8, ఏప్రిల్ 2006, శనివారం

గాయకుడు కారుణ్య

ఈవేళ - ఏప్రిల్ 8 న - పొద్దున జెమిని టీవీలో ఏదో ఇంటర్వ్యూ వస్తూంది. రోజూ పొద్దున్నే ఎవరో ఒక సినిమా వ్యక్తి ని ఎంచుకుని ఇంటర్వ్యూ తీసుకుంటారు వాళ్ళు. ఈ మధ్యే విడుదలైన తమ సినిమా గురించి డబ్బా వాయించుకునే అవకాశం ఆ వ్యక్తికి కల్పించే కార్యక్రమమది. కాబట్టి పెద్దగా పట్టించుకోకుండా పేపరు చదువుకుంటున్నా. అయితే ఆ వ్యక్తి మాట్లాడే తెలుగు వింటుంటే కాస్త ఆసక్తి కలిగి, మనసటు మళ్ళింది. ఇంటర్వ్యూ ఇస్తున్న వ్యక్తి పేరు కారుణ్య, అతడో గాయకుడు. హిందీ ఇంగ్లీషు పాప్ పాటలు పాడుతాడు. బొంబాయిలో ఉంటాడు. ఇప్పుడెందుకో ఇటొచ్చాడు. అంతకు మించి నాకింకేమీ తెలీదు. విశేషమేమిటంటే..

మనాళ్ళు కొందరు, ఏదైనా రంగంలో ఓ స్థాయికి వెళ్ళారంటే మనుషులు మారిపోతారు, భాష మారిపోతుంది, తామేదో ఓ మెట్టు పైనున్నట్లు మాట్లాడతారు. శుభ్రమైన తెలుగు మాట్లాడ్డానికి ఇబ్బంది పడిపోతారు. (ఇతర రాష్ట్రాల్లోనో, ఇతర దేశాల్లోనో రాణించిన వాళ్ళ విషయంలో అయితే ఇక చెప్పనక్కర్లేదు). ఉదాహరణకు.. రామగోపాల్ వర్మ మాట్లాడే విధానం చూస్తే ఆయన పుట్టినప్పటినుండీ ఆంధ్ర ప్రదేశ్ బయటే పెరిగాడేమో , పాపం తెలుగు సరిగ్గా రావట్లేదు అని అనుకుంటాం. ఆయన జీవితంలో నేర్చుకోవాల్సిందల్లా మన రాష్ట్రంలోనే నేర్చుకున్నాడనీ, విజయవాడలో చదువుకున్నాడనీ తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.

కానీ ఈ కుర్రాడు - కారుణ్య - పాప్ గాయకుడని చెప్పినా నమ్మబుద్ధి కాలేదు నాకు. చక్కగా జుట్టు కత్తిరించుకుని, మంచి పద్ధతైన బట్టలు వేసుకుని, ముఖ్యంగా.. పద్ధతిగా కూచ్చోని మాట్లాడుతున్నాడు. నోరారా తెలుగు మాట్లాడుతున్నాడు. శుభ్రమైన తెలుగు మాట్లాడుతున్నాడు. అస్సలు ఇంగ్లీషు మాట్లాడలేదని కాదు.. మాట్లాడాడు. "ముఖ్య ఉద్దేశం" అనే మాటను వాడాడు.. మెయిన్ ఐడియా అనో బేసిక్ ఐడియా అనో అనలేదు. మీకిష్టమైన పాటలు పాడమని టీవీ ఆవిడ అడిగితే అతనేం పాడాడు!! పా..త తెలుగు పాటలు రెండు. చక్కగా పాడాడు. నాకు బాగా నచ్చిందతని ధోరణి. ఇంతకీ అతనేదో పోటీలో పాల్గొంటున్నాడట, దానికి మనందరం SMS ద్వారా అతన్ని బలపరచాలట.

ఆ పోటీ ఏంటో, ఎక్కడ జరుగుద్దో, ఎవరెవరు పాల్గొంటున్నారో నాకేమీ తెలవదు. అయినా నిర్ణయించుకున్నాను.. నా ఓటు అతడికేనని. అంతేకాదు, మా పిల్లలకూ చెప్పాను అదే విషయం -"నాకతని పద్ధతీ, అతడు మాట్లాడే పద్ధతీ నచ్చాయి, అంచేత అతనికే నా ఓటు "అని.

ఇక ఆ పోటీ సంగతేంటో తెలుసుకోవాలి.

2 కామెంట్‌లు:

 1. Sirish,
  U can watch his programme on SONY tv at 9 pm today i.e. 10th April.
  To choose him as the best singer in that contest SMS "karunya" to 2525(i'm not sure abt this number).
  I too was very much impressed by his telugu, vinayam, anakuva and his style when singing hindi songs.
  He's such a wonderful guy. we all should vote for him.
  Thanks for writing abt this in ur blog.

  రిప్లయితొలగించండి
 2. థాంక్స్ స్వాతి గారు!
  మా పిల్లలదే అన్నారు మొన్నెప్పుడో ఈనాడులో పడిందట ఈ విషయం!
  రాత్రికా కార్యక్రమం చూడాలి, ఎస్సెమ్మెస్ పంపాలి.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు