9, డిసెంబర్ 2006, శనివారం

తెలంగాణా సెంటిమెంటు + యాంటీ కాంగ్రెసు సెంటిమెంటు = కరీంనగర్

కరీంనగర్లో తెరాస గెలుపు కారణంగా తెలంగాణ వస్తుందో రాదో తెలీదు గానీ, తెలంగాణ కావాలని కరీంనగర్ ప్రజలు కోరుకుంటున్నారనేది మాత్రం తేటతెల్లమై పోయింది.
కాంగ్రెసు మోసాన్ని, కుటిలనీతిని, మాటలు మార్చే తత్వాన్ని ప్రజలు గ్రహించారు, ఆగ్రహించారు. వారి ధర్మాగ్రహమే నేటి తెరాస విజయం.
కేసీయారు పై ప్రజలకు వల్లమాలిన అభిమానం ఉందో లేదో గానీ, తెలంగాణ కాంక్షించి మాత్రం ఆయనకీ మెజారిటీ ఇచ్చారనేది సుస్పష్టం.
బీజేపీపై అపనమ్మక ముందో లేదో గానీ, తెరాస గెలవకపోతే తెలంగాణ ఏర్పాటు కష్టమౌతుందని బీజేపీని మూలన కూచ్చోబెట్టారు.

గత ఎన్నికల తరువాత కేసీయారు ఏం చేసాడయ్యా అంటే..
- రెండేళ్ళపాటు మంత్రి పదవిలో ఉండి ప్రజలనేమాత్రం పట్టించుకోలేదు
- ఇదుగో తెలంగాణ అదుగో తెలంగాణ అంటూ గడువులూ తేదీలు పెట్టి చివరికి పెదవి విరిచాడు
- నిరాహారదీక్ష అంటూ ప్రహసనం చేసాడు
పత్రికల్లో, టీవీల్లో ఒక్కరికి కూడా కేసీయారుపై సానుకూలత లేదు
ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత గత స్థానిక ఎన్నికల్లోనే తెలిసింది.

మరి ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా కేసీయారు ఇంత అద్భుతంగా ఎలా గెలిచాడు?
కేసీయారుకు వోటెయ్యకపోతే తెలంగాణ కు వ్యతిరేక వోటు అవుతుందని ప్రజలు తలచారు. కేసీయారే కాదు, ఇంకెవరినైనా ఇలాగే గెలిపించేవారేమో!!
ప్రజల విజయమిది. తెలంగాణ కావాలని ప్రజలింత గట్టిగా గత ఎన్నికలలో కూడా అడగలేదు!

కరీంనగరే యావత్తెలంగాణా అభిప్రాయానికి కొలబద్దా అనే ప్రశ్నకు.. కరీంనగర్లో ప్రజలనుకుంటున్నది మిగతా తెలంగాణలోనూ అనుకోవడంలో అసహజమేముంది? కొన్ని ప్రాంతాల్లో ఇంత బలంగా అనుకోకపోవచ్చు, కొన్ని చోట్ల ఇంతకంటే బలవత్తరంగా కాంక్షించనూ వచ్చు. ఏదేమైనా, ఈ ఎన్నిక ఫలితం ప్రజల్లో తెలంగాణ కావాలన్న కోరికను మరింతగా పెంచుతుందనేది మాత్రం సత్యం.

తెరాస తెలంగాణ తెస్తామని అంటోంది, అదొక్కటే మా ఎజెండా అని అంటోంది. మంచిదే!
తెలుగుదేశం, కమ్యూనిస్టులు తెలంగాణకు వ్యతిరేకమంటున్నారు. ఆచరణలోనూ చేస్తున్నారు. తమ విధానం ఇదీ అని బయటికి చెప్పేస్తున్నారు, బానే ఉంది !
కానీ కాంగ్రెసో..?
తెలంగాణ కావాలంటోంది, కానీ ఇవ్వడంలేదు. ఎందుకంటే కమ్యూనిస్టులు కలిసిరావడం లేదంటూ దొంగమాటలు చెప్పింది. వాళ్ళసలు కలిసివస్తామని ఎప్పుడు చెప్పారు? కలుస్తానంటున్న బీజేపీని కాదంటోంది. ఇప్పుడు, కరీంనగర్లో కన్ను లొట్టబోయాక, దిగ్విజయ్ ఏమంటున్నాడు.. తెలంగాణ కావాలంటే రెండో ఎస్సార్సీ వెయ్యాల్సిందే. (నిజానికి 2004 ఎన్నికలకు ముందు వాళ్ళు తెరాసతో చేసుకున్న ఒప్పందమిదే, కానీ ఇంత గట్టిగా ఎప్పుడూ చెప్పలేదు, నానుస్తూనే ఉండేవారు) పైగా ఎస్సార్సీ వెయ్యాలన్నా ఏకాభిప్రాయం కావాలని అంటున్నాడు!

కాంగ్రెసు ఏనాడూ నమ్మదగ్గ పార్టీ కాదు. జవహర్‌లాల్ నెహ్రూ గురించి తెరాస నాయకులు ఓ విషయం చెబుతూ ఉంటారు.. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడేటపుడే నెహ్రూ ఇలా అన్నాడట, "గడుసు ఆంధ్రకు అమాయక తెలంగాణను ఇచ్చి పెళ్ళి చేస్తున్నాను, ఎప్పుడు నచ్చకున్నా తెలంగాణ విడాకులు తీసుకోవచ్చు" అని. అది నిజమో కాదో తెలీదు (ఎందుకంటే, ఉద్యమ ప్రస్థానంలో తెరాస నాయకులూ, వారి వంతగాళ్ళూ ఎన్నో అబద్ధాలను వ్యాపింపజేసారు) నిజమే అయితే..
పెళ్ళి రోజే, స్వయానా పెళ్ళి పెద్దే విడాకుల దీవెనలిస్తాడా? అసలదేం నీతి? బ్రిటిషు వాళ్ళు దేశాన్ని చీల్చి వెళ్తే, ఈయన రాష్ట్రాన్ని చీల్చదలచిన వారికి ఓ కారణాన్ని ఇచ్చిపోయాడు. అసమానతలు ఏర్పడకుండా ఖచ్చితమైన నిబంధనలు ఏర్పాటు చెయ్యొచ్చు కదా. చెయ్యాల్సిన బాధ్యత, చెయ్యగల అధికారమూ గల పదవిలోనే ఉన్నాడు కదా. రాష్ట్రం ఏర్పడ్డాక, ఎనిమిదేళ్ళ పాటు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఆ నిబంధనలు సరిగా అమలు జరిగేటట్లు చూడొచ్చు కదా. పైగా ఇక్కడ ప్రభుత్వం చెలాయిస్తున్నది ఆయన పార్టీయే! అయినా కూడా, సంయుక్త రాష్ట్ర తొలిముఖ్యమంత్రే ఉప ముఖ్యమంత్రిని నియమించక, పెద్దమనుషుల ఒప్పందాన్ని అతిక్రమించినపుడు ప్రధానమంత్రిగా ఉండీ, ఆయనేం చేస్తున్నట్లు?

నెహ్రూ గురించి ఎందుకు చెబుతున్నానంటే, కాంగ్రెసు నాయకుల సంగతులిలా ఉంటాయని చెప్పేందుకే. మోసం వారి నైజం. గత రెండున్నరేళ్ళుగా వాళ్ళు తెలంగాణకు, తెరాసకు చేసిందిదే! ప్రజలకీ మోసం కళ్ళక్కట్టింది. కోపగించారు. తెలంగాణ సెంటిమెంటు ఎంతుందో యాంటీ కాంగ్రెసు సెంటిమెంటూ అంతుంది! కాంగ్రెసు వాళ్ళీ రకంగా పచ్చి మోసం చెయ్యకపోయి ఉంటే కేసీయారు నేడింత అద్భుతంగా గెలిచి ఉండే వాడు కాదు.

4 కామెంట్‌లు:

 1. మీ రచన బాగుంది. కాని కాంగ్రేస్ ఒక్కటే చెడ్డది అనడం అంత ఆలోచనాత్మకంగా లేదు. ఎందుకంటే కాంగ్రేసు కానిదేమైనా ఉన్నదా. ఆన్ని పార్టీలలోనూ ఉన్న బ్రహ్మపదార్ధం ఒకటే. స్వార్ధం, సంకుచితత్వం, ఓట్లకోసం ఏదైనా చేయగల్గడం, ఇత్యాది. ఇంకోటి, నెహ్రూ తెలంగాణాను గురించి అలా అన్నాడంటే నమ్మడం కష్టం. అలా అని ఉంటే చెన్నారెడ్డి ఈవిషయం కెలక్కుండా ఉండేవాడా. కీ.శే. సుందరంబాడి గారినే 'సమ్మక్క సారక్క' లని గురించి కీర్తించలేదని దుయ్యబట్టిన వారు, రేపు ఏ కెనడీ యో ఆంధ్రా వాళ్ళు కంత్రీలన్నాడన్నా అనొచ్చు. ఎవడు నిజానిజాల నిర్ధారణ చేసేంత చదువుకొన్నాడు మన దేశంలో. జనాలు అజ్ఞానం లో మ్రగ్గిపోయేలా ఆమాత్రం జాగ్రత్త పడ్డారు మన రాజకీయులు.

  రిప్లయితొలగించండి
 2. Chaduvari Gaaru....!

  The present theme is not looking good..please strict to some plain theme or previous one as it suits for what you write...and also it'll be easy to read.

  రిప్లయితొలగించండి
 3. మెజారిటీ అనేది గెలిచిన అభ్యర్థికి ఓడిపోయిన సమీప ప్రత్యర్థికి మధ్య ఉన్న అంకెల తేడా మాత్రమే. మనం చూడాల్సింది-KCR కి ఎన్ని వోట్లు పోలయ్యాయి, ఆయనకి వ్యతిరేకంగా ఎన్ని వోట్లు పోలయ్యాయి అనేది మాత్రమే.అలా చూసినప్పుడు కరీంనగర్‌లో మెజారిటీ ప్రజలు ప్రత్యేక తెలంగాణా సిద్ధాంతానికి వ్యతిరేకంగా వోట్ చేశారని స్పష్టమౌతుంది.ఎందుకంటే KCRకి అనుకూలంగా పోలైనవి 47 శాతం వోట్లు కాగా ఆయనకి వ్యతిరేకంగా పోలైనవి 53 శాతం.

  మూడు పరిస్థితులు ఒనగూడితేనే ప్రత్యేక తెలంగాణా వస్తుంది.

  (1) 2009 కి ముందే ప్రత్యేక తెలంగాణాకి అనుకూలంగా సోనియా ప్రకటన చెయ్యడం.
  (2) 2009 ఎన్నికల్లో అక్కడా ఇక్కడా ఒకే పార్టీ అధికారంలోకి రావడం
  (3) అక్కడా ఇక్కడా కూడా ప్రభుత్వాల మనుగడ TRS మద్ధతుపై ఎంతో కొంత ఆధారపడి ఉండడం.

  ఈ మూడింటిలో ఏ ఒక్కటీ కూడా సమీప భవిష్యత్తులో జరిగే అవకాశం కనిపించట్లేదు.కాబట్టి ప్రత్యేక తెలంగాణా అనేది కొందరు భావుకుల సుదూర స్వప్నం మాత్రమే.

  రిప్లయితొలగించండి
 4. బాలసుబ్రహ్మణ్యం గారు మీ వాదన లొ ఒక Logical fallacy ఉందండి.
  1) కరీంనగర్‌లో లొ జరిగింది ఉప ఎన్నిక మాత్రమె. తెలంగాణ కొరకు plebiscite కాదు. ఆన్ని పార్టి లకు వాల్లవాల్ల ఎజెండా లున్నట్లె KCR ఎజెండా లొ తెలంగాణ ఒక ముఖ్యమైన అంశం. కనుక కాంగ్రేస్ కు ఓటు వెసిన వాల్లందరికి కాంగ్రేస్ పాలనా విపరీతంగా నచ్చింది అని తెలంగాణా అస్సలు వద్దని అన్నట్లు కాదు.

  2) తెలంగాణా ఎజెండా తొ వచ్చిన అన్ని పార్టీల ఓట్లు, తెలంగాణా ఇష్టం ఉండి కూడ మిగితా పార్టిలకు పద్ద ఓట్లు,తెలంగాణా ఇష్టం ఉండి కూడ అసలు ఓట్లె వెయకుండా వరి చేను కొసుసుకునే వాళ్ళ ఓట్లు కలుపుకుంటె, మరొ మాటలొ చెప్పాలంటె ఒక వెళ కరీంనగర్‌లో లొ జరిగింది plebiscite అయ్యి ఉంటె తప్పకుందా more then 90% వాళ్ళు తెలంగాణా కావాలనెవాళ్ళు.

  చివరగా ఒక మాట తెలంగాణా issue break even point కు చెరువ లొ ఉంది. సదూద స్వప్నం కానె కాదు.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు