత మరో "మళ్ళీ" అయింది :) తప్పలా మరి!

  ఒరెమూనా, కొత్తపాళీ: మార్చాను. రంగులను కాస్త చల్లబరచాను. బ్లాగు వార్మింగును తగ్గించానన్నమాట!

  మళ్ళీ ఒరెమూనా: "నాకయితే ... నప్పదు " -కూల్! :)

  రిప్లయితొలగించండి
 17. ఈ మూస బావుంది కానీ సగం పుట ఖాళీగానే కనిపిస్తోందే ! Header లో ఏదైనా బొమ్మ పెట్టండి.

  రిప్లయితొలగించండి
 18. ఈ వ్యాఖ్యను కొత్తగా బ్లాగ్రు ప్రవేశపెట్టిన ఇన్‌లైన్ వ్యాఖ్యలపెట్టెను వాడి రాసాను. ఈ అంశం చాలా బాగుంది, ఎంతగానో అవసరమైఅనది, ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్నదీను. బ్లాగరు కొత్తగా అనేక అంశాలను ప్రవేశపెట్టింది. వాడి చూడండి.

  రిప్లయితొలగించండి
 19. అవునవును... మంచి ఫీచర్లు జోడించాడు (డ్రాఫ్టులో ఉన్నాయి ప్రస్తుతం).
  స్టార్ రేటింగు కూడా ఉంది.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు