24, జనవరి 2007, బుధవారం

కార్పొరేటు చిల్లర కొట్లు

దేశంలో చిల్లర కొట్ల విప్లవం వస్తూంది. రిలయన్సులూ, టాటాలు చిల్లర కొట్లు పెట్టేస్తున్నారు. ఎక్కడ చూసినా సూపరు బజార్లే! కూరగాయలను కూడా వదలడం లేదు. ఇలా కార్పొరేటు చిల్లర కొట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి, సాధారణ కొట్లు తాళాలేసుకునే పరిస్థితికి వస్తాయేమోననిపిస్తోంది.

కార్పొరేటు కొట్లలో ధరలు తక్కువగా ఉన్నాయంటున్నారు. ఇదే మొదలు కాబట్టి అలా ఉండొచ్చు. కానీ అవి తామరతంపరగా పెరిగిపోయి, సన్నకారు దుకాణాలు మూలన పడ్డాక, అప్పుడు ఈ కార్పొరేట్లు తమ అసలు రంగును బయట పెడితే మన పరిస్థితి ఏమిటి? ప్రభుత్వాన్నే అదుపు చెయ్యగల సంస్థలవి. మనం ఎదుర్కోగలమా!? సిమెంటు రేట్లు తగ్గిపోయినపుడు కంపెనీలన్నీ కలిసి ఉత్పత్తి తగ్గించి రేట్లను పెంచాయలాగే!

ఈ కార్పొరేటు చిల్లరకొట్లు మనలనెక్కడికి తీసుకెళతాయో!! టోకు దుకాణాలకు మాత్రమే కార్పొరేట్లను పరిమితం చేసి, చిల్లర రంగంలోకి వాళ్ళను అనుమతించకపోతే మంచిదనిపిస్తోంది.

5 కామెంట్‌లు:

 1. ఈ విషయంలో అమెరికాలోని కార్పొరేటు చిల్లరకొట్టుల చరిత్ర తెలుసుకుంటే, పరిస్థితిని కొంత ఊహించవచ్చునేమో...

  రిప్లయితొలగించండి
 2. అమెరికాలో వాల్‌మార్ట్ వాడి దెబ్బ కి చిల్లర కోట్లు చాలనే మూతబడ్డాయి. అందుకే కొన్ని ప్రాంతాలలో వాళ్ళని కొట్టు కూడా పెట్తనీయారు

  రిప్లయితొలగించండి
 3. నేను ఈ మధ్య ఇంటికి వెళ్ళినప్పుడు మా కుటుంబ స్నేహితులు ఒకరు ఇదే చెప్పారు నాకు...(నా బ్లాగులో రైతుల గూర్చి రాసిన టపా చదివి). ఇదొక రకమయిన దోపిడీ అని అతనన్నారు. నిజమేననిపిస్తుంది. మొదట మనకు అలవాటు అవనిస్తారు. తరువాత మనమే అలవాటు పడి, అవసరం అనుకుంటాం. మొబైల్ రంగంలో కూడా ఇదే జరిగింది. అన్ని ప్రయివేట్ కంపనీలు బాగా జెండాలు పాతాకనే మన బీ.యస్.యన్.యల్ కు అనుమతి ఇచ్చారు కదా.

  రిప్లయితొలగించండి
 4. ఇప్పుడున్న కిరాణా కొట్లలో నాణ్యమైన సరుకు దొరకట్లేదు. (ఇప్పుడేమైనా మార్పు వచ్చిందా?) ఏమయ్యా బియ్యంలో రాళ్ళున్నాయి అంటే నాకు తెల్వదు పైనుంచీ అలాగే వచ్చాయి అంటాడు. పైనుండే వాడేఎవరో కల్తీకి ఎవరిని నిందించాలో తెలియని పరిస్థి సామాన్యుడిది. (తిరుమల నిత్యాన్నదానానికే ఇసుక నింపిన నూనె అంటగట్టారట!) అదే కార్పొరేట్లయితే కల్టి అయినా, నాసిరకమైనా తీసుకెళ్ళి వాడి మొహాన కొట్టవచ్చు. ఒక బ్రాండును మనం నమ్మాము అంటే అది పాపులర్ అవుతుంది. నాసిరకం, కల్తీ అమ్మే బ్రాండ్లు మార్కెట్ శక్తుల ముందు తలవంచుకు తీరతాయి. ఎంత పెద్ద కార్పొరేట్ సంస్థ నైనా మార్కెట్ శక్తులే నిరోదించాలి. అన్ని చార్పొరేట్ సంస్థలూ కలిపి రేట్లు పెంచి దోచుకోకుండా మాత్రమే ప్రభుత్వమూ, కోర్టులు నిరోధించాలి.
  అమెరికాలో వున్న ఈ విధానం అపసవ్యంగా నడుస్తున్నట్లు నాకేమీ ఆధారాలు దొరకలేదు. వాల్‌మార్ట్ ను కొంత మంది ప్రజలు వ్యతిరేకించడానికి, తమ దగ్గర లేకుండా వుండాటానికి కారణాలు వేరు. (దేవాలయము, చర్చి, బస్సు స్టేషను లాంటి ప్రజా సౌకర్యాలకు కూడా స్థానికులు అబ్యంతరం చెబుతారిక్కడ! వీటివల్ల అల్పాదాయ వర్గాలు సంచరించడం ఎక్కువయి నేరాలు పెరుగుతాయని భయం!) చవకైన వస్తువులు, నాణ్యతగా దొరికేది వాల్‌మార్ట్‌లోనే అని అందరికీ తెలుసు. ఒకే బ్రాండు వస్తువు యొక్క ధర వాల్‌మార్ట్‌లో వున్నంత తక్కువగా ఇంకెక్కడా వుండటం నేను గమనించలేదు.
  ఇక్కడ మార్కెట్లలో దొరికే బియ్యంలో రాయి గానీ, కూరగాయల్లో పురుగు గానీ నేనింతవరకు చూడలేదు. మరి వినియోగదారుడికి కావలిసిందదే కదా? అయితే ఈ కార్పొరేట్ల మద్య స్నేహం కాకుండా పోటీ వున్నంత వరకూ అటు రైతుకు, ఇటు వినియోగదారుడికీ రెండందాలా లాభమే! కిరాణా కొట్ల వ్యాపారులు నష్టపొయేది నిజమే! కానీ ఈ అనివార్యమైన మార్పుకు వాళ్ళు తలొగ్గకా, సర్దుకుపోకా తప్పదు.
  --ప్రసాద్
  http://blog.charasala.com

  రిప్లయితొలగించండి
 5. ఎంత గగ్గోలు పెట్టిన జరిగేది అదే. కంప్యూటర్లొచ్చి ఎన్ని టైపు ఇన్స్టిట్యూట్లు మూతపడలేదా. ఈ కిరాణా కొట్లు ఎంత త్వరగా తేరుకొని కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తే అంత మంచిది. ఉదాహరణకి హోం డెలివరీ చేపట్టడము. ఫోన్ ద్వారా ఆర్డర్లు స్వీకరించడము మొదలైనవి కొన్ని. ఈ పెద్ద కంపెనీలలో మానవీయ సంబంధముండదు..దీన్ని ఆధారము చేసుకొని చిన్న కొట్లు కూడా అభివృద్ధి చెందవచ్చు. వాల్ మార్ట్లు వ్యాపించినా చిన్న చిన్న రోడ్డు మూలన ఉన్న దుకాణాలు మూత పడలేదు ఎందుకంటే సౌకర్యము. ఓ ఎగేసుకోని వాల్ మార్టుకెళ్లాలంటే ట్రాఫికులో అర్ధగంట సేపు వెళ్లి రావాలి. చిన్న చిన్న వస్తువులు ఇంటి పక్కన స్టోరులో రెండింతల ఖరీదున్నా సౌకర్యార్ధము కొంటుంటారు. ఇక్కడ వాల్ మార్టుల బిజినెస్ మాడల్ వేరు చిన్న చిన్న దుకాణాల బిజినెస్ మాడల్ వేరు. వాల్ మార్ట్ బిజినెస్ మాడల్ తక్కువ ధరలు అయితే చిన్న చిన్న దుకాణాల బిజినెస్ మాడల్ సౌకర్యము, హ్యూమన్ టచ్ మీద ఆధారపడుతుంది. (అయితే ఇందులో నాకు తెలియని విషమేమిటంటే భారత దేశములో ప్రతి వస్తువును ఎంతకమ్మాలో ఇంకా ప్రభుత్వమే నిర్ణయిస్తుందా?)

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు